29, ఆగస్టు 2020, శనివారం

వామన జయంతి*

వామనుడు శ్రీమహావిష్ణువు అయిదో అవతారం. రాక్షసకులంలో పుట్టిన బలి గొప్ప విష్ణుభక్తుడు. ఆ గర్వంతో స్వర్గం మీదికి దండెత్తి ఇంద్రుణ్ని జయించి, స్వర్గాధిపతి అయ్యాడు. దేవతలను, మునులను హింసించసాగాడు. దేవతల తల్లి అదితి శ్రీహరిని ప్రార్థించింది. స్వామి అనుగ్రహించి, ‘తగిన సమయంలో నేను బిడ్డగా జన్మించి, నీ కష్టాలు తొలగిస్తాను’ అని వాగ్దానం చేశాడు. ఫలితంగా అదితికి వామనుడిగా జన్మించాడు. లోకకల్యాణార్థం అవతరించిన వామనుడికి ఉపనయన సంస్కారాలు జరిగాయి. బ్రహ్మ తేజస్సుతో వెలిగే వటుడు వామనుడు దండం, గొడుగు, కమండలం తీసుకుని, నర్మదా నదీ తీరాన ‘భృగుకచ్ఛ’ అనే ప్రదేశంలో అశ్వమేధయాగం చేస్తున్న బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు.
వామనమూర్తిని బలి స్వాగతించి, సత్కరించి, అంజలిబద్ధుడై, ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. ‘కేవలం మూడు అడుగుల నేల ఇస్తే నాకు చాలు’ అన్నాడు వామనుడు. ‘నేను త్రిలోకాధిపతిని. మీ కోరిక నాకు తగినట్టు గొప్పదిగా ఉండాలి’ అన్నాడు బలి. అందుకు వామనుడు- ‘నేను బ్రహ్మచారిని. నీ సంపదను నేనేం చేసుకోను? నా ఇంద్రియాలన్నీ నా వశంలోనే ఉన్నాయి. మూడు అడుగుల భూమి చాలు నాకు’ అన్నాడు మళ్లీ. వామనుడి ఆంతర్యం గ్రహించిన రాక్షస గురువు శుక్రాచార్యుడు ‘వచ్చినవాడు సాక్షాత్తు విష్ణువు. నీ రాజ్యాన్ని, జీవితాన్ని హరించి నిన్ను అథఃపాతాళానికి తొక్కివేయడానికి వచ్చాడు. అతడి కోరికను అంగీకరించకు’ అని ఎంతగా హెచ్చరించినా, బలి వినలేదు. ఆడిన మాట తప్పనన్నాడు. దానం చేసేందుకు, నీరు వదలడానికి కమండలం అందుకున్నాడు. చివరి ప్రయత్నంగా శుక్రుడు శిష్యుణ్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఓ పురుగు రూపంలో ఉదకం విడిచే చెంబు కొమ్ముకు అడ్డుపడ్డాడు. శ్రీహరి దర్భపుల్లతో కొమ్ములో పొడిచాడు. దాంతో శుక్రాచార్యుడి కన్ను పోయింది. బలి ఉదకాన్ని వామనుడి చేతిలో విడిచి దానం పూర్తి చేశాడు.
అనంతుడైన శ్రీహరి తన వామన రూపాన్ని విస్తరించి విశ్వరూపుడయ్యాడు. ఆ త్రివిక్రమ భగవానుడు ఒక పాదంతో భూమిని, రెండో పాదంతో స్వర్గాన్ని ఆక్రమించాడు. మూడో అడుగు బలి శిరస్సు మీద ఉంచి, రసాతలానికి అణగదొక్కాడు. బలి సమర్పణ భావానికి, దానశీలతకు సంతోషించిన శ్రీహరి- బలిని సుతల లోక రాజ్యానికి అధిపతిని చేశాడు. సాపర్ణి మనువు కాలంలో దేవేంద్రుడవవుతావని బలికి వరం ఇచ్చాడు.

ఆత్మతత్త్వాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తుంది వామనావతారం. దేహంలోని ఆత్మ, విశ్వపరివ్యాప్తమైన పరమాత్మ ఒక్కటేనన్న ఆత్మజ్ఞాన రహస్యానికి దర్పణం బలిదానగుణం. ‘నేను ప్రభువును, నేను దాతను’ అని గర్విస్తే ఫలితమిదేనని భగవద్గీత కూడా చెబుతుంది.
వామన ద్వాదశి ముందు రోజు ఏకాదశినాడు ఉపవసించి, జాగారం చేసి, వామన విగ్రహాన్ని పూజిస్తారు. శుక్ర ద్వాదశి, వామన ద్వాదశి, శ్రవణ ద్వాదశి, మహా ద్వాదశి, అనంత ద్వాదశి, కల్కి ద్వాదశి అన్న పేర్లూ ఈ పర్వదినానికున్నాయి. ఎదుటివారిని అహంకారంతో చులకనగా చూసే దుష్టులకు తగిన గుణపాఠం నేర్పి, వారికి సక్రమ మార్గ నిర్దేశం చేయడమే వామనావతార రహస్యం.

*-:చిమ్మపూడి శ్రీరామమూర్తి*
*****************

కామెంట్‌లు లేవు: