20, ఆగస్టు 2023, ఆదివారం

వేంకటేశ్వరునిగా

 *భగవంతుడిని మనకు వేంకటేశ్వరునిగా అందించింది ఎవరు?*

 

*మనం తెలిసో తెలియకనో ఎన్నో దోషాలు చేస్తుంటాం , నడిచి వస్తుంటే ఎన్నో జీవరాశులని తొక్కి వేస్తుంటాం. కానీ ఆ దోషాలు మనకి అంటొద్దని కోరుకుంటాం, దాన్ని తొలగించే ఏదో ఒక సాధనం ఉండాలి. మామూలుగా లోకంలో ఒక్కో వస్తువుకు పట్టిన దోషాలు తొలగాలంటే ఒక్కో మార్గం ఉంది. బంగారానికి పట్టిన మళినాలు తొలగాలంటే పసుపుతో శుభ్రం చేయాలి. వెండిని తెల్లముగ్గుతో శుభ్రం చేయాలి. రాగిని శుద్ది చేయాలంటే చింతపండుతో చేయాలి, రాతిని శుద్ది చేయాలంటే ఒక రాతితోనే చేయాలి. ఇలానే మన మనస్సును శుద్ది చేయాలంటే ఒక జ్ఞాని అందించిన  భగవంతుడిచే శుద్ది చేయబడాలి. అలా మనల్ని శుద్ది చేయగలడని భగవంతున్ని మనకు రామానుజులవారు చూపించారు, అందుకే ఆభగవంతుడికి వెంకటేశ్వరుడు అని పేరు.*

 

*ఏమిటి వెంకటేశ్వరుడు అంటే* 

 

*ఈశ్వరుడు అంటే నియమించు వాడు అని అర్థం. దేనిని నియమించు వాడు అంటే వేంకటమును నియమించువాడు అని అర్థం. వేంకటము అంటే ఏమిటి,  ఈ వెంకటేశ్వర అనే పదం ద్రవిడం మరియూ సంస్కృతం రెంటిలోంచి ఏర్పడింది. దీని అర్థం మనకు నమ్మాళ్వారు వివరించారు.*


*'వేంకడంగల్ మేయ్ మేల్ వినై ఉత్తమన్ తాంగల్ తంగర్కు నల్లనవే శేవాయ్ వేంగడ తురై వార్కు నమో వెన్నలాంకడమై అదిసుమందా అరర్కే'*


*అని అంటారు. 'కటంగల్' అంటే ఋణములవలే మనం అనుభవిస్తే తప్ప తొలగని పాపములకి పేరు.*

 

*ఋణం అంటే ఏమి*

 

*మనం పుట్టగానే కొన్ని ఋణములతో పుట్టాం. మనం పుట్టుకతో స్వతంత్రులం కాదు. మనం కొన్ని బంధాలతో పుడుతున్నాం. ఎందరితోనో బంధులుగా కల్గి ఉన్నాం. ఈ బంధాలన్నీ మనం తెచ్చుకుంటే రాలేదు, వాటంతట అవి ఏర్పడ్డాయి. చివరికి భార్యా భర్తల బంధం కూడా భగవంతుడు ఏర్పరిచిందే అని అంటుంటారు. అందుకే పుట్టుకతో వచ్చిన ఈ బంధాలని తెలుసుకొని జాగ్రత్తగా ప్రవర్తించమని చెప్పారు మన పెద్దలు. మన భాద్యత ఏమిటో తెలుసుకొని ప్రవర్తించాలి. వీటిని ముఖ్యంగా మూడు భాగాలు చేసారు. ఆ మూడు రకాల ఋణాలని మనం  క్రమ క్రమంగా తీర్చివేవాలి అని చెబుతారు. మన స్మృతులలో మను అనే మహర్షి చెబుతాడు 'ఋణాని త్రీని అపా కృత్య మనో బ్రహ్మని నివేస్యచ' మూడు ఋణాలు తీసివేసుకొని, మనస్సును భగవంతుడిపై పెట్టాలి అప్పుడు మానవుడిగా తరించవచ్చు అని దీని అర్థం.*

 

*మరి ఏమిటా ఋణాలు*


*ఒకటి పిత్రు ఋణం. మనల్ని కన్న తల్లి తండ్రుల కోసం చెయ్యాల్సింది. వారు చెప్పిన మాట వినడం, వారు ఏది సంకల్పిస్తే అది చేయాలి. రామచంద్రుడు తండ్రి మాటకై కట్టుబడి అడవికి వెళ్ళాడు. తండ్రి నోటితో రాముడిని అడవికి వెళ్ళమని చెప్పలేదు. తండ్రిగారి సంకల్పం తెలుసుకొని రాముడే వెళ్ళాడు. ఆనాడు రాముడు అడవికి బయలుదేరుతుంటే దశరథుడు తనని పట్టించుకోకుండా రాజ్యాన్ని నీవే తీసుకోవయ్యా అని చెబుతాడు. తన తల్లి కౌసల్యమ్మ అడ్డుకున్నా, పిన తల్లి కైకేయికి తన తండ్రి ఇచ్చిన మాట ఉందని తెలుసుకొని అడవికి వెళ్ళాడు. కేవలం అక్కడే కాదు తన వివాహ విషయాన కూడా తండ్రి ఆజ్ఞ మేరకే సీతాదేవిని వివాహమాడినట్లు మనకు వాల్మీకి రామాయణం తెలుపుతుంది.  విశ్వామిత్ర మహర్షి ధనస్సు గురించి చెబితే శ్రీరామ చంద్రుడు జనక చక్రవర్తి సభకి వెళ్ళాడు, కానీ సీతాదేవిని వివాహం ఆడాలని వెళ్ళలేదు. ధనస్సు విరిచాక, సీతాదేవిని వివాహమాడాలని జనక చక్రవర్తి అడిగితే, ఆ విషయం తన తండ్రిగారిని అడగమని చెప్పాడు శ్రీరాముడు. ఆతర్వాత దశరథుడు ఈ సీతాదేవి నీకు తగును అని చెప్పాక ఆమెను వివాహం ఆడాడు. ఇది సంతానం యొక్క భాద్యత. పిత్రు ఋణం తేర్చుకోవడం అంటే అట్లాంటిది.*

 

*రెండవది దేవ ఋణం. మనం బ్రతక గల్గుతున్నాం అంటే మనకు గాలి, నీరు , నేల ఇలా ఎన్నో దేవతలు సహాయం చేస్తే తప్ప సాధ్యం కాదు. ఇలా అన్నో కోట్ల దేవతలు ఉన్నారు అంటారు, అందుకే అన్నింటి మూలమైన శ్రీకృష్ణా పరమాత్మని ఆరాధన చేస్తే అందరికీ చేసినట్లే, అలా దేవ ఋణం తీరుతుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో అదే విషయం చెబుతాడు. ఈలోకం కోసం చేసేవి రెండు, పై లోకం కోసం చేసేవి రెండు, బాగు పడటానికి చేసేది ఒకటి ఈ అయిదూ నా కోసం చెయ్యి అని చెబుతాడు. ఈ లోకంలో కర్మ చేస్తుంటాం, ఆహారం తింటుంటాం. అవి కృష్ణుడికోసం అని చెస్తే చాలు. హోమం చేస్తున్నాం, దానం చేస్తున్నాం ఈ రెండు పై లోకం కోసం చేసేవి, అవీ కృష్ణార్పణం అని చెయ్యాలి. ఇక ఐదవది తపస్సు, తపస్సు అంటే ఆలోచన చెయ్యడం, శరీరాన్ని అధీనంలో పెట్టే ఉపవాసం వంటివి. ఇదీ శ్రీకృష్ణుడికై చెయ్యాలి. మన ఇంద్రియాలకు కూడా దేవతలనే పేరు. మన ఇంద్రియములని భగవంతుడి అభిముఖంగా వాటి ప్రవృత్తులని మార్చడం కూడా దేవఋణం తీర్చుకొనే సాధనమే.*


*మూడవది ఋషీ ఋణం. పశువుల వలె కాకుండా మనకు ఒక క్రమశిక్షణాయుత సమాజాన్ని మన చుట్టూ ఏర్పరిచినది ఋషులు. వారికి కొంత చేయ్యడం ఋషీ ఋణం తీర్చు కోవడం వంటిది. ఋషులు చెప్పిన వ్యాక్యాణాలను చదవడం, వాటిని అధ్యయనం చేసే వారిని ప్రోత్సాహం చెయ్యడం లాంటివి చేస్తే ఋషీ ఋణం తీర్చుకున్నట్లు అవుతుంది. ఈ మూడింటిని మనం తీర్చుకోకుంటే అవి మనల్ని దిగజారేట్లు చేస్తాయి అని మన ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఈ ఋణాలు అట్లా అయితే తీర్చుకుంటే కానీ తీరవో మనపై ఉండే పాపాలు అనుభవిస్తే కాని తొలగవు. అన్నీ అనుభవించి తొలగించుకోవాలి అనుకున్నా మనం అంత కాలం బ్రతకలేం. మరి ఈ పాపాలు ఎట్లా తొలగాలి, ఇవన్నీ తొలగితే మనం మంచి స్తితిని పోందవచ్చు.*

 

*మరి ఇప్పుడే తొలగించుకోవాలి అంటే ఎట్లా*

 

*దానికి సాధనం ఒకటి కావాలి.  మన మనస్సుకు పట్టిన ఈ పాపాలు అనే మళినాలను తొలగించే సాధనం నేను చెబుతాను రండి అని నమ్మాళ్వార్ అన్నారు. అదిగో కొండపై కూర్చున్నాడే ఆయనను 'వేంగడ తురైవార్కు నమః' అంటే వేంకటేశాయనమః అని అనమన్నాడు. ఎందుకాపేరు అంటే, ద్రవిడంలో  'కటంగల్' అంటే ఋణములన్నింటినీ 'వేం' కాల్చివేయును అని అర్థం. అలా మనపై ఉండే పాపాలని కాల్చివేయడాన్ని 'వేంకట' అని అంటారు. మరి కాల్చటం అంటే నిప్పు కూడా కాల్చగలదు కదా! కానీ అది కొంత మేరకే కాల్చగలదు. నిప్పుచే కూడా కాల్చబడని వాటిని కూడా కాల్చేవాడు పరమాత్మ కాబట్టి ఆయన కాల్చువాటి కన్నింటికీ నియంత. నియంత అంటే 'ఈశ్వర' అని అంటారు. అందుకే ఆయన పేరు 'వేంకటేశ్వర'.   అందుకే ఈ ఋణాలను కాల్చడంలో తనని మించినవారు లేరు కాబట్టి ఆయన పేరు వెంకటేశ్వర అయ్యింది.*

 

*అలా పరమాత్మ వేంకటేశునిగా ఉన్నాడంటే కారణం ఏమి*


*ఆనాడు నమ్మాళ్వార్ పాడారు కాబట్టి భగవంతుడు అక్కడ నిలిచాడు.  భక్తుల ఆదేశానికి కట్టుబడి పరమాత్మ అక్కడ ఉంటాడు. కేవలం ఇక్కడే కాదు, నైమిశారణ్యంలో, భద్రికాశ్రమం లో 'హే భగవన్! నీవు ఇక్కడ ఇలా ఉండు'అని వేద వ్యాసుడు చెబితే అక్కడ స్వామి నిలిచాడు. కొన్ని దక్షిణ భారత దేశ దేవాలయాల్లో ఋషులు ప్రార్థన చేస్తే ఉన్నాడని, కొన్ని చోట్ల బ్రహ్మ ప్రార్థన చేస్తే ఉన్నాడని చెబుతుంటారు. కేవలం భగవంతుడు ఉంటే అది ఒక క్షేత్రం అని అనలేం, ఎక్కడైతే భగవత్ భక్తుడు అదివసించి ఉంటాడో దాన్ని క్షేత్రం అని చెప్పవచ్చు. అందుకే భగవంతుడిని కాదు పట్టుకోవాల్సింది, భగవత్ భక్తులని పట్టుకోవాలి అని చెబుతారు. భక్తులని వదలలేక భగవంతుడు ఉంటాడు కాబట్టి ఇద్దరూ లభిస్తారు. భగవత్ భక్తులలో కూడా అగ్రేసరులు ఉన్నారు, వారికి ఆళ్వారులు అని పేరు. వారి పాటలై తానున్నాడు. ఆ ఆళ్వారులకు అన్నో శక్తులుండేవి, కానీ అన్ని శక్తులని తమ కోసం వాడుకోలేదు. తమకున్న యోగ్యతలన్నీ భగవంతుడికి అని అనుకున్నారు. ఆళ్వారుల హృదయాల్లో భగవంతుడు ఎప్పటికీ ఉంటాడు. వారి ద్వారా వెళ్తే భగవంతుడు మనకు మరింత భాగా ప్రసన్నుడు అవుతాడు.*


   *\!/ ఓం నమో నారాయణాయ \!/*

🪷🪷🪷 🙏🕉️🙏 🪷🪷🪷

కామెంట్‌లు లేవు: