20, ఆగస్టు 2023, ఆదివారం

రామాయణమ్ 298

 రామాయణమ్ 298

...

ఓ రామా ! నాకు ఒక చిన్నగాయము అయినందుకే అంతకోపించి కాకిమీదనే బ్రహ్మాస్త్రము ప్రయోగించినావు కదా ! ఏల ఇపుడు నన్ను అపహరించుకుపోయిన వాని మీద అంత దయ !ఇప్పటికే నీవు వచ్చి వానిని కడతేర్చినన్ను తీసుకొని పోవలసినది కాదా ?

.

సర్వలోక నాధుడవైన నీవు నా ప్రాణనాధుడవయి ఉండి కూడా అనాధలాగ అయిపోతినికదా !

.

సర్వశ్రేష్ఠ ధనుర్ధారివే! 

సకలశస్త్రాస్త్ర పారంగతుడవే!

భండన భీముడవే !

ఏల ఈ ఉపేక్ష !

రాక్షసులమీద ఇంత దయ?

.

నీ అస్త్రములు సకల దుష్టరాక్షస సంహార కారకములు

నీ ధనుష్ఠంకారమే వారి గుండెలు బద్దలు చేయునుకదా !

.

ఏల రావు ? నీవేల రావు?

.

ఆ రామానుజుడైనా అన్నగారి ఆజ్ఞతీసుకొని నన్ను రక్షించుటకు రాడేమి?

.

లేదు,లేదు నేనే ఏదో పాపము చేసియున్నాను ,సందేహము లేదు.

.

సీతమ్మ కన్నీరు కాల్వలై ప్రవహిస్తూ దీనముగా మాట్లాడటము చూసిన హనుమ ,....

.

అమ్మా! రాముని స్థితి నీ స్థితి ఒకటేనమ్మా! సత్యము మీద ఒట్టు పెట్టి చెప్పుచున్నాను రాముడు ఏ భోగము అనుభవించుటలేదు ! 

ఎప్పుడూ ఆయనకు 

నీపైనే ధ్యాస ! 

నీ పేరే ఆయన శ్వాస!

.

ఆయన హృదయము కరిగి కన్నీరై ఏరులై పారుచూ కడు దయనీయమైన స్థితిలో నిన్నేపలవరించుచున్నాడు.ఆయన పరిస్థితి చూసి లక్ష్మణస్వామికూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడమ్మా!

.

ఓ అమ్మా ! దోషరహితా ! నా భాగ్య వశమున నీవు నా కంట బడితివి .ఇక విలపించవలదమ్మా .అన్ని కష్టములు అతి త్వరలో కడ తేరగలవు.....

.

వూటుకూరు జానకిరామారావు

కామెంట్‌లు లేవు: