"అల్లసానివారిఅల్లిక జిగి"
ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయల ఆస్తానంలోని అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక ఉత్పలమాల చెప్పి రాయల చేత సన్మానం గండపెండేరం తొడిగించుకున్నవాడు. ఇతడు రచించిన స్వారోచిష మనుసంభవము లేదా మనుచరిత్ర ఆంధ్రవాఙ్మయములో ప్రథమ ప్రబంధముగా ప్రసిద్ధికెక్కినది. ఇతను కవి మాత్రమే కాక రాచకార్యాలలో కూడా రాయలవారికి సలహాలు ఇచ్చువాడు అందుకే ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా అంటారు. ఇతడు బళ్లారి కడప జిల్లాల ప్రాంతములయందు దూపాడు అను దేశంబున దొరాళ అను గ్రామంలో శాలివాహన శకము 1430 సంవత్సరమున జన్మించినట్లు తెలియబడుచున్నది. కృష్ణదేవరాయలవారి ఆస్థాన పండితులు ఎనిమిది మందిలో ఈయన ఒక్కరు. ఈయన గురువు శఠగోపయతి.
అల్లసాని వారిదే ప్రాంతం అన్న విషయం ప్రసక్తికి వచ్చినపుడు వేటూరు ప్రభాకరశాస్త్రిగారు ‘బళ్లారి ప్రాంతమందలి దోపాడు పరగణాలోని దోరాల గ్రామమీతని వాసస్థలము’ అన్నారు (సింహావలోకనము). కాని పరిశోధకులు అధిక సంఖ్యాకులు పెద్దన కోకటం గ్రామమన్నారు. కడప జిల్లాలోని కమలాపురానికి సమీపంలో కోకట గ్రామం ఉంది. ఆ గ్రామంలో సకలేశ్వరుడూ ఉన్నాడు. ప్రక్కన పెద్దనపాడు ఉంది. ఆయన పేరు మీదనే పెద్దనపాడు ఏర్పడిందంటారు.
మను చరిత్ర:
మను చరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము, అల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము. ఈ కావ్యం రచనా కాలం 1519-20 ప్రాంతం కావచ్చునని, అప్పటికి పెద్దనకు 45 యేండ్ల వయసు ఉండవచ్చునని పరిశీలకులు భావిస్తున్నారు.
ఇతివృత్తము:
మారన మార్కండేయ పురాణంలో 150 పద్యాలలో చెప్పిన విషయము. ఇది వరూధినీ, ప్రవరాఖ్యుల ప్రేమ కథతో మొదలై స్వారోచిషునితో ముగుస్తుంది. కాశీ నగరం దగ్గర ప్రవరుడనే పరమ నిష్టాగరిష్ఠుడైన బ్రాహ్మణుడు, అతనికి అనుకూలవతియైన భార్య ఉండేవారు. వారు అతిథులను ఎంతగానో ఆదరించేవారు. వారి ఇంటికి వచ్చిన ఒక సిద్ధుడు ప్రవరునికి ఒక మహిమాన్వితమైన పసరును ఇచ్చాడు. ఆ పసరు కాళ్ళకు పూసుకొని ఆ దివ్య ప్రభావం వలన ప్రవరుడు హిమాలయ పర్వతాలకు పోయి అక్కడి సుందర దృశ్యాలను చూచి ఆనందిస్తాడు. అయితే ఎండకు ఆ పసరు మంచులో కరిగిపోయింది.తిరుగి పోయే ఉపాయం కోసం చూస్తున్న ప్రవరుడిని చూచు వరూధిని అనే అప్సరస మనసు పడింది. అయితే ప్రవరుడు ఆమెను తిరస్కరించి వెళ్ళిపోయాడు. కామవిరహంతో ఉన్న వరూధినిని ఒక గంధర్వుడు ప్రవరుని వేషంలో సమీపించి తన కోరిక తీర్చుకున్నాడు. వారికి జన్మించిన స్వరోచి ఒక దేశానికి రాజయ్యాడు. ఆ స్వరోచి ఒకసారి వేటకు వెళ్ళి మనోరమ అనే యువతిని పెళ్ళాడాడు. వారి కొడుకే స్వారోచిష మనువు.
రచనా వైభవం
మనుచరిత్రంలో పెద్దన కథన కౌశలం, వర్ణనా చాతుర్యం పండితుల ప్రశంసలందుకొన్నాయి. పెద్దనను సమకాలికులు, అనంతర కవులు కూడా అనుసరించారు. మనుచరిత్రలోని కవితాశిల్పం అద్వితీయం. అక్షరాలా పెద్దన ఆంధ్ర ప్రబంధ కవితా పితామహుడే. మనుచరిత్రలో అనేక ఇతివృత్తాలున్నా గాని అందరినీ అలరించి పెద్దనకు కీర్తి తెచ్చిపెట్టినది వరూధినీ ప్రవరాఖ్యుల ఘట్టమే.
పాత్ర పోషణ : వరూధినీ ప్రవరులు ఈనాటికీ మన సంభాషణలలో చోటు చేసుకోవడం పెద్దన పాత్ర పోషణలోని నైపుణ్యానికి చిహ్నం.
రస పోషణ : శృంగారం, శాంతం, ధర్మం, అద్భుతం, బీభత్సం వంటి అనేక రసాలు ఆయా వృత్తాంతాలలో పాత్రలకు తగినంత ఔచిత్యంతో పెద్దన పోషించాడు.
అలంకారిక రామణీయత : పాత్రలకు, సన్నివేశాలకు, రసానికి అనుగుణంగా అలంకారాలను ప్రయోగించాడు.
కవితా శైలి : "అల్లసానివారి అల్లిక జిగిబిగి" అనే నానుడి ఉంది. "జిగి" అంటే కాంతి. "బిగి" అంటే కూర్పు, పట్టు. అంటే పదాల ఎంపికలోను, సమాసాల కూర్పులోను, పద్యాల ఎత్తుగడలోను చక్కదనం, చిక్కదనం ఉంటాయన్నమాట.
మార్కండేయ పురాణంలోని ఒక చిన్న కథను తీసుకొని, దాన్ని విస్తరించీ ప్రస్తరించీ ఒక అపూర్వ కళాఖండాన్ని శిల్పించాడు పెద్దన. ఇది నిజంగా అపూర్వమే. పెద్దనకు పూర్వం తెలుగులో అంత ఖచ్చితమైన ప్రమాణాలతో రచింపబడిన కావ్యం లేదు. పెద్దన తర్వాత కవుల్లో కూడా మనుచరిత్రమును అనుకరించి రాయబడిన కావ్యాలే ఎక్కువ. మనుచరిత్రమును పెద్దన గారి “సకలోహ వైభవ సనాధము” అనవల్సిందే. కొద్దో గొప్పో సాహిత్యజ్ఞానం ఉన్నవారికి మనుచరిత్రం లోని చాలా పద్యాలు కంఠతా ఉంటాయనేది అతిశయోక్తి కాదు. ... కథా సంవిధానంలో గానీ, పాత్రల చిత్రణలో గానీ, సన్నివేశాలు కల్పించి సంభాషణలు నిర్వహించడంలో గానీ, పద్య నిర్వహణంలో గానీ దీనికి సాటి ఐన గ్రంథం నభూతో నభవిష్యతి అనీ అనిపించుకున్న కావ్యం ఈ మను చరిత్రము.
అరుణాస్పదపురంలో ప్రవరుని గైహిక జీవనం, హిమాలయ ప్రాంతాల ప్రకృతి వర్ణన, వరూధినీ ప్రవరుల వాదోపవాదాలు గానీ, ఆమె దిగులు, ఆ తర్వాత ప్రకృతి వర్ణనా, స్వరోచి మృగయా వినోదం గానీ, ఎవరు ఎంతగా వర్ణించి చెప్పినా, రసజ్ఞుడైన పాఠకుడు, స్వయంగా చదివి అనుభవించే ఆనందం ముందు దిగదుడుపే.
విశేషాలు
ఇది తొలి తెలుగు ప్రబంధము, దీని తరువాత మొదలైనదే ప్రబంధ యుగము, తరువాతి ప్రబంధాలు దీని నుండి స్ఫూర్తిపొందినవే ఎక్కువగా ఉన్నాయి.ఇందు మొత్తం ఆరు అశ్వాసాలు ఉన్నాయి. ఈ ప్రబంధం తెలుగు పంచకావ్యాలలో మొదటిదిగా చెపుతారు.
మనుచరిత్ర అనగానే అందరికీ గుర్తొచ్చే పద్యం ఇది. అర్థం తెలిసినా తెలియకపోయినా, చదవగానే (వినగానే) "ఓహో!" అనిపించే పద్యం.
అటజని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్ లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్
భూమిసురుడు = బ్రాహ్మణుడైన ప్రవరుడు
అటన్+చని = అక్కడికి వెళ్ళి
అంబర చుంబి = ఆకాశాన్ని తాకుతున్న
శిరస్ = శిఖరాల నుండి
సరత్ = జారుతున్న
ఝరీపటల = సెలయేళ్ళ సమూహంలో
ముహుః + ముహుః = మాటి మాటికి
లుఠత్ = దొర్లుతున్న
అభంగ = ఎడతెగని
తరంగ = అలలు అనే
మృదంగ = మద్దెలల యొక్క
నిస్వన = ధ్వనుల చేత
స్ఫుట = స్పష్టమైన
నటన + అనుకూల = నాట్యమునకు తగినట్లుగా
పరిపుల్ల = మిక్కిలి విప్పారిన
కలాప = పురులుగల
కలాపి జాలమున్= ఆడ నెమళ్ళు గల దానిని
కటక చరత్ = పర్వత మధ్యప్రదేశాల్లో తిరిగే
కరేణుకర = ఆడ ఏనుగుల తొండాల చేత
కంపిత = కదిలించబడిన
సాలమున్ = మద్దిచెట్లు గల దానిని
శీతశైలమున్ = మంచుకొండను
కాంచెన్ = చూశాడు
మంచుకొండ కొమ్ములు నింగిని తాకుతున్నాయి. వాటి నుండి సెలయేళ్ళు జారుతున్నాయి. వాటిలో లేచిపడే అలల సవ్వడి మద్దెలమోతల్లాగా ఉన్నాయి. వాటికి పరవశించిన నెమళ్ళు పురివిప్పి ఆడుతున్నాయి. ఏనుగుల తొండాలతో అక్కడి మద్దిచెట్లను పెకలిస్తున్నాయి. అటువంటి మంచుకొండను చూశాడు ప్రవరుడు.
ఇంత సరళంగా చెప్పగలిగిన సంగతిని ఎందుకింత ప్రౌఢగంభీరంగా వర్ణించాడు కవి? హిమాలయ పర్వతం అసామాన్యమైనది. మహోన్నతమైనది. ఆ మహత్వాన్ని, మహాద్భుత దృశ్యాన్ని స్ఫురింపజేయటానికి అంత సంస్కృత పదాటోపం అవసరమైంది. పద్యంలో ముచ్చెం మొదటి మూడూ మాటలు తప్ప (అట, చని, కాంచె) తక్కినవన్నీ సంస్కృతం నుండి దిగిన తత్సమపదాలే.
కేవలం శబ్దం ద్వారానే అర్థస్ఫురణ గావించటం ఈ పద్యంలో విశేషం. "అంబరచుంబి శిరస్సరజ్ఝరీ పటల"
మన్నప్పుడు నింగినంటిన కొండల నుండి జాలువారే సెలయేళ్ళ ధారాప్రవాహం మనో నేత్రం ముందు కనబడుతుంది.
మద్దెల చప్పుళ్ళకి, మేఘధ్వనులకి నెమళ్ళు ఆహ్లాదంతో పురివిప్పి ఆడతాయని ప్రసిద్ధి. ఆ సెలయేటి అలలు రాళ్ళకు కొట్టుకొని మద్దెలలాగా మోగుతున్నాయి. అభంగ, తరంగ, మృదంగ అనే పదాల ద్వారా ఆ మద్దెలల మోత వినిపించాడు కవి.
"స్ఫుటనటనానుకూల" అనేచోట నాట్యం స్ఫురింపజేస్తున్నాడు. అక్షరాలు నర్తిస్తున్నట్టు, ఆయా అర్థాలను స్ఫురింజేస్తున్నట్టు రచించటం వికటత్వం. (వికటత్వ ముదారతా- వామనుడు) వికటత్వం గల కూర్పు ఔదార్యం. ఈ పద్యంలో ఔదార్యం అనే గుణం ఉంది. దీనికి తోడు దీర్ఘసమాసాలతో కూడిన
గాఢబంధం వల్ల ఓజోగుణం కూడా చేకూరింది.
"అంబరచుంబి, శిరస్సరత్, ముహుర్ముహుః, అభంగ తరంగ మృదంగ, స్ఫుట నటనానుకూల, కలాపకలాపి, సాలము శీతశైలము" - ఈ చోటుల్లో వృత్త్యనుప్రాస, ఛేకానుప్రాస, అంత్యప్రాస, యమకంలాంటి శబ్దాలంకారాలున్నాయి. తరంగ ధ్వనుల్ని మృదంగధ్వనులుగా నెమళ్ళు భ్రమించినట్టు వర్ణించటం చేత భ్రాంతిమదలంకారం అవుతుంది.
"అల్లసాని వాని అల్లిక జిగిబిగి" పేరు గాంచింది. అల్లిక అంటే పద్యమల్లటమే. జిగి అంటే తళుకు. బిగి అంటే బిగువు. మృధుమధురమైన పదప్రయోగం, వ్యర్థ పదాలు లేని దృఢమైన పదబంధం - ఇదే అల్లిక జిగిబిగి.
సేకరణ🙏🙏👌
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి