30, నవంబర్ 2024, శనివారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ఉద్యోగ పర్వము ప్రథమాశ్వాసము*


*211 వ రోజు*

*సంజయునికి ధర్మజుని స్పందన*


ధర్మరాజు " సంజయా! నా మాటలలో యుద్ధం అన్న మాట ధ్వనించిందా? మాకు మాత్రం యుద్ధమంటే ప్రియమా? యుద్ధానికి దిగకనే కార్య సాఫల్యత కలిగితే కావలసిన దేముంది. భీమార్జునులు జనహితమైన పనులే చేస్తారు కాని అప్రియములు చేయరు. దురాశకు పోయి యుద్ధానికి దిగితే యుద్ధం దుఃఖం కాక సుఖం ఇస్తుందా? సంజయా! మా పెదనాన్న ధృతరాష్ట్రుడు తాను అక్రమ మార్గాన నడుస్తూ నన్ను ధర్మ మార్గాన నడవమనడం న్యాయమా? తాము ఉత్తమ మార్గాన నడుస్తూ ఎదుటి వారికి చెబితే బాగుంటుంది. ఇప్పుడు మాకు సంపద లేదు, బలం లేదు. మమ్ము పిలిచి ఆదరించడానికి ధృతరాష్ట్రుడు వెర్రి వాడా? ఆయన ప్రవర్తన మాకు కొత్త కాదు అప్పుడే పెద్దల మాటలు వినని వాడు ఇప్పుడు వింటాడా? జూదపు సిరికి ఆశపడకూడదని విదురుడు అప్పుడు చెప్పిన మాటలు విని ఉంటే ఇప్పుడు ఇంత దూరం వచ్చేది కాదు. అతడు సుయోధనుడు విషం తాగమన్నా త్రాగుతాడు కాని మంచి మాటలు వింటాడా? దృతరాష్ట్రునికి సుయోధనుడు అత్యంత పరాక్రమ వంతుడని నమ్మకం. సుయోధనుడు కర్ణుని భుజబలంతో రాజ్యం నిష్కంటకం చేసుకోవాలని అనుకుంటున్నాడు. కానీ అది అతడి భ్రమ. ఎందుకంటే ఇంతకు ముందు అనేక యుద్ధాలు జారిగాయి. అప్పుడు కర్ణుడు కౌరవులను ఎందుకు గెలిపించ లేక పోయాడు. ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు, దుశ్సాసనుడు, కర్ణాదుల మాటలు వింటాడు కాని మంచి మాటలు వినరు. అన్నీ తెలిసిన నీవు ఇలా మాట్లాడటం అవివేకమా లేక లౌకికమా? భీష్మాదులకు యుద్ధం అంటే తెలియదా? ఆశాపాశ బంధితులై కళ్ళు కానని వారికి అర్జునిని గాండీవ కాంతులు పూర్తిగా గుడ్డి వారిని చేయక మానవు . సంజయా ! మా పరాక్రమం పొగుడుతూనే వారితో పోరి గెలవలేమని చెప్తున్నావు. నీకు పక్షపాత బుద్ధి ఏల. యుద్ధంలో గెలువగలమా లేదా అన్నది విడువుము. నీవు గుణవంతుడవు కనుక మా కోపం పోయేలా మాట్లాడావు. మేము ఇప్పటి వరకూ ఎవరికీ అపకారం చేయ లేదు ఇక ముందు అలాగే సహనంగా ఉంటాము. నిజంగా ధృతరాష్ట్రుడు మంచి వాడై మా మీద ప్రేమ ఉంటే మమ్ములను పిలిచి గౌరవించి మారాజ్యభాగం మాకు ఇచ్చి బంధుత్వం నిలుపమని చెప్పు. నీవు చెప్పినట్లు నేను గూడా శాంతిని వహిస్తాను, ఇంద్రప్రస్థం నా రాజ్యంగా ఉండు గాక " అన్నాడు.*


*సంజయుని ప్రతి స్పందన*


సంజయుడు లేచి " ధర్మజా! ఎన్ని తప్పులనైనా సహించి ఓర్పు వహించగలవు కనుకే ఇన్ని మాటలు చెప్పాను. నీవు నమ్మిన సత్యం, అహింసలే నీకు సంపదలు. కౌరవులు మీకు రాజ్యభాగం ఇవ్వకున్న, మీకు ఆ నెత్తురు కూటికన్నా, భిక్షమెత్తి జీవించుట మేలు కదా? నీవు యుద్ధ రూపమైన పాపమును చేయవద్దు. రాజసూయం నిర్వహించిన నీ చరిత్రను హింసతో కళంకితం చేసుకోకు. నీతో మాయాజూదం ఆడి నిన్ను అవమానపరచిన కౌరవులను లోక నిందితులను చేసావు. అరణ్యములలో కష్టాలు అనుభవించిన నీవు ఇలా నీచమైన యుద్ధానికి తలపడి బంధు మిత్రులను చంపుట ధర్మం కాదు. ఇంతకు ముందు కూడా ఈ శ్రీకృష్ణుడు, సాత్యకి ద్రుపదాదులు, శత్రుసంహారుకులయిన నీ తమ్ములు నీ వెంట వున్నా వనాలకు వెళ్ళారు గదా! దుర్యోధన, దుశ్శాసన, భీష్మ ద్రోణ కర్ణ శల్య బాహ్లీకాడులను చంపి నీవేం సుఖ పడతావు. చెప్పు. హాలాహలం దిగమింగిన ఈశ్వరుడిలా నీవు నీ కోపాన్ని దిగమింగి నీ కీర్తిని కాపాడుకో " అన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: