29, నవంబర్ 2020, ఆదివారం

శివానందలహారీ

 🙏శివానందలహారీ🙏



నిఖిలేశ్వరా ! నీదు నిడుపు కేశంబులు

             యాకాశమునకుండ యనిరి " శిఖి " గ

భుజగేంద్రు వాసుకిన్ భూషణంబుగ దాల్చి

             యరయ " కలాపి " గ నైతి వీవు

నతులగు భక్తుల ననయంబు బ్రోచెడి

             ప్రణవంబుతో " కేకి " వైతివీవు.

నగమందు బుట్టిన ఘనకాంతులను గాంచి

             నృత్యంబు చేయును నెమలి యెపుడు

నగజాత పార్వతి ఘనశ్యామ కాంతికి

              పులకించి నృత్యంబు పొందె దీవు.

నెమలి యుద్యానవనమున నృత్యమొందు

నీవు నిగమోపవనమున నిలచి యాడ

" నీల కంఠుని " శబ్దంబు నిక్కమయ్యె

నిన్నె పూజింతు నిరతంబు నీలకంఠ !       53



సరస సంధ్యారంభ సద్వర్ష వేళలో

              ప్రకృతి ప్రశాంతతిన్ పరిఢవిల్ల

శ్రీహరి కరవాద్య సృజనమౌ స్వనములు

              ఘనసంఘ గర్జన కరణి కాగ

నంబరంబందున్న యమరుల దృక్కులే

             విరిసి వెల్లువైన మెఱుపులుగను

భక్తుల పరితోష భాష్పకణంబులే

             వారిద సంభూత వర్షముగను

పార్వతీదేవియే భాసిల్లు చుండెడి

              యాడునెమలి భంగి యలరు చుండ

యే యుమామహేశ్వరునందు విభవముగను

దివ్య తాండవ నృత్యంబు తేజరిల్లు

నట్టి శ్రీనీలకంఠుని యమిత భక్తి

పావనంబగు మదితోడ భజన సేతు          54



✍️గోపాలుని మధుసూదన రావు 🙏

కామెంట్‌లు లేవు: