17, డిసెంబర్ 2025, బుధవారం

సంపూర్ణ మహాభారతము*

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🪷బుధవారం 17 డిసెంబర్ 2025🪷*

``

           *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                            7️⃣7️⃣

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


     *సంపూర్ణ మహాభారతము*           

                    *77 వ రోజు*                   


*వన పర్వము ద్వితీయాశ్వాసము*

```

ఒకరోజు బృహదశ్వుడు అనే ముని పాండవుల వద్దకు వచ్చాడు. ధర్మరాజు ఆ మునికి అతిధిసత్కారాలు కావించి కౌరవుల వలన తాము పడుతున్న బాధలు అన్నీ వివరించి “మహాత్మా! రాజ్యాన్ని, నివాసాన్ని పోగొట్టుకుని మాలాగ అడవిలో కష్టాలు పడుతున్నవారు ఎవరైనా ఉన్నారా? ఉంటే చెప్పండి” అని అడిగాడు. 


అందుకు బృహదశ్వుడు “ధర్మరాజా! నీవు కష్టాలు పడుతూ అడవులలో ఉన్నా, నీ వెంట నీ అన్నదమ్ములు, నీ భార్యా, నీ హితం కోరే విప్రులు నీ వెంట ఉన్నారు. పూర్వం నలుడనే మహారాజు నీవలె జూదంలో సర్వం కోల్పోయి, పుష్కరునికి రాజ్యాన్ని అప్పగించి భార్యా సమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళాడు", అని చెప్పాడు. 


అది విని ధర్మరాజు “మహత్మా! నాకు నలుని కథ వివరించండి” అని అడిగాడు.```


      *నలదమయంతులు*```


బృహదశ్వుడు ధర్మరాజుకు ఇలా వివరించ సాగాడు.. 

“నిషిధదేశాన్ని వీరసేనుడి కుమారుడైన నలుడు పరిపాలిస్తున్నాడు. తన పరాక్రమంతో ఎన్నో దేశాలను జయించి ప్రజారంజకంగా పరిపాలిస్తున్నాడు. అతనికి జూదం అంటే ఎక్కువ ప్రీతి. ఆ కాలంలో విదర్భ దేశాన్ని భీముడనే రాజు పరిపాలిస్తున్నాడు. చాలా కాలం అతనికి సంతానం లేదు. అతనికి దమనుడు అనే ముని ఇచ్చిన వరము వలన దమయంతి అనే కూతురు, దముడు, దమనుడు, దాంతుడు అనే కుమారులు కలిగారు. దమయంతి సౌందర్యరాశి, గుణవంతురాలు. దమయంతి నలుని గుణగణాలను గురించి విన్నది. నలుడు దమయంతి గురించి, ఆమె సౌందర్యం గురించి విన్నాడు. ఇరువురి నడుమ ప్రేమ అంకురించింది.```


*నలదమయంతుల మధ్య హంస రాయబారం*```

ఒకరోజు నలుడు ఉద్యానవనంలో ఉండగా హంసల గుంపు వచ్చి అక్కడ వాలింది. ఆ హంసలను చూసి ముచ్చట పడి నలుడు వాటిలో ఒకదానిని పట్టుకున్నాడు. మిగిలిన హంసలు తోటి హంసను విడిచి వెళ్ళలేక ఆకాశంలో తిరుగుతున్నాయి. నలునితో అతని చేతిలోని హంస మానవభాషలో ఇలా అన్నది. “ఓ మహారాజా! నీవు దమయంతిని ప్రేమిస్తున్నావు. నేను దమయంతి వద్దకు వెళ్ళి నీ గురించి, నీ అందచందాల గురించి గుణగణాల గురించి చెప్పి నీమీద అనురాగం కలిగేలా చేస్తాను” అని పలికింది. 


ఆ హంస పలుకులు విని నలుడు ఆనంద పడి, దానిని విడిచిపెట్టాడు. ఇచ్చిన మాట ప్రకారం ఆ హంస విదర్భదేశానికి ఎగిరిపోయింది. 


అంతఃపురం ముందు విహరిస్తున్న హంసను చూసి దమయంతి ముచ్చట పడింది. చెలికత్తెల సాయంతో దమయంతి ఆ హంసను పట్టుకుంది. ఆ హంస దమయంతితో “దమయంతీ! నేను నీ హృదయేశ్వరుడైన నలుని వద్ద నుండి వచ్చాను. నలుడు సౌందర్యవంతుడు, సంపన్నుడు, సద్గుణ వంతుడు. నీవు సౌందర్యంలో, గుణంలో అతనికి తగినదానివి. అతనికి భార్యవైతేనే నీకు రాణింపు" అని పలికింది. 


దమయంతి “ఓ హంసా! నలుని గురించి నాకు ఎలా చెప్పావో అలాగే నలునికి నా గురించి చెప్పు" అన్నది. ఆ హంస అలాగే చేసింది. ఇలా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగం అధికమైంది.``` 


            *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ!   జై శ్రీ కృష్ణ!🚩* 


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: