23, నవంబర్ 2023, గురువారం

నవగ్రహా పురాణం🪐*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌹🌹🌹🌹

.        *🪐నవగ్రహా పురాణం🪐*  

.               *84వ అధ్యాయం*


*పురాణ పఠనం ప్రారంభం*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

*బుధగ్రహ చరిత్ర - 11*


*"ఆచార్యా..."* బుధుడు గద్గద కంఠంతో అన్నాడు. వ్యక్తం చేయలేని వ్యధ అతని కళ్ళల్లో స్పష్టంగా , తడిగా కనిపిస్తోంది , వశిష్ఠుడికి.


*"నాయనా , బుధా ! దుఃఖాన్ని దూరం చేసుకో ! ఇలతో నీ ఎడబాటు నిరంతరమైనదీ కాదు , శాశ్వతమైనదీ కాదు !"*


*"ఆచార్యా !"*


*"చెప్పానుగా , నాయనా ! ఆ అర్ధనారీశ్వరుడు దంపతులకు ఎడబాటు కలిగించడు. నువ్వూ , నేనూ , ఎవ్వరూ కోరుకోకుండానే , అర్ధించకుండానే ఆయన నీ గురించి ఆలోచించాడు. ఉభయతారకమైన ఉపాయంతో , శాపాన్ని పరిహరించాడు. శాపఫలంగా సుద్యుమ్నుడు ఒక నెలరోజులు 'ఇల'గా ఉంటాడు. నాకు కరుణించిన వరం ఫలంగా నెల రోజులు సుద్యుమ్నుడుగానే ఉంటాడు !"*


వశిష్ఠుని వివరణ ఏదో అదృశ్య కుంచికలాగా బుధుడి ముఖం మీద కాపురం చేస్తున్న విచారాన్ని తుడిచివేసింది.


*"ఆచార్యా... నిజమా ?"*


*"అవును , బుధా ! ఈ వైవస్వతుడి బిడ్డ , ఒక నెలపాటు అక్కడ పుత్రుడుగా రాజుగా వ్యవహరిస్తాడు. మరుసటి నెల ఇక్కడ నీ పత్నిగా దాంపత్యం నెరపుతాడు. ఇది ఆదిశంకరుని అనుశాసనం !"* వశిష్ఠుడు నవ్వుతూ అన్నాడు.


*"గురుదేవా ! నా తల్లిదండ్రులు మీ రుణం తీర్చుకోలేరు. నేను కూడా మీ రుణం తీర్చలేను !"* సుద్యుమ్నుడు ఆనందంగా అన్నాడు.


*"నీ అదృష్టం అద్వితీయం సుద్యుమ్నా !"* వశిష్ఠుడు చిరునవ్వుతో అన్నాడు. *"అది ద్విముఖం ! సూర్యపుత్రుడైన వైవస్వతుడి కొడుకుగా , అత్రి పుత్రుడైన చంద్రుడికి కోడలిగా రాణించే మహద్భాగ్యం నీది !"*


వశిష్ఠుడు బుధుడి వైపు తిరిగాడు. *"నీది కూడా అదృష్టమే నాయనా ! ఒక నెల వియోగం , ఒక నెల సంయోగం ! ఈ వియోగ , సంయోగాలు ఆవృత్తి మీ అనుబంధాన్ని నిత్యనూతనంగా ఉంచుతుంది. మరొక సూచన ఏమిటంటే - పురూరవుడు భావిసామ్రాట్టు. ఆశ్రమవాసం కన్నా రాజమందిర వాసం అతనికి తగినది ! రాజోచితమైన శిక్షణ పసితనం నుంచే అలవడాలి."*


*"పురూరవుడు కూడా లేకుండా నేను ఎలా ఉండగలను ?"* బుధుడు నిరుత్సాహంగా అన్నాడు.


*"బిడ్డల ఆలనా పాలనా తల్లి పర్యవేక్షణలో జరగాలి. పురూరవుడికి ఇక్కడ తల్లి ఇల. అక్కడ సుద్యుమ్నుడు !"* వశిష్ఠుడు నవ్వుతూ అన్నాడు.


*"గురుదేవుల సూచన ఆచరణీయం. పురూరవుణ్ణి నాతో తీసుకువెళ్తాను. అప్పుడప్పుడు భటులు ఆశ్రమానికి తీసుకువస్తారు."* సుద్యుమ్నుడు బుధుడితో అన్నాడు. 


బుధుడు మాట్లాడకుండా. పురూరవుణ్ణి ఎత్తుకున్నాడు. *"నాయనా ! నీకు అర్థమైందా ? అమ్మ... ఇదిగో... సుద్యుమ్నుడు అనే రాకుమారుడిగా మారింది. ఒక మాసం గడిచిన అనంతరం మళ్ళీ సుద్యుమ్నుడు మాయమైపోయి , అమ్మ అమ్మగా వస్తుంది ! ఇప్పుడు చెప్పు. యువరాజు ప్రద్యుమ్నుడిలో ఎవరున్నారు ?”* 


పురూరవుడు సుద్యుమ్నుడి వైపు చిరునవ్వుతో చూశాడు. *"అమ్మ ఉంది. నెల అనంతరం అమ్మలో యువరాజు సుద్యుమ్నుడు ఉంటాడు."*


*"అమ్మా , సుద్యుమ్నుడూ ఒక్కరే కాబట్టి , నువ్వు ఆయనతో బాటు రాజధానికి వెళ్ళాలి. మళ్లీ రావాలి"* బుధుడు వివరిస్తూ అన్నాడు.


*"ఎప్పుడు రావాలి , నాన్నగారూ ?”*


*“అనుకున్నపుడల్లా నువ్వు ఈ ఆశ్రమానికి రావచ్చు నాయనా ! భటులు నిన్ను రథంలో తీసుకు వస్తారు"* సుద్యుమ్నుడు పురూరవుడి తల నిమురుతూ అన్నాడు.


*"నాన్నగారూ ! నాన్నగారూ ! నేను రాజధానికి వెళ్ళి , మిమ్మల్ని చూడడానికి రథంలో వస్తాను"* పురూరవుడు ఉత్సాహంగా అన్నాడు. సుద్యుమ్నుడి వైపు వాలుతూ. సుద్యుమ్నుడు పురూరవుణ్ణి అందుకున్నాడు.


*"పురూరవా ! నీతో ఆడుకోవడానికి రాజధానిలోని మందిరంలో ఇంకా ఇద్దరున్నారు. తెలుసా ?"* వశిష్ఠుడు చిరునవ్వు నవ్వాడు.


*"ఎవరు గురుదేవా ?"* పురూరవుడు ఉత్సాహంగా అడిగాడు.


*"నీ మాతామహీ , మాతామహుడు ! అంటే నీ అమ్మకు అమ్మగారూ, నాన్నగారూ అన్నమాట !"* వశిష్ఠుడు వివరించాడు.


బుధుడు పురూరవుడి బుగ్గ మీద ముద్దు పెట్టుకొన్నాడు. సుద్యుమ్నుడు పురూరవుణ్ణి దించి , బుధుడి పాదాలను కళ్ళకు అద్దుకున్నాడు. బుధుడు చిరునవ్వుతో దీవించాడు.


*"సుద్యుమ్నా ! అక్కడ రాజదంపతులు నీరాక కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు. బయలుదేరుదాం !"* వశిష్ఠుడు హెచ్చరించాడు.


*"ఇదీ బుధ చరిత్ర !”* నిర్వికల్పానంద శిష్యులతో అన్నాడు. *"ఎలా ఉంది ?"*


*"కథా , కథనం రెండూ అద్భుతంగా ఉన్నాయి గురువుగారూ !"* విమలానందుడు సంతోషంగా అన్నాడు.


*"గురువు గారూ ! ఒక సందేహం...”* సదానందుడు అన్నాడు.


*"ఏమిటి నాయనా , నీ సందేహం ?"* నిర్వికల్పానంద నవ్వుతూ అడిగాడు. 


*"బుధుడు ఇలాదేవిని వివాహం చేసుకున్నాడు. అంటే బుధపత్ని 'ఇల' అన్నమాటే కద ! అయితే నవగ్రహాల వివరాలు ఉదహరించే సందర్భాలలో , బుధుడి భార్య 'జ్ఞాని' అని అంటున్నారే ! బుధుడు ద్వితీయపత్నిని స్వీకరించాడా ?"* సదానందుడు ప్రశ్నించాడు.


*"మంచి ప్రశ్న అడిగావు ! కానీ , దీనికి ఇదమిత్థంగా సమాధానం చెప్పలేం. ఎందుకంటే , బుధుడు పునర్వివాహం చేసుకున్నట్టు ఏ పురాణమూ పేర్కొనలేదు. అలాగే ఆయన పత్ని 'ఇల' కాదు అని కూడా ఎక్కడా ప్రస్తావించబడలేదు. వైవస్వతుడి కుమారుడు సుద్యుమ్నుడు 'ఇల'గా మారి బుధుడి భార్య అయ్యాడన్నదే సర్వపురాణ సారాంశం ! చంద్రవంశానికి మూలం ఆ ఇద్దరి దాంపత్యమే. ఇలా బుధుల పుత్రుడైన పురూరవుడే చంద్రవంశ కర్తలలో ప్రముఖుడు !"*


*"అయితే ఆ 'జ్ఞాని' అనే స్త్రీ ఎవరు గురువుగారూ ?"* శివానందుడు ప్రశ్నించాడు.


*"ఇలా దేవి మరొక నామధేయమే 'జ్ఞాని' అని అనుకోవడం శ్రేయస్కరం అని నా ఉద్దేశం. స్త్రీగా జన్మించి , పురుషుడుగా మారి , శివపార్వతుల శాప ఫలంగా మళ్ళీ స్త్రీగా మారి , శివుడి కటాక్షంతో శాప విముక్తి పొంది , తదనంతర కాలంలో స్త్రీగా , పురుషుడిగా చరిత్ర సృష్టించిన 'ఇలా' దేవినే 'జ్ఞానిదేవి' అనుకోవడం అపరాధం కాదు ! బుధుడు నవగ్రహాలలో ఒకడుగా నియమించబడినప్పుడు ఆయన సతీమణికి నామధేయం 'జ్ఞాని' అనే బిరుదనామం లభించిందేమో !"* నిర్వికల్పానంద ఆగాడు.


*"అలా అనుకోవడం మంచిదే ! బుధుని ధర్మ పత్నిగా ఇలను గౌరవించినట్లు ఉంటుంది ,”* విమలానందుడు సమర్ధింపుగా అన్నాడు. 


*"సరే... ఇక ఐదవ గ్రహం బృహస్పతి. ఆయన చరిత్ర వినండి"* అంటూ ప్రారంభించాడు. నిర్వికల్పానంద.


*"ఒక్కసారి బృహస్పతి గురించి సింహావలోకనం చేసుకుందాం. చంద్రుడి వద్ద నుండి భర్త వద్దకు చేరిన తార బృహస్పతిని సేవించుకుంటూ ఉంది. బృహస్పతి ఆమె అపరాధాన్ని క్షమించి చేరదీశాడు. ఆ ఇద్దరి దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది..."*


*రేపటి నుండి గురుగ్రహ చరిత్ర ప్రారంభం*


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐🪐

కామెంట్‌లు లేవు: