20, మే 2023, శనివారం

 నేను ఇలా అనుకుంటాను*


 1. భగవంతుడిని వశంచేసుకునే యుక్తే భక్తి.


2. భక్తి నటించ కూడదు. భక్తిని జీవింపజేయాలి.


3. ధ్యానంలో పరమాత్మను అంతర్ముఖంగా దర్శించాలి. ఆలయంలో భగవంతుని బహిర్ముఖంగా (తెరచిన కళ్ళతోనే) దర్శించాలి.


4.  భగవంతుని సన్నిధిలో అన్యులకు పాదాభివందనం చేయకూడదు.


5. దానం ఏ చేత్తో ఇచ్చినా పరవాలేదు. ఎడమ చేత్తో ఇచ్చినా మంచిదే. హృదయం ఎడం ప్రక్క ఉంది గదా!


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

 సాయంకాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ద్వాదశస్కంధము -  తొమ్మిదవ అధ్యాయము*


*మార్కండేయుడు భగవన్మాయను దర్శించుట*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*9.17 (పదిహేడవ శ్లోకము)*


*క్వచిద్గతో మహావర్తే తరలైస్తాడితః క్వచిత్|*


*యాదోభిర్భక్ష్యతే క్వాపి స్వయమన్యోన్యఘాతిభిః॥13899॥*


*9.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*క్వచిచ్ఛోకం క్వచిన్మోహం క్వచిద్దుఃఖం సుఖం భయమ్|*


*క్వచిన్మృత్యుమవాప్నోతి వ్యాధ్యాదిభిరుతార్దితః॥13900॥*


ఆ ముని ఒక్కొక్కసారి పెద్ద పెద్ద సుడిగుండములలో చిక్కుకొనుచుండెను. ఒక్కొక్క పర్యాయము తరంగములతో కొట్టబడుచుండెను. ఒక్కొక్కసారి పరస్పరము పోట్లాడుకొనుచున్న జలజంతువులు ఆయనపై విరుచుకొనిపడుచు బాధించుచుండెను. అతడు అప్పుడప్పుడు శోకగ్రస్తుడగుచుండెను. ఒక్కొక్కసారి మోహములో పడిపోవుచుండెను. అప్పుడప్పుడు పూర్తిగా దుఃఖములో మునిగిపోవుచుండెను. ఒక్కొక్కసారి సుఖానుభవమును పొందుచున్నట్లుగా ఉండెను. అప్పుడప్పుడు వ్యాధులకు లోనగుచున్నట్లుగను, మృత్యువుపాలగుచున్నట్లుగను భావించి, భయకంపితు డగుచుండెను. 


*9.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*అయుతాయుతవర్షాణాం సహస్రాణి శతాని చ|*


*వ్యతీయుర్భ్రమతస్తస్మిన్ విష్ణుమాయావృతాత్మనః॥13901॥*


ఈ విధముగా మార్కండేయుడు శ్రీమహావిష్ణువుయొక్క మాయామోహితుడై ప్రళయకాల జలధియందు పరిభ్రమించు చుండగా, కోట్లకొలది సంవత్సరములు గడచిపోయెను.


*9.20 (ఇరువదియవ శ్లోకము)*


*స కదాచిద్భ్రమంస్తస్మిన్ పృథివ్యాః కకుది ద్విజః|*


*న్యగ్రోధపోతం దదృశే ఫలపల్లవశోభితమ్॥13902॥*


శౌనకమహర్షీ! మార్కండేయుడు ఇట్లు ప్రళయకాల జలములలో పెద్దకాలము తిరుగుచుండెను. ఒకనాడు అతడు ఒక ఎత్తైన ప్రదేశమునందు కోమలమైన ఒక చిన్న మర్రిచెట్టును జూచెను. అది చిగురుటాకులతోను, ఫలములతోను విలసిల్లుచుండెను.


*9.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*ప్రాగుత్తరస్యాం శాఖాయాం తస్యాపి దదృశే శిశుమ్|*


*శయానం పర్ణపుటకే గ్రసంతం ప్రభయా తమః॥13903॥*


ఆ మర్రిచెట్టుయొక్క ఈశాన్య దిశయందలి కొమ్మపై దొన్నె ఆకారమున ఒక ఆకుగలదు. అందు అందమైన ఒక చిన్న శిశువు పరుండియుండెను. ఆ శిశువుయొక్క దేహకాంతి ప్రభావమున ఆ చుట్టునుగల చీకట్లు  పటాపంచలైపోయెను.


*9.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*మహామరకతశ్యామం శ్రీమద్వదనపంకజమ్|*


*కంబుగ్రీవం మహోరస్కం సునాసం సుందరభ్రువమ్॥13904॥* 


ఆ శిశువు దివ్యమైన ముఖారవిందమున అందములు చిందుచుండెను. అతడు శంఖమును బోలిన కంఠమును, విశాలమైన వక్షస్థలమును, చక్కని నాసికను, చూడముచ్చట గొలిపెడి కనుబొమలను కలిగి అల్లారు ముద్దుగా ఉండెను. 


*9.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*శ్వాసైజదలకాభాతం కంబుశ్రీకర్ణదాడిమమ్|*


*విద్రుమాధరభాసేషచ్ఛోణాయితసుధాస్మితమ్॥13905॥*


అతనియొక్క నిశ్శ్వాసలకు కుంతలములు  ఇటునటు కదలుచు శోభాయమానములై యుండెను. శంఖాకారముననున్న అతని చెవులయందు దానిమ్మపూవులవలె  నున్న ఆభరణములు మిలమిల మెఱయుచుండెను. అమృతధారలొలికెడు అతని చిఱునవ్వుపై పడుచున్న పగడమువంటి అధరముయొక్క శోణ (ఎర్రని) కాంతులు మనోహరముగా నుండెను. 


*9.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*పద్మగర్భారుణాపాంగం హృద్యహాసావలోకనమ్|*


*శ్వాసైజద్వలిసంవిగ్ననిమ్ననాభిదలోదరమ్॥13906॥*


నేత్రాంతములు పద్మములయందలి లోపలిభాగమువలె అరుణద్యుతులను వెలార్చుచుండెను. దరహాసములు, చూపులు, హృద్యములై అలరారుచుండెను. ఆ చిన్నారి నిట్టూర్పులు  సలుపుచున్నప్పుడు వళిత్రయము పైకి క్రిందికి కదలుచు మనోజ్ఞముగా ఉండెను. గంభీరమైన   నాభితో  ఒప్పుచున్న ఉదరము రావి ఆకువలె చలించుచుండెను.


*9.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*చార్వంగులిభ్యాం పాణిభ్యామున్నీయ చరణాంబుజమ్|*


*ముఖే నిధాయ విప్రేంద్రో ధయంతం వీక్ష్య విస్మితః॥13907॥*


ఆ పసివాని చేతులవ్రేళ్ళు అతికోమలములు. ఆ చిన్ని శిశువు మృదువైన తన చిట్టి చేతులతో పాదారవిందమును పట్టుకొని నోటియందిడుకొని బొటనవ్రేలును చీకుచుండెను. ఈ అద్భుత దృశ్యమును గాంచి మార్కండేయుడు మిగుల విస్మితుడాయెను.


ఈ సుందర దృశ్యమును లీలాశుకుడు తన కృష్ణకర్ణామృతమున ఇట్లు వర్ణించెను.


*శ్లో. కరారవిందేన పదారవిందం, ముఖారవిందే వినివేశయంతమ్|*

*వటస్య పత్రస్య పుటే శయానం, బాలం ముకుందం మనసా స్మరామి॥*


*9.26 (ఇరువది ఆరవ శ్లోకము)*


*తద్దర్శనాద్వీతపరిశ్రమో ముదా ప్రోత్ఫుల్లహృత్పద్మవిలోచనాంబుజః|*


*ప్రహృష్టరోమాద్భుతభావశంకితః ప్రష్టుం పురస్తం ప్రససార బాలకమ్॥13908॥*


శౌనకమహర్షీ! ఆ దివ్యశిశువును జూచినంతనే మార్కండేయుని అలసటలు అన్నియును తొలగిపోయెను. అతని హృదయపద్మము సంతోషముతో నిండిపోయెను. కమలమువలె వికసితములయ్యెను. శరీరము పులకించిపోయెను. 'ఇంతకును ఈ మహిత శిశువు ఎవరు?' అని అతడు తన మనస్సునగల శంకను దీర్చుకొనుటకై ఆ బాలుని సమీపమునకు చేరుటకు ముందుకు  జరిగెను.


*9.27 (ఇరువది ఏడవ శ్లోకము)*


*తావచ్ఛిశోర్వై శ్వసితేన భార్గవః సోఽన్తఃశరీరం మశకో యథాఽఽవిశత్|*


*తత్రాప్యదో న్యస్తమచష్ట కృత్స్నశో యథా పురాముహ్యదతీవ విస్మితః॥13909॥*


మార్కండేయుడు ఆ శిశువును చేరకముందే అతని ఉఛ్వాసవేగమున అతడు ఒక దోమవలె ఆ శిశువు గర్భములోనికి లాగబడెను. అచట అతడు ప్రళయమునకు పూర్వమునగల సమస్త జగత్తును గాంచెను. ఆ విచిత్ర దృశ్యమునకు అతడు ఎంతయు అబ్బురపడెను. మోహవశమున ఆయనకు దిక్కుతోచని స్థితి ఎదురయ్యెను.


*9.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*


*ఖం రోదసీ భగణానద్రిసాగరాన్ ద్వీపాన్ సవర్షాన్ కకుభః సురాసురాన్|*


*వనాని దేశాన్ సరితః పురాకరాన్ ఖేటాన్ వ్రజానాశ్రమవర్ణవృత్తయః॥13910॥*


*9.29 (ఇరువది తొమ్మిదివ శ్లోకము)*


*మహాంతి భూతాన్యథ భౌతికాన్యసౌ కాలం చ నానాయుగకల్పకల్పనమ్|*


*యత్కించిదన్యద్వ్యవహారకారణం దదర్శ విశ్వం సదివావభాసితమ్॥13911॥*


ఆ పసివాని ఉదరమున అతడు ఆకాశమును, అంతరిక్షమును, నక్షత్రములతో, గ్రహములతో నిండిన జ్యోతిర్మండలమును, పర్వతములను, సముద్రములను, ద్వీపములను, దేశములను, దిక్కులను, సురలను, అసురులను, వనములను, వివిధప్రదేశములను నదులను, నగరములను, గనులను, కర్షకుల గ్రామములను, గొల్లపల్లెలను, ఆశ్రమములను, వర్ణాశ్రమ ఆచార వ్యవహారములను, పంచమహా భూతములను, వాటితో ఏర్పడిన ప్రాణుల శరీరములను, పదార్థములను, వివిధ యుగములలో, కల్పములలో ఘటిల్లిన కాలాదిభేదములను చూచెను. అంతేగాక పలుదేశములలో, వస్తువులలో, కాలములలో జగత్తునందు ఏర్పడెడి పరిణామములను గమనించెను. విశ్వమంతయును అచటనేయున్నట్లు అతని (మార్కండేయునకు) ప్రతీతమయ్యెను.


*9.30 (ముప్పదియవ శ్లోకము)*


*హిమాలయం పుష్పవహాం చ తాం నదీం నిజాశ్రమం యత్ర ఋషీనపశ్యత్|*


*విశ్వం విపశ్యంఛ్వసితాచ్ఛిశోర్వై బహిర్నిరస్తో న్యపతల్లయాబ్ధౌ॥13912॥*


అతడు ఆ చిన్ని శిశువుయొక్క ఉదరమునందే హిమవత్పర్వతమును, పుష్పభద్రానదిని, ఆ నదీతీరమునగల తన ఆశ్రమములను, అచటి ఋషీశ్వరులను ప్రత్యక్షముగా చూచెను. ఇట్లు సంపూర్ణ విశ్వమును చూచుచుండగనే ఆ దివ్యశిశువు యొక్క నిట్టూర్పుద్వారా అతడు బయటికి వచ్చిన వెంటనే ప్రళయకాల సముద్రములో పడిపోయెను.


*9.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*


*తస్మిన్ పృథివ్యాః కకుది ప్రరూఢం వటం చ తత్పర్ణపుటే శయానమ్|*.


*తోకం చ తత్ప్రేమసుధాస్మితేన నిరీక్షితోఽపాంగనిరీక్షణేన॥13913॥*


మరల ఆ ప్రళయసముద్రమునందు ఎత్తైన భూతలమున అతడు ఆ చిన్నారిని అక్కున జేర్చుకొనటకై అతికష్టము పై ముందునకు సాగెను.


*9.32 (ముప్పది రెండవ శ్లోకము)*


*అథ తం బాలకం వీక్ష్య నేత్రాభ్యాం ధిష్ఠితం హృది|*


*అభ్యయాదతిసంక్లిష్టః పరిష్వక్తుమధోక్షజమ్॥13914॥*


మార్కండేయుడు ఇంద్రియాతీతమైన ఆ భగవన్మూర్తిని  తన నేత్రములద్వారా హృదయమున ప్రతిష్ఠించుకొని యుండెను. ఇప్పుడు అతడు ఆ చిన్నారిని అక్కున జేర్చుకొనుటకై అతికష్టముపై ముందునకు సాగెను.


*9.33 (ముప్పది మూడవ శ్లోకము)*


*తావత్స భగవాన్ సాక్షాద్యోగాధీశో గుహాశయః|*


*అంతర్దధే ఋషేః సద్యో యథేహానీశనిర్మితా॥13915॥*


శౌనకమహర్షీ! పరమయోగీశ్వరుడైన ఆ పరాత్పరుడు యోగుల హృదయములయందు నివసించుచుండును. మార్కండేయుడు తనను సమీపింపక ముందే అశక్తుడు, అదృష్టహీనుడు అగువానియొక్క పరిశ్రమ నిష్ఫలమైనట్లు, అతడు మార్కండేయునకు తన ఆలింగన భాగ్యమును ప్రసాదింపక అంతర్హితుడయ్యెను.


*9.34 (ముప్పది నాలుగవ శ్లోకము)*


*తమన్వథ వటో బ్రహ్మన్ సలిలం లోకసంప్లవః|*


*తిరోధాయి క్షణాదస్య స్వాశ్రమే పూర్వవత్స్థితః॥13916॥*


శిశువు అంతర్ధానమైనంతనే, వటవృక్షము, అట్లే ఆ ప్రళయకాల దృశ్యమంతయును మాయమైపోయెను. మార్కండేయుడు మునుపటి వలెనే తన ఆశ్రమమునందే ఆసీనుడైయుండెను.


*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ద్వాదశస్కంధే మాయాదర్శనం నామ నవమోఽధ్యాయః (9)*


ఇది భాగవత మహాపురాణమునందలి ద్వాదశస్కంధము నందలి *మార్కండేయుడు భగవన్మాయను దర్శించుట* అను తొమ్మిదవ అధ్యాయము (9)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*


మీకు మీ కుటుంబ సభ్యులకు ఆ నారాయణ, నారాయణిల కటాక్షము సిద్ధించుగాక. శుభరాత్రి.

కామెంట్‌లు లేవు: