29, ఆగస్టు 2020, శనివారం

Srimadhandhra Bhagavatham

-- 101 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu

రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు. ఎవరికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు. కలియుగంలో ఏ రకంగా ఆర్జించారన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించారన్నది ప్రధానం అవుతుంది. ఎవరికి ఐశ్వర్యం ఉన్నదో వారే  పండితులు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో  ఉంటారు. అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి. కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమం సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములకు వెళ్లి కాళ్ళు పెట్టాలి.  మహా పురుషుల మూర్తులను సేవించాలి.  అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు.  నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ఇంద్రియముల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల. అది  మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకోవాలి. దీనినుంచి దాటాలని  అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు వెళ్ళాలి. కలియుగంలో నామమును గట్టిగా పట్టుకోవడం నేర్చుకోవాలి. ఈశ్వర నామమును విడిచిపెట్టకూడదు. ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము, ఇంద్రియ నిగ్రహము, జపము, తపస్సు, మంత్రమును అనుష్ఠానము చేయుట, భగవన్మూర్తి ముందు కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలుపెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు. అందరూ వీటిని ప్రారంభించాలి. వీటిని చేస్తే క్రమంగా వారికి నేను ఇంద్రియములకు లొంగని స్థితిని ఇస్తాను. ఆశ్రమములన్నిటిలో నేను గృహస్థాశ్రమయి ఉన్నాను. గృహస్థాశ్రమంలో వేదము చెప్పిన ఇంద్రియ సుఖము ధర్మబద్ధమయినది. వేదము ఎలా చెప్పిందో అలా ఇంద్రియ సుఖమనుభవించవచ్చు.
 సుఖములా కనపడుతున్నది సుఖము కాదనే సత్యమును  తెలుసుకోగలగాలి. అలా తెలుసుకొన్ననాడు  ఇంద్రియములకు లౌల్యము ఉండదు. సుఖము సుఖము కాదని తెలుసుకోవడానికి ఆశ్రయనీయము గృహస్థాశ్రమము. గృహస్థాశ్రమములో ఉండి ఆ ఆశ్రమము యథార్థ ధర్మములను పాటిస్తూ ఇంద్రియములకు లొంగనివాడు ఎవడు ఉన్నాడో వాడు శమమును పొంది ఉన్నాడు. కంచుతోకాని, సీసంతో కాని, వెండితో కాని, బంగారంతో కాని నా మూర్తిని తీసి ఇంట పెట్టుకో. సాత్త్వికమయిన మూర్తిని తీసుకు వచ్చి  పెట్టి పువ్వులు వేయడం మొదలుపెడితే మొదట్లో నీవు నైవేద్యం పెట్టినది ఆ మూర్తి తింటున్నదని, నీవు వేసిన పువ్వులను అది పుచ్చుకుంటుందని అనుకుంటావు. అది క్రమంగా అహంకారమును ఆ మూర్తి తినెయ్యడం మొదలుపెడుతుంది. క్రమక్రమంగా నీవు ఆ మూర్తి ఆశీర్వచనం మీద ఆధారపడడం ప్రారంభిస్తావు. మనస్సు తొందరగా నిలబడడానికి విగ్రహారాధనం అనేది ఒక ఆలంబన. కొన్నాళ్ళకి ప్రతి జీవి గుండెలలోను పరమాత్మ ఉన్నాడనే సత్యమును గ్రహించగలుగుతావు.
 ఎక్కడ చూసినా నీకు నారాయణుడే కనిపిస్తాడు. పరమాత్మ అనేక రూపములతో దర్శనం అవుతాడు. జీవుడు అంతటా ఉన్న ఈశ్వరుని చూస్తూ ఉండగా ఒకనాడు వానిలో వున్న ప్రాణవాయువు ఉత్క్రమణమును పొందుతుంది. వాడు నన్నే చూస్తూ వెళ్ళిపోయాడు  వాడు నాయందే చేరిపోతున్నాడు.  ఉద్ధవా! నీవు ఈ పని ప్రారంభించు. కలియుగం వచ్చేస్తోంది. బదరికాశ్రమమునకు చేరిపో’ అన్నాడు. ఉద్ధవుడు బయలుదేరి బదరికాశ్రమమునకు వెళ్ళిపోయాడు.
ముందు బలరాముడు వెనుక పరమాత్మ నడిచి వెడుతున్నారు. బలరాముడు నడుస్తూ నడుస్తూ తన శరీరమును విడిచి పెట్టేసి తన చైతన్యమును అనంతునిలో కలిపివేశాడు. బలరాముడి శరీరం నేలమీద పడిపోయింది.  కృష్ణ పరమాత్మ ఒక పొదచాటుకు వెళ్లి నేలమీద పడుకొని మోకాలు మీద రెండవ కాలు పెట్టి పాదమును కొద్దిగా కదుపుతూ పడుకున్నారు. దూరంనుంచి బోయవాడు వేటకై వచ్చి అక్కడ పొదలలోకి చూశాడు. ఒక పొదలో జింక చెవి కదులుతున్నట్లుగా కనపడింది. ఆ జింక చెవిమీదికి బాణం వేస్తే  తలలోకి గుచ్చుకుంటుందనుకుని బాణమును కృష్ణ పరమాత్మ కాలిమీద ప్రయోగించాడు. ఈ ముసలపు ముక్క ఏ శ్రీపాదములు ఈ గోపాల బాలురను అలరించాయో, లోకమునంతటినీ పవిత్రం చేశాయో, ఏ పాద చిహ్నములను స్వామి ఈనేల మీద మోపాడో, ఏ మహానుభావుడు కురుక్షేత్రంలో అర్జునుడి రథం మీద కూర్చుని గీతోపదేశం చేశాడో, ఏ  పాదములను నమ్మి అర్జునుడు ధన్యుడు అయ్యాడో,  ఏ పాదమును పట్టుకుని కొన్ని కోట్లమంది మోక్షమును పొందారో, ఆర్తితో పిలిచినా వాళ్ళ దగ్గరకు పరుగెత్తుకుని వచ్చి ఏ శ్రీపాదములు దర్శనము ఇచ్చాయో అటువంటి పాదముల బొటనవ్రేలి దగ్గరికి ఆ బాణం వెళ్ళి గుచ్చుకుంది. కృష్ణ పరమాత్మ ‘హా’ అని అరిచారు. బోయవాడు అయ్యో మనుష్యుడిని కొట్టానని పరుగెత్తాడు. కృష్ణ పరమాత్మ పడుకుని ఉన్నారు. రక్తం ధారలా కారుతోంది. అయ్యో! ఎంత పొరపాటు చేశాను స్వామీ నా జన్మకు నిష్కృతి లేదు అని నేలమీద పడి ఏడ్చాడు. కృష్ణ పరమాత్మ ‘నాయనా నీవు నిమిత్తమాత్రుడవు. నా మరణమును ఎవరూ తప్పించలేరు. ఎంతటివాడయినా కూడా ఒకసారి ఈ శరీరంలోకి వచ్చిన తరువాత ఈ శరీరమును వదిలి పెట్టవలసిందే. నేను కూడా పెద్దల వాక్కును పాటించాను. అందుకని కాలికి బాణం తగిలితే ప్రాణం విడిచి పెడుతున్నాను’ అన్నారు.
దారుకుడు పరుగుపరుగున అక్కడికి వచ్చాడు. ఏమిటి స్వామీ ఈ పరిస్థితి? మీరిలా పడిపోవడమా? కృష్ణుడు శరీరం వదిలిపెట్టడమా! అని విలపించాడు.  కృష్ణుడు ‘నా అవతారం పరిసమాప్తి అయిపోతున్నది. ఈ గుర్రములు, రథములు అన్నీ అదృశ్యం అయిపోతాయి. ఇప్పుడు యాదవులు అందరూ కొద్ది క్షణములలో మరణించబోతున్నారు’ అని చెప్పారు.
యాదవుల అంతమొందుట
ఆడుకుంటున్న యాదవులు అకారణంగా రెండు పక్షములుగా విడిపోయి ‘యుద్ధం చేసుకోవడం మొదలుపెట్టి చిట్టచివర మిగిలిన వారు వాళ్ళు అరగదీసిన  ఇనప రోకలి లోంచి పుట్టిన తెట్టు కలిపినపుడు పుట్టిన రెళ్ళు దుబ్బులు కోసి తెచ్చి వాటితో కొట్టుకుని ప్రాణములు వదిలేశారు. యాదవ కులం నాశనం అయిపోయింది. బలరాముని భార్యలు, కృష్ణుని భార్యలు చితులలోనికి ప్రవేశించారు. మిగిలినవారు ఎవరో కొద్దిమంది ఉంటే  వారిని ఇంద్రప్రస్థం తీసుకు వెడదామని అర్జునుడు  గాండీవము పట్టుకుని వారిని తీసుకువెడుతున్నాడు. చిత్రం ఏమిటంటే కృష్ణ పరమాత్మ అవతారం చాలించగానే పదిమంది గోపబాలుర చేతిలో గాండీవము ఉన్న అర్జునుడు ఓడిపోయాడు. ఆ విషయమును వచ్చి ధర్మరాజుకి చెప్తాడు. ‘గాండీవం ఉన్నది, పాశుపతాస్త్రం ఉన్నది గెలిచాననుకున్నాను. ఆ కృష్ణ పరమాత్మ సారధ్యం వలన గెలిచానని అనుకోలేదు. ఆ మహానుభావుడు నా సఖుడు వెళ్ళిపోయాడు అన్నాడు.  ధర్మరాజు గారు ‘అటువంటి మహానుభావుడు వెళ్ళిపోయిన తరువాత మనం ఈ భూమండలం మీద ఉండవద్దు. రండి వెళ్ళిపోదాం అని పిచ్చివానిలా జుట్టు విరబోసుకుని ఆభరణములు అన్నీ తీసి పక్కన పెట్టేసి ఉత్తరాభిముఖుడై వెళ్ళిపోయాడు. మిగిలిన పాండవులు ద్రౌపది, కుంతి అంతా శరీరములు విడిచిపెట్టారు. కలియుగం ప్రవేశించింది.
ఫలశ్రుతి
కృష్ణ పరమాత్మ ఉద్ధవుడితో ఒకమాట చెప్పారు. ‘ఎవరు ఈ భాగవత కథ వింటున్నారో వాళ్ళందరూ కూడా చెవుల ద్వారా అమృతమును పానము చేసినట్లే. వాళ్ళందరూ నన్నే చేరుతారు. నేను అభయం ఇస్తున్నాను’ అన్నారు.
అటువంటి వారు కన్ను మూసినపుడు కన్ను తెరిచినపుడు కృష్ణ దర్శనమే అగుట కొరకు పోతనగారు మనకొక భిక్ష పెట్టారు. వ్యాసుడు సంస్కృతంలో చెప్పిన శ్లోకమును యథాతథంగా తెలుగులోకి అనువాదం చేశారు. అది భాగవతమునకు జీవనాడి. భాగవత పఠన ఫలితమును కోరుకున్న వారందరూ ఈ పద్యములను తప్పనిసరిగా పఠించాలి. మనుష్య జన్మకు ఇంతకన్నా ప్రయోజనం వేరొకటి ఉండదు. ఎవరు ఈ పద్యమును పఠిస్తారో వారు మాత్రమే భాగవతమును వినడం వలన కాని, చదవడం వలన కాని కలిగే శుభఫలితములు పొందగలరని ఫలశ్రుతి చెప్పబడింది.
నగుమొగమున్ సుమధ్యమును నల్లనిదేహము లచ్చి కాట ప
ట్టగు నురమున్ మహాభుజము లంచితకుండలకర్ణముల్ మదే
భ గతియు నీల వేణియు గృపారసదృష్టియు గల్గు వెన్ను డి
మ్ముగ బొడసూపు గాత గనుమూసిన యప్పుడు విచ్చినప్పుడున్.
‘ఈశ్వరా! నా కన్ను మూసినప్పుడు, నా కన్ను తెరిచినప్పుడు నువ్వు నాకు ఎలా కనపడాలో తెలుసా! నవ్వు ముఖముతో, సన్నని నడుముతో, నల్లని శరీరంతో, లక్ష్మీదేవికి స్థానమయిన వక్షస్థలముతో, మమ్మల్ని రక్షించగలిగిన భుజ స్కంధములతో, కుండలములు దాల్చిన కర్ణ యుగళితో ఏనుగు నడకవంటి నడకతో, నల్లని వెంట్రుకలతో, కృప వర్షించే కన్నులతో, నాయందు అనుగ్రహించి నా కోరిక తీర్చుగాక! నిద్రపోయినప్పుడు నీ అనుగ్రహమునే సమాధిలో నేను అనుభవించాలి. కళ్ళు తెరుచుకుని ఉదయం లేచిన దగ్గరనుంచి నీవే నాకు సారధియై నడిపించాలి. చిట్టచివర నా కన్నులు మూతపడిపోయినప్పుడు నీవే అనుగ్రహించి నాకు మోక్షమును ఇవ్వాలి. వేరొకసారి నాకు జన్మవద్దు. స్వామీ నన్ను యిలా అనుగ్రహించు’ అని గొప్ప పద్యమును మనకు పోతనగారు భిక్షపెట్టి పూర్తిచేస్తూ అంటారు
ఈ కథ విన్నను వ్రాసిన, బ్రాకటముగ లక్ష్మి యశము భాగ్యము గలుగుం
జేకొని యాయువు ఘనుడై, లోకములోనుండునరుడు లోకులు వొగడన్.
‘ఎవరయితే భాగవతంలోని ఈ ఆఖ్యానమును వింటున్నారో ఇది విన్న వాళ్ళకు, ఇది వ్రాసిన వాళ్ళందరికీ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సిరిసంపదలు కలుగుతాయి. ఆయుర్దాయం కలుగుతుంది. ఏమయినా ప్రమాదములు ఉంటే తప్పిపోతాయి. వాళ్ళు బ్రతికిన బ్రతుకు ఎలా ఉంటుందంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ ఆయనతో కలిసి ఉండాలని, ఆయనను చూడాలని, ఆయన వద్ద వినాలని కోరుకునేటట్లుగా జన్మ సార్థకత పొంది నడుస్తుంది. అటువంటి కీర్తిని కృష్ణ పరమాత్మ కటాక్షిస్తారు’ అని ఈ ఆఖ్యానమునకు ఫలశ్రుతి చెప్పబడింది.

భాగవత ప్రవచన పాఠం నేటితో సమాప్తం
*****************

కామెంట్‌లు లేవు: