16, ఏప్రిల్ 2023, ఆదివారం

శ్రీరామనవమి

 *శ్రీరామనవమి-రాముడు జన్మించిన సుదినము.అది సీతారామకళ్యాణము కాదు.*

శ్రీరామచంద్రుడు జన్మించి నేటికి 1,91,49,127- ఒక కోటి తొంబై ఒక్క లక్షల,నలుబై తొమ్మిదివేల ఒకవంద ఇరువది ఏడు సంవత్సరములైనవి.దాదాపు( 2) కోట్ల ఏళ్ళ క్రితం శ్రీరాముడు ఈ ఆర్యావర్త దేశమందు జన్మించారు.

సీతకు పద్దెనిమిది యేండ్లు నిండాక,రాముడికి (25)యేండ్లు నిండాక వారి వివాహము జరిగినట్లు తెలియుచున్నది.అయితే అది చైత్ర శుద్ధ నవమి నాడు కానే కాదు.అయినను నిరాధారంగా,మన దక్షిణాదిన శ్రీరాముడి జన్మదినోత్సవములు జరుపుటకు బదులు సీతారాముల కళ్యాణోత్సవాలు జరపుతున్నారు. జీవితములో ఒక జంటకు ఒక్కమారే వివాహము జరుగుతుంది.కాని ఈ కళ్యాణ వేడుకలు చేయువారు,శ్రీరాముడికి యేటేట పెళ్ళిల్లు జరిపిస్తున్నారు.

ఆ సందర్భంగా పురోహితుడే పతివ్రత తల్లి సీతాదేవి(విగ్రహము) మెడలో తాళి కట్టు కుప్రథకు-దురాచారమునకు తెర లేపారు.

తన భార్య సీతాదేవిని యెత్తుకుని వెళ్ళిన రావణాధముడిని బంధుబాంధవ,పుత్ర సమేతముగా శ్రీరామచంద్రుడు హతమార్చాడు.అటువంటప్పుడు,ఈ దుష్ట కార్యమునాచరించు పూజారులు యేల నశించకుందురు?


మనము అసలుసిసలైన శ్రీరాముడి చరిత్రోపాసకులము.ఇటువంటి కుప్రథలు-దురాచారాలు దక్షిణాదిలో జరుగకుండా మనమే చూడాలి.ఒక ఉద్యమ రూపకంగా పని చేయాలి. పూజారులు సీతామ తల్లి పై చేయుచున్న ఈ దుష్టాచారాన్ని నిరోధించాలి.

మహర్షి స్వామి దయానంద సరస్వతిగారు వాల్మీకి విరచిత రామాయణాన్ని పఠనీయ గ్రంథాలలో సూచించారు.

శ్రీరాముడు జగదభిరాముడు.రఘుకుల సోముడు.

ఇంతకాలం ఒక వ్యక్తిని భరతజాతి యావత్తు యింతగా గుర్తు చేసుకోవడానికి అతడి శుభ గుణములే కారణము.

శ్రీరాముడు ఒక స్ఫూర్తి.ఒక ఉద్యమము.ఒక అగ్ని శిఖ.

అందువలన ఆ మహాపురుషుడు మహిలో రాక్షసులు లేకుండా చేశాడు.సరయూనది తీరమునగల కోసల దేశమునుండి సుదూర ప్రాంతమైన దక్షిణాతటిలోని దండకారణ్యము వరకు పాదాచారియై పయనించి ధర్మవిహీనులను, దుష్కర్ములను దునుమాడాడు.

“అగ్నే త్వం సుజాగృహి”అంటుంది యజుర్వేదము.

(అగ్నే)అగ్నివంటి తేజోవంతుడైన వీర!వీరాగ్రేసరా!(త్వమ్)నీవు(సుజాగృహి)బాగుగా మేల్కొనుము. వీరులు,వీరాగ్రణ్యులు మేల్కొనియుండి ప్రజలను బాగుగ మేల్కొలుప వలయును.నిద్రాణమైయున్న జాతి సర్వ నాశనమగును.

మేల్కొన్న వ్యక్తికి -పురుషార్థ పరాయణునికి పరమే శ్వరుడి మరియు  ధర్మ సహకారముంటుంది. పురుషార్థరహితుడై నిద్రించే వ్యక్తిని ధర్మము యే రకంగాను కాపాడదు.

“Vigilenti bus non dormanti bus “ఇది “లా”లోని ఒక ల్యాటిన్  మ్యాక్సిమ్(సిద్ధాంతము).తన హక్కులపై అవగాహన గల జాగరూకునికి ‘లా’సహకరిస్తుంది.తన హక్కులు-బాధ్యతలు మరచిపోయి నిద్రించే వ్యక్తికి సహకరించదు.

అగ్ని-అంటే జాగరూకత.అగ్ని-వేడియున్నప్పుడు శరీరము చైతన్యవంతముగనుండును.లేనపుడు చల్లబడును.శవమగును.శవమెంతటి మహనీయు నదైనను నిరుపయోగమగును.దానిని కాపాడవలసి వచ్చును.అది ఇతరులను కాపాడదు.తన్న తాను కాపాడుకొనజాలదు.పూర్వము ఆర్యవీరులు అజేయు లుగా యుండి అవనిలో అన్యాయ అక్రమాలు యెక్కడ జరిగినను, అచ్చటికి చేరుకొని మరీ అరికట్టుచుండిరి.

కాని,నేడు దురదృష్టవశాత్తు మన దేశములోనే అన్యాయఅక్రమాలను అరికట్టజాలకున్నాం.దీనికి కారణం? మనలో అగ్ని లేకపోవడమే!

🚩“అగ్ని మూలం బలం పుంసాం రేతో మూలంతు జీవితమ్।తస్మాత్ సర్వ ప్రయత్నేన అగ్నిం వీర్యంచ రక్షయేత్॥(చరక సంహిత)

జీవులకు జఠరాగ్ని దీప్తిని బట్టియే బలం ఉంటుంది.

వీర్యము జీవనానికి మూలము.కావున అన్ని విధాల ప్రయత్నించి అగ్ని దీప్తిని,వీర్యమును కాపాడు కొనవలెను.

వాల్మీకి శ్రీరాముడిని అద్భతంగా వర్ణించాడు.

🚩 “ఇక్ష్వాకు వంశప్రభవో రామోనామ జనైః శ్రుతః।నియతాత్మా మహావీర్యో ద్యుతిమాన్ధృతిమాన్వశీ॥”వా.రా.బాల కాండము.8.

ఇక్ష్వాక వంశోద్భవుడు రామనామ విఖ్యాతుడు-నియత స్వభావుడు(మాటిమాటికి స్వభావములు మార్చువాడు కాడు), వీర్యవంతుడు-చెఱకుగడలో రసమున్నట్లు శరీరములోని కణకణమునందు వీర్యమున్నవాడు, అగ్నితుల్య తేజోవంతుడు,ధృతివంతుడు-వెనుకడుగు వేయని దైర్యవంతుడు మరియు తనపై తనకు అదుపు గలవాడు.

🚩బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః।

విపులాంసో మహాభాహుః కంబుగ్రీవో మహాహనుః॥

మహెూరస్కో మహేష్వాసో గూఢజత్రురరిందమః।

🚩అజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః॥

వా రా.బాలకాండం.9,10.

శ్రీరాముడు బుద్ధిమంతుడు, నీతిమంతుడు, వాగ్విశారదుడు-మధుర భాషి,శత్రు సంహారకు డు,ఆజానుబాహుడు,గుండ్రటి బలమైన భుజములు కలవాడు,శంఖాకృతిని బోలిన కంఠము గలవాడు,విశాలమైన నుదురు కలవాడు,సదా ధనుస్సును ధరించి శత్రువులకు బుద్ధి చెప్పుటకు ఉద్యుక్తుడై యుండువాడు,మెడ యెముకలు-clavical bones మాంసముతో కప్పబడి పుష్టికరముగ నున్నవాడు,సుందరమైన శిరస్సు మరియు మహా పరాక్రమవంతుడు.

ఆబాలవృద్ధులు తమ శరీరాకృతిని వ్యాయామ ము(దండెములు-బస్కీలు) సూర్యనమస్కారాలు, ఆసనములు మరియు ప్రాణాయామముల ద్వారా రామునికి తుల్యముగ మార్చుకొని శరీరమునందు వీర్యమును వర్ధిల్ల జేసుకొనవలయును.అగ్ని-తేజములను కలిగి యుండవలయును.

అప్పుడు అందరు వారిని ఆదరింతురు. తేజోవిహీనులను తిరస్కరింతురు.ప్రజ్వరిల్లుచున్న అగ్నిని,జ్వాలలను దాటుటకెవరు సాహసింతురు?నిప్పును త్రొక్కరు.బొగ్గును త్రొక్కవచ్చును.కావున ఆర్యసమాజీయులు,వైదికులు,వేదాభిమానులు “అగ్నే త్వం జాగృహి”వేద వాక్యమును శ్రీరామనవమి రోజు పఠించి,మననము చేసి తాము మేల్కొని,ఇతరులను మేల్కొలిపి చైతన్యవంతమైన  జాతిగ రూపొందవలయునని “ఆదిత్య వాణి”కోరుచున్నది.

కామెంట్‌లు లేవు: