30, నవంబర్ 2024, శనివారం

శ్రీ మురుడేశ్వర ఆలయం

 🕉 మన గుడి : నెం 945


⚜ఉత్తర కర్నాటక  : మురుడేశ్వర


⚜ శ్రీ మురుడేశ్వర ఆలయం


💠 మురుడేశ్వర దేవాలయం, ఆధునిక కాలంలో దేవాలయ నిర్మాణంలో పవిత్రతకు, విశేష ప్రతిభకు ఒక ప్రముఖ నిదర్శనం. 

ఎత్తైన దేవాలయాన్ని (18 అంతస్తులు) చూసినవారు, ఇటువంటి నిర్మాణం ఎలా సాధ్యమయిందని ఆశ్చర్యపోతారు.  మురుడేశ్వర దేవాలయ ఆవరణలో కనబడే ఎత్తైన శివుని పాలరాతి విగ్రహం అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తుంది.


💠 మురుడేశ్వర్ లో శివుని విగ్రహం ప్రధాన ఆకర్షణ. చుట్టూ అరేబియా సముద్రం పక్కనే 123 అడుగుల ఎత్తులో భారీ శివుని విగ్రహం  సమీపంలోని రాజగోపురం 20 అంతస్తులు కలిగి ఉంది.


🔆 స్థలపురాణం 


💠 మురుడేశ్వర చరిత్ర త్రేతాయుగం నాటిది.

రావణాసురుడు కైలాసం నుండి పరమేశ్వరుడిని వేడుకుని తెచ్చిన ఆత్మలింగానికి, మురుడేశ్వర క్షేత్రంలో లింగానికి సంబంధం ఉంది. 

రావణాసురుడు తెచ్చిన ఆత్మలింగాన్ని గోకర్ణక్షేత్రంలో బ్రాహ్మణవటువు రూపంలో వచ్చిన గణపతి భూమిమీద పెడతాడు. 

వెంటనే ఆత్మలింగం భూస్థాపితమయింది. సాయంసమయాన ఆర్ఘ్యాన్ని వదలడానికి వెళ్ళిన రావణాసురుడు భూమిలో నుండి బయటకు తీయడానికి ఎంత ప్రయత్నించినా ఆత్మలింగం బయటకు రాదు. 

అప్పుడు రావణాసురుడు ఆగ్రహంతో ఆత్మలింగంపై ఉన్న వస్త్రం, దారం తదితర వస్తువులను విసిరిపారేస్తాడు. 

ఆ వస్తువులు ఎక్కడెక్కడ పడ్డాయో, అక్కడ శివలింగాలు ఉద్భవించి, ఆ ప్రదేశాలు మహామహిమాన్వితమయిన పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. 

ఆ ప్రదేశాలు, గోకర్ణక్షేత్రం దగ్గరలో ఉన్న సజ్జేశ్వర, గుణవంతేశ్వర, మురుడేశ్వర, ధారేశ్వరాలు. 


💠 గోకర్ణ క్షేత్రంతో కలిపి ఈ క్షేత్రాలన్నీ పంచక్షేత్రాలుగా ప్రసిద్ధిచెందాయి.

ఆత్మలింగం మీద ఉన్న వస్త్రాన్ని రావణాసురుడు విసిరివేస్తే, ఆ వస్త్రం పడిన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశం మురుడేశ్వరం అయింది. 

మురుడ అంటే కన్నడంలో వస్త్రం అని అర్థం. "సంతోషం "అనే అర్థం కూడా ఉంది. 

అందరికీ సంతోషాన్ని ఇచ్చే దేవుడున్న ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రం మురుడేశ్వరం అయిందని కూడా అంటారు.


💠 ఈ పంచక్షేత్రాలను దర్శించి పూజలు చేసిన వారి కోరికలన్నీ నెరవేరి, మోక్షప్రాప్తి కూడా కలుగుతుందని స్థల పురాణం చెబుతోంది. మురుడేశ్వరస్వామికి, శివరాత్రినాడు, బిల్వపత్రంతో పూజలు చేసిన వారికి స్వర్గ ప్రవేశం కలుగుతుందని భక్తుల విశ్వాసం.


💠 ఈ క్షేత్రానికి ఉత్తరాన భవానీ దేవత, తూర్పున మహాదుర్గ, ఇతర దేవతలందరూ మిగతా దిక్కులలో కొలువై ఉండి రక్షిస్తున్నారట. బ్రహ్మదేవుడు కూడా ఇక్కడికి వచ్చి మురుడేశ్వరుడిని పూజిస్తాడట.

బ్రహ్మదేవుడు ఇక్కడి పరమేశ్వరుడి విగ్రహంపై కమండలంతో చల్లిన నీళ్లతో కమండల తీర్థం అనే పవిత్ర సరస్సుగా ఏర్పడిందట. 


💠 ఇక్కడ పాండవులు కొంతకాలం ఉన్నారని ,ఒకనాడు  ధర్మరాజు, భీముడిని మురుడేశ్వరుడికి పవిత్ర గంగాజలంతో అభిషేకం చేయడానికి గంగాజలాన్ని వెంటనే తెమ్మన్నాడు. పరమేశ్వరుడిని ధ్యానిస్తే గంగాజలం వెంటనే లభిస్తుందనుకున్న భీముడు పరమేశ్వరుడిని ధ్యానం చేసాడు. 

కానీ, పరమేశ్వరుడు అనుగ్రహించలేదు. అప్పుడు భీముడు తన తలను భూమిమీద కొట్టుకున్నాడు. వెంటనే పరమశివుడు అనుగ్రహించి గంగామాతని హిమతీర్థంగా సృష్టించాడు. 

భీముడు తన నెత్తిని నేలపై కొట్టిన స్థలమే ప్రస్తుతం భీమతీర్థం అని పిలుస్తున్నారు.


💠 బ్రహ్మహత్యా పాతకానికి శిక్షను తప్పించుకోవడానికి, ఇంద్రుడు స్వర్గాన్ని వదలి, మురుడేశ్వరానికి వచ్చి ఇక్కడ మురుడేశ్వరస్వామి అనుగ్రహానికి పాత్రుడు కావడానికి పూజలు చేశాడని స్థానికులు చెబుతారు.


💠 ఇక్కడికి దేశంలో అన్ని ప్రాంతాల నుండి భక్తులు వచ్చి స్వామికి పూజలు చేస్తూంటారు. దేవాలయంలో అభిషేకాలు, కుంకుమ పూజలు మొదలయిన ఆరాధనలు జరుగుతాయి. అన్నసంతర్పణ సేవ, నిత్యసేవ, నందదీపసేవ, ఒక రోజు అన్నసంతర్పణం, సర్వదేవపూజ అంటూ సుమారు 50 రకాల పూజావిధానాలున్నాయి. 

శివరాత్రి ఉత్సవాలు, పుష్యమాసంలో రథోత్సవం ఇక్కడ వైభవంగా జరుగుతాయి. వీటిని చూసేందుకు దూరప్రాంతాల నుంచి కొన్ని లక్షలమంది భక్తులు వస్తుంటారు.


💠 మురుడేశ్వరంలో పవిత్రస్నానాలు చేయడానికి అనేక తీర్థాలున్నాయి. 

బ్రహ్మతీర్థం, కమండల తీర్థం, అగ్నితీర్థం, భీమతీర్థం, దేవతీర్థం అందులో ముఖ్యమైనవి.

ఈ తీర్థాలలో, ఇక్కడి సముద్రంలో స్నానం చేయడం వల్ల, దీర్ఘకాల రోగాలు నయమవుతాయని అంటారు.


💠 మురుడేశ్వరక్షేత్రం, కందూక పర్వతం మీద అరేబియా సముద్రతీరంలో ఉంది. 

ఈ పర్వతం బంతి మాదిరిగా (కందూకం అంటే బంతి ) ఉంది కాబట్టి, ఈ పర్వతానికి కందూక పర్వతం అనే పేరు వచ్చింది.


💠 మురుడేశ్వర ఆలయ ప్రాకారంలోనే, ఇతర దేవతల చిన్న మందిరాలు ఉన్నాయి. 

వాటిలో గణపతి మందిరం, గౌరీమందిరం, దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య, ఆంజనేయ మందిరాలు ముఖ్యమయినవి. 

ఇక్కడ భక్తులు ప్రతిష్ఠించిన నాగప్రతిమలు ఉన్నాయి. దేవాలయ ఆవరణలో ధ్వజస్తంభం, నందిమండపం, యజ్ఞమండపం ఉన్నాయి. దేవాలయ ప్రాంగణంలోనున్న రావిచెట్టు చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేసి తమ కోరికలను నెరవేర్చమని, చెట్టుకు ముడుపులు కడుతుంటారు.


💠 గోకర్ణం నుంచి మురుడేశ్వరం 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.


రచన

©️ Santosh Kumar

కామెంట్‌లు లేవు: