23, నవంబర్ 2023, గురువారం

 🌸 *రామాయణములో మనము తెలుసుకొన వలసిన విషయాలు* 🌸


"""ఉపాయము లేని వాడిని  ఊరి నుండి వెళ్లగొట్టమని"  సామెత.""


అదేమిటి ఉపాయాలు తెలియకపోతే ఉరినుండి వెలి వేసేస్తారా? అంటే  ఉపాయాలు తెలియని వాడు ఊరికి పనికిరాని వాడని అర్థము. ఊరికి ఉపకారము చేయలేని వాడు ఊళ్లో ఉన్నా లేక పోయినా ఊరికేమి లాభము. అందుకే అందరు  వాడిని వెలి వేయడానికైనా సరే సిద్దపడతారు కనుక కనీసము ముఖ్యమైన ఆరు ఉపాయాలన్నా తెలుసుకొమ్మని రామాయణము  మనలని హెచ్చరిస్తున్నది.ఏమిటి ఆ ఆరు ఉపాయాలు.


రామాయణము అరణ్యకాండములో చెప్పబడ్డ ఆరు ఉపాయాలు గమనించుకుందాము.

"" షడ్యుక్తయః"" (ఆరు ఉపాయములు),


""సంధివిగ్రహయానాసన ద్వైధీభావ సమాశ్రయాః.-షడ్యుక్తయః,""


శత్రువులతో ఒడంబడిక చేసుకొనుట సంధి,

రిపు విరోధము విగ్రహము,

అదనుచూసుకొని శత్రువుమీదకి దండెత్తుట యానము,

అనుకూలమైన కాలము కొరకు నిరీక్షించుట ఆసనము,

బలవంతులు బలహీనులైన శత్రువులిద్దరితోను మాటలతో మంచిగా వ్యవహరించుట ద్వైధీభావము,

బలవంతుని ఆశ్రయించుట సమాశ్రయము.


రామలక్ష్మణులు కబంధుని దేహమునకు అగ్నిసంస్కారములు ఒనర్చిన పిమ్మట కబంధుడు దివ్య దేహముతో బయటకు వచ్చి సీతాదేవిని తిరిగి పొందుటకు రామలక్ష్మణులకు  ఈ ఆరు ఉపాయములు చెప్పుతూ వాటి  గురించి ప్రస్తావిస్తూ ఇలా చెప్పాడు.


"" రామా! షడ్యుక్తయో లోకే

    యాభిః సర్వం విమృశ్యతే,

    పరిమృష్టో దశాంతేన 

   దశభాగేన సేవతే."""(72-18),


ఓ రామచంద్రప్రభూ!   లోకములో ఎవ్వరికైనా సరే సర్వ కార్యములు సాధ్యము కావాలంటే ఆరు ఉపాయములు గలవు.అవి పాటిస్తే విజయం ప్రాప్తిస్తుంది. అవే సంధి,విగ్రహము,యానము,ఆసనము,ద్వైధీభావముమరియు సమాశ్రయము ఈ ఆరింటిని ఆకళింపు చేసుకొని""సమాశ్రయము""ద్వారా  (సుగ్రీవుని ఆశ్రయించి) సీతాన్వేషణలో విజయము సాధించమని హితవు చేస్తాడు.


కబందుని సూచనమేరకు రాముడు సుగ్రీవుని కలిసి అగ్నిసాక్షిగా అతనితో మైత్రి సల్పి సమాశ్రయమనే ఉపాయనము ద్వారా సీతామాత ను రావణచెర నుండి విడిపించుకుటాడు.


ఈ కలియుగములో మనందరికి అనుకోకుండగానో, గ్రహపాటువల్లనో అనేకవిధములైన  సమస్యలు ఎదురవుతుంటాయి. ఆ సమయములో సాధకులు అధైర్యపడకుండ రామాయణములో చెప్పబడ్డ ఈ ఆరు ఉపాయములను గుర్తు తెచ్చుకొని వాటిద్వారా లభ్దిపొందగలగటమే రామాయణ పారాయణ మనకి ప్రసాదించే అతి పెద్ వరమని  గ్రహించుకోవాలి.



“””””””””హరయేనమ: శ్రీకృష్ణాయనమ:”””””””””

కామెంట్‌లు లేవు: