🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹
. *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*
. ♦️ *ఆర్య చాణక్య*♦️
*పార్ట్ - 105*
చక్రవర్తి తృళ్లిపడి "ఆర్యులా.... తరతరాలుగా పాటిస్తున్న ఆచారాన్ని ఆయన నిషేధించారా....? అదీ.... మాతో మాట మాత్రం చెప్పకుండా...." రెట్టించాడు.
ప్రతీహారి తలవంచుకుని, ఓరకంట చక్రవర్తిని చూస్తూ "తామే సర్వంసహా శాసనకర్తలమని, మీతో మాటవరసకైనా చెప్పనవసరం లేదని ఆర్యుల అభిప్రాయం" అన్నాడు.
"అభిప్రాయమా ? అహంకారమా ? ఈ రాజ్యానికి చక్రవర్తులము మేము. రాజ్యాధికారం మాది. మమ్మల్ని కాదని శాసనాలు చెయ్యడానికి ఆయనెవరు ?" అంటూ చక్రవర్తి పళ్లు కొరికి "ప్రతీహారీ ! తక్షణమే చాణక్యుల వారికి వర్తమానం పంపించు. ఆర్యులు వెంటనే వచ్చి చక్రవర్తి దర్శనం చేసుకోవాలి..... యీ రాత్రి ... యిక్కడే..." అంటూ ఆదేశించాడు ఆవేశంతో. ప్రతీహారీ వేగంగా నిష్క్రమించాడు.
చంద్రగుప్తుడు కోట బురుజుల మీదనే అసహనంతో పచార్లు చెయ్యసాగాడు. అర్ధఘడియ తర్వాత....
చాణక్యుడు వస్తూనే "ఏమిటి.... ఎప్పుడూ నా దర్శనం కోసం నువ్వే వచ్చేవాడివి.... ఇవాళ, వేళకాని వేళ నీ దర్శనం చేసుకోవడానికి నన్ను రమ్మన్నావట ?" అడిగాడు వ్యంగంగా.
"ఆ సంగతి తర్వాత. ముందు ఈ విషయం చెప్పండి. దీపోత్సవాన్ని ఎందుకు నిషేధించారు ?" తీవ్రస్వరంతో ప్రశ్నించాడు చక్రవర్తి.
చంద్రుని స్వరంలోని మార్పుని గుర్తించిన చాణక్యుడు అభిజాత్యంతో "మమ్మల్నే నిలదీసి ప్రశ్నించేంతటి వాడివయ్యావా ?" అని ఎదురు ప్రశ్నించాడు.
చక్రవర్తి పళ్లు కొరుకుతూ "మా ప్రశ్నకి సమాధానం ఇది కాదు. మేము మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తులం. చక్రవర్తి ప్రశ్నకి ఎంతటి వారైనా సమాధానం చెప్పి తీరాలి" అన్నాడు కటువుగా.
"ఆహా... అలాగా .... మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించి నిన్ను చక్రవర్తిని చేసింది మేమే.... ఆ సంగతి మర్చిపోకు...."
"ఆ సంగతి గుర్తున్నది కాబట్టే ఇంకా మిమ్మల్ని, మీ అహంభాహాన్నీ భరిస్తున్నాం. కానీ, మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించింది మీరు కాదు. అది మా తండ్రిగారి అంతిమకోరిక. మా సామ్రాజ్యానికి ఆ పేరు వారే పెట్టారు. ఇహ.... నన్ను చక్రవర్తిని చేసింది మీరా.... ? కాదు.... సాటిరాజులు సహకరించారు. మాకు కన్యాదానం చేసిన మామగారు బాసటగా నిలిచారు. పాపం ఏలోకానున్నారో గానీ, పర్వతకుల వారు తమ సైన్యాలతో అండగా నిలిచారు. ఇందరి సహాయ సంపత్తులతో, మా శౌర్య ప్రతాపాలతో పోరాడి, నందులను సంహరించి మేము రాజ్యాధికారాన్ని చేజిక్కించుకున్నాం. చక్రవర్తులమయ్యాం. ఈ బృహత్తర కార్యంలో మీరు చేసిన సాయమెంత ? మీరు చేసిన ఆవగింజంత సహాయాన్ని కొండంతలుగా ఊహించుకొని మాకు మారుగా మీ అంతట మీరే అధికారం చెలాయిస్తారా ? శాసనాలు చేస్తారా ? ఎంత ధైర్యం ?" ఆవేశంతో ఊగిపోయాడు చక్రవర్తి.
"వృషలా...." గర్జించాడు చాణక్యుడు. ఆగ్రహంతో మండిపడుతూ "ఏమి మా ధైర్యాన్నే ప్రశ్నించేంతటి వాడివయ్యావా ? నీ కోసం ఎంతో చేస్తే, అది మరిచి, కృతఘ్నుడవై...." అంటుంటే, చక్రవర్తి మధ్యలోనే కల్పించుకుంటూ "ఏం చేశారు నా కోసం ..." రెట్టించాడు.
ఎదురు చూడని ఆ ప్రశ్నకు నిశ్చేష్టుడయ్యాడు ఆర్యుడు.
"ఏం చేశారు నా కోసం.... ? అమాయకులైన పర్వతకుడిని విషకన్య ప్రయోగంతో చంపించి నేపాళరాజులతో మాకు శత్రుత్వాన్ని తెచ్చిపెట్టారు. బాగురాయణ, డింగరాత్త, భద్రభటాదులను దేశబహిష్కారంగావించి ఆ రాజభక్తుల సేవలను నాకు దూరం చేశారు. ఆఖరికి మీ కుతంత్రంతో..... మగధులకు అత్యంత ప్రేమాస్పదుడైన రాక్షసామాత్యుల వారిని ఈ రాజ్యం నుంచి తరిమేశారు.... "
"ఏమిటేమిటీ... ఆ రాక్షసుడు మాగధులకు అత్యంత ప్రేమస్పదుడా... ఆహా ! ఆ మాగధులలో నీవు ఒకడివే గదా ! ఇంకేం .... విషయం ఇంత ముదిరిన తర్వాత ఇంక నీతో మాకు మాటలేమిటి ? ఈ క్షణం నుంచి నీ రాచకార్యాలతో మాకేం సంబంధం లేదు..... ఆ రాక్షసుడినే తెచ్చిపెట్టుకో...."
"తెచ్చి పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకుంటాను. దానికి తమరి అనుమతి అవసరం లేదు. అయినా మీ వంటి కౌటిల్యుని కంటే ప్రజా సంక్షేమమే జీవితధ్యేయంగా బ్రతికే ఆ రాక్షసుడు వెయ్యి రెట్లు నయం" అన్నాడు చక్రవర్తి ఉక్రోషంతో.
"ఔరా ... ఎంత మాటలంటున్నావు ? ఇంక, ఇంకొక క్షణం ఇక్కడ నిల్చోవడమే మహాపరాధం..." అని అరుస్తూ గిర్రున వెనుతిరిగాడు చాణక్యుడు.
"ఆగండి...." హెచ్చరించాడు చక్రవర్తి కటువుగా.
చాణక్యుడు ఆగి తల వెనక్కి తిప్పి చూసాడు.
"నా ప్రశ్నకు సమాధానం చెప్పి వెళ్ళండి. ఏ అధికారంతో దీపోత్సవాన్ని నిషేధించారు ?" తీవ్ర స్వరంతో ప్రశ్నించాడు చక్రవర్తి.
చాణక్యుడు కోపంగా చూస్తూ "అధికారమేదో వుందనుకొని నిషేధించాం... ఆ అధికారం లాంటిదేదైనా మాకుంటే... ఈ క్షణం నుంచే దాన్ని వదులుకుంటున్నాం. అంతే ఇదే మా సమాధానం...." అనేసి ముఖం తిప్పుకొని చరచరా నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
"ప్రతీహారీ....." అరిచాడు చక్రవర్తి ఆవేశంతో. ప్రతీహారీ లోపలికి పరిగెత్తుకు వచ్చాడు. చక్రవర్తి అతడివైపు కన్నెర్రగా చూస్తూ "ఈ నాటి నుంచి ఆర్య చాణక్యుల వారికి మా రాజ్యపాలనలతో ఏ సంబంధం లేదు. పరిపాలన వ్యవహారాలన్నీ మేమే స్వయంగా చూసుకుంటాం.
ఈ విషయాన్ని నగరమంతటా దండోరా వేయించు...." అని ఆదేశించి చరచరా అంతఃపురం వైపు సాగిపోయాడు.
అలా వెళ్ళిపోతున్న చక్రవర్తిని వెనకనించి చూస్తూ మందహాసం చేశాడు ప్రతీహారి.
(ఇంకా ఉంది)...🙏
*సేకరణ:- శ్రీ రమణమూర్తి గారి వాట్సాప్ పోస్ట్*
🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻🪻
👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి