🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*గురువు పట్ల శిష్యుడి కర్తవ్యం*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరుడిగా గురువు తపించేది శిష్యుడికోసమే.*
*అంతగా పరితపించే గురువు శిష్యుడినుండి ఏం కోరతాడు? ఏమీ ఉండదు. అంటే తను అడగ దలుచుకున్నది బలవంతంగా అణచుకోవడం కాదు. కోరుకోవడానికి ఆయనకు మరే కోరిక ఉండదు కనుక. ’నాకిది కావాల్రా’ అని అడగడు. కారణం –ఆయన కోరుకుంటే ఇచ్చేవాడు వేరొకడున్నాడు (పరమేశ్వరుడు). ఆయన్ని అడుగుతాడు తప్ప శిష్యుడి ముందు చేయిచాపడు. అయనకా అవసరం లేదు కూడా. ఆయన పరిపూర్ణుడు. ఎప్పుడూ తృప్తితో ఉంటాడు.*
*మరి అటువంటి గురువు పట్ల శిష్యుడి కర్తవ్యం?*
*గురువుగారు శరీరంలో ఉండేటట్లు చూసుకోవడమే. శరీరం అనిత్యమని గురువుకు తెలుసు. అది పడిపోతుంది. కించిత్ బెంగపెట్టుకోడు. ‘నేను ఆత్మ, శాశ్వతం. ఎక్కడికీ వెళ్ళను’ అన్న అవగాహనతో పరమ సంతోషంతో ఉంటాడు. ఈ శరీరంతో అనుభవించడానికి ఆయనకు భోగాపేక్ష ఉండదు. ఒకవేళ కష్టం వస్తే... గతజన్మల తాలూకు కర్మఫలం పోతున్నదని అనుభవిస్తాడు. కానీ గురువుగారి శరీరం లేకపోతే నష్టం కలిగేది శిష్యులకు.*
*ఊపిరి త్వరగా తీసి త్వరగా విడిచిపెడుతుంటే ఆయువు క్షీణిస్తుంటుంది. బోధనలు నిర్విరామంగా చేస్తూంటాడు గురువు. ఆయన ఆయువు త్వరగా క్షీణిస్తుంది. ఇలా శిష్యులకోసం తన ఆయువును తాను తగ్గించుకుంటున్న గురువుకు శిష్యుడు చెయ్యడానికేమీ ఉండదు. మరి ఏం చేయాలి ?*
*కేవలం శుశ్రూష మాత్రమే చేయగలడు. ఆయన శరీరం సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడం కోసమని తాపత్రయపడి చేసే సేవే శుశ్రూష. ఇది స్థాన శుశ్రూష అని, దేహ శుశ్రూష అని రెండు రకాలు. స్థాన శుశ్రూష అంటే – గురువుగారి ఇల్లు సాక్షాత్ పరమేశ్వరుడు కొలువైన దేవాలయంతో సమానం. అందుకే గురువుగారి ఇంటిపక్కనుంచి వెళ్ళేటప్పుడు అది గుడి అన్న భావనతో ప్రదక్షిణంగా వెడతారు చాలామంది.*
*విరాటపర్వంలో ఉత్తరకుమారుడితో అర్జునుడు– ‘‘రథం నడపడంలో నీకంత ప్రవేశం లేదు. ఆయన మా గురువు ద్రోణాచార్యులవారు. వారు నాకు పరమ పూజ్యులు. నీవు రథం నడిపేటప్పుడు పొరబాటున కూడా నా రథాన్ని మా గురువుగారి రథం ముందు పెట్టవద్దు. మా గురువుగారి రథం నా ఎడమవైపున కూడా ఉండడానికి వీల్లేదు. వారి రథం నా కుడి చేతివైపునే ఉండాలి. కారణం– నేను మా గురువుగారి మీద బాణం వెయ్యను. గురువుగారే ఒకవేళ ముందు వేస్తే...నేను క్షత్రియుడిని కాబట్టి దానికి బదులుగా బాణం వేస్తాను తప్ప నా అంతట నేను వేయను. యుద్ధరంగంలోకి వెళ్ళేటప్పుడు కూడా వారి రథాలకు ప్రదక్షిణచేసి లోపలకు నడుపు’’ అన్నాడు. దీన్ని స్థాన శుశ్రూష అంటారు. దానివల్ల గురువులకు ఒరిగేదేమీ ఉండదు. శిష్యుడి స్థాయి పెరుగుతుంది. అంతే.*
*గురువుగారు ఉన్న ఇంటిని శుభ్రం చేయడం, గురువుగారి అవసరాలు గుర్తెరిగి సమకూర్చడంవంటివి చేస్తారు.*
*దేహ శుశ్రూష – దేహము అంటే దహ్యమానమయిపోతుంది. ఆయన శరీరం ఒడలిపోతుంది. నీరసపడిపోతుంది. వయసు పెద్దదవుతుంది. శరీరంలో బలమూ తగ్గిపోతుంది. కానీ ఆయనకు శిష్యుడిపట్ల ప్రేమ ఎక్కువవుతుంటుంది. ఆ గురువు ఉండాలి ఆ శరీరంలో. అందుకని గురువుగారు పడుకుంటే ఆయన కాళ్ళు ఒత్తుతారు. మంచినీళ్ళు తెచ్చిస్తుంటారు. గురువుగారు నదీస్నానం చేస్తుంటే ప్రవాహదిశలో దిగువకు శిష్యుడు స్నానం చేస్తాడు. గురువుగారిని తాకి వస్తున్న నీరు గంగకన్నా గొప్పది.*
*శ్రీ గురుభ్యోనమః!*
🛐🛐🛐🛐🛐🛐🛐🛐
*ఓం శాంతిః శాంతిః శాంతిః!*
*సర్వేజనా సుఖినోభవంతు!!*
*ఓం తత్సత్!!*
*సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు!!*
*ఓం నమః శివాయ!!!*
🛐🛐🛐🛐🛐🕉️🛐🛐🛐
*(సంకలనం భగవంతుని కృపతో మీ ఆత్రేయపురపు వెంకట రమణమూర్తి)*
🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి