27, జూన్ 2023, మంగళవారం

చామకూర చమత్కారం



చామకూర  చమత్కారం 

    

                             శ్లేష-  చమత్కారాల  మధ్య  చాలాతేడా ఉంది. శ్లేషంటే  కేవలం రెండు అర్ధాలు  పొదగటం. శబ్దానికి ఉన్న నానార్ధముల నాధారంగా  దీనిని యేర్పాటు  చేయవచ్చు.*రాఘవపాండవీయము, హరిశ్చంద్ర నలోపాఖ్యానమూ  ఇలాంటి

శ్లేషకావ్యాలు. వీనికి ద్వర్ధికావ్యాయాలుగా  లోకంలో ప్రసిధ్ధి. 


               చమత్కారం  అలాకాదు. భావనాకాశంలో  మెరిసే మెఱపులాంటిది. లోకోత్తరమైన ఉల్లాస భరితమైన  అర్ధవిశేషాన్ని,లేదా

భావనను ఆవిష్కరించటం  చమత్కారం. చతురులైన వారిమాటలలో యిది మాటిమాటికి  తొంగిచూస్తూ ఉంటుంది. అలాంటి కవిత్వం చెప్పటంలో  మొనగాడు చామకూర  వేంకట కవి. 


                    అతడు వ్రాసిన విజయ విలాసం ,సారంగ ధరచరిత్రములు  చమత్కారమునకు  నెలవగు కృతులు. . మన మిప్పుడు  సారంగధర చరిత్రములోని  రెండు పద్యములను పరిశీలించి యతనిచమత్కార

కవితా తత్వము  నవలోకింతముగాక!


               చిత్రాంగి  సారంగధరుని వలచిన రాచకన్నె. ఆమెసోయగమునకు మురిసి  వృధ్ధుడగు  రాజేంద్రుడామెను పెండ్లాడెను.కానీ,

సారంగధరుని కొరకు చిత్రాంగి వేచియుండెను. అనుకొనకుండ నొకనాడు  పావురమునకై   సారంగ ధరుడామె యంతఃపురమునకు

వచ్చెను. మంచిసమయము దొరికెనని చిత్రాంగి  యతనిని వలపించుటకు ప్రయత్నించు చున్నది. 


             ఉ: నిక్కుగఁ జూడు చిత్రమిది , నెమ్మది వేడుక నోలలాడు ,న

                  మ్మక్కల  గుట్టు బట్టబయలై  గనుపింపగ  శౌరి  "కొమ్మపై

                  నెక్కి రమించు చున్కి, అవులే ! మగువా! యిది  చిత్రమౌట దా

                   నిక్కము; కృష్ణలీలగద  నీవిపుడెన్నిన  మార్గమంతయున్ ;


                                    సారంగధర చరిత్రము-- చామకూర  వేంకటకవి! 


                     చిత్రాంగి  వలపుల కళ్ళెమును  బిగించుటకు  ప్రయత్నించుచుండ ,నైతిక  జీవన పరాయణుడగు  సారంగధరుడు  ఆమాటలకు  అన్యార్ధమును  గలిపించి  యాగండమునుండి తప్పించు కొనుటకు యత్నించుచుండుటవిషయము. 


               1  చిత్రము  2  అమ్మక్కలగుట్టు బట్టబయలగుట 3 కొమ్మపై నెక్కి రమించుట -  యను మూడింటిలోనే   యీపద్యములోని

విషయమంతయు దాగియున్నది.


               చిత్రాంగి పడకటింటిలో  నొక కుడ్య చిత్రమును జూపుచు ,సారంగధరా! ఈ చిత్రమును చూడుము గోపికల  మానచోరుడైనకృష్ణడు  చేయుకొంటెపనులు . ఆకొమ్మపై నెక్కిరమించుట చిత్రముగానున్నదిగదా? యనుచున్నది. ఇటనామెభావము

కృష్ణుడు గోపికలతో జరపు  మిధున కార్యమును జూపుట. "జయదేవుని '  శ్లిష్యతికామపి చుంబతి కామపి  రమయతి కామపి రామామ్"  అన్నది గుర్తుకు తెచ్చుకోవాలి. అదిగో  కుడ్యచిత్రంలో ఉన్నవిషయమంతా అది. సహజంగా అలాంటిదృశ్యాలు  యువకులకు కామోద్రేకాన్ని కల్గిస్తాయికదా! అందుకు యెత్తు వేసింది. కానీ  ఆమె యెత్తు పారలేదు.

            

                                   ఔనులే! నీవుచెప్పినది నిజమే! యిది చిత్రమే! (చిత్తరువే ) యేమున్నది? యివన్నియు కృష్ణలీలలని

సారంగ ధరుని సమాధానము. (ఇది ఫొటోయేకదా  యదార్ధదృశ్యము కాదుగదా!) ఇంతకు అవి  భగవత్కృత్యములు. అనితప్పించుకొనెను.


                       చిత్రము  అనునొక్కమాటతో  కృష్ణుడు గోపికలతో నొనరించిన కాముక కృత్యములను  మరుగున పడవేయుట యిందలి చమత్కారము. ఆహా! చామకూర యెంతటి ప్రతిభాశాలి!! 


కేవలము తెలుగు పదములగారడీతో

 నతడొనర్చిన యీశ్లేషఘటనా చమత్కారమునకు అంజలి ఘటింపక తప్పదుగదా!. 


                                                            స్వస్తి!🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🙏🌷🌷🌷🌷🙏

కామెంట్‌లు లేవు: