*స్వామివారి నిజరూప ప్రతిమ..(మొదటి భాగం)*
"నేను హైదరాబాద్ లో ఉంటాను..మొగిలిచెర్ల దత్తాత్రేయ స్వామి మందిరానికి ఎలా రావాలి..? బస్ రూట్ చెపుతారా..?" అని ఓ సంవత్సరం క్రితం ఫోన్ లో అడిగాడా యువకుడు..వివరంగా చెప్పాను..తన పేరు జయచంద్ర అని చెప్పాడు..
ఆ ప్రక్క ఆదివారం ఉదయమే జయచంద్ర అనబడే ఆ యువకుడు శ్రీ స్వామివారి మందిరానికి వచ్చాడు..తెల్లగా..సన్నగా..చిరునవ్వుతో వున్నాడు..తనకు ప్రత్యేకంగా గది అక్కరలేదనీ..బైటనే స్నానాదికాలు ముగించుకొని..మంటపం లో ఉంటానని చెప్పాడు..స్నానం చేసి, శ్రీ స్వామివారి దర్శనానికి వచ్చాడు..స్వామివారి సమాధి వద్దకు వెళ్లి, నమస్కారం చేసుకొని..ఇవతలికి వచ్చి..నేరుగా నా ప్రక్కన కూర్చున్నాడు..శ్రీ స్వామివారి గురించి తనకున్న సందేహాలను అడిగి తెలుసుకున్నాడు.."మీరు సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తున్న విశేషాలని క్రమం తప్పకుండా చదువుతున్నానని.." చెప్పాడు..ఆ తరువాత స్వామివారి జీవితచరిత్ర పుస్తకాన్ని తీసుకొని..మంటపం లోకి వెళ్లి అక్కడే కూర్చుని శ్రద్ధగా ఆ పుస్తకాన్ని పారాయణం చేసుకుంటూ గడిపాడు..
ఆరోజు సాయంత్రం బస్ కు తిరిగి తాను హైదరాబాద్ వెళ్లిపోతానని నాతో చెప్పాడు..సరే అన్నాను..అతని ఫోన్ నెంబర్ తీసుకున్నాను..హైదరాబాద్ వెళ్లిన వారం పది రోజుల తరువాత..
"ప్రసాద్ గారూ..నేను జయచంద్రను మాట్లాడుతున్నాను..నాకొక ఆలోచన వచ్చింది మీతో చెప్పాలనిపించింది..చెప్పమంటారా..? " అన్నాడు.."చెప్పండి.." అన్నాను..
"మొగిలిచెర్ల స్వామివారిది విగ్రహం చేయించాలని అనుకుంటున్నాను..చూడగానే శ్రీ స్వామివారు నిజంగా కూర్చుని ఉన్నట్టు అనిపించేవిధంగా..సజీవమూర్తి లా కనబడేలా చేయించాలని నాకు సంకల్పం కలిగింది..ఎంత ఖర్చు అవుతుందో నాకు తెలీదు..కనీస అవగాహన కూడా లేదు..కాకుంటే అటువంటి విగ్రహాలు హైదరాబాద్ లో తయారుచేస్తారని మాత్రం నాకు తెలుసు..సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి ప్రతిమను వారి ట్రస్ట్ సభ్యులు చేయించి వున్నారు..మీరు అనుమతి ఇస్తే..నేను ఆ పనిలో ఉంటాను .." అన్నాడు..
నాకు ఎంతగానో ఆశ్చర్యం వేసింది..అంతకు వారం ముందునుంచే నాలో అదే కోరిక కలిగింది..ఎవరు పూనుకుంటారు..?.ఎవరిని అడగాలి..? అని మనసులో పరి పరి విధాలా ఆలోచిస్తున్నాను..సరిగ్గా అదే ఆలోచనతో జయచంద్ర ఫోన్ చేసాడు..
"స్వామీ..నువ్వు నా ప్రక్కనే ఉన్నావయ్యా.." అని మనసులో అనుకోని..జయచంద్ర కు సంతోషంగా నా అంగీకారాన్ని తెలిపాను..
మరో రెండురోజుల తరువాత..వాట్సాప్ లో సద్గురు శ్రీ శివానంద మూర్తి గారి ప్రతిమ తాలూకు ఫోటోలు జయచంద్ర పంపారు.."ఈ రకమైన ప్రతిమలు చేసే వ్యక్తి ఖైరతాబాద్ దగ్గర ఉన్న ఆనందనగర్ కాలనీ లో ఉన్నారనీ..వారి పేరు లక్ష్మీనారాయణ గారనీ..వారి అడ్రెస్ తీసుకున్నాననీ..మొగిలిచెర్ల స్వామివారి ఫోటో లు తనకు పంపితే..తాను వారితో మాట్లాడుతాననీ.." చెప్పాడు..ఆలస్యం చేయకుండా శ్రీ స్వామివారి ఫోటోలు పంపాను..
"మీరు కోరుకున్న ఎత్తులో..ప్రతిమను తయారు చేసి ఇవ్వడానికి సుమారుగా లక్ష రూపాయలు అవుతుంది..అని లక్ష్మీనారాయణ గారు చెప్పారు..ప్రసాద్ గారూ నేను అంత మొత్తాన్ని భరించలేను..మీరేమైనా భరించగలరా..? " అని నేరుగా తన మనసులో మాట చెప్పేసాడు జయచంద్ర..ఓ రెండురోజులు సమయం కావాలన్నాను..
ఆ ప్రక్కరోజే..మా మొగిలిచెర్ల కు చెందిన చీమలదిన్నె అంకయ్య అనే యువకుడు.. స్వామివారి మందిరానికి దర్శనానికి వచ్చాడు..స్వామివారి దర్శనం చేసుకున్న తరువాత..నా దగ్గరకు వచ్చి.." మంటపం లో స్వామివారి విగ్రహం పెట్టిస్తే బాగుంటుంది కదా.." అన్నాడు..వెంటనే నేనూ జయచంద్ర అనుకుంటున్న పథకం అతనికి చెప్పాను..జయచంద్ర ఫోన్ నెంబరూ ఇచ్చాను..
"ఈ విగ్రహం తయారు చేయించే బాధ్యత నాది..జయచంద్ర గారితో మాట్లాడతాను..మీరు నిశ్చింతగా ఉండండి.." అన్నాడు..అనడమే కాదు జయచంద్రతో ఫోన్ లో మాట్లాడి..ఆపై హైదరాబాద్ వెళ్లి కలిసి ఒక అవగాహనకు కూడా వచ్చేసాడు..నేను కేవలం నిమిత్తమాత్రుడిగా మిగిలిపోయాను..స్వామివారిలో ఉన్న చమత్కారం అదే..అన్నీ ఆయనే సమకూర్చుకుంటారు కానీ మనమే కర్తలం అనే భ్రమలో ఉంచుతారు..
మరో రెండు నెలలకు శ్రీ స్వామివారి ప్రతిమ తయారవుతున్నదనీ..మీరు హైదరాబాద్ వచ్చి మార్పులు చేర్పులు చెపితే..దానికనుగుణంగా తయారుచేస్తారని జయచంద్ర చెప్పాడు..నేను హైదరాబాద్ వెళ్లి చూసాను..సాక్షాత్తూ శ్రీ స్వామివారు పద్మాసనం వేసుకొని కూర్చున్నట్లు ఉంది..చిన్న చిన్న మార్పులు సూచించి.తిరిగి వచ్చేసాను..శ్రీ స్వామివారి ఆరాధనామహోత్సవం నాటికి మొగిలిచెర్ల లోని మందిరానికి ఈ ప్రతిమను చేర్పించాలని అనుకుంటున్నానని నేను చెప్పాను..వాళ్ళూ అందుకు ఇబ్బంది లేదని చెప్పారు..జయచంద్ర పర్యవేక్షణ, అంకయ్య ఆర్ధిక తోడ్పాటు..లక్ష్మీనారాయణ గారి శ్రద్ధ..మూడూ కలిసి..శ్రీ స్వామివారి నిజరూప ప్రతిమ తయారయింది..
స్వామివారి నిజరూప ప్రతిమ..ఆరాధన రోజు ఆవిష్కరణ..రేపటి భాగంలో..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి