15, డిసెంబర్ 2020, మంగళవారం

ఎంఆర్‌ఎన్‌ఏపై పరిశోధనకు

 ఎంఆర్‌ఎన్‌ఏపై పరిశోధనకు డిమోషన్‌ బహుమతి..!


పాతికేళ్ల కిందట శాస్త్రవేత్త కాటలిన్‌ అనుభవం


ఆమెను డిమోట్ చేసిన పెన్సిల్వేనియా వర్సిటీ


ఇప్పుడు అదే పరిశోధనతో కరోనాకు వ్యాక్సిన్‌


తొలి టీకా ఫైజర్‌ వెనక ఆమె కృషి అనిర్వచనీయం


సాహిన్‌, టురేసి, బౌర్లా సహకారంతో టీకా తయారీ


ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాపై పోరాటానికి బ్రిటన్‌ ఎంచుకున్న అస్త్రం.. ఫైజర్‌ టీకా. అమెరికా కూడా దానినే పంపిణీ చేయడానికి సర్వం సిద్ధం చేసుకుంది. మరి అందులో అంత గొప్పదనం ఏముంది? అంటే.. అది ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీని ఉపయోగించి అభివృద్ధి చేసిన టీకా. కరోనాపై పోరులో ఇంతగా ఉపయోగపడుతున్న ఈ టెక్నాలజీని ఒకప్పుడు తిరస్కరించారని తెలుసా? ఈ టెక్నాలజీపై పరిశోధనలు చేసిన మహిళా శాస్త్రవేత్తకు ప్రమోషన్‌కు బదులు డిమోషన్‌ ఇచ్చారు తెలుసా? ఆ కథాకమామిషు ఏంటి? ఎంఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞానంతో టీకా తయారు చేయడంలో కీలకపాత్ర పోషించినవారెవరు? ఈ అంశాలన్నింటితో ప్రత్యేక కథనం..


ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్‌.. మందేలేని మహమ్మారిగా విజృంభిస్తున్న సమయంలో.. శాస్త్రవేత్తలను ఆలోచింపజేసింది మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ(ఎంఆర్‌ఎన్‌ఏ) టెక్నాలజీ. ఇప్పుడు ప్రపంచంలోనే మొట్టమొదటి టీకాను తయారు చేయడానికి ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంయుక్తంగా ఇదే టెక్నాలజీని వాడాయి. ఈ పరిజ్ఞానం వెనక ఓ మహిళా శాస్త్రవేత్తకష్టం దాగి ఉంది. అసలు అది పనికిమాలిన ప్రయోగమంటూ ఛీత్కారాలు, విమర్శలు ఉన్నాయి. ఆమె పరిశోధనకు స్పాన్సర్లు దొరక్కపోగా.. పనిచేస్తున్న వర్సిటీ డిమోషన్‌ను బహుమతిగా ఇచ్చింది. కాటలిన్‌ కరీకో అనే శాస్త్రవేత్త ఎదుర్కొన్న చేదు అనుభవం అది. అయినా.. ఆమె తన ప్రయోగాలను పూర్తిచేసింది.


సరిగ్గా పాతికేళ్ల తర్వాత వాటి ఫలాలు కరోనా వ్యాక్సిన్‌ తయారీలో ఉపయోగపడ్డాయి. హంగేరీకి చెందిన కాటలిన్‌.. 1985లో తన కారును అమ్మేసి.. 1200 అమెరికా డాలర్లతో భర్త, రెండేళ్ల కూతురితో కలిసి అమెరికాకు చేరుకున్నారు. పెన్సిల్వేనియా వర్సిటీలో అధ్యాపకురాలిగా చేరి ప్రొఫెసర్‌ స్థాయికి ఎదిగారు. 1995లో 40వ పడిలో ఉన్న కాటలిన్‌.. భవిష్యత్‌లో రానున్న కొంగొత్త వైర్‌సలను ఎదుర్కొనేలా ఎంఆర్‌ఎన్‌ఏపై పరిశోధనలు సాగించారు. ఎంతో ముందు చూపుతో ఆమె ప్రారంభించిన ప్రయోగాలు, పరిశోధనలకు సాయం అందకపోగా.. ఛీత్కారాలు, విమర్శలు ఎదురయ్యాయి. 


ఏంటీ టెక్నాలజీ?

మన శరీరం సజీవంగా, ఆరోగ్యంగా ఉండడానికి కోట్లాది సూక్ష్మ ప్రొటీన్లపై ఆధారపడి ఉంటుంది. కణాలు ఏ ప్రొటీన్లను తయారుచేయాలో చెప్పడానికి ఎంఆర్‌ఎన్‌ఏ (అంటే మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏ)ను ఉపయోగించుకుంటుంది. అంత కీలకమైన ఎంఆర్‌ఎన్‌ఏ వ్యవస్థను హైజాక్‌ చేస్తే.. అంటే శరీరానికి బదులు మనమే కృత్రిమ మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఏలను ఉపయోగించి శరీరంలో మనకు కావాల్సిన ప్రొటీన్లను, యాంటీబాడీలను, ఎంజైములను ఉత్పత్తి చేసుకోగలిగితే? అరుదైన వ్యాధులను రివర్స్‌ చేయగలిగే ఎంజైమ్స్‌ని, దెబ్బ తిన్న గుండె కణాలను బాగు చేసే గ్రోత్‌ ఏజెంట్స్‌ను, ఇన్ఫెక్షన్లపై పోరాడే యాంటీబాడీలను.. దేన్ని కావాలంటే దాన్ని తయారు చేసుకోవచ్చు. అదే ఊహ డాక్టర్‌ కాటలిన్‌ కరీకోకు వచ్చింది. దీంతో, తన బృందంతో కలిసి ఎంఆర్‌ఎన్‌ఏపై పరిశోధనలు చేశారామె. కానీ, సమస్య ఏమిటంటే శరీరంలోకి ప్రవేశించే సింథటిక్‌ ఎంఆర్‌ఎన్‌ఏపై రోగనిరోధక వ్యవస్థ తీవ్ర దాడి చేస్తుంది. అది మనం నిర్దేశించిన కణాల వద్దకు చేరుకునేలోపే ధ్వంసం చేసేస్తుంది. దీన్ని కారణంగా చూపి ఆమె పరిశోధనకు వర్సిటీ అధికారులు నిధులు ఆపేశారు.


మరిన్ని పరిశోధనలతో ఈ అడ్డంకిని ఎలాగైనా అధిగమించవచ్చని కరీకో పేర్కొన్నా.. ఆమె పరిశోధనల కోసం అవసరమైన గ్రాంట్లను విడుదల చేయలేదు. అలా దాదాపు ఆరేళ్లు గడిచిపోయాయి. పెన్సిల్వేనియా వర్సిటీ అధికారులు ఆమెను ప్రొఫెసర్‌ స్థాయి నుంచి అసోసియేట్‌ ప్రొఫెసర్‌ ర్యాంకుకు డిమోట్‌ చేశారు. పరిశోధన సమయంలో ఆమె కేన్సర్‌ బారిన పడ్డారు. అలాంటి సందర్భాల్లో బలహీన మనస్కులైతే తమ పరిశోధనలకు అక్కడితో చుక్క పెట్టేసేవారు. కానీ, కరీకో పదేళ్లపాటు తన అధ్యయనాన్ని కొనసాగించి విజయం సాధించారు. ఆమె పట్టుదలకు డాక్టర్‌ డ్రూ వెస్‌మాన్‌ అనే ఇమ్యూనాలజిస్టు రూపంలో ఒక అండ దొరికింది. వారు రూపొందించిన సింథటిక్‌ఎంఆర్‌ఎన్‌ఏ రోగనిరోధక వ్యవస్థకు తెలియకుండా తనపని తాను చేయగలిగింది. కరోనా సమయంలో.. ఫైజర్‌ శాస్త్రవేత్తలు ఆ వైరస్‌ జన్యుక్రమాన్ని పరిశీలించాక.. వ్యాక్సిన్‌ తయారుచేయడం కోసం గత అధ్యయనాలపై దృష్టిసారించారు. అప్పుడు కాటలిన్‌ పరిశోధన వారిని ఆకర్షించింది. కాటలిన్‌ కూడా.. బయోఎన్‌టెక్‌ సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ హోదాలో.. ఫైజర్‌తో కలిసి టీకా తయారీలో పాల్గొన్నారు.


ఈ దంపతులదీ..

కరోనా వ్యాక్సిన్‌ తయారీలో కాటలిన్‌తో పాటు.. మరో ముగ్గురు తీవ్రంగా కృషి చేశారు. వారిలో.. ఉగుర్‌ సాహిన్‌, ఆయన భార్య ఓజ్లెమ్‌ టురేసి పాత్ర కీలకం. వీరు జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ (‘బయో ఫార్మాస్యూటికల్‌ న్యూ టెక్నాలజీ్‌స’కు సంక్షిప్త రూపం) సంస్థ వ్యవస్థాపకులు. కాటలిన్‌ ఆ సంస్థ వైస్‌ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ టీకాను కనిపెట్టడానికి ముందు వరకూ కూడా వీరిద్దరూ ఓ సాధారణ అపార్ట్‌మెంట్‌లో ఉంటూ.. ఆఫీసుకు సైకిల్‌పై వెళ్లేవారు. సొంతంగా ఒక కారు కూడా లేదు. వారిని కాటలిన్‌ ఎంఆర్‌ఎన్‌ఏ పరిజ్ఞానం ఆకర్షించింది. కరోనా నేపథ్యంలో.. ఎంఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో దానికి అడ్డుకట్ట వేసే టీకా అభివృద్ధిపై దృష్టి సారించి ఫైజర్‌ కంపెనీతో చేతులు కలిపారు. టీకాను అభివృద్ధి చేయడంతో వీరి దశతిరిగి పోయింది. టర్కీలో జన్మించిన సాహిన్‌.. నాలుగేళ్ల వయసులోనే తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వచ్చారు. కేన్సర్‌ ఇమ్యూనోథెరపీపై పనిచేశారు. టురేసి తండ్రి టర్కీకి చెందిన వారు. ఆమె జర్మనీలో జన్మించారు. ఆధ్యాత్మిక భావాలతో నన్‌గా మారాలనుకున్న టురేసి.. మెడిసిన్‌ చదివేప్పుడు సాహిన్‌తో ప్రేమలో పడి.. పెళ్లి చేసుకున్నారు. ఇక.. కరోనా తొలి వ్యాక్సిన్‌ వెనక నాలుగో వ్యక్తి ఒక గ్రీకు శాస్త్రవేత్త. ఆయనే.. ఫైజర్‌ సీఈవో అల్బర్ట్‌ .

కామెంట్‌లు లేవు: