29, జూన్ 2023, గురువారం

ఎలజవ్వనంలోని కొత్త సొగసులు

🙏


ఎలజవ్వనంలోని  కొత్త సొగసులు

                             -------------------------------------------------  


        సీ:  ఘనసారమును  సార  ఘనము  నాక్షేపించు


                                            కలికి పలుకుల యింపు,  కచము పెంపు;


            పద్మరాగము,  రాగపద్మము  నదలించు 


                                          రమణంపు  మోవి,  పాదముల  ఠీవి ;


            మృగమదంబును ,  మద మృగమును హసియించు,


                                                  గాయంపు  వలపు, కన్దోయి మెలపు ;


             వరనాగమును ,  నాగవరముఁ  జుల్కగఁ జూచు 


                                                   నవకంపు  నూగారు, నడల తీరు;


తే:    చక్ర సామ్యత వెలయు కుచమ్ములందు ,


        సామ్య చక్రతఁ దగు వెక్కసఁపుఁబిరుందు ;

   

       రూఢి  నారోహిణియు, నవరోహిణియుఁగ, 


       నెలఁత  చెలువంబు సారె  వర్ణింపఁ దగును;


          అనిరుధ్ధచరిత్రము :ద్వి. ఆ:  26 వ  పద్యము;  కనుపర్తి అబ్బయామాత్యుడు!


                  ఈపద్యం  కవితా కళాప్రస్థానంలో  చాలా గొప్పది. ఇందులో కావ్య నాయిక ఉషాసుందరి  యెలజ్వ్వనపు  సొగసులను వర్ణించుచున్నాడు కవి. చామకూర తరువాత యిలాంటి  చమత్కార భాసురమైన వర్ణన నిర్వహించిన 

కవి మరియొకడు  కానరాడు. 


                    పద్యాన్ని పరిశీలిద్దాం. ఇందులో దీపక మనేయొక  అలంకారాన్ని  ప్రయోగించి  తన రచనకు వన్నెలు దిద్దాడు కవి. దీపకం ఒక అలంకారం. " ఒకే క్రియతో  రెండు విషయాలను సమన్వయ పరచుట"- దీపకం." గేహళీ దీపన్యాయం"  అనే

తర్క శాస్ర్ర సూత్రం దీనికాధారం.' ఇంట్లో  మధ్యగది గడపమీద దీపం పెడితే  అది రెండుగదులలో  వెలుగు నింపినట్లు ,ఒకేక్రియ రెండు విషయాలను సమన్వయపరుస్తుంది. 


                         ఘనసారమును  సారఘనము  నాక్షేపించు


                                      కలికి  పలుకులయింపు,కచముసొంపు; 

                

                                       ఆయతివ పలుకులు  పచ్చకర్పూరం  చల్లదనాన్నికూడా  ఆక్షేపిస్తాయట; కురులపెంపు  దట్టమైన మేఘాన్ని ఆక్షేపిస్తాయట; ఆక్షేపించు  అనే ఒక్క క్రియతోనే  రెండు కార్యములను కవిసాధించాడు.ఇలాగే తక్కినపాదాలలోగూడా.


            రెండవ పాదంలో  ఆమె యందమైన  పెదవిని,  పాదముల యందాన్ని వర్ణస్తున్నాడు. ఆమె పెదవి పద్మరాగమును యెడలిస్తుందట,అంటే పద్మరాగ మణికన్నా రక్తిమ గలిగి ఉంటుందని భావం.పాదాలయందం , రాగ పద్మము నెడలించునట,తామర పూల రాగమును అంటే  అరుణవర్ణమును తిరస్కరించునని భావం. ఇందులో యెడలించు క్రియ.


                         ఆమె శరీరపు  సువాసన మృగమదమును (కస్తురి ) జూచి పరిహసిస్తుందట, అంటే అంతకు మించిన సువాసనలు గలది యనిచెప్పటం. ఆమెకన్దోయి యందం  పొగరెక్కిన  జింక  చూపును గూడా  నవ్వగలదట,లేడిచూపుల

కన్నా అందమైనవనిభావం. ఇక్కడ హసించు క్రియ;


                              ఆకన్నె నూగారు (వక్షస్థలమునుండి నాభివరకుగల సన్నని వెంట్రుకల చాలు) త్రాచు పాము కన్నా అందమైనది.దానినే చుల్కన చేయు నంటూ  వెక్కిరిస్తుందంటాడు కవి. నడకల యందమో  మదపుటేనుగు(నాగవరము) 

నడకలను  చులకన చేస్తాయి. అంతకన్నా అందమైనవి అంటున్నాడు. ఇక్కడ చుల్కన జేయు క్రియ;


                గీతం దగ్గర పధ్ధతి  మార్చాడు. ఆమె  స్తనములు  చక్రవాకములను  బోలితే , ఆమెపిరుదులు  చక్రంతో సామ్యాన్ని పొందుతున్నాయి.( గుండ్రంగా ఉన్నాయని భావం) 


                              చెప్పుకుంటానికి రోహిణియనుకోవచ్చు. రోహిణీ నక్షత్రం వలె అందమైనదని  భావం. లేదా నూతన  రోహిణియే

యని చెప్పదగునని, ఇట్టి యామె  చెలువము  నెవరు వర్ణింపఁ  గ లరు?అని కవిమెప్పు. 


                         మొత్తంమీద పరికిస్తే  సారం యిదే!


          ఆమె మాటలు  ఘనసారం. కురులు  దట్టపు మేఘాలు.  మోవి పద్మ రాగం, పాదాలు పద్మములు, ఆమె వలపు జవ్వాది

నతిక్రమించును. ఆమెకన్నులు లేడి చూపులను మించును. నూగారు పామువలెనుండును, ఆమె మదగజ యామిని. ఆమె కుచములు చక్రవాకములను బోలును. ఆమెకటి చక్రమువలె నుండును.


        

                       ఇక్కడ వర్ణనముగాదు,ప్రధానం, వర్ణించిన తీరు గొప్పదని  భావము!


                                                                   స్వస్తి!🙏🙏🙏👌

కామెంట్‌లు లేవు: