23, నవంబర్ 2023, గురువారం

🚩శ్రీ వివేకానందస్వామి

 🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.    *🌹చారిత్రాత్మక కథాస్రవంతి🌹*

.   *ఓం నమో భగవతే రామకృష్ణాయ*


.       *🚩శ్రీ వివేకానందస్వామి🚩*

.                *🚩జీవిత గాథ🚩*   

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

.                      *భాగం 94*


ఆగస్ట్ నెలాఖరులోగా కాశీపూర్ ఇంటిని ఖాళీ చేసి ఇవ్వాలి. మాతృదేవి ఎక్కడకు వెళతారు? యువకులు ఎక్కడకు పోతారు? ఇంటిని ఖాళీ చేయవద్దని  మళ్లీ ఒకసారి గృహస్థ భక్తులకు, యువశిష్యులు విన్నవించారు. "మేం భిక్షాటన చేసి అయినా మాతృదేవిని పోషించుకొంటాం" అని చెప్పి చూశారు. కాని గృహస్థ భక్తులు ఇంటిని ఖాళీచేసి తీరాలని పట్టుబట్టారు. 


ఆగస్ట్ 21వ తేదీ మాతృదేవిని బలరాంబోస్ తన ఇంటికి తోడ్కొని వెళ్లాడు. యువకులు తమ కోసం పదిలపరచుకొన్న అస్థికల కలశాన్ని మాతృదేవి తమతో కూడా బలరాంబోసు ఇంటికి తీసుకుపోయి నిత్యం పూజించసాగారు. శ్రీరామకృష్ణులు ఉపయోగించిన వస్తువులను కూడా మాతృదేవి తమతో తీసుకు వెళ్లారు. ఆగస్ట్ 30 వ తేదీ యువభక్తులైన కాళీ, యోగీన్, లాటూలతోను, భక్తురాండ్రతోను బృందావనం మొదలైన పుణ్యస్థలాల తీర్థయాత్రకు మాతృదేవి బయలుదేరారు.


మరి యువశిష్యులు?


వారు ఎక్కడకు పోగలరు? మాతృదేవితో ఒకరిద్దరు వెళ్లారు. ఒకరిద్దరు ఇంటికి తిరిగి వెళ్లిపోయి తమ చదువులు కొనసాగించారు. నరేంద్రుడు అప్పుడప్పుడు ఇంటికి వెళ్లివచ్చేవాడు. పెద్దగోపాల్, నిరంజన్ ప్రభృతులు ఇల్లు ఉన్నా లేకపోయినా, మఠం ఉన్నా లేకపోయినా సన్న్యాస జీవితం కొనసాగించాలని నిర్ణయించుకొన్నారు.


 "పాము తనకంటూ నివాసం ఏర్పాటు చేసుకోదు. ఇతర జంతువుల నివాసాలలో నివసిస్తుంది. సన్న్యాసి కూడా అంతే. అతడు ధర్మ సత్రాలు, చావిళ్ళలో జీవితం గడపాలి. మనం కూడా అట్లే చేద్దాం” అన్నాడు నిరంజన్. "ఆగకుండా ప్రవహించే నీటిలా సన్న్యాసి ఒకే చోట ఉండిపోకుండా పయనించాలి" అన్నారు మరొకరు. ఏది ఏమైనప్పటికీ సన్న్యాస జీవితం కొనసాగించాలని వారు గట్టిగా నిర్ణయించుకొన్నారు. కాని ఎక్కడ బస చేయాలి?


శ్రీరామకృష్ణులు ఏదో ఒక దారి చూపుతారని యువశిష్యులకు అచంచల విశ్వాసం. ఒక కొత్త సందేశంతో అరుదెంచి, దానిని లోకమంతటా చేయడానికి యువకులకు శిక్షణనిచ్చిన ఆయన అనుగ్రహించకుండా ఉంటారా? లేదు,  అనుగ్రహించారు. ఆయన వరదాభయ హస్తాలు యువశిష్యులకు చేయూత నిచ్చాయి.🙏


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

👉 *రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: