29, నవంబర్ 2020, ఆదివారం

అరుణగిరిపై కార్తిక దీపం🔥🙏

 ఈ రోజు సరిగ్గా సాయంత్రం 6 pm కు అరుణగిరిపై కార్తిక దీపం🔥🙏


🔥🪔🔥🪔🔥🪔🔥


🔥 కార్తిక పౌర్ణమి🔥


‘అ-రుణాచలం’ అనే పదానికి ఐహిక బంధాలను తొలగించే పర్వతం అని కూడా అర్థం చెబుతారు. సాక్షాత్తూ పరమేశ్వర స్వరూపమైన ఈ గిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే జీవితం పరిపూర్ణమవుతుందని రమణ మహర్షి పేర్కొన్నారు.

 

పంచభూత మహాలింగాల్లో మూడవది అరుణాచలేశ్వర లింగం. బ్రహ్మ, మురారుల తగవు తీర్చడం కోసం వారిద్దరి మధ్యా అగ్ని లింగంగా మహాశివుడు ఆవిర్భవించాడు. కోటానుకోట్ల సూర్యప్రకాశాన్ని మించిన ఆ కాంతిని చూడలేక బ్రహ్మ విష్ణువులతో పాటు దేవతలందరూ ప్రార్థించగా, శిలారూపంలో శివుడు సాక్షాత్కరించాడు. అదే ‘అరుణాచలం’. తమిళులు ‘అణ్ణామలై’ అంటారు.

 

‘అణ్ణాల్‌’ అనే తమిళ పదానికి ‘అగ్ని’ లేదా ‘కాంతి’ అని అర్థం. అగ్నిరూపంలో వెలసిన పర్వతం కనుక ‘అణ్ణామలై’ అనే పేరు ప్రసిద్ధి పొందింది. పర్వత పరిమాణంలో ఉన్న అంత పెద్ద లింగాన్ని ఆరాధించడం సాధ్యం కాదు కనుక... చిన్న లింగంగా సాక్షాత్కరించాల్సిందిగా దేవతలు ప్రార్థించారు. ఆ మేరకు అరుణాచల సానువులో చిన్న లింగంగా శివుడు రూపాంతరం చెందాడు. కృతయుగంలో అగ్నిలింగంగా ఉన్న శివుడు త్రేతా యుగంలో రత్న (పర్వత) లింగంగా, ద్వాపర యుగంలో తామ్ర (పర్వత) లింగంగా, కలియుగంలో శిలా పర్వతంగా మారాడని అంటారు. అరుణాచలాన్ని శోణ పర్వతంగా గౌతమ, అగస్త్య మునులు వర్ణించారు. ‘అరుణం’ అంటే ఎరుపు వర్ణం. ‘శోణము’ అన్నా కూడా అదే అర్థం! ఒక పర్వతమే మహాశివలింగం కావడం విశేషం.

 

అడుగడుగునా విశిష్టతలు

ఆ పర్వత పాదాల దగ్గర అరుణాచలేశ్వర ఆలయం ఉంది. ఇరవై అయిదు ఎకరాల్లో నిర్మితమైన ఈ క్షేత్రం ఎంతో పురాతనమైనది. దీనికి అడుగడుగునా విశిష్టతలు కనిపిస్తాయి. నాలుగు దిక్కుల్లో ఎత్తైన గోపురాలు ఉన్నాయి. తూర్పు గోపురం 217 అడుగుల ఎత్తులో, పదకొండు అంతస్థుల్లో ఎంతో దూరం నుంచి కనిపిస్తుంది. మిగిలిన గోపురాలు కూడా సుమారు అంతే ఎత్తులో ఉంటాయి. ఇక్కడ శివుని దేవేరి అపిత కుచలాంబాదేవి. స్వామికి ఎడమవైపున ఆమె కొలువై ఉంటుంది. గజానన, షడాననులకు విడివిడిగా ఆలయాలున్నాయి.

 

ఆరు ప్రాకారాలతో, ఎన్నో ఉపాలయాలతో, విశాలమైన ప్రాంగణంతో అలరాలే ఈ ఆలయానికి నిత్యం దేశమంతటి నుంచీ భక్తులు వస్తూ ఉంటారు. వెయ్యి స్తంభాల మండపానికి సమీపంలో శివగంగ తీర్థం ఉంది. అక్కడే రమణ మహర్షి తన ఐహిక బంధాల నుంచి విముక్తి పొందారు. పదహారేళ్ళ వయసులోనే మౌనమునిగా ప్రసిద్ధి పొందారు. అరుణాచలం 48 కోణాల్లో శ్రీచక్రాకారంలో ఉంటుంది. దాదాపు 800 మీటర్ల ఎత్తైన గిరి చుట్టూ 14 కిలోమీటర్ల నడక మార్గం ఉంది. ఎనిమిది దిక్కుల్లోనూ దిక్పాలకుల లింగాలు ఉన్నాయి. ఈ శోణగిరిని ‘మహామేరువు’ అని ఆదిశంకరాచార్యులు అభివర్ణించారు. అరుణగిరి చుట్టూ నిత్యం వేలాది భక్తులు ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. పున్నమి రోజుల్లో, ముఖ్యంగా కార్తిక పౌర్ణమి రోజున ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది.

 

మహాసాలగ్రామం

అరుణచలం శివస్వరూపంగా విఖ్యాతి పొందినా శ్రీచక్రమే పర్వత రూపంగా వెలసిందని వైష్ణవ ఆగమశాస్త్రాలు చెబుతున్నాయి. దీన్ని ‘మహాసాలగ్రామం’గా భగవద్రామానుజులు పేర్కొన్నారు. అగ్ని క్షేత్రమైన అరుణాచల జ్యోతిర్లింగం గురించి ‘స్కాంద పురాణం’ విస్తృతంగా వర్ణించింది. అందులో ‘అరుణాచలేశ్వర మహాత్మ్యం’ అని ప్రత్యేక అధ్యాయం ఉంది. అద్భుత శిల్పకళతో అలరారే ఈ ఆలయాన్ని విశ్వకర్మ నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. కాగా తొమ్మిది-పది శతాబ్దాల మధ్య చోళ రాజులు నిర్మించినట్టు శాసనాలున్నాయి. అనంతరం పల్లవులు, విజయనగర సార్వభౌములు ఎంతగానో అభివృద్ధి పరిచారు. దక్షిణ భారతంలో ఉన్న పెద్ద శైవాలయాల్లో ప్రసిద్ధి పొందిన క్షేత్రం ఇది.

 

దీప ప్రజ్వలనం- గిరి ప్రదక్షిణం

అరుణాచలేశ్వరునికి నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, వార్షిక ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. శివుడి ఆజ్ఞ మేరకు గౌతమ మహర్షి వీటికి రూపకల్పన చేశాడని పురాణ కథనం. వీటితో పాటు కార్తిక మాసంలో ‘కార్తిక దీపోత్సవం’ పేరుతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అగ్ని నక్షత్రమైన కృత్తిక, పున్నమి కలిసిన మాసాన్ని ‘కార్తిక మాసం’ అంటారు. పౌర్ణమికి ముందురోజు అరుణాచలేశ్వరుడి సన్నిధిలో భరణి దీపం వెలిగిస్తారు. పౌర్ణమి నాటి ప్రదోష సమయంలో, వృషభారూఢుడైన అరుణాచలేశ్వరుణ్ణి అపిత కుచలాంబాదేవి, గణపతి, షణ్ముఖులతో ఊరేగింపు జరిపి, గిరిపై ఏర్పాటు చేసిన కార్తిక మహా దీపాన్ని ప్రజ్వలింపజేస్తారు. తమిళులు దీన్ని ‘కార్తిగై దీపం’గా వ్యవహరిస్తారు. ఈ మహాదీపోత్సవంలో మూడున్నర టన్నుల ఆవు నెయ్యి వినియోగిస్తారు. అద్భుతమైన ఈ దీపకాంతి కొన్ని కిలోమీటర్ల వరకూ కనిపిస్తుంది. అది పున్నమి చంద్రుడి కాంతిని మించిపోతుంది. ఈ దీపం పదిరోజుల వరకూ వెలుగుతూనే ఉంటుంది.

 

దీపోత్సవాన్ని దర్శించడానికీ, గిరి ప్రదక్షిణకూ లక్షలాది భక్తులు విచ్చేస్తారు. ‘అరుణాచల శివా’ అంటూ భక్తులు చేసే నినాదాలతో అంబరం 

ప్రతిధ్వనిస్తుంది.


🙏అరుణాచల శివ🙏

కామెంట్‌లు లేవు: