20, మే 2023, శనివారం

*ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 65*

🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 65*


నందసోదరుల వైపు ప్రసన్నంగా దృష్టి సారించాడు జీవసిద్ధి. 


"చాతుర్వర్ణములలో బ్రాహ్మణులదే మిగిలిన మూడు వర్ణముల వారిపై ఆధిపత్యం. దానికి కారణం బ్రాహ్మణుల హస్తగతమై ఉన్న వేదాలు. ఉపనిషత్తులు, మంత్రాలు, తంత్రాలు. నిజానికి అది వారి తప్పు కాదు. క్షత్రియులు అధర్వణ వేదంలోని యుద్ధ, రాజకీయ, రాజ్యాంగ, ధనుర్విద్యా విభాగాలని మాత్రమే అధ్యయనం చెయ్యడానికి ఇష్టపడతారు. ఎందుకంటే, రాజ్యాధికారం క్షత్రియులదే కాబట్టి, వారు అంతవరకూ తెలిస్తే చాలనుకుంటారు." 


"నిజం. నిజం." అన్నాడు సుకల్పనందుడు, జీవసిద్ధి మాటలకు వంత పాడుతూ. 


జీవసిద్ధి మందహాసం చేసి "వైశ్యులు వ్యాపారవాణిజ్యాలే తమకి ముఖ్యమని భావిస్తారు కాబట్టి, వారు అర్థశాస్త్రా అధ్యయనాన్ని మాత్రమే ఆశిస్తారు. శూద్రులకి అసలు వేదద్యయన అధికారమే లేదు" అన్నాడు. 


"యదార్ధం ... యదార్థం..." అన్నాడు సుకల్పుని తమ్ముడు, కోశాధికారి ధర్మానందుడు. 


జీవసిద్ధి తలపంకించి "అందుకే బ్రాహ్మణులకే అన్ని శాస్త్రాలూ సొంతమయ్యాయి. ఒక చిన్న మంత్రం కావాలన్నా, మంత్రోపదేశం పొందాలన్నా, మందో మాకో కావాలన్నా, తాయత్తో రక్షరేఖో అవసరమైనా, ఇలా ప్రతి చిన్న విషయానికీ మిగతా వర్ణాలవారు వారి మీద ఆధారపడడం వల్ల వారి ఆధిపత్యం పెరిగిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే నియమ నిష్టాతులైన బ్రాహ్మణులు నిస్వార్ధంగా సమాజసేవ చేస్తున్నారు. ధర్మరక్షణ దీక్షను వహిస్తున్నారు. నిజమే, కానీ అభిజాతులైన కొందరు బ్రాహ్మణులు ప్రపంచానికి తామే దిక్కూ, అతీ గతీ అని అహంకరించడం చేతనే బౌద్ద మతావలంబులమైన మేము వారి అహంకారాన్ని యండ గట్టడానికి... ఇప్పటివరకూ వారికి మాత్రమే సొంతమైన మంత్ర, తంత్ర, మహిమాన్విత మాయాశక్తుల మీద పట్టు సాధించాం... లోకసేవ, ఆర్తుల రక్షణ చేస్తూ మా మహత్తును లోకానికి చాటుతున్నాం" అని వివరించాడు. 


"తమ మాటలు ప్రత్యక్షర సత్యం .... అందుకే తమ ఆశ్రయం కోరి వచ్చాం" చెప్పాడు సుకల్పనందుడు వినయంగా. 


"చేతులు కాలాక, ఆకులు పట్టుకున్న చందానా... ?" అంటూ జీవసిద్ధి నవ్వి చప్పున కళ్ళు మూసుకుని ధ్యాన నిమగ్నుడయ్యాడు. అతని నోటి వెంట ఏం మాట వస్తుందోనని నందులు ఉత్కంఠతో ఎదురు చూడసాగారు. రెండు క్షణాల తర్వాత... 


"నల్ల బాపడు నందప్రభువులను దూషిస్తుంటే... నమ్మకస్తులమని పదే పదే చెప్పుకుంటున్న వాళ్లు వారించకపోగా... అతడిని దండించకుండా అడ్డుపడ్డాడు కదా ... అసలు ఎవరి అండదండలూ లేకుండానే అతడలా మిడిసి పడగలడా ?" అన్నాడు జీవసిద్ధి ఉచ్చస్వరంతో. నందులు ఉలిక్కిపడి మొహాలు చూసుకున్నారు. 


"ఆ బాపడు తనంతతానే వచ్చాడా... ? నందులను అవమానించాలన్న దురుద్దేశంతో... మహానందుల వారి వంశాంకురానికి మగధ సింహాసనాన్ని కట్టబెట్టాలన్న దుర్బుద్ధితో... అయిన వాళ్లే పథకం ప్రకారం ఆ బాపడిని రప్పించి రభస చేయించారా ?" అన్నాడు జీవసిద్ధి మహోగ్రస్వరంతో, ధ్యానదీక్షలో. 


సుకల్పనందుడి మొహం ఎరుపెక్కింది. పటపట పళ్లు కొరుకుతూ "నిజమే... మేము ఎంత అభిమానంగా సేవిస్తున్నా సుబంధుల వారికింకా మహానందుల వారి మీదున్న అభిమానం పోలేదు. ఆనాటి ఆయన పరిపాలనతో మా పరిపాలనని పోలుస్తూ అప్పుడప్పుడూ మమ్మల్ని కించ పరుస్తుంటాడు. అసలు ఆయన మెప్పుకోసమే ధర్మశాలలో ప్రత్యేకపీఠం ఏర్పాటు చేశాం. ఆ పీఠం కారణంగానే అవమానాల పాలయ్యాం. ఆ చాణక్యుడు మమ్మల్ని అనరాన్ని మాటలు అంటుంటే ఆయన్ని ఖండించలేదంటే... అది సుబంధుల వారి వ్యూహమా ? చాణక్యుని పట్ల బ్రహ్మణాభిమానమా...?" అన్నాడు ఉక్రోషంగా. 


"ఏదైతేనేం...? స్వజాతి అభిమానంతో మిమ్మల్ని అవమానించిన బాపడిని మందలించకుండా ఉపేక్షించిన వారిని శిక్షించకతప్పదు... ధర్మశాలని తక్షణం మూసివెయ్యండి. బోలడంత ధనం ఆదా అవుతుంది. సుబంధుల వారిని తరిమెయ్యండి. మీ ప్రక్కనే నమ్మకంగా ఉంటూ, నక్కజిత్తులు ప్రదర్శించి మీ రహస్యాలను మీ శత్రువులకు చేరవేసిన ఫలితం అనుభవిస్తాడు..." చెప్పాడు జీవసిద్ధి బిగ్గరగా. 


"తమ ఆజ్ఞని తక్షణం పాటిస్తాం స్వామీ ! ధర్మశాల వల్ల మాకంతా నష్టమే. దాన్ని వెంటనే మూసేస్తాం. సుబంధుడిని ఆలస్యం చెయ్యకుండా సాగనంపుతాం. ఇంకా ఏం చెయ్యాలో శెలవియ్యండి" అన్నాడు ధర్మనందుడు. 


"ప్రస్తుతం ఈ రెండు చెయ్యండి. మేము వీలు చూసుకుని కోటనీ, అంతఃపురాన్నీ సందర్శిస్తాం. అక్కడే ఏదో దుష్టశక్తుల ప్రాబల్యమేదో మా దివ్యదృష్టికి గోచరిస్తోంది. మా మహత్తుతో ఆ శక్తులను గుర్తించి, మా మంత్రశక్తితో వాటి ఆట కట్టిస్తాం..." అన్నాడు జీవసిద్ధి కళ్ళు తెరుస్తూ. 


సరిగ్గా అప్పుడే రాజుగురువు సుబంధుడు హడావిడిగా లోపలికి వచ్చాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: