20, మే 2023, శనివారం

శ్రీమద్రామాయణము

 శ్రీమద్రామాయణము 

బాలకాండము

మొదటి సర్గము  లోని ‘సంక్షిప్త రామాయణం’ (2/5)

(పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణం నుండి)


*నారదుడు వాల్మీకికి రామకథ సంక్షిప్తముగా తెలుపుట.*


ముల్లోకసంచారి యగు నారదుడు , వాల్మీకి మాటలను విని సంతోషించి “చెప్పెదను వినుము.” అనుచు ఇట్లు చెప్పెను.

“ఓ వాల్మీకిమునీ! నీవు చెప్పిన అనేకమైన ఈ సద్గుణములు సామాన్య మానవులకు దుర్లభమైనవి. అయిననూ అట్టి గుణములన్నీ ఉన్న ఒక మహాపురుషుని గుర్తించి చెప్పెదను. వినుము.


_రాముని గుణవర్ణన_

ఇక్ష్వాకువంశమునందు జన్మించిన రాముడు లోకమంతటా ప్రసిద్దుడు. అతడు మనోనిగ్రహవంతుడు. గొప్ప పరాక్రమము, కాంతి, ధైర్యము కలవాడు. ఇంద్రియములను వశములో ఉంచుకొన్నవాడు. 

రాముడు బుద్ధి, నీతి, మాటలాడుటలో నేర్చు, ఐశ్వర్యము కలవాడు. శత్రువులను నశింపచేయువాడు. అతని మూపులు విశాలమైనవి. బాహువులు దీర్హములై బలిసి ఉన్నవి. కంఠము శంఖమువలె ఉండును. చెక్కిళ్ళ పైభాగము ఉన్నతముగా ఉండును. అతని వక్షస్థలము చాల విశాలమైనది. అతడి ధనుస్సు చాల గొప్పది. అతని మూపుల సంధులు పైకి కనబడవు. శత్రుసంహారకుడైన అతని బాహువులు మోకాళ్ళను స్పృశించునంతగా దీర్హమైనవి. అతడి నడక చూడముచ్చటగా ఉండును. అతడి శిరస్సూ, లలాటమూ కూడ మంచి లక్షణముతో ఒప్పుచుండును. 


అతడి శరీరము హెచ్చు తగ్గులు లేక సమముగా విభజింపబడిన అవయవములతో శోభించును. అతని శరీరము, మరీ పొట్టిగా గాని, పొడవుగా గాని కాకుండగా సమముగా ఉండును. అతడి శరీరపు ఛాయ చాల చక్కనిది. తేజస్సు ప్రశంసనీయమైనది. వక్ష్యస్టలము కండలు తేరి ఉండును. నేత్రములు విశాలమైనవి. అవయవాల శోభ ప్రశస్తమైనది. సాముద్రిక శాస్త్రములో చెప్పిన శుభలక్షణములన్నీ ఆతని శరీరములో కనబడును. 

అతడు సకల ధర్మములు తెలిసినవాడు. ఆడిన మాట తప్పనివాడు. ఎల్లప్పుడూ ప్రజల హితమునే కోరుచుండును. అతడు యశస్సు కలవాడు. అన్ని విషయములు తెలిసినవాడు. పరిశుద్ధమైనవాడు-వ్యవహారములలో ఎన్నడూ ఎవరినీ మోసము చేయనివాడు. 

శ్రీమంతుడైన ఆ రాముడు బ్రహ్మదేవునితో సమానుడు. అందరినీ పోషించువాడు. శత్రువినాశకుడు. సమస్త ప్రాణీసముదాయమును రక్షించువాడు. ధర్మసంరక్షకుడు. 

అతడికి వేదవేదాంగముల రహస్యములన్నీతెలుసు. ధనుర్వేదములో అతడి ప్రావీణ్యము సాటిలేనిది. 

సకల శాస్త్రముల సారము తెలిసిన ఆ రాముని జ్ఞాపకశక్తి, ప్రతిభ చాల ప్రశంసనీయమైనవి. అతడు సకల ప్రజలకు ఇష్టుడు. సాధుస్వభావం కలవాడు. మనస్సులో ఎన్నడూ దైన్యమెరుగనివాడు. పనులలో మంచి నేర్పు కలవాడు.


నదులు సముద్రమును చేరినట్లు సత్పురుషులందరు ఎల్లవేళలా అతనిని చేరుచుందురు. ఈ విధముగా అతడు ఆర్యుడు, అనగా ప్రతి ఒక్కరూ దగ్గరికి చేరవలసిన పురుషుడు. అందరివిషయమునందు సమముగా ప్రవర్తించువాడు. అతడి దర్శనము అందరికీ, ఒకే విధముగా, ఎల్లవేళలా ఆనందజనకమైనది. 

కౌసల్యానందవర్ధనుడైన ఆ రాముదొక్కడే సకలగుణములకు నిలయమైనవాడు. అతడు గాంభీర్యములో సముద్రమువంటివాడు. ధైర్యములో హిమవత్పర్వతమువంటివాడు. ఆతని మనస్సులోని భావము ఏమిటో ఎవ్వరూ గ్రహింపజాలరు. అతని మానసిక స్థైర్యాన్ని ఎవరూ కదల్పజాలరు. 


అతడు పరాక్రమములో విష్ణువుతో సమానుడు. చూచువారికి ఆనందము కలిగించుటలో చంద్రునివంటివాడు. క్రోధము వచ్చినచో ప్రళయకాలాగ్నితో సమానుడు. ఓర్పులో భూమితో సమానుడు. దానం చేయుటలో కుబేరునివంటివాదు. సత్యము విషయంలో సాక్షాత్తు రెండవ ధర్మదేవతయే. శ్రీమద్రామాయణము 

బాలకాండము

మొదటి సర్గము  లోని ‘సంక్షిప్త రామాయణం’ (3/5)

(పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణం నుండి)


*నారదుడు వాల్మీకికి రామకథ సంక్షిప్తముగా తెలుపుట.*


*కైక వరములు*

దశరథుడు ప్రజలకు హితము చేయవలెనను కోరికతో, సమస్త సద్దుణసంపన్నుడును, అమోఘములగు బలపరాక్రమములు కలవాడును, ఎల్లప్పుడును ప్రజల హితమునే కోరుచుందువాడును, తనకు ప్రీతిపాత్రుడును అగు జ్యేష్టకుమారుడైన రాముని యువరాజుగా చేయగోరెను. 


దశరథుని రాణులలో కైకేయి ఒకతె. పూర్వమెప్పుడో దశరథుడు ఆమెకు రెండు వరములు ఇచ్చియుండెను. రామాభిషేకముకొరకు సేకరించిన సంభారములను చూచి ఆమె తనకిచ్చిన వరములలో ఒక వరముగా రాముని అరణ్యమునకు పంపవలెననియు, రెండవ వరముగా భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలెననియు దశరథుని కోరెను. 


దశరథుడు సత్యవాక్పాలన నియమము గలవాడు. అందుచే ధర్మపాశబద్దుడై తన ప్రియపుత్రుడైన రాముని అరణ్యములకు పంపెను. రాముడు, కైకేయికి సంతోషము కలిగించుటకై తండ్రి మాటమా(త్రముగా చెప్పినంతనే దానిని ఆజ్ఞగా గ్రహించి, తన ప్రతిజ్ఞను నిలుపుకొనుచు అరణ్యమునకు వెళ్ళెను. 


లక్ష్మణుడు రామునికి చాల ఇష్టుదైన తమ్ముడు. అతనియందు సహజమైన ప్రేమ కలవాడు. వినయసంపన్నుడు. అతడు తన భ్రాతృస్నేహమును చూపుచు అరణ్యమునకు పోవుచున్న ఆ రామునివెంట వెళ్లెను. ఇట్లు ఉత్తమమైన కార్యము చేయుటచే తల్లియగు సుమిత్రకు కూడ ఆనందమును వృద్ధిపొందించెను. 


*సీత వర్ణన*

జనకుని వంశమునందు పుట్టినదియు, రామునికి భార్యయు, దశరథునికి కోడలు అయిన సీత రామునకు చాల ఇష్టురాలు. ప్రాణము వంటిది. ఆమె సర్వదా రామునకు హితమునే చేయుచుండును. రాక్షసులను మోహింపచేయుటకై సృజింపబడిన దేవమాయవలె లోకోత్తరమైన సౌందర్యము కలది. సాముద్రికశాస్తములో చెప్పిన మంచిలక్షణము లన్నియు ఆమెయందు ఉన్నవి. స్త్రీలలో ఉత్తమురాలైన ఆ సీత కూడ, రోహిణి చంద్రుని అనుసరించినట్లు, ఆ రామచంద్రుని అనుసరించి వెళ్లిను. 


*రాముడు అయోధ్యను వీడుట*

పౌరులును, దశరథుడును వనవాసమునకు వెళ్ళుచున్న రామునివెంట చాల దూరమువరకు వెళ్ళిరి. ధర్మాత్ముడైన రాముడు గంగాతీరమునందు, శృంగిబేరపురము అనెడు పట్టణములో బోయజాతివారికి ప్రభువైన గుహుని కలుసుకొనెను. అచటినుండి రాముడు తన సారథియెన సూతుని వెనుకకు పంపివేసెను. 

సీతారామలక్ష్మణులు ఒక వనమునుండి మరొక వనము చేరుచు, గొప్ప గొప్ప నదులను దాటుచు, భరద్వాజమహర్షి ఆదేశము ప్రకారము చిత్రకూటపర్వతమును చేరిరి. అచట పర్ణశాల నిర్మించుకొని దేవగంధర్వులవలె సుఖముగా నివసించిరి. 


రాముడు చిత్రకూటమునకు వెళ్ళిన పిమ్మట దశరథుడు పుత్రశోకముచేత పీడితుడై, పుత్రునిగూర్చి విలపించుచు స్వర్గస్థుడయ్యెను. 


దశరథుడు మరణించిన పిదప వసిష్టాదులు రాజ్యము చేయుమని భరతుని ఆజ్ఞాపించిరి. తనకు రాజ్యము చేయు సామర్ధ్యమున్నను, భరతుడు రామునిపై నున్న గౌరవముచే రాజ్యమును పాలించుటకు ఒప్పుకొనలేదు. 


రాగద్వేషాదులు జయించిన భరతుడు రాముని అనుగ్రహింప చేసుకొనుటకై అరణ్యమునకు వెళ్ళి, వినయముతో సుమహాత్ముడును, సత్యవ్రతుడును, తన సోదరుడును అగు రాముని చేరి, “నీవు సమస్తధర్మములు తెలిసినవాడవు. అందుచేత నీవే రాజువు కావలెను.” అని ప్రార్ధించెను.


రాముడు తనను ఆశ్రయించినవారి పట్ల సుముఖుడై వారి కోరికలన్నియు తీర్చును. అంతటి మృదుస్వభావుదైనను రాముడు, తండ్రియాజ్జను అనుసరింపవలెనను దీక్షవహించి యుండుటవలన భరతుడు ఎంత ప్రార్ధించినను రాజ్యమును స్వీకరించుటకు అంగీకరించలేదు. 

“నేను వచ్చునంతవరకును నా పాదుకలను నా ప్రతినిధిగా భావించి రాజ్యము చేయుటకై నీవద్ద ఉంచుకొనుము.” అని చెప్పి, తన పాదుకలను భరతునకిచ్చి, రాముడు అతనికి అనేకవిధముల బోధించి అయోధ్యకు పంపెను. 


రాముని తిరిగి తీసికొని వెళ్లవలెనన్న కోరిక తీరని భరతుడు ఆ రామపాదుకలనే సేవించుచు, రాముడు సుఖముగా తిరిగి రావలెనని మనస్సులో కోరుకొనుచు, అయోధ్యాసమీపమున నున్న నంది గ్రామము అనెడు గ్రామములో నివసించి రాజ్యపాలనము చేసెను. శ్రీమద్రామాయణము 

బాలకాండము

మొదటి సర్గము  లోని ‘సంక్షిప్త రామాయణం’ (4/5)

(పుల్లెల శ్రీరామచంద్రుడు వారి వచన రామాయణం నుండి)


*నారదుడు వాల్మీకికి రామకథ సంక్షిప్తముగా తెలుపుట.*


*దండకారణ్యము*

భరతుడు వెళ్లగానే రాముడు, అయోధ్యాపౌరులును భరతాదులును మాటిమాటికి ఆ చిత్రకూటపర్వతమునకు వచ్చుచుందురు అని ఊహించి, పిత్రాజ్ఞాపాలనమునందు సావధానుడై దండకారణ్యమున ప్రవేశించెను. 

దండకారణ్యమును ప్రవేశించిన వెంటనే రాముడు విరాధుడను రాక్షసుని చంపి, శరభంగ - సుతీక్ష్ణ - అగస్త్యమహర్షులను, అగస్త్యుని సోదరుని చూచెను. అగస్త్యుడు తనకు ఇంద్రుడిచ్చిన ధనుస్సును, ఖద్గమును, తరగని బాణములుగల అమ్ములపొదులను రామున కీయగా అతడు సంతోషముగా వానిని గ్రహించెను. 

రాముడు శరభంగమహర్షి ఆశమములో నివసించుచుండగా ఆ చుట్టుప్రక్కలనున్నబుషులందరును, “అసురులను, రాక్షసులను సంహరింపుము.” అని ప్రార్ధించుటకై ఆతనివద్దకు వచ్చిరి. 

రాక్షసనివాసమైన ఆ అరణ్యములో అచ్చటి బుషులు చేసిన ప్రార్ధనను రాముడు అంగీకరించెను. “యుద్ధములో రాక్షసులను సంహరించెదను.” అని అగ్నితుల్యతేజస్సులైన ఆ దండకారణ్యవాసులైన మునులకు మాట ఇచ్చెను. 


*శూర్పణఖ*

దండకారణ్యములో జనస్థానము అను ప్రదేశములో నివసించు కామరూపిణియగు శూర్చణఖ అను రాక్షసిని ముక్కుచెవులు కోసి విరూపిణిగా చేసెను. 


శూర్చణఖ విరూపితయైన పిమ్మట ఆమె మాట విని యుద్ధమునకు వచ్చిన ఖరుని, త్రిశిరసుని, దూషణుని, వారి అనుచరులైన సకలరాక్షసులను రాముడు యుద్ధమునందు సంహరించెను. దండకారణ్యమునందు నివసించునపుడు రాముడు జనస్థానములో నివసించు రాక్షసులలో పదునాలుగువేలమందిని సంహరించెను. 

తన జ్ఞాతుల మరణవార్త వినిన రావణుడు మిక్కిలి కోపించి తనకు సాహాయ్యము చేయుమని మారీచుడను రాక్షసుని కోరెను, 


“రావణా! బలవంతుడైన రామునితో వైరము పెట్టకొనకుము.” అని మారీచుడు రావణుని అనేక పర్యాయములు వారించెను. మృత్యువు సమీపించి ఉండుటచే రావణుడు మారీచుని మాటలు వినలేదు. అతనిని వెంటబెట్టుకొని రాముని ఆశ్రమమునకు వెళ్లెను. 


*సీతాపహరణ*

మాయావియైన మారీచునిద్వారా రామలక్ష్మణులను పర్జశాలనుండి చాలదూరము వెళల్లిపోవునట్లు చేసి, రావణుడు రాముని భార్యయగు సీతను అపహరించెను. ఆమెను విడిపించుటకై వచ్చిన జటాయువును వధించెను. 

ప్రాణములు విడుచుటకు సిద్ధముగా ఉన్న జటాయువును రాముడు చూచెను. సీతను రావణుడు అపహరించినట్లు జటాయువు చెప్పగా విని, రాముడు మిక్సిలి దుఃఖితుదై ఇంద్రియములను వశములో ఉంచుకొనజాలక విలపించెను. 

రాముడు జటాయువునకు దహనసంస్కారము చేసెను. 


*కబంధుడు*

పిమ్మట సీతకై వెదకుచు, ఆ వనములో వికృతమైన ఆకారముతో, భయంకరముగా ఉన్న కబంధుదనెడి రాక్షసుని చూచెను. బలిష్టములైన బొహువులుగల రాముడు ఆ కబంధుని చంపి దహనసంస్కారము చేయగా అతడు స్వర్గమునకు వెళ్లెను. 


అతడు స్వర్గమునకు పోవుటకు ముందు, “రామా! ధర్మమును ఆచరించుటయందు నేర్పు కలదియు, ధర్మమును ఆచరించునదియు అగు ఒక శబర స్రీ సన్న్యాసాశమమును స్వీకరించి ఈ ప్రాంతమునందే యున్నది. ఆమె వద్దకు వెళ్ళుము.” అని చెప్పెను. 

రాముడు శబరి వద్దకు వెళ్లెను. శబరి ఆ రాముని చక్కగ పూజించెను. 


*హనుమత్సుగ్రీవుల పరిచయము*

రాముడు పంపాసరోవరతీరమున హనుమంతునితో పరిచయ మేర్చరచుకొని పిదప ఆతని మాట ప్రకారము సుగ్రీవునితో స్నేహము చేసికొనెను. రాముడు తన వృత్తాంతమునంతను మొదటి నుండియు సుగ్రీవునకు, హనుమంతునకు చెప్పెను, సీతావృత్తాంతమును విశేషించి తెలిపెను. సుగ్రీవుడు రాముని వృత్తాంతమంతయు విని, అగ్నిసాక్షికముగా రామునితో మైత్రి చేసికొనెను. 


“నీకును వాలికిని విరోధమెట్లు ఏర్పడినది?” అని రాముడు ్రశ్నింపగా, సుగ్రీవుడు దుఃఖించుచు, స్నేహముతో రామునకు ఆ వృత్తాంతమునంతయు తెలిపెను. వాలిని చంపెదనని రాముడు ప్రతిజ్ఞ చేసెను. సుగ్రీవుడు కూడ రామునకు వాలియొక్క బలమును వర్ణించి చెప్పెను.


*రామునికి పరీక్షలు*

సుగ్రీవుడు రాముని చూచినది మొదలు, “ఇతడు వాలిని చంపుటకు సమర్ధుడో, కాడో” అని సందేహించుచుందెను. అతడు రాముని విషయమున తనకు నమ్మకము కలుగుటకై, కొండవలెనున్న దుందుభి యను రాక్షసుని కళేబరమును రామునకు చూపెను.


ఊహింపరాని బలము కల రాముడు ఎముకల పోగయి ఉన్న ఆ దుందుభి కళేబరమును చూచి, “ఇది ఎంత?” అన్నట్లు నవ్వి దానిని తన కాలి బొటనవేలితో ఎత్తి పదియోజనముల దూరము పడునట్లు విసరెను. సుగ్రీవునకు ఇంకను నమ్మకము కలుగుటకై ఒకే బాణముచే ఏడు మద్దిచెట్లను, ఒక పర్వతమును, పాతాళమును కూడ భేదించెను. 

రాముడు ఆ పనులు చేసిన పిమ్మట సుగ్రీవునకు నమ్మిక కుదిరెను. తనకు రాజ్యము లభించునని అతడు సంతసించి, రాముని వెంటబెట్టుకొని గుహవలె నున్న కిష్కింధాపట్టణమునకు వెళ్లిను. 


*వాలివధ*

కిష్కింధ ప్రవేశించి సుగ్రీవుడు గర్జించెను. ఆ మవానాదమును విని వాలి గృహమునుండి బయటకు వచ్చెను. యుద్ధమునకు వెళ్లవద్దని నివారించుచున్న తారను ఒప్పించి, వాలి సుగ్రీవునితో యుద్ధమునకు తలపడెను. అచట రాముడు ఒక్క బాణముతో వాలిని చంపెను. అనంతరము సుగ్రీవుని వానరరాజ్యమునందు పట్టాభిషిక్తుని చేసెను.

కామెంట్‌లు లేవు: