దుప్పటి - దయ
పరమాచార్య స్వామివారు సతారాలో మకాం చేస్తున్నారు. అది చలికాలం. స్వామివారు బాలు మామకి ఒక దుప్పటిని ఇచ్చి కుంబకోణం పట్టు పాట్టికి ఇవ్వమని చెప్పారు. కుంబకోణం పట్టు పాట్టి పరమాచార్య స్వామివారికి పెద్ద భక్తురాలు. ఆమెకు సంతానం లేకపోవడంతో ఆమెకున్న రెండు ఇళ్లనూ కంచి మఠానికి ఇచ్చివేసింది. ఆమె చాలా మంచి మనసు కలది. అందరితోనూ బాగా కలివిడిగా ఉండేది.
ఆరోజు రాత్రే మహాస్వామివారు నిద్రనుండి మేలుకొని, బాలు మామని నిద్రలేపి దుప్పటిని పాట్టికి ఇచ్చావా? అని అడిగారు. బాలు మామ ఆ విషయం మరచిపోవడంతో అలా చూస్తూ నిలబడిపోయారు.
వెంటనే వెళ్లి ఆమె ఎక్కడుందో వెతికి ఆమెకు దుప్పటి ఇమ్మని పరమాచార్య స్వామివారు ఆదేశించారు. అది మధ్యరాత్రి కావడంతో చలి చాలా తీవ్రంగా ఉంటుందని, బయటకు వెళ్ళడానికి బాలు మామ భయపడి ఉదయం ఇస్తానని చెప్పారు.
“లేదు! ఇప్పుడే ఈ దుప్పటి తనకి చేరాలి. ఈ రాత్రి చాలా చలిగా ఉంది” అని చెప్పారు స్వామివారు. ఇక చేసేదిలేక ఆ రాత్రిలో ఆమెను వెతుకుతూ వెళ్ళారు బాలు మామ. వెతకగా వెతకగా చివరికి కబిలేశ్వర్ ఇంటి దగ్గర కనపడ్డారు పాట్టి. ఆమె చెలికి తాళలేక గజ గజ వణుకుతూ నేలపై పడుకుని ఉంది. మహాస్వామివారు ఎందుకు ఆ క్షణమే ఆ దుప్పటి ఇమ్మని చెప్పారో బాలు మామకు ఆపుడు అర్థం అయ్యింది. పాట్టి ఆ దుప్పటిని తీసుకోని కప్పుకుంది. జగద్రక్షకుని రక్షణలో ఉన్నట్టు తన్మయత్వం పొందింది పాట్టి. స్వామివారి కరుణ అపారం కదా!
ఇలాంటి సంఘటన ఒకటి బాలు మామ జీవితంలో కూడా జరిగింది. ఇంతటి కరుణను స్వయంగా అనుభవించారు బాలు మామ. ఒకసారి తీవ్రమైన చలికాలంలో దేవాలయ ఆవరణంలో పడుకున్నారు బాలు మామ. కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు. ఉదయం నిద్రలేవగానే ఇంతటి తీవ్రమైన చలిలో ఇంత సుఖంగా పడుకున్నానేమిటా అని ఆశ్చర్యం వేసింది మామకి. చూడగా వారిపై ఒక శాలువా కప్పబడి ఉంది. ఎవరో మఠంలో ఉన్న తన తోటివారు ఎవరో కప్పి వెళ్ళుంటారని అనుకోని దాని విషయం మరచిపోయారు.
నాలుగు రోజులు గడిచిపోయాయి. స్వామివారు బాలుమామ దగ్గరున్న శాలువా చూసి చాలా బావుందని అది ఎక్కడిదని అడిగారు. మఠంలోని వారే ఎవరో తనపై కప్పి వెళ్ళారని చెప్పారు బాలు మామ. అది విని స్వామివారు చిన్నగా నవ్వి, అది నేనే అన్నట్టుగా స్వామివారు చేతితో సైగ చేశారు.
“ఆ చల్లని నేలపై పైవస్త్రం కూడా లేకుండా పడుకుని ఉన్నావు. మరి మీ అమ్మగారు నిన్ను అలా చూస్తే ఏమనుకుంటారు?” అని అన్నారు.
పరమాచార్య స్వామివారి అపార కరుణ చలికాలంలో వెచ్చదనం, ఎండాకాలంలో నీడ, వర్షాకాలంలో గొడుగు వంటిది. మనల్ని మనం వారికి సమర్పించుకొని జీవితంలో సుఖసంతోశాలను పొందుదాం
--- శ్రీ ప్రదోషం మామ గృహం ‘రేర్ జెమ్స్’ నుండి.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/KPDSTrust
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి