శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహాత్మ్యము
భగవానుడు యారీతిగ
యగుపించియు స్వప్నమందు యానతి నీయన్
సగమగు రేయిని భూపతి
ఖగవాహను దలచుకొనుచు క్షణమున లేచెన్ 113
ఉదయ మైనంత వెంటనె నుర్విరేడు
సభను గావించి తెల్పెను స్వప్న విధము
సభికు లత్యంత విస్మయ సంభ్రమమున
సాధు సాధంచు బల్కిరి సంతసమున 114
వసుధేసు డంతట వర్తకు లిర్వుర
బంధముక్తుల జేయ భటుల బంపె
సభలోని కొచ్చిన సాధువు యల్లుడు
భయముతో నుండిరి ప్రభును గాంచి
అంత నభయమిచ్చి యా వర్తకులతోడ
యాప్యాయతంబుగా ననియెనిట్లు
“వణిజప్రముఖులార ! వగచగా వలదింక
కారణంబులు లేక కలుగవేవి
దైవ ప్రాతికూల్య తరుణంబు నందునే
సకల యిడుము లెల్ల సంభవించు
పరమ దైవ కరుణ ప్రసరించి నంతట
సకల యిడుములెల్ల సమసిపోవు 115
జరిగిన దానికి వగచక
పరమాత్ముని నమ్ముకొనియు పావన మదితోన్
సరగున వెళ్ళుడు నెలవుకు
సిరితోడను యింక మీరు చింతలు లేకన్ " 116
అంతట భూపతి యా వర్తకులకును
ధైర్యంబు జెప్పియు దయను జూపె
క్షురకర్మ చేయించి కొత్త దుస్తులు బెట్టి
భూషణంబుల నిచ్చె భూరిగాను
రాజాన్నమును బెట్టి రాగంబు జూపించి
దయతోడ రెట్టింపు ధనము నిచ్చె
మర్యాద చేసియు మన్నన జూపించి
మంచి మాటలు జెప్పె మధురముగను
పిదప వారల తోడను ప్రియము గాను
"మదిలొ యెటువంటి దిగులులు మసలనీక
సొంత గృహమున కెళ్ళుడు సంతసమున "
యనుచు పలికెను కూర్మితొ యనుమతిచ్చి 117
అంత వర్తకు లిర్వురు సంతసిల్లి
వందనంబులు యర్పించి వసుధపతికి
ధరణినాథుండు యిచ్చిన ధనముపొంది
వెడలి రటనుండి నెలవుకు వేడ్కతోడ 118
మూడవ అధ్యాయము
సమాప్తము
సశేషము…
✍️గోపాలుని మధుసూదన రావు🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి