🙏శివానందశలహారీ🙏
కడుపట్టు దలతోడ కడలిని మథియించ
సామర్థ్యమును లేదు శక్తి లేదు
అశనంబుగా నీకు నవ్విషమెట్లిత్తు ?
నెలవంక నెట్లిత్తు తలను దాల్చ ?
పాతాళ భేదన పాటించగా లేను
భూషణంబుగ నెట్లు భుజగ మిత్తు ?
పోయి వేటాడంగ బోయవాడను గానె
యిభ చర్మ మేరీతి నీయ గలను ?
ఈశ్వరా ! యింక నేనెట్టు లిచ్ఛ తోడ
పూజ లొనరించ గల్గుదు పూత మదిని
తెలియ జేయుము సర్వేశ ! తేటగాను
జరిపె దారీతి నిరతంబు చంద్రమౌళి !. 85 #
పార్వతీవల్లభా ! భవదీయ పూజకు
శ్రీకర ద్రవ్యముల్ సిద్ధ మయ్యె
నైననున్ నీ పూజ నాచరించగ నాకు
సాధ్యంబు కాదయ్యె సకలవినుత !
నీదు శిరస్సును నీ పాదయుగళిని
కాన నైతిని నేను గరళకంఠ !
శీర్ష పాదంబులన్ చెలువార దర్శించ
మఱి యంచ , ఘోణిగా మార లేను
హంస కిటియు పగిది నన్వేషణము జేసి
బ్రహ్మ విష్ణు వేమి బడసి నారు ?
తెలియరైరి నీదు తలయును పాదముల్
నరుడ నేను నిన్ను నెఱుగ గలనె ! 86 #
✍️గోపాలుని మధుసూదన రావు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి