28, జనవరి 2023, శనివారం

గంగా పుష్కరాలు

 *గంగా పుష్కరాలు 2023*

                                                                           హిందూ సంప్రదాయంలో మానవుడు నీటిని 

గంగా, 

యమునా, 

గోదావరి, 

కావేరీ 

మొదలైన నదులను స్త్రీశక్తి రూపాలుగా పూజిస్తారు. ఒక్క బ్రహ్మపుత్ర తప్ప మిగిలిన నదులన్నీ స్త్రీల పేర్లతో ఉన్నాయి. మానవుడు ఆచరించు అన్నిరకాల  మంగళకరమైన అర్చనలు, ఆరాధనలు, క్రతువులు, యజ్ఞాలు మొదలైన సంప్రదాయాలన్నీ నీటితో ముడిపడి ఉన్నాయి. అంతేకాక శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు మొదలైన ఖర్మలుకూడా నీటితో ముడిపడినవే. స్నానాలు అన్నిటిలో పుష్కరసమయంలో సంబంధిత నదీస్నానం చేయడం పుణ్యప్రథమని పురాణాల్లో తెలుపబడింది. పుష్కరసమయంలో సంబంధిత నదులు ప్రవహించు పరీవాహకప్రాంతాలో ముఖ్యంగా పుణ్యక్షేత్రాలలో మరణించిన పూర్వీకులకు  శ్రాద్ధకర్మలు, పిండ ప్రదానాలు, తర్పణాలు మొదలైన ఖర్మలు చేయుట ఉత్తమమని కూడా తెలుపబడింది. బ్రహ్మ ఆకాశం, వాయువు, జలం, అగ్ని,భూమి అను పంచ భూతాలు సృష్టించగా పంచ భూతాల నుండి జీవులు పుట్టాయని ఉపనిషత్తుల సారాంశం. మనిషి ఉదయం నిద్రలేచింది మొదలుగా  నిద్రకు ఉపక్రమించేవరకు దైనందిన కార్యక్రమాలు నీటితో ముడిపడ్డవే. మానవజీవితంలో ప్రధానమైన నీటి  ప్రాముఖ్యత గుర్తుచేసేవే పుష్కరాలు.

దైనందిన కార్యక్రమాలలో 12 సంవత్సరాలు కాలం లేదా సమయం చెప్పడానికి పుష్కరకాలం అనిచెప్పడం సాధారణం.. మనదేశంలోని 12 ముఖ్యమైన నదులకు నదికి సంబంధించిన రాశిలో  బృహస్పతి ప్రవేశించినట్లు గణనచేసి ఆనదీజలం సాధారణ రోజులకంటే 12 రోజుల కాలం పుష్కరాలకాలం పవిత్రమైనట్లు భావిస్తారు. పుష్కరాలకుకల ఖ్యాతిపై కధనం ఉన్నది. పురాణకథ ప్రకారం  పుష్కరుడనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సుచేయగా శివుడు ఆయన భక్తికిమెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకోమ్మని అడిగాడు.  పుష్కరుడు జీవులు చేసిన పాపాలవల్ల వారు స్నానంచేసిన నదులు అపవిత్రమవుతున్నాయని,నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని, లోకహితం కోరి తన శరీర స్పర్శచే నదులు పునీతమయ్యేట్లు వరం ఇవ్వమని అడిగాడు. శివుడు పుష్కరుడు ఏ నదిలో ప్రవేశిస్తే ఆనది పుణ్యతీర్థం అవుతుందని, ఆ నదీలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరం ఇచ్చాడు.  

సింధూనదికి కుంభ రాశిలో  20-11-2021 తేదీన  ప్రణహితనదికి మీన రాశిలో 13-04-2022 తేదీన పుష్కరాలు జరిగియున్నవి. రాబోవు పుష్కరాలు గంగానదికి  మేష రాశిలో 22-04-2023 తేదీన, రేవానదికి (నర్మదకు ) వృషభ రాశిలో 01-05-2024 తేదీన,  సరస్వతీనదికి మిథున రాశిలో 14-05-2025  తేదీన,

యమునానదికి  కర్కాట రాశిలో 01-06-2026తేదీన,  గోదావరినదికి  సింహ రాశిలో 26-06-2027 తేదీన,

కృష్ణా నదికి కన్యా రాశినందు  24-07-2028 తేదీన ,

కావేరీ నదికి తులారాశినందు 24-08-2029 తేదీన, భీమానదికి వృశ్చిక రాశిలో 23-09-2030 తేదీన,తపతి పుష్కరవాహినికి ధనస్సు రాశినందు 15-10-2031 తేదీన మరియు తుంగభద్రనదికి మకర రాశినందు 24-10-2032  తేదీన పుష్కరాలు ప్రారంభమౌతాయి..

బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పుడు గంగా పుష్కరం 22-04-2023 తేదీన  ప్రారంభమైబృహస్పతి పన్నెండో రాశిఅయిన మీనంలో ప్రవేశించినప్పుడు 03-05-2023 తేదీన ముగుస్తుంది. పుష్కరకాలము సాధారణముగా ఒక సంవత్సరము అనిచెప్పబడింది. పుష్కర కాలంలో  22-04-2023  నుండి మొదటి పన్నెండు రోజులను ఆది పుష్కరంఅని, చివరి పన్నెండు రోజులు 03-05-2023 వరకు అంత్య పుష్కరంగా వ్యవహరిస్తారు. సంవత్సరకాలంలో ఆది మరియు అంత్య పుష్కరాల పన్నెండు రోజులు ప్రత్యేకమైనవి. అంత్య పుష్కరాలకంటే ఆదిపుష్కరాలు పన్నెండురోజులు పవిత్రమైయనవి. బృహస్పతి మేషరాశిలో ప్రవేశించినప్పటి నుంచి 12 రోజుల పాటు గంగా నదికి పుష్కరుడు సకలదేవతలతో ఉంటాడని పన్నెండు రోజూలలో గంగానదిలో స్నానం చేయటంవలన సకల తీర్థాలలో స్నానంచేసిన ఫలితం దక్కుతుందని గంగానదిలో అనేకమంది భక్తులు స్నానాలుచేస్తారు.

హిందువులు గంగాదేవిని పాపములను తొలగించి శుద్ధిచేయు దేవతగా పూజిస్తారు. మొసలి వాహనధారి అయిన  గంగను అందమైన స్త్రీగా అభివర్ణిస్తారు. ఋగ్వేదంలో గంగ నదులలో పవిత్రమైనదిగా పేర్కొనబడింది. గంగాదేవి రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాల్లో ప్రముఖంగా ప్రస్తావించబడింది. రామాయణం ఆమె పర్వతరాజు హిమవంతుని ప్రధమ సంతానంగా పార్వతి సోదరిఅని తెలుపుతుంది. బ్రహ్మ హిమవంతున్ని సృష్టించి హిమాలయాలకు రాజును చేశాడు.  హిమవంతుడు మేరు అను పర్వతరాజు కుమార్తె మేనవతిని వివాహం చేసుకున్న చాలాకాలం పిమ్మట  వారికి కుమార్తె జన్మించగా ఆమెకు గంగఅని పేరుపెట్టారు. పిమ్మట వారికి సతీదేవి అవతారమైన పార్వతి కుమార్తెగా జన్మించింది. గంగ పెద్దయ్యాక, దేవతలు ఆమెను స్వర్గానికి తీసుకువెళ్లారు, ఆమె నది రూపంలో ప్రవహించింది. 

మహాభారతంలో గంగ కురువంశరాజైన శంతనుని భార్యగా భీష్మునితో ఎనిమిదిమంది వశువులకు తల్లిగా తెలుపబడింది. బ్రహ్మ గంగ మరియు శంతనులను భూలోకంలో జన్మించమని శాపంఇచ్చాడు. శంతనుడు గంగానది ఒడ్డున గంగాదేవిని కలుసుకుని తనను పెళ్లి చేసుకోమని కోరాడు. తన చర్యలను శంతనుడు ప్రశ్నించకూడదనే షరతుపై ఆమె ఆతని ప్రతిపాదనన అంగీకరించింది. శంతనుడు వారు వివాహంచేసుకొని కలిసి జీవించి వసువుల అవతారమైన ఎనిమిదిమంది కుమారులను పొందారు. శాపగ్రస్తులైన వారు భూమిపై జన్మించి నప్పుడు తమజీవితాన్ని ముగించమని గంగను కోరారు. వారి అభ్యర్థనప్రకారం శంతనుని ఎదురుగానే గంగ సంతానాన్ని గంగలో పారవేయడం ప్రారంభించింది. ఎనిమిదవ కుమారుడైన భీష్ముని గంగలో ముంచబోగా, శంతనుడు అడ్డుకున్నాడు.గంగ భీష్మునితో వెళ్లిపోయి అతనికి పదేళ్ల వయసులో శంతనునికి  తిరిగి అప్పగించి వెళ్లిపోయింది. 

భాగవత గ్రంధంలో విష్ణువు గంగకు మూలమని పేర్కొనబడింది. కధనంప్రకారం, వామన అవతారంలో విష్ణువు తన ఎడమపాదాన్ని విశ్వమంతా విస్తరించి బొటనవేలు గోరుతో ఒక రంధ్రం ఏర్పరచాడు. రంధ్రంద్వారా, సముద్రంనీరు స్వచ్ఛమైన గంగానదిగా భూమిపై ప్రవేశించింది. ఎర్రటి కుంకుమరంగు కల వామనుని పాదాలను కడిగిన తరువాత, గంగ గులాబీరంగు పొందింది. విశ్వంలోకి వచ్చేముందు గంగ విష్ణువు పాదాలను తాకింది కాబట్టి గంగను విష్ణుపది అనిపిలుస్తారు.భూమిపైకి దిగేముందు గంగ బ్రహ్మలోకంలో ఉండిపోయిందని నిర్ధారణ అయింది. ఆమె రాజర్షి భగీరథుని తపస్సువల్ల మరియు శివుని వరంప్రభావంతో భూమిపైకి దిగింది.

సాగరరాజు వంశస్థుడైన భగీరథుడి ప్రయత్నాలద్వారా గంగ భూమిపైకి వచ్చిన కథ రామాయణం, మహాభారతం మరియు వివిధ పురాణాల్లో వివరించబడింది.సాగర రాజు అశ్వమేధయాగం చేసి గుర్రాన్ని సంచరించడానికి వదిలి వేశాడు.యాగం విజయవంతం కాకుండా ఇంద్రుడు అశ్వాన్ని దొంగిలించాడు.గుర్రం అదృశ్యమైందని సాగరరాజు తన అరవైవేలమంది కొడుకులను గుర్రాన్ని వెతకడానికి పంపాడు. వారు పాతాల లోకంలో కపిలమహర్షి ఆశ్రమంలో గుర్రాన్ని కనుగొన్నారు. కపిలమహర్షి గుర్రాన్ని దొంగిలించాడని భావించి, ఆయన ధ్యానంలో ఉండగా వారు ధ్యానాన్ని ఆటంకపరచారు. కపిలమహర్షి కోపించి తనచూపులతో అరవై వేలమందినీ కాల్చి బూడిదచేసాడు.వారిఆత్మలకు విముక్తి కలిగించడానికి పరిహారం కపిలమహర్షినుండి తెలుసుకోడానికి సగరరాజు మనవడైన అంశుమాన్‌ని పంపాడు. స్వర్గంనుండి ప్రవహింఛు గంగ మాత్రమే వారిని విముక్తి చేయగలదని కపిలమహర్షి తెలిపాడు.

అంశుమాన్ మనుమడు భగీరథుడు తీవ్రమైన తపస్సుచేసి, బ్రహ్మ మరియు శివుని అనుగ్రహాన్ని పొందాడు. బ్రహ్మ గంగను భూమిపైకి దిగడానికి అనుమతించగా, శివుడు గంగ ఉధృతి తగ్గుటకు కేశములందు బంధించి ఒకపాయగా భూమిపై వదిలాడు. శివుని జటాఝూటం (కేశముల) నుండి గంగానది గంగోత్రివద్ద ఉద్భవించింది. గంగను భగీరథుడు సముద్రానికి అక్కడనుండి, పాతాళానికి ప్రవహింపచేశాడు. గంగానది భూమిపై ప్రవహించుప్పుడు జాను మహర్షి యొక్క ఆశ్రమంలో హోమాగ్ని ఆర్పివేసింది. మహర్షి  ఆగ్రహించి మొత్తం గంగను మ్రింగివేశాడు. భగీరథుని విజ్ఞప్తిపై, జాహ్నాఋషి ఆమెను తన ఎడమచేవినుండి వదలిపెట్టాడు. అందువలన గంగను జాహ్నవిఅని అంటారు. పిమ్మట గంగ పాతాళంలోని కపిలమహర్షి  ఆశ్రమానికి చేరుకొని, అక్కడ బూడిదగాఉన్నభగీరథుడి పూర్వీకులను శాప విముక్తులను చేసింది.

భగీరధుని కృషి వలన భూమిపైకి వచ్చుటవలన భగీరధిగా పిలువబడు గంగానది భారతదేశంలో మతపరమైన ప్రాముఖ్యత కలిగిన అతిపెద్ద నది. గంగాదేవి స్వర్గం, భూలోకం మరియు పాతాళలోకాల్లో ప్రవహిస్తుంది. గంగానదికి జాహ్నవి, గంగ, శుభ్ర, సప్తేశ్వరి, నికిత, భాగీరథి, అలకనంద మరియు విష్ణుపది వంటి వివిధ నామాలు (పేర్లు) ఉన్నవి. పవిత్రమైన గంగానది దైవత్వం కలిగి స్నానంచేసినంత మాత్రాన సకల పాపములు హరిస్తుంది. మరణించినవారికి పిండప్రదానం చేస్తే వారికి ముక్తి కలిగించి స్వర్గలోక నివాసం ప్రసాదిస్తుంది. హిందూ మతంలో గంగాదేవిని మానవాళికి తల్లిగాతలచి యాత్రికులు తమ బంధువుల చితాభస్మం గంగానదిలో నిమజ్జనం చేయడంద్వారా వారిఆత్మలు శుద్ధి చేయబడి జనన మరణ చక్రంనుండి విముక్తికలిగి మోక్షం పొందుతాయని భావిస్తారు. గంగోత్రి, హరిద్వార్, ప్రయాగ్‌రాజ్, వారణాశి, కలకత్తాలోని కాళీ ఘాట్‌ మొదలైన గంగానది పరీవాహక ప్రదేశాల్లో గంగానదికి పండుగలు జరుపుతారు.

గంగా పుష్కరాలు అనగానే భక్తులు సాధారణంగా కాశీ లేదా వారణాశి వెళ్లడానికి ఉత్సాహం చూపుతారు. వారణాశిలో బస మరియు భోజన సౌకర్యాలు చాలా అభివుద్ధి చెందిఉన్నాయి. కానీ భద్రీనాధ్ వద్దఉద్భవించిన అలాకానంద దేవప్రాయాగ వచ్చుసరికి గొంగోత్రివద్ద ఉద్భవించిన భగీరధితో కలిసి గంగానదిగా ఋషీకేశ్, హరిద్వార్, వారణాసి ప్రవహించి ప్రయాగరాజ్ వద్ద యమున మరియు సరస్వతీనదులతో కలిసి ప్రవహిస్తుంది. గంగా పరీవాహక ప్రాంతంలో ఉన్న ప్రముఖ దివ్యప్రదేశాలు గంగోత్రి, దేవప్రయాగ, ఋషీకేశ్, హరిద్వార్, వారణాసి, ప్రయాగరాజ్, గర్ ముక్తేశ్వర్ (హాపూర్) మరియు గంగాసాగర్ గంగా పుష్కరాల సమయంలో పవిత్రస్నానాలకు మరియు మరణించినవార్కి పిండప్రదానం చేయుటద్వారా వారి ఆత్మలకు మోక్షం కలిగించే దివ్యప్రదేశాలు. ప్రతిక్షేత్రంలో స్నానఘట్టాలు, రవాణా, భోజన వసతి సదుపాయ వివరములు విడిగా తెలియజేస్తాం. 

గమనిక: పుష్కరాల సమయంలో కాశీ (వారణాశి) తోపాటు మిగిలిన క్షేత్రాల్లో                  నదీస్నానం మరియు పిండప్రధానం  చేయవచ్చు గంగోత్రి, దేవప్రయాగ,                                                                           ఋషీకేశ్, హరిద్వార్ ఛోటా చార్ ధామ్ యాత్రనందు భాగమై ఉన్నాయి.  కావున వీలుకొద్దీ వారియాత్ర ఎంచుకొన వలసినదిగా కావున వీలుకొద్దీ  వారియాత్ర ఎంచుకొన వలసినదిగా కోరుతున్నాం.

కామెంట్‌లు లేవు: