10, ఆగస్టు 2020, సోమవారం

భగవద్ గీత*


శ్రీ కృష్ణుడు తన జీవిత కాలంలో రెండు గానాలు చేశాడట. ఒకటి వేణు గానం, రెండవది గీతా గానం.
శ్రీ కృష్ణ పరమాత్మ వేణు గాన మాధుర్యాన్ని ఆ కాలము లోని వారు విని ధన్యులవుతే... ఆ భాగ్యానికి నోచుకోని మనకు, దానికి మిన్నగా (మన భావన) అందించిన గానమే గీతా గానం. ఈ గానమృతములో లీనమైన వారి పాపాలన్నీ తొలగి పోతాయి.
గీతా పఠనావశ్యకత తెలుపుతూ... వేదముల సారభూతంగా శ్రీ కృష్ణుని చేత అర్జునుడికి చెప్పబడిన గీత పరమానంద స్వరూపమైనది. తనను ఆశ్రయించిన వారికి తత్వ జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని వరాహ పురాణము తెల్పిన మాట.
*కోరికలు* లేనటువంటి కర్మలను ఆచరించడం ద్వారా *భక్తి* కలుగుతుంది.
భక్తి *జ్ఞానానికి* మార్గం చూపుతుంది.
జ్ఞానం *మోక్షానికి* హేతువవుతుంది.
త్యాగం, యోగం, యజ్ఞం, తపస్సు ఈ నాటి జన సామాన్యానికి అనుభవంలో లేని అంశాలు.
అవుతే ఆనాడే శ్రీ కృష్ణ పరమాత్మ తన గీతోపదేశములో వీటిలోని మరో కోణాన్ని అందించారు. దాన్ని ఆచరణలో పెట్టే నట్లవుతే సమాజములో కొత్త వెలుగులు ప్రసరిస్తాయి.
అడవికి చేరి అన్నం, నీరు వదిలి తపస్సు చేసిన మహర్షులనెందరి గురించో విన్నాము. ఈనాడు అది అసాధ్య మవుతున్న పరిస్తితులలో *గీత సూచించిన మార్గమే శరణ్యం, ఆచరణ సాధ్యం కూడా*.
*శారీరకం, వాచికం మరియు మానసికం* అను మూడు విధాలుగా ఇది అలరారుతుంది.
1) సుగుణాలను అలవర్చుకుని దేవతలను, పెద్దలను, గురువులను, మహనీయులైన వారిని పూజించటం *శారీరక తపస్సు*.
2) ప్రేమగా మాట్లాడడం, నిజానికి కట్టుబడి ఉండడము, నిత్యం భగవత్ అధ్యయనం చేయడం *వాచికమైన తపస్సు*.
3) మనస్సును నిర్మలంగా ఉంచడం, భావ శుద్ధిని కలిగి ఉండడము *మానసిక తపస్సు*.
మూడు రకాలైన ఈ సాధనలను నిరంతరము ఆచరణలో పెట్టడం ఒక తపస్సని...నిజాయితీగా ప్రయత్నించే వారికి ఇది సాధమవు తుందని చెబుతుంది గీత.

కామెంట్‌లు లేవు: