15, డిసెంబర్ 2020, మంగళవారం

- దుర్గా సప్తశతి - 38

 *🌹. శ్రీ దేవీ మహత్యము - దుర్గా సప్తశతి - 38  / Sri Devi Mahatyam - Durga Saptasati - 38 🌹*

✍️. మల్లికార్జున శర్మ 

📚. ప్రసాద్ భరద్వాజ 


*అధ్యాయము 11*

*🌻. నారాయణీ స్తుతి - 2 🌻*


9. కాష్ఠ (పద్దెనిమిది రెప్పపాట్ల కాలం) కల (ముప్పది కాష్ఠల కాలం) ఇత్యాది రూపాలతో మార్పులు కలిగించే, విశ్వాన్ని నశింపజేసే శక్తిగల ఓ నారాయణీ! నీకు ప్రణామాలు. 


10. శుభాలన్నింటిలోను గల శుభ స్వరూపవై, కోరదగిన సర్వ ప్రయోజనాలను సిద్ధింపజేసేదానవై, శరణంమిచ్చేదానవై, త్రినేత్రవై, పాండువర్ణం (పసుపు తెలుపుల మిశ్రమ వర్ణం) గలదానవై ఉండే ఓ శివపత్నీ! ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.


11. జగత్తును సృజిచే, పోషించే, నశింపజేసే శక్తిగలదానవు, నిత్యవు, త్రిగుణాలకు నిలయమూ, త్రిగుణస్వరూపవు అయిన ఓ నారాయణీ! నీకు ప్రణామాలు. 


12. శరణుజొచ్చిన అభాగ్యులను, దుఃఖితులను, రక్షించే ఆసక్తి గలదానవు, ఎల్లర కష్టాలను నశింపజేసే దానవు అయిన ఓ దేవీ! ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.


13. బ్రహ్మాణీ రూపాన్ని ధరించి హంసలు పూన్చిన విమానంలో కూర్చుండి దర్భతో (మంత్రపూతమైన) జలాన్ని చల్లే ఓ దేవీ! ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.


14. మాహేశ్వరీ రూపాన్ని ధరించి, త్రిశూలాన్ని, (అర్ధ) చంద్రుణ్ణి, సర్పాలను ధరించి, పెద్ద ఎద్దుపై ఆశీనురాలవై ఉండే ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.


15. కౌమారీరూపాన్ని ధరించి నెమిలి కోడి వెంటరాగా, పెద్ద బల్లెమును పూని ఉండే ఓ పాపరహిత మూర్తీ! ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.


16. వైష్ణవీ రూపాన్ని ధరించి శంఖం, చక్రం, గద, (శార్జ ) ధనుస్సు అనే మహాయుధాలు పూని ఉండే ఓ నారాయణీ ! నీకు ప్రణామములు; ప్రసన్నతి చూపు.


17. వారాహీరూపాన్ని ధరించి, భయంకరమైన మహాచక్ర ఆయుధాన్ని పూని, కొమ్ముతో భూమిని పైకి లేవనెత్తిన శుభస్వరూపిణివి అయిన ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.


18. ఉగ్రమైన నారసింహీ రూపాన్ని ధరించి, రాక్షసులను పరిమార్చే ఉద్యమంలో ప్రసక్తవై, ముల్లోకాలను రక్షించే  దానవైన ఓ నారాయణీ! నీకు ప్రణామాలు.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹

కామెంట్‌లు లేవు: