* *శ్లో:- జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ:౹*
*జిహ్వాగ్రే మిత్ర బాంధవా:*౹
*జిహ్వాగ్రే బంధన ప్రాప్తి:౹*
*జిహ్వాగ్రే మరణం ధృవమ్*౹౹
*****
*భా:- సమస్త మానవాళి విజ్ఞానానికి చక్కని కొలమానం నాలుక. ముప్పదిరెండు కత్తులవంటి దంతాలు, రెండుదవడల మధ్య నిరపాయ జీవనం దాని ప్రత్యేకత. మన మృదు మధుర భాషణమే ఎనలేని సిరిసంపదలు, భోగభాగ్యాలు సమకూరుస్తుంది.మన ప్రియమైన వాక్కులే స్నేహితుల్ని, చుట్టాలను హితం, సన్నిహితం చేస్తాయి. మన పరుష వాక్కులే రకరకాల చిక్కులలో, కష్టాలలో, సమస్యలలో పడవేస్తాయి. అంతెందుకు? మన కర్కశ వాక్కులే మరణానికి దారి తీయవచ్చును. హనుమ వాగ్విభవమే రామ సుగ్రీవ మైత్రికి కారకము. శిశుపాలుని వాక్పారుష్యమే అతని మరణానికి కారకము. కాలు జారితే తీసి కోవచ్చు. కాని నోరు జారితే తీసికోలేము. కాన "వాగ్భూషణం భూషణం " అని; "ముఖంబున సూనృతవాణి" అని; " వాణ్యేకా సమలంకరోతి పురుషమ్ " అని భర్తృహరి వివరించాడు. మన మూర్తిమత్వానికి, వ్యక్తిత్వ వికాసానికి, పారదర్శకానికి ప్రతీక మన "జిహ్వ" అని గుర్తించి వర్తించాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సూక్తి మరచిపోరాదు.*
*****
*సమర్పణ : పీసపాటి*
****************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి