23, నవంబర్ 2023, గురువారం

శ్రీసత్యసాయి

 *ॐ                   శ్రీ సాయిరాం* 



    *శ్రీసత్యసాయి జయంతి శుభాకాంక్షలు* 


       *శ్రీసత్యసాయి అవతారపురుష లక్ష్యం* 


*1. మాయ అంటని స్వచ్ఛ సమాజంగా మార్పు* 

                *( జలగ - పంకజం )* 


    పద్మం,జలగ రెండూ బురదనుంచీ పుట్టేవే!

    కానీ పద్మం తనని భక్తులు కోసి, భగవంతుని పాదపద్మాల వద్ద పూజిస్తే, భక్తుల ఆనందానికి భగవత్పాదాల వద్ద తన జీవితాన్ని చాలిస్తుంది.

    జలగ ఇతరుల రక్తాన్ని పీల్చి బాధపెడుతుంది.

   మానవులు అందరూ ఒకేలాగా జన్మించినా, "పరోపకారాయమిదం శరీరం" అని సేవాభావంతో త్యాగం  చేసే పద్మాలు కొన్ని.

    రాక్షసత్వంతో ఇతరులని పీడించే జలగలు కొన్ని.


    కలియుగంలో, మాయ అనే బురద తొలగించి, 

    మనలోనే ఉన్న "జలగ మనస్తత్వం" అనే రాక్షసత్వాన్ని సంహరించి, 

    పంకం అంటని పంకజాలుగా మార్చి, సంస్కరించడానికి, "ప్రేమ తత్వంతో" వచ్చిన అవతారపురుషుడు " శ్రీ సత్యసాయి".


*2. మానవజన్మ లక్షణాలను ఎఱుకపరచడం* 

                    *( కాకి - కోకిల )* 


    కోకిల గుడ్లు కాకి తన గూట్లో పొదుగుతుంది. 

    కోకిల పిల్లలు చూడడానికి కాకి పిల్లలలాగానే ఉంటాయి.

    తన పిల్లలే అనుకుని, ఆహారం కూడా తీసికొనివచ్చి కోకిల పిల్లలని పోషిస్తుంది.

    అవి కూడా ఆ ఆహారాన్నే తింటాయి. కాకి అరుపులే వింటాయి. 

    కానీ ఎగిరె శక్తి వచ్చేటప్పటికి, ఆ కోకిల పిల్లలు, 

    కాకి అరుపుతో కాక, తన కోకిల జాతి కూత -  "కుహు కుహూ" అని కూస్తూ ఎగిరిపోతాయి.

    అట్లే పెరిగే పరిసరాలూ ఎటువంటివైనా, ఎదిగి కార్యరంగంలోకి వచ్చినప్పుడుమాత్రం, 

    మొహమాటం లేకుండా మానవులుగా "సత్యధర్మాలు" ఆచరించే మానవులు కోకిలల వంటివారు.


    మన జీవితాలలో ఆ ఎరుక తెప్పించి, 

    దుష్టసావాసంలో మునిగిపోక, 

    మానవత్వం తెలియజెప్పేందుకు వచ్చిన అవతార పురుషుడే "శ్రీసత్య సాయి".


*3. దైవత్వంగా పదోన్నతి కల్పించడం* 

              *( కీటకం - భ్రమరం )* 


    కీటకం మరణిస్తే, తుమ్మెద దాని దగ్గరకి వచ్చి ఆగకుండా  "ఝంకారం" చేస్తూంటుంది.

    అది చేసే ధ్వనికి, ఆ పురుగు జీవం పొంది, కొంత సమయానికి రూపం కూడా మారి, భ్రమరం(తుమ్మెద)గా మారుతుంది.

    దీన్ని "భ్రమరకీటక" న్యాయం అంటారు. ఇక్కడ కీటకం భ్రమర రూపం పొందుతుంది.


    *జీవచ్ఛవాలుగా ఉన్న దీనులకి  సేవచేయిస్తూ, వారిని ఉద్ధరించడానికి ఒక ప్రక్క,* 

    *మఱొకప్రక్క, వారి అజ్ఞానాంధకారాన్ని తొలగించి, వారిలోని దైవశక్తిని తెలిపి,*

    *జ్ఞాన వెలుగు గల తుమ్మెదలుగా పదోన్నతి కల్పించేదే* 

        *- "సర్వప్రాణపతి"గా భక్తులు ప్రార్థించే - సద్గురువు "శ్రీసత్యసాయి"* 


                    =x=x=x=


    — రామాయణం శర్మ

             భద్రాచలం

కామెంట్‌లు లేవు: