29, ఆగస్టు 2020, శనివారం

452. తేజోవతీ

సూర్యుడు మొదలగు తేజోమూర్తులకు ఆధారభూతురాలు ఆ పరమేశ్వరి నుండి అనేక వేలకోట్ల కిరణాలు ప్రసరిస్తున్నాయి. అందులో అగ్ని 108 కిరణములు సూర్యుడు 116 కిరణములు చంద్రుడు 136 కిరణములు వెరసి 360 కిరణములను
గ్రహించగలిగారు. సూర్యుని ప్రకాశమువల్ల పగలు, చంద్రకాంతులవల్ల రాత్రి, అగ్ని
కాంతులవల్ల సంధ్యవేళలయందు ఈ జగత్తులోని వ్యాపారాలన్నీ జరుగుతున్నాయి. అని గతంలో వివరించాం. అయితే ఈ కిరణాలన్నీ శ్రీచక్రంలోని నవావరణల నుంచే ప్రసరిస్తున్నాయి అని కూడా అంటున్నారు.


త్రికోణంలో 3x5= 15 కిరణములు
అష్టకోణంలో 8x1= 8 కిరణములు
అంతర్దశారంలో 10X2 =20 కిరణములు
బహిర్ధశారంలో 10X6 =60 కిరణములు
చతుర్దశారంలో. 14x4=56 కిరణములు
అష్టదళపద్మములో 8x8 =64 కిరణములు
షోడశదళపద్మములో 16 x7=112 కిరణములు
భూపురంలో. 10X3 =30 కిరణములు

                         మొత్తం 365 కిరణములు

ఇవే సంవత్సరానికి రోజులు. లలితా సహస్రంలోని శ్లోకాల సంఖ్య 182 1/2 అంటే 365 పాదాలు. ఇవే కాంతి కిరణాలుగా భావించాలి అని చెప్పారు. అయితే వృత్తము లేక బిందువులో 360 కిరణాలు లేదా డిగ్రీలు ఉంటాయి. అంతేకాని 365 కాదు. అందుచేత ఈ లెక్క సరిగా అగుపించటం లేదు. అయినప్పటికీ
వారి మతాన్ని కూడా ప్రతిపాదించాం. ఈ రకంగా కాంతిని ఇచ్చే వాటికి మూలాధారమైనది కాబట్టి తేజోవతీ అనబడుతుంది.

శ్రీమాత్రే నమః

ధర్మ ప్రచారం

వెంకటేశ్వర ప్రసాదు
*****************

కామెంట్‌లు లేవు: