27, జూన్ 2023, మంగళవారం

ఇంటింటి చాగంటి"

 "ఇంటింటి చాగంటి"


సనాతన ధర్మాన్ని అనుసరించే తెలుగువారందరూ  ఒక్కసారైనా శ్రీ చాగంటి కోటేశ్వర రావు గారి ప్రవచనం  వినే ఉంటారు ! 


వైదిక ధర్మం లుప్తమైపోతుందేమో, ఇప్పటి తరానికి దిశానిర్దేశం చేసేవారెవరూ ఉండరేమో అని భయపడుతున్న దశలో తెలుగు ప్రవచనాల రంగస్థలం మీద ఒక వెలుగు రేఖలా ప్రసరించి, 'ఇంతింతై వటుడింతై' అన్నట్టు తన వాగ్ఝరి, అసమాన ధారణా కౌశలంతో చాగంటి గారు ఇంటింటి మనిషైపోయారు. ప్రొద్దున్న లేవగానే ప్రక్కింట్లోనో, ఎదురింట్లోనో లేదా గుడిలోనో ఆయన కంఠం మోగుతూనే ఉంటుంది.


సనాతన ధర్మం మీద ఉన్న అచంచల విశ్వాసం, తల్లిదండ్రులు, గురువుల మీద గల గౌరవం, వాఙయాన్ని ఇచ్చిన ఋషులపట్ల విధేయత, పెద్దల పట్ల గల గౌరవం ఆయన ప్రసంగాల్లో ఉట్టిపడుతూ ఉంటుంది.  ఆయన ప్రవచనాలు విని పులకరించని మది ఉంటుందా? నిరాశా, నిస్పృహలతో నిండిన జీవితానికి ఆశ చిగురించకుండా ఉండగలదా? ఆచరించగలిగీ ఆచారాన్ని విడిచిపెట్టేసిన వారి మనస్సాక్షి 'నువ్వు చేస్తున్నదేమిట'ని నిలదీయకుండా ఉంటుందా!  


'పూజామందిరంలో ఉన్నది బొమ్మ కాదు, నీ మొర ఆలకించే భగవంతుడే అక్కడున్నాడ'ని చాగంటి గారు నొక్కి వక్కాణించడం విన్నాకా మన పూజా విధానం మనకి తెలియకుండానే మార్పు చెందుతుంది. భగవంతుడికి అవసరార్థం ఓ దణ్ణం పెట్టి 'నీకిదిస్తే నాకేమిస్తావ్' అనే బేరసారాల స్థాయి నుండి భగవంతుడంటే నమ్మినవారి బాగోగులు చూసే ఒక అద్భుతశక్తి అనే నమ్మకం  కొన్ని వందలు, వేలమందికి కలగడానికి కారణం ఆయన ప్రవచనాలే కదూ!


శివకేశవుల అభేదం పాటిస్తూ ఆయన ప్రవచించిన పురాణాలు, ఇతిహాసాలు వింటోంటే సూత మహామునే స్వయంగా మనముందుకి వచ్చి ప్రవచించినట్టు ఉంటుందనడంలో కించిత్ అతిశయోక్తి కూడా లేదు. నిత్య నైమిత్తిక కర్మలని ఎలా ఆచరించాలి, సమయం లేకపోతే లఘువుగా పూజ ఎలా చేసుకోవాలి అని ఇంటిపెద్దలా వివరిస్తోంటే ఎన్ని వేల చేతులు మౌనంగా మనస్సులోనే ఆయనకి నమస్కరిస్తూ ఉంటాయో!


ప్రత్యేక తిథుల్లో పారాయణ చేయవలసిన శ్లోకాలని ఆయన పఠిస్తుండగా సభికులు గొంతు కలిపినప్పుడు వెలువడే ఆ పాజిటివ్ ఎనర్జీని అనుభవించాలే తప్ప మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. ఎన్నో వందల ప్రవచనాలు చేసినా తాను భగవత్స్సేవ చేస్తున్నాను అనుకుంటూ ఈ సేవకి రూపాయి తీసుకోకూడదని ఆయన మాతృమూర్తి పెట్టిన నిబంధనని గత రెండు దశాబ్దాలుగా తు.చ. పాటిస్తున్న శ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి నిష్ఠకి చేతులెత్తి మొక్కకుండా ఎలా ఉండగలం ! 


చాగంటి గారి ప్రవచన ఝరి ప్రేక్షకులని మంత్రముగ్ధులని చేయడంతో పాటు కూర్చున్నవారిని కూర్చున్నట్టుగా వివిధ ఆలయాల సందర్శనకి కూడా తీసుకెళ్ళిపోతుంది. తన ప్రవచనాల్లో తిరుమల వేంకటేశ్వరుడి ఆలయం లేదా తాను సందర్శించిన ఏ ఇతర ఆలయం ప్రస్తావన వచ్చినా చాగంటిగారు పులకరించిపోయి ఆ ఆలయాన్ని అణువణువూ వర్ణిస్తూ, తన ప్రవచన ప్రఙతో శ్రోతలకి ఆలయ విశేషాలని శాబ్దిక ప్రత్యక్షప్రసారం చేసి దానిని కళ్ళముందు  సాక్షాత్కరింపజేస్తారు. ఆయా ఆలయాలని సందర్శించినప్పుడు నిర్మల భక్తితో, ఏకాగ్రచిత్తంతో మనసుని ఆ పరిసరాల్లో లయం చేస్తే తప్ప అటువంటి ధారణ అసాధ్యం.    


కేవలం పురాణేతిహాసాల ప్రవచనాలతో చాగంటి గారు తన కర్తవ్యం పూర్తయ్యిందనుకోలేదు. పిల్లలని, యువతని సరైన మార్గంలోకి మళ్ళిస్తేనే వారు మంచి పౌరులుగా తయారవుతారని ఒక బాధ్యత గల పౌరుడిగా మనసారా నమ్మి వారికి తన ప్రసంగాల ద్వార అనేక పాఠశాలలు, కళాశాలల్లో దిశానిర్దేశం చేసారు, ఇప్పటికీ చేస్తున్నారు.  


'మన చాగంటిగారు ' అనుకునేంతగా ఆయన తన ప్రవచనాలు వినేవారి మనసుల్లో కొలువయ్యారంటే అందుకు ఆయన కృషి మాత్రమే కాకుండా, చాగంటిగారిని సదా  వెన్నంటి ఉంటూ తన తోడ్పాటుని అందిస్తున్న ఆయన అర్ధాంగి శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరిగారి పాత్ర కూడా ఉంది. 


ప్రవచనాల ద్వారా దిశా నిర్దేశం చేస్తున్న ఆ శారదాపుత్రునికి మనం ఏమివ్వగలం? తాను చెప్పే ప్రవచనాలు తనని తాను ఉద్ధరించుకోవడానికేనని చాగంటి గారు వినయంగా చెప్పుకుంటారు. తాను చేస్తున్న సత్కార్యాన్ని నిష్కామంగా ఆ పరమేశ్వరుడికే ధారపోసే ఆ ప్రవచనయోగిని ఏమని పొగడగలం? ఆయన చూపుతున్న బాటలో నడవడం తప్ప.


భగవంతుడు తనకి ప్రసాదించిన వాక్కుని, అసాధారణమైన ధారణాశక్తిని ఉపయోగించి సమాజంలో మార్పు తీసుకురావడానికి తన వంతు కృషి చేస్తున్న శ్రీ చాగంటి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.


-శ్రీమతి వాత్సల్య గుడిమళ్ళ, సింగపూర్

కామెంట్‌లు లేవు: