20, ఆగస్టు 2023, ఆదివారం

పతంజలి మహార్షి

 🕉పతంజలి మహార్షి.🕉️


యోగేన చిత్తస్య పాదేన వాచాం

మలం శరీరస్య చ వైద్యకేన 

యోఽపాకరోత్తం ప్రవరం మునీనాం

పంతంజలిం ప్రాంజలిరానతోఽస్మి

ఆబాహు పురుషాకారం శంఖచక్రాసిధారిణం

సహస్ర శీరసం శ్వేతం ప్రణమామి పతంజలిం


యోగం ద్వారా మనస్సును, వ్యాకరణం ద్వారా మాటను, వైద్యం ద్వారా దేహాన్ని పరిశుద్దం చేసి పరిరక్షించిన మునిశ్రేష్ఠుడు పతంజలికి కైమోడ్పులు అర్పిస్తిన్నాను. 


బాహుపర్యంతం మానవాకారం కలిగి, విష్ణుస్వరూపుడను చెప్పేవిధంగా శంఖచక్రాలను ధరించి వేయి శిరములతో శ్వేతవర్ణంలో విరాజిల్లుతున్న ఆదిశేషుని అంశావతారుడైన పతంజలికి నమస్కరిస్తున్నాను.


భర్తృహరి - వాక్యపదీయం.


పతంజలిని ఆదిశేషుడి అంశగా భావిస్తారు.

పతంజలి యోగ శాస్త్రం యోగ సూత్రాలను మానవాళికి అందించిన ఒక గొప్ప యోగి. మనసు, స్పృహ, చైతన్యం మొదలైన వాటిని గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఇందులో తెలిపాడు. అంతేకాక పాణిని రచించిన అష్టాధ్యాయికి భాష్యాలు కూడా రచించాడు.కానీ చాలామంది పండితులు ఈ రెండు గ్రంథాలు ఒకరు రాసినవి కాకపోవచ్చునని భావిస్తున్నారు. పతంజలి  "యోగ సూత్రాలు" గ్రంథంతో బాటు పాణిని చే రచింపబడ్డ అష్టాద్యాయికి కూడా భాష్యం రాసాడు. 


ఈ మధ్య కాలంలో యోగ బాగా ప్రచారంలోకి వచ్చింది. ముఖ్యంగా ప్రపంచంలో భారత దేశంలో పుట్టిన యోగ సిద్దాంతాన్ని (ముఖ్యంగా రాజ యోగ) రాజయోగం బహుళ ప్రచారంలోకి వచ్చింది.


చరిత్ర 

*****


క్రీ.పూ 200 సంవత్సరాల ప్రాంతానికి చెందినవాడుగా పతంజలిని ఆధునిక పాశ్చాత్య చరిత్రకారులు భావిస్తున్నప్పటికీ, మన భారతీయ పంచాంగాల లెక్కల ప్రకారం పతంజలి శ్రీకృష్ణుడు జీవించిన కాలానికి కొద్దిగా అటుయిటుగా జీవించినవాడు. అంటే దాదాపు యిప్పటికి 5000 సంవత్సరాలకు పైమాటే! భారతీయ శాస్త్రవేత్తలందరూ పాశ్చాత్య చరిత్రకారుల లెక్కలకన్నా ఎంతో పూర్వీకులన్నది కాదనలేని సత్యం.


యోగ సూత్రములు 

**************

పతంజలి రచించిన యోగ సూత్రములలో మొత్తం 195 సూత్రములున్నాయి; నాలుగు పాదములుగా విభజింపబడినవి.అవి క్రమముగ:సమాధి, సాధన, విభూతి, కైవల్య పాదములు.కొందరి అభిప్రాయము ప్రకారము మొదటి మూడు మాత్రము పతంజలి విరచితములు మిగిలినది తరువాత చేర్పబడినదట.కాని ప్రాచీనులు దీనికి ఎక్కడ ఏకీభవించినటులు కనబడదు.


ప్రథమ పాదమున యోగము యొక్క ఉద్దేశము, లక్షణము, వృత్తుల లక్షణము, యోగోపాయములు, యోగ భేదములను వర్ణింపబడింది. రెండవ పాదమున క్రియా యోగము, క్లేశములు, కర్మవిపాకము, దాని దుఃఖస్వరూపము, చతుర్య్వూహములు వర్ణిపబడినవి. తృతీయ పాదమున, అంతరంగ-అంగములు, పరిణామములు, సంయమభేదములు, విభూతి, వివేక జ్ఞానములు ప్రస్తావింపబడినవి. నాల్గవ పాదమున ముక్తి యోగ్యమగు చిత్తము, పరలోకసిద్ధి, బాహ్యార్ధసిద్ధి, ఆత్మసిద్ధి, ధర్మమేఘ సమాధి, జీవన్ముక్తి, విదేహకైవల్యము ప్రసంగింపబడినవి.


సమాధి పాదము 

*************

సాధకుడు తన గృహస్థ, సామాజిక ధర్మాలు నిర్వర్తించుకున్నతరవాత సమాధి పొందడానికి యోగ్యుడైన గురువును ఎంచుకుని, ఆ గురువు శిక్షణలో యోగవిద్య ప్రారంభిస్తాడు. పతంజలి మహర్షి “ఇప్పుడు యోగాభ్యాసం గురించి” తెలుసుకో అంటూ ప్రారంభిస్తారు.


మానవప్రవృత్తిలో చిత్తవృత్తులు ఒక భాగం. పతంజలి ఐదు చిత్తవృత్తులను గుర్తించి వాటిని యోగసాధనకి అనుగుణంగా ఏ విధంగా మలుచుకోవలసి ఉందో వివరించేరు. మూడవ సూత్రంలో చెప్పిన “చిత్తవృత్తి నిరోధః” అంటే చిత్తవృత్తులను ఆపడం కానీ అణిచి పెట్టడం కానీ కాదని పండితులు వ్యాఖ్యానించేరు. మిగతా మూడు పాదాలలో ఆ చిత్తవృత్తులను యోగసాధనకి అనుకూలంగా మలుచుకునేవిధానం వివరణ చూస్తే ఆ వ్యాఖ్యానం సమంజసమే అనిపిస్తుంది.


అనూచానంగా ప్రసిద్ధమైన జ్ఞానాన్ని గ్రహించడం, స్వయంగా వితర్కించుకుని సత్యాసత్యాలను గమనించడంతో సాధన మొదలవుతుంది. ప్రాపంచికవిషయాలలో వైముఖ్యం ప్రయత్నంవల్ల సాధ్యం కాగలదు. సాధనలో వేగిరపాటు తగదు. అవిరళంగా పటుతర నిష్ఠతో బహుకాలం సాగించవలసి ఉంటుంది.


సాధన కొనసాగించడానికి వ్యాధి, అలసత, అస్థిమితంవంటి అవరోధాలు కలుగుతాయి. అవి దుఃఖం, ఆందోళన, వణుకువంటి బాహ్యరూపాలలో గోచరిస్తాయి. మైత్రీ, కరుణ, సాధుత్వం, ఉపేక్షవంటి సుగుణాలను పెంపొందించుకోడంద్వారా పై అవరోధాలను అధిగమించి యోగసాధనకి అవుసరమైన ప్రశాంతత పొందవచ్చు.


చిత్తస్థైర్యం సాధించడానికి కొన్ని పద్ధతులు సూచించేరు పతంజలి. ఉచ్ఛ్వాసనిశ్వాసాలు క్రమబద్ధం చేయడం (ప్రాణాయామం), ముక్కు, చెవివంటి ఇంద్రియప్రవృత్తులమీద తదేకదృష్టితో ధ్యానించడంద్వారా కూడా ప్రశాంతత చేకూరుతుంది. ఈ ప్రయత్నాలన్నిటిలోనూ అంతర్గతభావం ఇతరవిషయాలనుండి చిత్తమును యోగంవైపు మళ్ళించడం, యోగంమీద దృష్టిని సుస్థిరంగా నిలపడం.


వైరాగ్యం అంటే భౌతికవిషయాలలో ఆసక్తిని నిరోధించడం. వ్యక్తి తాను ఏ విషయాలలో అనురక్తుడో గుర్తించి ఆ అనురక్తిని నిర్మూలించడమే వైరాగ్యం. అభ్యాసంతో ఈ వైరాగ్యం సాధించాలి అంటారు పతంజలి మహర్షి.


సాధకుడు దృశ్యమానప్రపంచంలో తన అనుభవాలతో మమైక్యం కావడం క్లేశములకు హేతువు. ఆ భావాన్ని ఉపసంహరించుకోవాలి. వస్తువు, శబ్దము, అర్థము ఒకటే కావని గుర్తించి, వీటికి అతీతుడయిన పరమపురుషునియందు చిత్తమును నిలపడంకోసం సాధన చేయాలి.


ఇలా సాధన చేస్తే సాధకుడికి పిపీలికాది బ్రహ్మపర్యంతం సమస్తమూ స్వాధీనమవుతాయి. నిర్మలచిత్తము భగవంతునియందు సుస్థిరముగా నిలిపితే, స్వచ్ఛమైన మణివలె ఆ భగవంతుని ప్రతిఫలింపగల శక్తిని పొందుతుంది.


పూర్వజన్మలలో చేసిన సాధన స్మృతులుగా (వాసనలు) తరవాతి జన్మలలో కొనసాగుతాయి. ఆ పూర్వవాసనలు, సాధనలో ఏకాగ్రత, దృఢత – ఇవి ఎంత బలంగా ఉంటే అంత త్వరగా సమాధిస్థితిని చేరుకోగలడు.


తర్కం, నిశితపరిశీలన, పరంపరానుగతంగా పొందిన జ్ఞానం సమాధికి మార్గాలు. సాధనకి అనేక మార్గాలు ఉన్నాయి. ఏ పద్ధతిని సాధకుడు ఎంచుకున్నా, శ్రద్ధతో తదేకధ్యానంతో చేస్తే శారీరకంగానూ, మానసికంగానూ దృఢత్వం కలుగుతుంది. ఈవిధంగా చేసిన సాధనమూలంగా సమాధిస్థితిలో ఒక స్థాయికి చేరుతాడు. అది సబీజసమాధి. ఆ బీజాన్ని కూడా తొలగించుకోడానికి సాధన కొనసాగించాలి.


సమాధి అంటే పరమపురుషునిలో ఐక్యము కావడం. ఆ పరమపురుషుడు కాలానికి అతీతుడు. గురువులందరికీ గురువు. ఆ పరమపురుషుని చిహ్నం ఓంకారం. ఓంకారము జపించడం సమాధికి మార్గం.


సాధనద్వారా సాధకుడికి సమస్త వస్తువులూ స్వాధీనమవుతాయి. సమాపత్తి సాధిస్తాడు. సమాపత్తి అంటే వస్తువు, శబ్దము (వస్తువుకి మానవుడు ఇచ్చుకున్న పేరు), అర్థము – ఈ మూడింటిని గూర్చిన అవగాహన పొందినప్పటి స్థితి.


ఇది పరమపురుషునిగురించిన అవగాహనలో తార్కికమైన వివరణ. ఆ తార్కికవివరణ, అవగాహనస్థితిని అధిగమించడానికి సాధన కొనసాగించాలి. తాను సమాధి పొందేను అన్న స్పృహ కూడా నశించినతరవాత పొందిన సమాధిస్థితిని నిర్బీజసమాధి అంటారు.


ఇంతవరకూ చెప్పినది సాధనకి వివరణలో పూర్వభాగం. ఉత్తరభాగంలో సాధన ఆచరణలో ఎలా ఉంటుందో వివరించారు.


సాధన పాదము

*************

ఇది మూడు భాగాలుగా సాగుతుంది. అవి తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వరునియందు మనసును సంపూర్ణంగా నిలపడం. అష్టాంగాలుగా చెప్పుకుంటున్న ఈ క్రియావిశేషాలలో మొదటి రెండూ యమ నియమాలు. ఇవి మళ్ళీ ఐదు ఉప భాగాలుగా వర్ణించేరు. యమంలో వివరించిన సత్యపాలన, అహింస, చోరగుణం నిరసించడం, పరులసొమ్ము స్వీకరించ నిరాకరించడం వంటివి నిత్యవ్యవహారంలో కూడా చూస్తాం. అలాగే నియమంలో క్రమశిక్షణ యొక్క ప్రాధాన్యత కనిపిస్తుంది. రాగద్వేషాలు, అహమిక, అభినివేశాలకి అవిద్య మూలకారణం. నిరంతర యోగసాధనతో ఈ నాలుగు క్లేశములను జయించవచ్చు.


ప్రజ్ఞావంతులు సైతం రాగద్వేషాలకీ, అహంభావానికీ అతీతులు కారు. క్లేశాలకు మూలకారణాలు తెలుసుకొని, వాటిప్రభావంనుండి తప్పుకుని సాధన కొనసాగిస్తే సమాధి పొందగలరు.

ఒక జన్మలో ఆచరించిన కర్మలు మరుజన్మలో రాగద్వేషాలు, అహమిక, అభినివేశాలవంటి క్లేశములకు కారణమవుతాయి. తిరిగి ఆ క్లేశములమూలంగా కర్మలు ఆచరిస్తారు. ఆవిధంగా కర్మలూ, క్లేశములు ఒకదానికొకటి కారణమవుతూ మళ్ళీ మళ్ళీ పుట్టడానికి కారణమవుతాయి. అలా పునర్జన్మలకి కారణమయిన క్లేశములను, కర్మలనూ నివర్తించి సమాధి ధ్యేయంగా సాధన కొనసాగించాలి.సత్వ తమో రజో గుణాలమూలంగా వివిధ అనుభవాలకు సాధకుడు లోనవుతాడు. వివేకవంతుడు ఆ విషయం గ్రహించి, వాటిని అధిగమించడానికి ప్రయత్నిస్తాడు.


ధారణ, ధ్యానం, సమాధి  అచంచలదీక్షతో కొనసాగించిన సాధకునికి అలౌకికమైన శక్తులు సిద్ధిస్తాయి. ఎదటివారి చిత్తము గ్రహించడం, ఎదటివారికి అగోచరము కావడం, నీటిమీద నడవడం వంటివి. అయితే సాధకునికి ఈ శక్తులే పరమావధి కారాదు. ఆ శక్తులప్రభావాలకు లోను కాకుండా, వాటిని కూడా నిరోధించి, యోగం కొనసాగిస్తేనే పరమపురుషునిలో లీనమవడం జరుగుతుంది.


విభూతి పాదము 

*************

సాధన, సమాధి పాదాలలో వివరించిన మార్గాలు అనుసరిస్తూ సాధన చేసిన తరవాతి స్థాయి విభూతి స్థాయి. విభూతిపాదంలో సంయమనం అంటే ఏమిటో, అది ఎలా చెయ్యాలో, తద్వారా సాధకుడు ఏమి సాధించగలడో వివరించడం జరిగింది. సూక్ష్మంగా, ఒక వస్తువుపై దృష్టి కేంద్రీకరించడం ధారణ. ధారణ నిరవధికంగా కొనసాగించడం ధ్యానం. ధారణ, ధ్యానంద్వారా మనోలయము (విభూతి) చేయడానికి కృషి చేయాలి. పతంజలి వరుసక్రమంలో ఏ అంశంమీద సంయమం చేస్తే ఏ శక్తి పొందగలడో వివరించేరు. అయితే అతీంద్రయశక్తులే (సిద్ధశక్తులు) సాధకునికి ధ్యేయం కారాదు. సాధకుడు వాటిని కూడా ముక్తికి అవరోధాలుగానే గుర్తించి, నిరోధించి, ముక్తికోసం ధ్యానం కొనసాగించాలి అంటాడు పతంజలి.


కైవల్య పాదము 

************

ముందు పాదాలలో వివరించిన విధంగా సాధన కొనసాగించి సమాధి స్థితికి చేరేవరకు గల పరిణామస్థితిని వివరించేరు కైవల్యపాదంలో. పాపపుణ్యాలు, కర్మఫలితాలు, క్లేశములు పూర్వజన్మవాసనలు మరుజన్మలో ఎలా పునరావృత్తమవుతాయి, సాధకుడు వాటినిగురించిన అవగాహన పెంపొందించుకుని, ముక్తిమార్గాన్ని అనుసరించడానికి ఏమి చేయాలి అన్న విషయం వివరించడంతో 

ఈ పాదము ముగుస్తుంది.


పతంజలి యోగ సూత్రములు

(అష్టాంగ యోగము)

@@@@@@@@@


యమము :

*********

 అహింస, సత్యవచనము, బ్రహ్మచర్యము, పాపరహితము, పరుల వస్తువులను ఆశించకుండుట, ఈ ఐదు వ్రతములు యమము. బ్రహ్మచర్యము, దయ, క్షాంతి (క్షమ), ధ్యానము, సత్యము, పాపరహిత స్థితి, అహింస, అస్తేయము, మాధుర్యము, దమము ఇవి యమమని మరియొక యోగ శాస్త్ర గ్రంథము చెబుతుంది.


నియమము : 

**********

శౌచం, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము నియమములు అనివేదాంత సారం చెబుతుంది.తపము, సంతోషము, అస్తిక్యము, దానము, దేవతా పూజ, సిద్ధాంతము, శ్రవణము, మనోనిగ్రహము జపము, అగ్నికర్మ (హోమము) ఇవి నియమములని తంత్ర సారము చెబుతున్నది.


ఆసనం: 

*****

ఆసనం అంటె యిప్పుడు భౌతికమైన హలాసనం, గరుడాసనం, శీర్షాసనంవంటి అనేక యోగాసనాలుగా పాశ్చాత్యులు పొరబడ్డారు. నిజానికి ఈ అవసరాలన్నీ యమ, నియమ, స్థాయిలోనే సాధకునిచే సాధన చేయిస్తారు. నిజానికి పతంజలి చెప్పిన "ఆసనం" అంటే మనస్సును ఆ


త్మతో సంధానం చేసి స్థిరంగా ఉండటం. దీనినే "స్థిర సుఖాసనం" అన్నారు. ఆసనం అష్టాంగ యోగం మూడవ అంగము. ఐదు విధములైన కరచరణస్థానములను నిర్దేశించేది. పద్మాసనం స్వస్తికాఖ్యం భద్రం వజ్రాసనం తదా వీరాసనమితి ప్రోక్తం క్రమాదాసన పంచకమ్ (భాగవతం 3. 28. 11)


ప్రాణాయామం:

************

 శరీర స్పందన లన్నింటినీ క్రమబద్దీకరించడమే ప్రాణాయామం. ప్రాణాయామమువలన దేహ దోషాలు, ధారణ వలన చేసిన పాపాలు అపరాధాలు, ప్రత్యాహారము వలన సంసర్గతా (సాంగత్య) దోషాలు, ధ్యానము వలన అనీశ్వర గుణాలు తొలగుతాయి. ప్రణవం (ఓంకారం) తో ముమ్మారు ప్రాణాయామం (పూరక కుంభక రేచకాలతో) చేయాలి.


ప్రత్యాహారం :

*********

 ఇంద్రియ జనితములైన బాహ్య ప్రపంచ శబ్దములు దృశ్యముల నుండి దృష్టి నిగ్రహించి అంతరంగముపై చింతించుట ప్రత్యాహారము


ధారణ:

******

ధారణ అంటే బ్రహ్మమును (ఈశ్వరుని అనుకోవచ్చు) హృదయపద్మములో ధరించుట. ఇది మనో స్థితి. •ధ్యానం బ్రహ్మ ఆత్మల గురించిన గురించిన చింత . ఇది సాధన. (ప్రగతితో కూడిన గతి) .గమ్యం సమాధి. అహంబ్రహ్మ తత్త్వం అనుభవంలోనికివచ్చే స్థితి.


ధ్యానము :

*********

 ధ్యేయ వస్తువుపై మనసును లగ్నముచేసి, అన్య పదార్థములను గమనించక, నిశ్చలమైన మనసుతో (చిత్తముతో) ధ్యేయ వస్తువైన ఈశ్వరుని గురించిన చింతలో ఉండుటయే ధ్యానము. సాధనా పూర్వకముగా పొందిన ద్వైత రహిత స్థితి సమాధి. (జీవుని ఈశ్వరుని వేరుగా భావించుట ద్వైతము, వానిని ఒకే వస్తువుగా అనుభవైంచుట అద్వైత సిద్ధి, అదే సమాధి స్థితి.


సమాధి : 

******

నిత్యమూ శుద్ధమైన బుద్ధితో కూడి, సత్యమైన ఆనందముతో కూడిన తురీయ (మెలకువ, నిద్ర, స్వప్న స్థితులకు అతీతమైన) స్థితిలో ఏకము, అక్షరము (శాశ్వతము) ఐన నేను ఉన్నాను (అహమస్మి) అనే బ్రహ్మ భావనలో అహంబ్రహ్మాస్మి (నేనే ఆ బ్రహ్మమును) అనే ఎరుక కలిగియుండు అవస్థయే సమాధి.

పై సూత్రాలలో మొదటి నాలుగు విభాగాలు పాశ్చాతులకు యిప్పుడిప్పుడే కొంత అవగాహనకు వచ్చి దీనిపట్ల ఆకర్షితులవుతున్నారు. ఆ తరువాత చెప్పబడే నాలుగు అధ్యాయాలూ పాశ్చాత్యుల మేధస్సుకు అందనివి. ఆ మాటకొస్తే ఆధునిక భారతీయులలో కూడా చాలా మందికి తెలియనివి.


ఇలా అనేకానేక యోగ రహస్యాలన్నిటినీ పతంజలి తన యోగ సూత్రములలో పొందుపరిచాడు. ఈ గ్రంథములోని విషయాలు నిత్యజీవితంలో ఆచరించి అనుభూతి చెందవలసినవే గాని కేవలం చదవడం వలన తెలియవచ్చేది తక్కువే అని చెప్పవచ్చు.


భారతీయులకే కాక ప్రపంచ ప్రజలందరికీ ఆధ్యాత్మిక, యోగ విశేషాలను పరిచయం చేసి సాధకులను తయారుచేయగలిగే అమూల్య గ్రంథాన్ని ప్రసాదంగా అందించిన మహర్షి యోగపుంగవుడు పతంజలి.   


🚩⚜🚩⚜🚩⚜🚩


    🚩యోగం🚩

💫💫🌏🌙🌞💫

యోగ శబ్దం ‘యుజ్‌ ’ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టిందని అందరికి తెలిసినవిషయమే. ఆ ధాతువుకు కలిసికొనుట, ఏకమగుట, సమన్వయించుట మొదలైన అర్ధా లున్నాయి. జీవాత్మ పరమాత్మ లో సంయోగం చెందటమే యోగ పరమార్ధం. ‘ నయమాత్మాబలహీనేన లభ్యతే ’ అని ముండకోపనిషతు చెపుతోంది. అంటే బలహీనులు ఆత్మను తెలుసుకోలేరు, పొందలేరు అని భావం కాబట్టి ఆత్మ జ్ఞానానికి శక్తిమంతమైన శరీరము , సమాహితమైన బుధ్ధి అత్య అవసర మన్నమాట. దీని వల్ల క్రమంగా శరీరారోగ్యం సమాహితమైన చిత్తం ఏర్పడి ఆత్మను పరమాత్మతో సంయోగం చెందింప జేసే శక్తి సాధకుని కేర్పడుతుంది.


యోగ విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి తోడ్పడేవి ప్రధానంగా యోగానికి సంబంధించిన ఉపనిషత్తులు. వాటిలో యోగతత్వోపనిషతు, మండల బ్రాహ్మాణోపనిషతు, యోగకుండల్యోపనిషతు ప్రధానంగా పేర్కొన దగినవి. ఇవే గాక పతంజలి యోగసూత్రాలు , భగవద్గీత , యోగ వాసిష్ఠం యోగజ్ఞానానికి ప్రమాణ గ్రంధాలు. పతంజలి యోగ సూత్రాలకు స్వామి వివేకానందులు ఆంగ్లంలో చేసిన అనువాదం అందరు చదువదగింది. పై గ్రంధాలన్నిట్లోనూ యోగం భారత దేశాంలో అత్యంత ప్రాచీన కాలం నుంచి అధ్యయన అభ్యాసాలలో ఉన్నట్లు చెప్పబడి ఉంది.


యోగోపనిషత్తులలో యోగం నాలుగు విధాలుగా చెప్పబడింది. అవి , హఠయోగం , లయయోగం , మంత్రయోగం , రాజయోగం. అయితే, ఇప్పుడు యోగమంటే హఠ రాజాయోగాల సమ్మేళనం గా భావింప బడుతున్నది. దీనికే అష్టాంగయోగమని ప్రసిధ్ధి. అష్టాంగ యోగమంటే ఎనమిది అంగాలతో కూడిన యోగమని అర్ధం. యమ, నియమ,ఆసన,ప్రాణాయామ,ప్రత్యాహార, ధారణ,ధ్యాన,సమాధులు అష్టాంగాలు.


1.యమ :- యమానికి పదిలక్షణా లున్నాయి. అవి,


1.అహింస - అపకారికి సైతం ప్రత్యపకారం చేయకపోవటం అహింస. 


2. సత్యం -సర్వకాల సర్వావస్థలయందు నిజమేమాట్లాడటం సత్యం


3. అస్తేయం - దొంగతనం చేయక పోవటం అస్తేయం.


4. బ్రహ్మచర్యం- బ్రహ్మచర్యదీక్ష గాని, శాస్త్రోక్తవిధి ననుసరించి గార్హస్థ్య ధర్మ నిర్వహణంగాని బ్రహ్మచర్యం


5. క్షమ- సర్వావస్థల యందును ఓర్పు కలిగి ఉండటం క్షమ


6. ధృతి -దైర్యం 


7. దయ - సర్వభూత దయ


8. అర్జవం -  శత్రు మిత్రులయందు సమభావం కలిగి ఉండటం ఆర్జవం


9. మితాహారం - మితంగా భుజించటం మితహరం


10. శౌచం. -ఆంతర్భహి శ్శుధ్ధి శౌచం

కామెంట్‌లు లేవు: