29, నవంబర్ 2020, ఆదివారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*సీతమ్మ భక్తి..*


"ఇక మళ్లీ వస్తానో..లేనో..ఈ జన్మకు ఇదే ఆఖరి చూపు అవుతుందేమో..బొత్తిగా శరీరం సహకరించడం లేదు..ఆరోగ్యమూ అంతంత మాత్రం గానే ఉంది..వయసూ మీదబడింది..లేని ఓపిక తెచ్చుకొని..వచ్చాను నాయనా..ఒక్కసారి సమాధి దర్శనం చేసుకొని వస్తాను.." ఎనభై అయిదేళ్ల సీతమ్మ గారు ఈమధ్య మందిరానికి వచ్చినప్పుడు అన్నారు..సరే అన్నాను..మెల్లిగా నడుస్తూ..కొడుకు సహాయంతో శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..సమాధికి తల ఆనించి ప్రార్ధించుకొని..నమస్కారం చేసుకొని..ఇవతలికి వచ్చారు..ఆ క్షణం లో ఆవిడ కళ్ళల్లో ఎనలేని తృప్తి కనిపించింది..


సీతమ్మ గారిది నెల్లూరు..శ్రీ స్వామివారిని మాలకొండలో తపోసాధన చేసుకునే రోజుల్లో చూసారు..అప్పటికి ఆవిడ వయసు దగ్గర దగ్గర నలభై ఏళ్లు..సీతమ్మ గారు, ఆవిడ భర్త రాజేశ్వరరావు గారు మాలకొండ లోని శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారి దర్శనానికి వచ్చారు..అక్కడ దర్శనం చేసుకున్న తరువాత, శివాలయం, పార్వతీదేవి మఠం చూద్దామని వచ్చారు..శివాలయం లోకి ఆ దంపతులు అడుగుబెట్టే సమయానికి అక్కడ శివలింగం ప్రక్కన శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని కూర్చుని వున్నారు..శ్రీ స్వామివారిని చూసిన మరుక్షణమే ఈ దంపతులకు భక్తి భావం ఏర్పడింది..అప్రయత్నంగా చేతులెత్తి నమస్కారం చేశారు..శ్రీ స్వామివారు కుడిచేతితో ఆశీర్వచనం చేసి..వీళ్ళిద్దరిని కూర్చోమన్నట్లు సైగ చేశారు..ఇద్దరూ శ్రీ స్వామివారికి అభిముఖంగా కొద్దిదూరంలో కూర్చున్నారు..


"ఏ ఊరు నుంచి వస్తున్నారు?.." అని శ్రీ స్వామివారు అడిగారు.."నెల్లూరు నుంచి స్వామీ.." అన్నారు..సంతానం గురించి అడిగారు..తమకు ఇద్దరు పిల్లలనీ మొదట అమ్మాయి పుట్టిందని..తరువాత కుమారుడు కలిగాడనీ.. ఇద్దరినీ వాళ్ళ అమ్మమ్మ వద్ద వదిలిపెట్టి ఈరోజు తాము మాలకొండకు వచ్చామని చెప్పారు..కొద్దిసేపు మౌనంగా ఉన్న తరువాత..మరొక్కసారి ఆ దంపతులను ఆశీర్వదించి..వెళ్ళిరమ్మని చెప్పి పంపించివేసారు శ్రీ స్వామివారు..అక్కడనుంచి తిరిగి నెల్లూరు వచ్చేదాకా ఆ దంపతులకు శ్రీ స్వామివారే పదే పదే గుర్తురాసాగారు..


ఆ తరువాత మరో మూడు నెలలకు మళ్లీ పిల్లలతో సహా మాలకొండకు వచ్చారు సీతమ్మ గారు..ఆరోజు శ్రీ స్వామివారి దర్శనానికి చాలా సేపు ఎదురు చూడాల్సి వచ్చింది..సాయంత్రానికి శ్రీ స్వామివారు పార్వతీదేవి మఠం లో కలిసారు.. నమస్కారం చేసుకొని వచ్చారు..అలా రెండు మూడు సార్లు శ్రీ స్వామివారిని కలవడం కోసమే మాలకొండకు ఆ దంపతులు వచ్చారు..చిత్రంగా వారు మాలకొండకు వచ్చిన ప్రతిసారీ శ్రీ స్వామివారు దర్శనం ఇచ్చేవారు..


శ్రీ స్వామివారు మొగలిచెర్ల సమీపాన ఫకీరు మాన్యం లో ఆశ్రమం నిర్మించుకొని నివాసం ఏర్పరచుకొని..తన తపోసాధన చేసుకునే రోజుల్లో సీతమ్మ గారు భర్త తో కలిసి శ్రీ స్వామివారిని దర్శించుకున్నారు..శ్రీ స్వామివారు కపాలమోక్షం ద్వారా సిద్ధిపొందిన తరువాత.. సీతమ్మ గారు అప్పుడప్పుడూ వచ్చి శ్రీ స్వామివారి సమాధి ని దర్శించుకునేవారు..


"మా అమ్మాయి వివాహం కావడం చాలా ఆలస్యం జరిగింది..స్వామివారి సమాధి వద్దకు వచ్చి గట్టిగా ప్రార్ధించాను.. నువ్వు నమ్ము నమ్మకపో నాయనా..సరిగ్గా రెండు వారాల్లో సంబంధం కుదిరింది..నెలలోపే పెళ్లి జరిగిపోయింది..అంతా కల లాగా జరిపించేశాడు మాహానుభావుడు..అట్లాగే దానికి సంతానం కలుగకపోతే..మా అమ్మాయిని అల్లుడిని తీసుకొచ్చి ఐదు వారాల పాటు ప్రతి శనివారం ఇక్కడ నిద్ర చేయించాను..సంవత్సరానికల్లా దానికి కొడుకు పుట్టాడు..ఒకటా..రెండా..ఎన్నని చెప్పను?..అడుగడుగునా మా ముందే వుండేవాడు ఈ స్వామి.."అంటూ కన్నీళ్లతో చెప్పారు సీతమ్మ గారు..రెండేళ్ల క్రిందట సీతమ్మ గారి భర్త రాజేశ్వర రావు గారు మరణించారు..ప్రస్తుతం కుమారుడి దగ్గర చెన్నై లో వుంటున్నారు..


"ఇప్పటికీ మాకు ఏదైనా కష్టం కలిగితే..స్వామివారి పటం ముందు నమస్కారం చేసుకొని..విభూతి ని నుదుటన పెట్టుకుంటాను..చేత్తో తెసేసినట్లుగా ఆ కష్టం తీరిపోతుంది..నువ్వేమీ పెద్దగా పూజలు..ఆర్భాటాలు చేయాల్సినపనిలేదు నాయనా..మనసులో పూర్తి భక్తి విశ్వాసాలతో ఆ స్వామిని కొలువు చాలు..అన్నీ ఆయనే చూసుకుంటాడు!!" అంటుంటారు సీతమ్మ గారు..


ఆ నిష్కళంక భక్తురాలి మాటలు నిజమే కదా!!..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: