16, ఏప్రిల్ 2023, ఆదివారం

ఊరగాయల కార్యక్రమం

 *మార్చి లొనే మనల్ని వడియాల్లా వేయించేస్తున్న ఈ ఎండల్ని చూస్తుంటే పాతారోజులు జ్ఞాపకం వస్తున్నాయి. మునుపూ ఎండలు ఉన్నాయి. కానీ వాటికి మనం ఇంత భయపడింది లేదు. వాటిని ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించు కొనేవారు. నాకయితే బాగా గుర్తు. వేసవి కాలం వచ్చిందంటే మాబామ్మ , అమ్మ, చాలా బిజీగా ఉండేవారు. మాకు పరీక్షల హడావుడి; వాళ్ళకి ఇంకోరకం హడావిడి. "నులకమంచాలు, పట్టెడ మంచాలూ, మడతమంచాలు బైటవేసి, ఏడాదికి సమకూర్చుకొన్న పప్పులు ఎండబెట్టి, అన్నీ డబ్బాలలో పోసి అటకెక్కించడం పెద్దపని. అది అవుతూనే వడియాలు పెట్టే కార్యక్రమం మొదలు. గుమ్మిడి వడియాలు, సగ్గుబియ్యం వడియాలు, చల్ల/మజ్జిగ మిరపకాయలు, గుమ్మిడి వడియాలూ, పిండి వడియాలు.... అబ్బో! పెద్ద బృహత్తర కార్యక్రమం. నాలుగు ఎండలకే, వడియాలు గలగల లాడుతూ ఎండిపోయేవి. మధ్యలో పచ్చివడియాలు- అన్నంలోకి వేయించుకొని ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం. ఈలోపు మాపరీక్షలు అయిపోయేవి. మళ్ళీ ఊరగాయల కార్యక్రమం మొదలు. పప్పులడబ్బాలు, వడియాల డబ్బాలు, అన్ని వరసగా ఆటకెక్కేవి. భోషాణపు పెట్టెలు నిండిపోయేవి.  జాడీలు అన్ని బుద్ధిగా కిందికి దిగేవి. మళ్ళీ ఊరగాయల కార్యక్రమం మొదలు. ఆవాలు, మిరపకాయలు, ఉప్పు ఎండబెట్టడం, పనివాళ్ళచేత ఇళ్లలోనే చెక్కరోళ్లలో ఆవకాయ కారాలుకొట్టించడం, అన్నికొలతలు కొలుచుకొని, జాడీ లకెత్తించడం; మరునాడు సొంత తోటల్లోంచికాని, లేదా వాడుగ్గా ఇచ్చే చెట్టునించి కాని కాయలు కోయించి తేవడం, వెంటనే కాయలు నీళ్ళల్లో వేసి కడగడం మావంతు.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

*ముందురోజే "మరకత్తి పీట" ని అటకమీదనుచిదించి కడిగి శుభ్రంచేసి ఉంచేవారు. నాన్నగారు మరకత్తి పీటతో కాయలుతరిగితే, జీడి తీయడం మావంతు. బామ్మ పర్యవేక్షణలో అమ్మ ఆవకాయకలిపి జాడీలకెత్తి ఆమహాయజ్ఞం జయప్రదంగా పూర్తి చేసేది.  మరునాడు మాగాయ, తొక్కుడు పచ్చళ్ళపని.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

          *ముందురోజే ఆవకాయ కాయతోపాటు, మాగాయకికూడా మామిడికాయలు తెచ్చి నీళ్ళల్లో వేసి ఉంచేవారు. తెల్లవారి లేస్తూనే అమ్మ పాతదుప్పటి పరిచి రడీ అయ్యేది. మేమందరం కాయలన్నీ తుడిచి పెడితే, ఇరుగపొరుగు అత్తయ్యలందరూ కదనరంగానికి వచ్చే వీరనారుల్లా కత్తిపీటలువేసుకొని తయారై వచ్చేవారు. వదినా, అత్తయ్యగారు, పిన్నిగారు, అంటూ కబుర్లు చెప్పుకుంటూ-- అలవోకగా రెండువందలకాయల్ని- మాగాయకి, తొక్కుడుపచ్చడికి తరిగేసి, కావాలంటే ఉప్పువేసి ముక్కల్ని జాడీకెత్తేసి మరీ ఇంటి కెళ్లేవారు.*

*ఒకరికి ఒకరు మేమున్నాం మీకు- అన్నట్లు గా ఆరోజుల్లోఉండేవారు. పనిసాయం, మాటసాయం, ఆర్థికసాయం చేసుకుంటూ ఒకరికొకరు అండదండలుగా ఉండేవారు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

        *ఆవకాయలపర్వం పూర్తయ్యేసరికి, అత్తయ్యలు, పిల్లలు, వేసంగి సెలవలకి అమ్మమ్మల ఇళ్ళకి రావడం మొదలయ్యేది. ఇంక ఒకటే సందడి. పెద్దలకి వాళ్ళ కబుర్లు, పిల్లలకి వాళ్ల ఆటపాటలతో, చిలిపిచేష్టలతో ఒకటే సందడి.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

 *సాయంత్రం అయ్యేసరికి మావీరమ్మ  పెరడంతా పేడనీళ్లతో   కళ్ళాపుజల్లి ముగ్గేసి అందరికి పట్టెమంచాలు, మడతమంచాలు వేసి, పక్కలువేసి వెళ్ళేది.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

           *ఆరుబయట హరికేన్ లాంతరు మధ్యలో పెట్టుకొని అందరం చుట్టూ కూర్చుని కబుర్లు చెప్పు కుంటూ భోజనం చేసిన ఆరోజులు ఇప్పటికి నా కళ్ళకి కడుతున్నాయి. నాకే కాదు, ఇలాంటి అనుభవం మీకందరికీ ఉండే ఉంటుంది.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

       *రెండురోజుల తరువాత కొత్తావకాయ, మామిడిపండు తో అన్నం తింటుటే, స్వర్గం బెత్తె డు దూరం లో ఉన్నట్టు ఉంటుంది.* 

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

        *నాన్నగారు వేసవి వస్తూనే ఓ  పాతిక తాటాకు విసిన కర్రలు కొనేసి అందరి మంచాల దగ్గర పెట్టేసివారు. పెరట్లో మంచాలు వేసుకొని పడుకొంటే ఆవేపచెట్టు నుండి వచ్చే గాలి, కొబ్బరాకుల గలగలలు, ఆకాశం లో చుక్కలు, చంద్రుడు, వెన్నె ల, చుక్కల్ని చూపిస్తూ బామ్మ చెప్పే కబుర్లు ,,,,,,,నిద్రఎప్పుడు పట్టింది తెలిసేదికాదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

    *ఇప్పట్లా ఫాన్, ఏసీ లు ఏమీ లేని రోజులు,అయినా ఏమీ కష్టం అనేపెంచేదికాదు.*

🌸🌸🌸🌸🌸🌸🌸🌸

       *ఆరోజులు ఈరోజులు పూర్తిగా అనుభవించిన తరం మాది. మాతరం కనుమరుగైతే బహుశా ఇలాంటి అనుభూతుల్ని మీతో పంచుకొనే పెద్దలు ఇంకోపదేళ్ల తరవాత ఎవరూ ఉండరు.*  *అందుకే ఆనాటి ముచ్చట్లు మీతో పంచుకుందాం అనిపించింది.*

కామెంట్‌లు లేవు: