27, జూన్ 2023, మంగళవారం

ఆర్య చాణక్య*♦️ *పార్ట్ - 103*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.           ♦️ *ఆర్య చాణక్య*♦️


*పార్ట్ - 103*


భార్యబిడ్డలను పాటలీపుత్రంలో రహస్యస్థావరంలో దాచివచ్చి మంజు పట్టణంలో తలదాచుకున్న రాక్షసుడు తరచుగా తన కుటుంబ సభ్యులను తలుచుకొని బాధపడుతున్నాడని తెలుసుకున్న మలయకేతువు అతని విచారాన్ని పోగొట్టడానికి బాగురాయణుడు సలహా మేరకు అమూల్యమైన రత్నహారాన్ని రాక్షసునికి బహుమతిగా పంపించాడు. ఆ హారం చేరే సమయానికే కొన్ని ఆభరణాలు రాక్షసుని వద్దకు విక్రయానికి వచ్చాయి. వ్యాపారులు ధనం అవసరం వచ్చి తక్కువ వెలకు ఆ ఆభరణాలను రాక్షసునికి విక్రయించి ధనం తీసుకుని నిష్క్రమించారు. 


ఇంతలో మలయకేతువు వద్ద నుంచి దూతరావడంతో రాక్షసుడు తాను కొన్న అభరణాలన్ని పెట్టెలో దాచి పెట్టి, మలయకేతువు పంపిన రత్నహారాన్ని స్వీకరించి దానిని ధరించి వెళ్లి మలయకేతువుకి ఆనందం కలిగించాడు. 


ఇది జరిగిన కొన్నాళ్ళకు శకటదాసు, సిద్దార్థకుడు వచ్చి రాక్షసుని కలుసుకున్నారు. తన మిత్రుడైన శకటదాసుని రక్షించినందుకు కృతజ్ఞతగా తన మెడలోని రత్నహారాన్ని తీసి సిద్దార్థకునికి బహుకరించాడు రాక్షసుడు. 


సిద్ధార్థకుడు ఆ హారాన్ని తిరిగి యిచ్చివేస్తూ "అయ్యా... ! ఈ హారాన్ని మీ వద్దనే వుంచండి. నాకు అవసరమైనప్పుడు తిరిగి తీసుకుంటాను" అని చెప్పాడు. 


అంతలో అప్రయత్నంగా అతని దుస్తుల్లో నుంచి రాక్షసుని నామాక్షరాలున్న ఉంగరం జారిపడింది. రాక్షసుడు ఆ ఉంగరాన్ని తనదిగా గుర్తించి వివరాలు అడిగాడు. 


"ఒకసారి నేను చందనదాసు ఇంటి ముందు భిక్షకోసం వెళ్లగా వీధి గుమ్మం బయట పడి వున్న ఉంగరం కనిపిస్తే తీసి దాచాను. మీదైతే మీరే స్వీకరించండి" అని చెప్పాడు సిద్ధార్థకుడు. 


తన అంగుళీయకాన్ని చూసుకోగానే రాక్షసునికి భార్య గుర్తుకొచ్చి కంటనీరు గిర్రున తిరిగింది. తాను దేశం విడిచి వస్తూ తన భార్యకి ఇచ్చి వచ్చిన ఆ అంగుళీయకాన్ని ఆమె పొరబాటున చేజార్చుకుని ఉంటుందని అతను భావించాడు. 


"నాయనా .... ఈనాడు సుదినం. నాకు మిత్ర దర్శనంతోపాటు ఈ అంగుళీయకం ద్వారా నా భార్యబిడ్డల్ని దర్శించినంత ఆనందాన్ని కలిగించావు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేను" అంటూ రాక్షసుడు, మలయకేతువు అప్పుడప్పుడూ తనకి కానుకగా పంపిన మరో రెండు ఆభరణాలను సిద్దార్థకునికి ఇచ్చాడు. 


సిద్దార్థకుడు వాటిని కూడా రాక్షసుడు వద్దనే దాచమని చెప్పి "అమాత్యా ! మీకు సహాయం చేసి నేనా చాణక్యుడికి విరోధినయ్యాను. ఈ పరిస్థితుల్లో నాకు బ్రతికేందుకు వేరేదారి కూడా లేదు. కనుక తమరివద్దనే నాకూ ఏదైనా పని చూపించి పుణ్యం కట్టుకోండి" అని ప్రార్థించాడు. 


రాక్షసుడు సంతోషించి సిద్ధార్థకుడిని తన అంతరింగిక సేవకుడిగా నియమించుకున్నాడు. తన తరపున మలయకేతుకి ఏదైనా సందేశమో, వార్తో పంపాల్సివస్తే దానిని సిద్ధార్థకుడి ద్వారా నిర్వర్తించేవాడు రాక్షసుడు. ఆ విధంగా కొద్దిరోజుల్లోనే మలయకేతువుకి కూడా రాక్షసుని దూతగా సిద్ధార్థకుడు గుర్తింపు పొందాడు. 


ఇది జరిగిన కొంత కాలానికి....


"రాక్షసామాత్యుని అనుకూలురు అన్న ముద్రవేసి, రాజద్రోహనేరాన్ని మోపి, భద్రభట, డింగరారత, బలగుప్త సేనానులను రాజ్యాన్నించి బహిష్కరించాడు చాణక్యుడు. దేశబహిష్కారానికి గురైన ఆ సేనానులు చాణక్యుని మీద పగతీర్చుకోవాలన్న కాంక్షతో అష్టకష్టాలు పడి మంజుపట్టణానికి చేరుకుని రాక్షసుని ఆశ్రయాన్ని, మలయకేతు వద్ద పదవులని పొందారు. 


ఇది జరిగిన మరికొన్ని రోజులకు ప్రతీకారేచ్చతో రగిలిపోతూ జీవసిద్ధి వచ్చి వాళ్లలో చేరాడు. 


ఇలా ఒక్కొక్కరే వచ్చి తన బలాన్ని పెంచుతున్నందుకు ఆనందపడిపోయిన రాక్షసుడు చాణక్యుని దెబ్బతీయడానికి తగిన సమయం కోసం ఎదురు చూడసాగాడు. 

(ఇంకా ఉంది)...🙏


*సేకరణ:-  శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్.* 


🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻


👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: