28, జనవరి 2023, శనివారం

దైవ సన్నిధి

 దైవ సన్నిధి 

తిరుమల కొండమీద కాలుపెట్టినది మొదలు ఏదోతెలియని ఒక దివ్య మనోభావన నిజానికి మనం భూమిమీదనే వున్నా సాక్షాత్తు ఆ వైకుంఠానికి వచ్చినంతగా మనం  ఆనందపడతాము. అందుకేనేమో కలియుగ వైకుంఠంగా తిరుమల క్షేత్రాన్ని అభివర్ణించారు. అక్కడ మన ఊరువారు ఎవరైనాకనపడితే మీకు దర్శనం అయ్యిందా, లేదండి ఇందాకనే వచ్చాము ఇంకాదర్శనం కాలేదు,  మా టికెట్లు సాయంత్రం 3 గంటలకు మేము ముందే బుక్ చేసుకున్నాము. అని ఇలా అనేక విధాలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి గూర్చే ముచ్చటిస్తూవుంటారు.  నిజం చెప్పాలంటే తిరుమల కొండమీద గడిపిన రెండు మూడు రోజులు ప్రతివారు వారి నిత్య సాధారణ జీవితాన్ని పూర్తిగా మరచి కేవలం స్వామి గూర్చి మాత్రమే ఆలోచిస్తారు. దర్శనం టికెట్ కొనలేనివారు, దొరకని వారు గంటలకొద్దీ క్యూ షెడ్లలో ఉండి మరి స్వామివారి దర్శనం చేసుకోవటం కోసం ఎదురుచూస్తారు. అయ్యో ఇంతసేపు నేను క్యూలో ఉండాలా అని ఏమాత్రం సంకోచించరు  గోవిందా, గోవిందా అని గోవిందనామ స్మరణతో తిరుమల అంతా మారుమోగుతోంది.  అక్కడ ఉన్నంతసేపు త్రాగమా, తిన్నామా అనే భావన కూడా కలుగదు అంటే ఆకలి దప్పులు వేయవన్నమాట. మనుషులంతా గుండు చేయించుకొని వీధులమీద దర్శనమ్ ఇస్తారు. జుట్టుతో వున్నవారు అతితక్కువ మంది కనపడాతారు. గుండు చేయించుకోలేదు అంటే వాళ్ళు అప్పుడే బస్సు దిగారని అర్ధం. ఇదంతా యెట్లా సాధ్యం అంటే అదంతా అదేవ దేవుడి లీల అని అంటారు. 

దాదాపు తిరుమల దర్శించుకున్న భక్తులు అందరు తలనీలాలు సమర్పించటం అంటే గుండు చేయించుకోవటం ఆనవాయితీ. పిల్లలు ఎవరైనా నేను గుండు చేయించుకొని అంటే తప్పు అట్లా అనకూడదు కళ్ళు పోతాయి అని తల్లిదండ్రులు పిల్లలకు బలవంతంగా మరి గుండు చేయించటం మనం చూస్తూ ఉంటాం. కొంతమంది స్త్రీలు కూడా శిరోముండనం చేయించుకోవటం మనమెరుగుదము. ఇప్పుడు స్త్రీల నిమిత్తం నారి క్షురకులని దేవస్థానం ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ముందుగా గుండు చేయించుకొని అటు పిమ్మటే స్వామి దర్శనం.  కొంతమంది ఆన్లైనులో ఇంటివద్దనే పూర్తీ కార్య క్రమాన్ని (ప్రోగ్రాం) నిర్ణయించుకొని తిరుపతికి రావటం మనమెరుగుదము.  మనిషికి దేహవ్యామోహాన్ని కలుగచేసేది ముఖము అందునా సుందరమైన కేశాలు దేహసౌందర్యాన్ని ఇనుమిడింప చేస్తాయి. అంటే ఒక మనిషి తాను అందంగా వున్నాను అనుకోవటానికి మూల కారణం  కేశాలు. కేశాలు నిర్ములిస్తే దేహ సౌందర్యం పూర్తిగా పోతుంది.  అందుకేనేమో ఈ ముండనవిధి.  శరీరం అందంగా .లేదని ఎప్పుడైతే మనిషి తెలుసుకుంటాడో అప్పుడు దేహవ్యామోహం వదిలి మనస్సు దైవం వైపు మళ్లుతుంది. మన ధర్మంలో సన్యాసులు ముండనం చేసుకొని ఉండటం చూస్తున్నాము. ఏతావాతా తేలేది ఏమిటంటే మనం దేహవ్యామోహం వదిలి దైవ చింతన చేయాలని.మాత్రమే  

సముద్రమట్టానికి ఎగువకు వెళుతున్నకొద్దీ అంటే సముద్రమట్టానికన్నా ఎక్కువ ఎత్తుకు వెళితే మనకు వాతావరణ పరిస్థితుల్లో ఎన్నో మార్పులు వస్తాయి అవి వాతావరణ పీడనం, గురుత్వాకర్షణ శక్తిలో తేడా, అంతే కాకుండా గాలిలో ఆక్సిజన్ శాతంలో మార్పు ఇలా అనేకమైన తేడాలు కలుగుతాయి. అందుకే మనకు భూమికన్నా ఎంతో ఎత్తుమీద విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆనందంగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎత్తయిన ప్రదేశాలలో మనిషి మనస్సు ప్రశాంతముగా,  సంతోషంగా,ఆనందంగా ఉంటుంది అన్నది నిజం. ఈ సత్యాన్ని  మన మహర్షులు ఎప్పుడో తెలుసుకున్నారు. ఆ మానసిక స్థితే మనిషిలో ఆత్యాత్మికతను మేల్కొలుపుతుంది. అందుకే  ఎత్తైన గుట్టలమీద, కొండలమీద దేవాలయాలు నిర్మించారు.  ఎప్పుడో నిర్మించిన దేవాలయాలు ఇప్పటికి పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతూవున్నాయి. ఆయా దేవాలయాల్లో నెలకొన్న దేవుళ్ళు  భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారు. హిందుత్వంలో ప్రతిదీ శాస్త్రేయత కలిగి ఉంటుంది.  అంతరార్ధం తెలుసుకోలేని మూర్ఖులకు అది అర్ధం కాదు. 

తిరుమల కొండమీద రోజు కొన్ని లక్షలమంది వస్తున్నారంటే దానికి కారణం కేవలం శ్రీ వెంకటేశ్వర స్వామి మాత్రమే కానీ మరొకటి కాదు. ఏడుకొండలు వున్నాయి కానీ ఇతర కొండలమీదికి ఒక్కరు కూడా వెళ్ళరు. ప్రతి భక్తుడు తిరుమలలో వున్నన్ని రోజులు తాను పూర్తిగా దైవ సన్నిధిలో ఉన్నట్లు భావిస్తాడు.  అంతే కాదు ఒక్కొక్క భక్తునికి ఒక్కొక్క రీతిలో స్వామి అనుగ్రహించినట్లు చెప్పుకుంటారు. ఒక్కసారి తిరుమలకు వచ్చిన భక్తుడు ఇంటికి వెళ్లిన తరువాత కొన్నిరోజుల వరకు తిరుమల విశేషాలు చేర్చించుకుంటూ ఆనందిస్తాడు.  ఒక్క మాటలో చెప్పాలంటే తిరుమల యాత్ర ఒక ఆనందానుభూతితో కూడిన అనుభవం.  ఈ అనుభవం ఈ వ్యాసం చదువుతున్న వారందరు పొంది వుంటారు అంటే అతిశయోక్తి కాదేమో. 

తిరుమల వెళ్లకుండానే నీకు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే, నీకు తిరుమల కొండమీద వున్నప్పుడు కలిగే దైవ సన్నిధి అనే ఆనందభావన నీ ఇంట్లోనే కలిగితే యెట్లా ఉంటుంది.  ఆలోచించటానికి చాలా  బాగుంటుంది. కానీ అది యెట్లా సాధ్యం ఎట్టి పరిస్థితిలోకూడా సాధ్యం కాదు ఆలా అని ప్రతివారు అంటారు.  మన ధర్మంలో వున్న గొప్పతనం ఏమిటంటే ఒక నోము, వ్రతము, యజ్ఞ యాగాది క్రతువులు, దేవాలయాలలో దైవ దర్శనం ఇలా కొన్ని సత్ కర్మలు చేయటం వలన మానసికోల్లాసము కలిగి దివ్యమైన ఆనందానుభూతులు పొందుతాము.  తత్ద్వారా  ఏ లక్ష్యంతో ఆ య  సత్కర్మలు ఆచరించారో  ఆ యా లక్ష్య సిద్ది అంటే కోరికలు ఈడేరుతాయి ఒక్కమాటలో చెప్పాలంటే మునకు మన మీద మనకు తెలియకుండా పనిచేసే దైవ శక్తి ప్రేరితం అయ్యి ఆ ఫలితాలను ఇస్తుంది. 

తిరుమలలో ఉన్నంత కాలం ప్రతి భక్తుడు స్వామి సన్నిధిలోనే అంటే ఆయన రాజ్యంలోనే వున్నాడని తనను ఆ శ్రీ వెంకటేశ్వర స్వామే కాపాడుతాడనే ప్రఘాఢ విస్వాసంతో  ఉంటాడు. నిజానికి భక్తుని విశ్వాసమే భగవంతుడు, కాబట్టి తప్పకుండ భగవంతుడు కాపాడుతాడు. "మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః" అని అన్నారు కదా కాబట్టి ఎప్పుడైతే మనిషి మనస్సు పరిశుద్ధంగా దైవస్మరణతో ఉంటుందో అప్పుడు అది తేజోమయంగా, శుద్ధంగా ఉండి ధనాత్మకపు ఆలోచనలు  వస్తాయి. దాని పర్యవసానమే ఆ సత్కర్మ ఫలితాలుగా మనం పేర్కొనవచ్చు.  అందుకే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని మొక్కుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయి. సాధకుడు ఒక భక్తుడు తిరుమల కొండమీద పొందిన ఆనందానుభూతి తన ఇంట్లో, లేక ఏ చెట్టుకిందనో, నది వడ్డునో, కూడా పొందగలడు అది ఎట్లాగో చూద్దాం. 

చిన్న పిల్లవానికి సైకిలు త్రొక్కటం రాదు అప్పుడు వాడి తండ్రిగారో లేక అన్నగారో సైకిలు పట్టుకొని కొంత సమయం ఊతం ఇచ్చి నేర్పితే అప్పుడు బాలుడు స్వతంత్రంగా సైకిలు  త్రొక్కగలడు. అదేవిధంగా మనలో ఉన్న దైవశక్తిని తెలుసుకోలేక పోవటంచేత మనం కూడా సైకిలు నేర్చుకునే బాలుడు తన తండ్రిగారి మీద ఆధార పడినట్లు మనం భగవంతుని మీద బాహ్యంగా ఆధార పడాలి దానికోసమే తీర్ధాలు,  క్షేత్రాలు. నిజానికి తీర్థక్షేత్ర దర్శనం కేవలం మనలోని దైవాన్ని తెలుసుకోవటం కోసం తీసుకునే శిక్షణ  మాత్రమే. కానీ ఒక సాధకుడు భగవంతుని దర్శించటం కేవలం తనలోనే అనే విషయం తెలుసుకోవాలి. 

భార్గవ శర్మ చెప్పేది ఏమిటంటే మనిషి ఎప్పుడైతే అంతర్ముఖుడు అవుతాడో అప్పుడు తనకు తెలుస్తుంది భగవంతుడు బయట కాదు అంతరంగంలో వున్నాడని అప్పటినుంచి అసలైన వెతుకులాట మొదలవుతుంది అదే సాధనకు నాంది పలుకుతుంది. అప్పుడు సాధకుడు తిరుమల కొండమీద చేసినవే జీవితాంతం చేసి మోక్షాన్ని పొందుతాడు.  కొండమీద ఏమిచేసాడు అని ఆలోచిస్తే ముందుగా కొండ ఎక్కగానే గుండు చేయించుకున్నాడు అలానే తాను మోక్షాన్ని పొందాలనుకునే సాధకుడు దేహవ్యామోహాన్ని తొలగించుకోవటానికి సదా ముండనం చేసుకొని ఉంటాడు.  కొండమీద ఏరకంగా అయితే నిరంతర భగవత్ సంకీర్తనం చేస్తూ ఉంటాడో అలాగే సాధకుడు కూడా నిత్యం ఆ భగవంతునే స్మరిస్తూ భగవంతునిలోనే లీనమై వుంటూ నిరంతర సాధన చేస్తూ ఆత్మలోనే లయం అయి ఉంటాడు.  తత్ ద్వారా జీవన్ముక్తి పొందుతాడు.  సాధన ఎలా చేయాలి ఏ ఏ నియమాలు పాటించాలి అనేవి ఒక సత్ గురువు ద్వారా శిక్షణ పొంది ఆత్మా జ్ఞ్యానాన్ని పొందాలి.

ఓం తత్సత్ 

 ఓం శాంతి శాంతి శాంతిః 

మీ 

భార్గవ శర్మ

 



కామెంట్‌లు లేవు: