🌻🌻
(వామన జయంతి ప్రత్యేకం)
(భాద్రపద బహుళ ద్వాదశి)
వామానావతారాన్ని పోతన
తన పద్యచిత్రణ ద్వారా
తెలుగు ప్రజల కళ్లముందు నిలబెట్టాడు.
ఒక్కొక్క పద్యం చదువుతూ వామనావతార ఘట్టాన్ని
స్మరించుకుంటే మీ కళ్లెదుటే విష్ణుమూర్తి ,
బలిచక్రవర్తి గర్వాన్ని అణిచిన దృశ్యం
కనిపించేలా వామనావతార ఘట్టానికి
ప్రాణం పోశాడు పోతన.
వామన జయంతి సందర్భంగా
పోతన పద్యాలు చదివి తరించండి.
తెలుగువాడిగా గర్వించండి.
***
శ్రవణ ద్వాదశి- (శ్రవణ నక్షత్రంతో కూడిన భాద్రపద బహుళ ద్వాదశిని శ్రవణద్వాదశి అంటారు)నాడు వామనావతారంలో విష్ణుమూర్తి అవతరించాడు.
వామనుడు శంఖ, చక్ర, గదా కమల కలిత, చతుర్భుజునిగా, మకరకుండల మండిత గండ భాగుడై,కపిల రంగు వస్త్రమూ, కదంబ వనమాల సమస్త అలంకారాలతో, నిఖిల జన మనోహరుడిగా, జగన్మోహనుడిగా అదితి గర్భం నుంచి అవతరించాడు.
వెంటనే,
తన దివ్యరూపాన్ని ఉపసంహరించుకొని, కపట వటుని వలె, ఉపనయన వయస్కుండై వామన బాలకుడయ్యాడు.
వామనుడికి వడుగు చేయడంకోసం కశ్యప ప్రజాపతిని ముందుంచుకొని మునీంద్రులు తగిన సకల ఉపనయన కార్యకలాపాలు జరిపించారు. వామనుడికి సూర్యుడు గాయత్రి మంత్రాన్ని బోధించాడు. బృహస్పతి జంధ్యాన్నీ; కశ్యపుడు ముంజ (దర్భల మొలత్రాడునూ); అదితి కౌపీనాన్నీ (గోచీని); భూదేవి నల్లని జింకచర్మాన్నీ; చంద్రుడు దండాన్నీ; ఆకాశం గొడుగునూ; బ్రహ్మ కమండలాన్ని; సరస్వతీదేవి జపమాలనూ; సప్తఋషులు పవిత్రమైన దర్భలనూ ఇచ్చారు.
**
భిక్షాపాత్రిక నిచ్చెను
యక్షేశుఁడు వామనునకు; నక్షయ మనుచున్
సాక్షాత్కరించి పెట్టెను
భిక్షునకు భవాని పూర్ణభిక్ష నరేంద్రా!
యక్షుల ప్రభువు అయిన కుబేరుడు వామనుడికి భిక్షాపాత్ర ఇచ్చాడు. జగన్మాత పార్వతీదేవి ప్రత్యక్షమై అక్షయం అంటూ ఆ బ్రహ్మచారికి పూర్ణభిక్ష పెట్టింది.
హోమ కార్యక్రమాలు పూర్తి చేసుకుని భిక్ష కోసం ,
గర్వంతో విర్రవీగుతున్న బలిచక్రవర్తి వద్దకు వెళ్లాడు వామనుడు.
***
హరిహరి; సిరి యురమునఁ గల
హరి హరిహయుకొఱకు దనుజు నడుగం జనియెన్;
బరహితరత మతియుతులగు
దొరలకు నడుగుటయు నొడలి తొడవగుఁ బుడమిన్
ఔరా! హృదయంపై లక్ష్మీదేవిని కలిగిన మహా సంపన్నుడు విష్ణుమూర్తి. అయినా, అతడు ఇంద్రుడి కోసం బలిని బిచ్చమడగడానికి ప్రయాణమై వెళ్ళాడు. ఇతరులకు మేలుచేసే ఉద్దేశంతో బిచ్చమెత్తడం కూడా గొప్పవారికి ఒక అలంకారమే కాబోలు ఈ భూలోకంలో.
***
మనుడు బలిచక్రవర్తి యజ్ఞవాటికను సమీపించాడు......
శంభుండో హరియో పయోజభవుఁడో చండాంశుఁడో వహ్నియో
దంభాకారత వచ్చెఁ గాక ధరణిన్ ధాత్రీసురుం డెవ్వడీ
శుంభద్యోతనుఁ డీ మనోజ్ఞ తనుఁ" డంచున్ విస్మయభ్రాంతులై
సంభాషించిరి బ్రహ్మచారిఁ గని తత్సభ్యుల్ రహస్యంబుగన్.
అలా వేంచేసిన వామనుని చూసి, సభలోనివారు “శివుడో, విష్ణువో, బ్రహ్మయో, సూర్యుడో, అగ్నియో ఇలా మారు వేషంతో వచ్చి ఉండవచ్చు. ప్రపంచంలో ఇంతటి కాంతి అందమూ ఉండే బ్రహ్మచారి ఎవరుంటారు.” అనుకుంటూ ఆశ్చర్యంతో చకితులై రహస్యంగా గుసగుసలాడుకుంటున్నారు.
***
వటుని పాద శౌచవారి శిరంబునఁ
బరమ భద్ర మనుచు బలి వహించె
నే జలము గిరీశుఁ డిందుజూటుఁడు దేవ
దేవుఁ డుద్వహించె ధృతి శిరమున.
జటాజూటంలో చంద్రుని ధరించిన మహాదేవుడైన శివుడు ఎల్లప్పుడూ ఏనీళ్ళను తలపై ధరిస్తాడో, అటువంటి వామనుని కాళ్లు కడిగిన నీళ్ళను బలిచక్రవర్తి మేలుకలిగించేవిగా తలచి తలపై చల్లుకున్నాడు.
***
ఆ తర్వాత బలి చక్రవర్తి , వామనుడిని అడుగుతున్నాడు....
వడుగా ఎవ్వరి వాడ వెవ్వడవు సంవాస స్థలం బెయ్యది
య్యెడకున్ నీవరుదెంచుటన్ సఫలమయ్యెన్ వంశమున్ జన్మమున్
కడు ధన్యాత్ముడ నైతి నీ మఖము యోగ్యం బయ్యె నా కోరికల్
కడ తేరెన్ సుహ్రుతంబులయ్యె సఖులున్ కళ్యాణ మిక్కాలమున్ !!
ఓ బ్రహ్మచారీ! నీపేరేమిటి? ఎవరి పిల్లవాడవు? నీవు నివసించే చోటేది? ఇక్కడికి నీవు రావడంవల్ల నావంశమూ నా జన్మ సఫలము అయ్యాయి. నేను చాలా పుణ్యాత్ముడను అయ్యాను. ఈ యజ్ఞం పవిత్రం అయింది. నా కోరికలు నెరవేరాయి. అగ్నులు బాగా వేల్వబడ్డాయి. ఈ సమయం చాలా శుభదాయకం అయింది. అన్నాడు బలి చక్రవర్తి.
****
నీకేం కావాలో కోరుకో..అంటున్నాడు బలి చక్రవర్తి వామనుడితో...
వరచేలంబులొ మాడలో ఫలములో వన్యంబులో గోవులో
హరులో రత్నములో రథంబులొ విమృష్టాన్నంబులో కన్యలో
కరులో కాంచనమో నికేతనములో గ్రామంబులో భూములో
ధరణీ ఖండమొ కాక యే మడిగెదో ధాత్రీసురేంద్రోత్తమా! "
ఓ బ్రాహ్మణోత్తముడా! నీకేం కావాలో కోరుకో. మేలైన వస్త్రములా, డబ్బులా, పండ్లా, అడవి సంపదలా, గోవులా, గుఱ్ఱములా, రత్నాలా, రథాలా, మంచి ఆహారాలా, కన్యలా, ఏనుగులా, బంగారమా, భవనాలా, గ్రామాలా, పొలాలా, భూభాగాలా లేకపోతే ఇవి కాకుండా ఇంకేమైనా కోరుకుంటున్నావా?” అని అడిగాడు.
****
ఒంటి వాడ నాకు నొకటి రెండడుగుల
మేర యిమ్ము సొమ్ము మేర యొల్ల
కోర్కె దీర బ్రహ్మ కూకటి ముట్టెద
దాన కుతుక సాంద్ర దానవేంద్ర !!
ఓ దానవరాజా! దానం చేయలనే చిక్కని కుతూహలం కలవాడా! బలిచక్రవర్తీ! నేను ఒంటరివాడిని. నాకు సొమ్ములూ భూములూ అక్కరలేదు. మూడడుగుల నేల మాత్రము ఇమ్ము. దానితో తృప్తిపడి బ్రహ్మానందం పొందుతాను.
***
అర్థించేవాడికి లేక పోయినా , దాత గొప్పతనాన్నిచూసి అయినా గొప్పగా అడగాలి కదా అంటున్నాడు బలి చక్రవర్తి...
ఉన్నమాటలెల్ల నొప్పును విప్రుండ!
సత్య గతులు వృద్ధ సమ్మతంబు;
లడుగఁ దలఁచి కొంచె మడిగితివో చెల్ల;
దాత పెంపు సొంపుఁ దలఁపవలదె. "
“ఓ బ్రాహ్మణుడా! నీ మాటలన్నీ ఉన్నమాటలే. వాటిని ఒప్పుకోవలసిందే. ముమ్మాటికీ సత్యములే. అందుకు పెద్దలు కూడా కాదనరు. కానీ పాపం అడక్క అడక్క అడిగి ఇంత కొంచెమే అడిగావు. చాలా బాగుంది. కానీ అడిగే టప్పుడు దాత గొప్ప దనాన్నీ అతని గొప్ప గుణాన్ని తలచాలి కదా
***
ఎలాంటి దానం అడగాలో వామనుడికి చెబుతున్నాడు బలి...
వసుధా ఖండము వేడితో గజములన్ వాంఛించితో వాజులన్
వెస నూహించితొ కోరితో యువతులన్ వీక్షించి కాంక్షించితో
పసి బాలుండవు నేరవీవడుగ నీ భాగ్యంబు లీపాటి గా
కసురేంద్రుండు పద త్రయం బడుగ నీ యల్పంబు నీ నేర్చునే ?
“భూభాగం కోరుకోవాలి లేదా ఏనుగులు కోరుకోవాలి లేదా గుఱ్ఱాలను కోరాలి లేదా అందగత్తెలను చూసి కాంక్షపుడితే జవరాండ్రను కోరుకోవాలి; కాని చిన్నపిల్లాడివి కదా అడగటం తెలియదు; నీ సిరి / సామర్థ్యం ఇంత అల్పమైందే. కనుకే మూడడుగులు మాత్రమే అడిగావు; ఐనా ఇంతటి రాక్షస చక్రవర్తిని ఇంత అల్పం ఎలా ఇస్తాను.” అని అంటున్నాడు బలిచక్రవర్తి మూడడుగుల మేర దానం అడిగిన వామనునితో.
****
గొడుగో జన్నిదమో కమండలువొ నాకున్ ముంజియో దండమో
వడుగే నెక్కడ? భూములెక్కడ ?కరుల్ వామాక్షు లశ్వంబు లె
క్కడ? నిత్యోచిత కర్మమెక్కడ ? మదాకాంక్షామితం బైన మూ
డడుగుల్ మేరయ త్రోవ కిచ్చుటది బ్రహ్మాండంబు నా పాలికిన్ !!
“అయ్యా! నేను బ్రహ్మచారిని. నాకు గొడుగు కాని, యజ్ఞోపవీతం కాని, కమండలం కాని, మొలతాడు కాని ఉపయోగిస్తాయి. అంతేకాని బ్రహ్మచారి నైన నా కెందుకు భూములు, ఏనుగులు, గుఱ్ఱాలు, స్త్రీలు. నా నిత్యకృత్యాలకి వాటితో పనిలేదు కదా. కాదని తోసేయకుండ నే కోరిన ఆ మూడు అడగుల చోటిస్తే అదే నాకు బ్రహ్మాండం..... అన్నాడు వామనమూర్తి.
***
ఆశాపాశము దాఁ గడున్ నిడుపు; లే దంతంబు రాజేంద్ర! వా
రాశిప్రావృత మేదినీవలయ సామ్రాజ్యంబు చేకూడియుం
గాసిం బొందిరిఁ గాక వైన్య గయ భూకాంతాదులున్నర్థకా
మాశం బాయఁగ నేర్చిరే మును నిజాశాంతంబులం జూచిరే.
రాక్షస మహారాజా! ఆశ మిక్కిలి పొడవైన త్రాడు వంటిది. దానికి అంతు అన్నది ఉండదు. పూర్వకాలంలో పృధుచక్రవర్తీ గయుడూ మొదలైన రాజులు సముద్రాల దాకా వ్యాపించిన సామ్రాజ్యాన్ని సంపాదించి పాలించారు. వారు సైతం వృథాగా కష్టపడినవారే కానీ అర్థంమీదా కామంమీదా ఆశలను వదలుకోలేదు. అంతటి వారు కూడా ఆశల అంతు చూడలేదు కదా. అని బలి చక్రవర్తితో వామనుడు అన్నాడు.
***
సంతుష్టుఁడీ మూఁడు జగములఁ బూజ్యుండు-
సంతోషి కెప్పుడుఁ జరుఁగు సుఖము
సంతోషిఁ గాకుంట సంసార హేతువు-
సంతసంబున ముక్తిసతియు దొరకుఁ
బూఁటపూఁటకు జగంబుల యదృచ్ఛాలాభ-
తుష్టిని దేజంబు తోన పెరుఁగుఁ
బరితోష హీనతఁ బ్రభ చెడిపోవును-
జలధార ననలంబు సమయునట్లు
**
నీవు రాజ వనుచు నిఖిలంబు నడుగుట
దగవు గాదు నాకుఁ; దగిన కొలఁది
యేను వేఁడికొనిన యీ పదత్రయమునుఁ
జాల దనక యిమ్ము; చాలుఁజాలు. "
తృప్తిపడేవాడు ముల్లోకాల్లోనూ గౌరవింపబడతాడు. తృప్తునికి ఎప్పుడూ సుఖం కలుగుతుంది. సంతోషం లేకపోవడమే తిరిగి పుట్టడానికి కారణం. సంతోషంవల్ల మోక్షం కూడా సమకూరుతుంది. పూటపూటకూ తనంతతానుగా దొరికినదానితో సంతోషపడుతుంటే తేజస్సు పెరుగుతుంది. నీళ్ళ వలన నిప్పు చల్లారినట్లుగా సంతోషం లేకపోతే తేజస్సు తగ్గిపోతుంది. నీవు రాజువు కదా అని అవి ఇవి అన్నీ అడగడం భావ్యం కాదు. నాకు తగినట్లుగా నేను అడిగిన మూడుఅడుగులూ కాదనకుండా ఇమ్ము. అంతే చాలు. అదే చాలు.”...అన్నాడు వామనుడు.
***
రాక్షసుల గురువు శుక్రాచార్యుడు ,వామనుడి తీరు గమనించి
వచ్చినవాడు విష్ణుమూర్తి అని గ్రహించి ,
దానం చేస్తానని ఇచ్చిన మాట వెనక్కి తీసుకోమని
బలిని హెచ్చరించాడు.
ఇచ్చిన మాట తప్పడం ఎలా అన్నాడు బలి.
దానికి శుక్రాచార్యులు.....బలికి ధైర్యం చెబుతున్నాడు.
వారిజాక్షులందు వైవాహికములందు
ప్రాణ విత్త మాన భంగమందు
చకిత గోకులాగ్ర జన్మ రక్షణమందు
బొంక వచ్చు నఘము వొంద దధిప !!
ఓ బలిచక్రవర్తి! ఆడువారి విషయంలో కాని; పెళ్ళిళ్ల సందర్భంలో కాని; ప్రాణానికి, ధనానికి, గౌరవానికి భంగం కలిగేటప్పుడు కాని; భీతిల్లిన గోవులను, విప్రులను కాపాడే టప్పుడు కాని అవసరమైతే అబద్ధం చెప్పవచ్చు. దాని వల్ల ఏ పాపం రాదు. ఇది రాజనీతి అన్నాడు.
*****
ఏవేవో కుంటిసాకులు చెప్పి మాటతప్పడం సరికాదని అంటూ బలి చక్రవర్తి , శుక్రాచార్యునితో అంటున్నాడు.....
కారే రాజులు రాజ్యముల్ గలుగవే గర్వోన్నతిన్ బొందిరే
వారేరీ సిరి మూట గట్టుకొని పోవంజాలిరే భూమిపై
పేరైనన్ గలదే శిబి ప్రముఖులున్ ప్రీతిన్ యశః కాయులై
ఈరే కోర్కులు వారలన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవా !!
శుక్రాచార్యా! పూర్వ కాలంలో కూడ ఎందరో రాజులు ఉన్నారు కదా. వారికి రాజ్యాలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంతో అహంకారంతో ఎంతో ఔన్నత్యాన్ని సాధించినవారే కదా. కాని వా రెవరు సంపదలు మూటగట్టుకొని పోలేదు కదా. కనీసం ప్రపంచంలో వారి పేరైనా మిగిలి లేదు కదా. శిబి చక్రవర్తివంటి వారు కీర్తికోసం సంతోషంగా అడిగినవారి కోరికలు తీర్చారు కదా. వారిని ఈ నాటికీ లోకం మరువలేదు కదా. అన్నాడు.
బలిచక్రవర్తి రాక్షసరాజైనా సత్యసంధుడు. సంపద శాశ్వతం కాదని ఎరిగిన జ్ఙాని; కనుకనే ఆచార్యుడు శుక్రుడు చెప్పిన రాజనీతిని కాదని అంటూ దానం చేయాల్సిందేనని తన నిర్ణయం చెప్పాడు.
***
సకల జగత్తుకూ మూలమైన
వామన మూర్తి యాచనా హస్తం కింద,
దాతగా తన హస్తం పై న ఉండడాన్ని
ఆలోచించుకుని ఉప్పొంగి పోయాడు బలి....
ఆదిన్ శ్రీసతి కొప్పు పై తనువు పై నంసోత్తరీయంబు పై
పాదాబ్జంబుల పై కపోల తటి పై పాలిండ్ల పై నూత్న మ
ర్యాదంజెందు కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మే
ల్గాదే రాజ్యము గీజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే !!
ఇతడు దానం కావాలని చాచినచేయి ఎంతో గొప్పది కదా! మొదట లక్ష్మీదేవి కొప్పు ముడి మీద, శరీరం మీద, పైట చెంగు మీద, పాదపద్మాల మీద, చెక్కిళ్ళ మీద, పాలిండ్ల మీద సరికొత్త మర్యాదలు పొందే దివ్యమైన హస్తం. అంతటి చెయ్యి కిందది కావటం దాతగా నాచెయ్యి పైది కావటం ఎంత అదృష్టం! ఎంత మేలు! దీని ముందు ఈ రాజ్యం ఏ పాటిది! ఇదేమైనా శాశ్వతంగా ఉండేదా! ఈ శరీరం ఏమైనా పడిపోకుండా ఉండిపోతుందా. అనుకున్నాడు బలిచక్రవర్తి..
***
అంతేకాదు.....వంశనిర్మూలనం అయినా సరే దానం చేయాల్సిందేనని
మాట తప్పనని శుక్రాచార్యుడితో బలి చక్రవర్తి అంటున్నాడు....
నిరయంబైన నిబద్ధమైన ధరణీ నిర్మూలనంబైన దు
ర్మరణంబైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో
హరుడైనన్ హరియైన నీరజ భవుండభ్యాగతుండైన నౌ
తిరుగన్నేరదు నాదు జిహ్వ వినుమా ధీవర్య వేయేటికిన్ !!
***
మిగతా విషయాలు అన్నీ అనవసరమయ్యా! నే బంధింప బడటం కాని, నాకు దుర్మరణం కలగటం కాని, నాకు నరకం దాపురించటం కాని, చివరకు నా కులమే నాశనం కావటం కాని, భూమండలం బద్ధలవటం కాని, నిజంగానే వస్తే రానివ్వు; జరిగితే జరగనివ్వు; ఏమైనా సరే నేను మాత్రం అసత్యమాడ లేను. దానం పట్టడానికి వచ్చిన వాడు సాక్షాత్తు ఆ పరమ శివుడే అయినా, ఆ విష్ణుమూర్తే అయినా, ఆ బ్రహ్మదేవుడే అయినా సరే నా నాలుకకి ఆడిన మాట తప్పటం రాదు. పరమ విజ్ఞాన స్వరూప శుక్రాచార్య! అన్నాడు.
****
వెంటనే పవిత్రజాలాల్ని అందుకుని.. బలిచక్రవర్తి దానం చేస్తున్నాడు..
విప్రాయప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయ వే
దప్రామాణ్య విదే త్రిపాద ధరణీం దాస్యామి యంచున్ క్రియా
క్షిప్రుండై దనుజేశ్వరుండు వటువున్ చేసాచి కొమ్మంచు బ్ర
హ్మప్రీతమ్మని ధార వోసె భువనంబాశ్చర్యమున్ వొందగాన్ !!
బలిచక్రవర్తి చేతులు సాచి వామనుడిని పూజించాడు. “బ్రాహ్మణుడవూ; ప్రసిద్ధమైన వ్రతం కలవాడవు; విష్ణు స్వరూపుడవూ; వేదాల నియమాలు తెలిసినవాడవూ; అయిన నీకు మూడడుగుల నేల దానం చేస్తున్నాను.” అని పలికి “పరమాత్మునకు ప్రీతి కలుగుగాక.” అంటూ వెనువెంటనే ధారపోసాడు. అదిచూసి విశ్వం అంతా ఆశ్చర్యపోయింది.
****
ఇంతింతై వటుడింతయై మరియు తానింతై నభో వీధి పై
నంతై తోయద మండలాగ్రమున కల్లంతై ప్రభా రాశి పై
నంతై చంద్రుని కంతయై ధ్రువుని పై నంతై మహర్వాటి పై
నంతై సత్య పదోన్నతుండగుచు బ్రహ్మాండాంత సంవర్ధి యై !!
బలిచక్రవర్తి మూడడుగుల మేర భూమి ధారపోయగానే గ్రహించిన వామనుడు చూస్తుండగానే
చిట్టి పొట్టి బ్రహ్మచారి, ఇంతై, అంతై, దానికంతంతై...అలా అలా.... ఎదగటం మొదలు పెట్టాడు; అంతట్లోనే అంత పొడుగు ఎదిగాడు; అలా ఆకాశం అంత ఎత్తు పెరిగాడు; అదిగో మేఘాలకన్నా పైకి పెరిగిపోసాగాడు; పాలపుంత, చంద్రమండలం అన్నీ దాటేసాడు; అదిగదిగో ధ్రువ నక్షత్రం..దాన్ని కూడా దాటేసాడు; మహర్లోకం మించిపోయాడు. సత్యలోకం కన్నా ఎత్తుకి ఇంకా ఎత్తుకి పెరిగిపోతూనే ఉన్నాడు. మొత్తం బ్రహ్మాండభాడం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు; ఆహా ఎంతలో ఎంత త్రివిక్రమరూపం దాల్చేసాడో శ్రీమన్నారాయణ మహా ప్రభువు.
****
రవి బింబంబుపమింప పాత్రమగు ఛత్రంబై శిరో రత్నమై
శ్రవణాలంకృతి యై గళా భరణామై సౌవర్ణ కేయూర మై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచత్ ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠ మై వటుడు తా బ్రహ్మాండమున్ నిండుచోన్ !!
వామనుడు బ్రహ్మాండ మంతా నిండిపోతుంటే, సత్యపదోన్నతుడైన విష్ణువునకు అప్పుడే ఉదయించిన సూర్యబింబము మొదట గొడుగులా, తదుపరి శిరోరత్నమై, చెవి కుండలమై, మెడలోని ఆభరణమై, బంగారు కేయూరమై, కంకణమై వడ్డాణపు ఘంటమై, నూపురప్రవరమై, చివరకు పాదపీఠమై ఒప్ప శ్రీ మహా విష్ణువు బ్రహ్మాండానికి ఎదిగాడు...
****
ఆతర్వాత....
ఒక పాదంబున భూమి గప్పి దివి వే ఱొంటన్ నిరోధించి యొం
డొకటన్ మీఁది జగంబు లెల్లఁ దొడి, నొండొంటిన్ విలంఘించి. ప
ట్టక బ్రహ్మాండకటాహముం బెటిలి వేండ్రంబై పరుల్ గానరా
కొకఁడై వాగ్దృగలభ్యుఁడై హరి విభుం డొప్పారె విశ్వాకృతిన్.
విశ్వరూపాన్ని ధరించిన త్రివిక్రముడు తన ఒక పాదముతో భూలోకాన్ని కప్పి, మొదటిఅడుగుగా స్వర్గలోకాన్ని దాటి రెండవ పాదముంచాడు. రెండవ అడుగుగా వేసిన పాదంతో పైలోకాలను అన్నింటినీ దాటిపోయాడు. ఆ మహారూపం పట్టకపోవడంవలన బ్రహ్మాండభాండం పైపెంకు పెటపెటలాడి బ్రద్దలైపోసాగింది. ఆయన తప్ప ఇంకెవరూ కనిపించకుండా పోయారు. ఆ విశ్వరూపుడు మాటలకు చూపులకు అందరానివాడై సంశోభించాడు
****
ఇస్తానన్న మూడు అడుగులలో రెండు అడుగులూ భూమి, ఆకాశం అయిపోయాయి. ఇక మిగిలిన మూడవ అడుగుకు ఏం చేస్తావన్నాడు విష్ణుమూర్తి, బలి చక్రవర్తిని..
దానికి బలి సమాధానమిస్తూ మాటతప్పేది లేదు నా తలపై పెట్టు అన్నాడు.
సూనృతంబుఁ గాని సుడియదు నా జిహ్వ
బొంకఁజాల; నాకు బొంకు లేదు;
నీ తృతీయపదము నిజము నా శిరమున
నెలవు సేసి పెట్టు నిర్మలాత్మ!
ఓ పుణ్యాత్ముడా! నా నాలుక సత్యాన్ని తప్ప పలుకనే పలుకదు. అబద్ధమన్నది చెప్పనే చెప్పలేను. నాలో అసత్య మన్నది లేదు. నీ మూడవ అడుగు శాశ్వతంగా నా తలమీద పెట్టు మహాత్మా
అంటూ శిరస్సుచూపించాడు...
****
బలిచక్రవర్తి భార్య వింధ్యావళి వామనుడి పాదాలపై బడి పతి భిక్ష పెట్టమని వేడుకుంటుంది.
బలి శరణువేడుకుంటాడు.. బలికి తాత అయిన ప్రహ్లాదుడు విచ్చేసి బలి తప్పులను క్షమించమని వేడుకుంటాడు. బ్రహ్మ కూడా వచ్చి బలిని కరుణించమని అంటాడు.
ఆ రకంగా బలిని సుతల లోకానికి పంపుతాడు విష్ణుమూర్తి..
పరమాత్మ కరుణ పొందిన బలి చక్రవర్తి
ఎన్నడు లోకపాలకుల నీ కృపఁ జూడని నీవు నేఁడు న
న్నున్నతుఁ జేసి నా బ్రతుకు నోజయు నానతి యిచ్చి కాచి తీ
మన్నన లీ దయారసము మాటలు పెద్దఱికంబుఁ జాలవే?
పన్నగతల్ప! నిన్నెఱిఁగి పట్టిన నాపద గల్గనేర్చునే?"
“ఓ శేషశాయిశయనా! శ్రీమహావిష్ణూ! నీవు దిక్పాలకుల మీద కూడా ఏనాడూ ఇంతటి దయచూపలేదు. ఈనాడు నన్ను గొప్పగా గౌరవించావు. నా జీవితానికి తేజస్సును ఇచ్చి కాపాడావు. ఈ మన్ననా, ఈ కరుణా, ఈ మాటలు, మర్యాదా నాకు చాలు. నిన్ను తెలుసుకొని ఆశ్రయించినవారికీ ఎన్నడూ కష్టాలు కలుగవు. అని బలి చక్రవర్తి విష్ణుమూర్తికి నమస్కరించి సుతల లోకానికి వెళ్లిపోయాడు బలి చక్రవర్తి....
***
వామనావతార ఘట్టాన్ని చదివిన,విన్నవారందరికీ సకల శుభాలు కలుగుతాయి.
***
🏵️ ‘పోతన పదం🏵️
🏵️ భక్తి రసం ,ముక్తి పథం🏵️
*******************
1 కామెంట్:
భక్త పోతన గారి శ్రీమథ్భాగవతం లోని వామనావతార ఘట్టాన్ని విపులంగా అద్భుతంగా వివరించినందుకు ధన్యవాదాలు. బులుసు సీతారామ మూర్తి, హైదరాబాదు
కామెంట్‌ను పోస్ట్ చేయండి