🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
*ధార్మికగీత - 95*
*****
*శ్లో:- అగ్నిహోత్రం, గృహక్షేత్రే ౹*
*గర్భిణీమ్ వృధ్ధబాలకౌ ౹*
*రిక్త హస్తేన నో పేయాత్ ౹*
*రాజానం దైవతం గురుమ్ ౹౹*
*****
*భా:- లోకంలో మనం ఉత్త చేతులతో పోకూడని, పోరాని సందర్భాలు,సన్నివేశాలు ఎనిమిది తారసపడు తుంటాయి. అవి.1. "అగ్ని హోత్రము":- మన పరి సర ప్రాంతాలలో లోకకళ్యాణార్థం జరిగే యజ్ఞ,యాగాల సందర్శన కోసం వెళ్ళేటప్పుడు హోమ ద్రవ్యాలను భక్తితో అర్పించాలి. యాగఫలం మనకు శుభాల నిస్తుంది. 2."గృహక్షేత్రము":- బంధువుల ఇంటికి వెళ్ళే టప్పుడు పండ్లో,మిఠాయిలో తీసికొని వెళ్లడం మర్యాద సూచకము. 3."గర్భిణీ":- గర్భవతియైన స్త్రీ యోగక్షేమాల పరామర్శకై వెళ్ళేటప్పుడు ఫలమో, ఫలా హారామో ఆత్మీయంగా ఇచ్చి' శుభా కాంక్షలు అందజేయాలి.4."వృద్ధులు":- వయోవృద్ధులను చూడడానికి వెళ్ళినపుడు, ప్రేమాదరా భిమానాలతో మాట్లాడి' వారు తినగలిగినవి ఇవ్వాలి. 5."బాలలు":- కల్లా కపటం తెలియని దైవస్వరూపు లైన బాలల వద్దకు వెళ్ళే టప్పుడు తప్పనిసరిగా ఫలాలు, మిఠాయిలు ప్రేమతో ఇవ్వాలి. వారి ఆనందానికి మేర ఉండదు. 6."రాజు":- ప్రజల్ని కన్నబిడ్డలుగా, కంటికి రెప్పలా కాపాడే ప్రభువు దగ్గరికి వెళ్ళేటప్పుడు కృతజ్ఞతగా పండ్లు అర్పించాలి. 7. "దేవుడు" :-దేవుని గుడికి వెళ్ళి నప్పుడు టెంకాయ, పండ్లు, పూలు భక్తిగా సమర్పించాలి. 8."గురువు":- జ్ఞానబోధచే జీవాత్మ,పరమాత్మ తత్త్వాన్ని తెలిపి, జీవిత నౌకకు చుక్కాని వంటి గురువు సన్నిధికి వెళ్ళేటప్పుడు సముచిత ద్రవ్యాలను వినమ్రంగా అర్పణ చేయాలి. వీరందరి హార్దిక శుభా శీస్సులు, శుభ కామనలు, శుభా కాంక్షలు మనకు శుభ ప్రదములు , మంగళ ప్రదములై సుఖ జీవనయానానికి రాచ బాట వేయగలుగుతాయి. మన శ్శాంతి నిచ్చి, ఆధ్యాత్మిక పురోగమనానికి దోహదం చేస్తాయని సారాంశము*.
*****
*సమర్పణ : పీసపాటి*
🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲
.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి