15, డిసెంబర్ 2020, మంగళవారం

ధార్మికగీత - 110*

 🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

                              *ధార్మికగీత - 110* 

                                        *****

          *శ్లో:- ఉద్యమేన హి సిద్ధ్యంతి ౹*

                 *కార్యాణి న మనోరథై:  ౹*

                 *న హి సుప్తస్య సింహస్య ౹*

                 *ప్రవిశన్తి ముఖే మృగా:  ౹౹*

                                      *****

*భా:- లోకంలో గొప్ప  పనులు చేయాలని అందరూ ఆశిస్తుంటారు.  ఘన కార్యాలు సాధించాలని తెగ ఉవ్విళ్లూరుతుంటారు. వాటికి తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తారు. అమలుకు సమగ్ర సమాలోచనలు జరుపుతారు. అన్నీ బాగున్నా  ససేమిరా ఆపని చేయడానికి  పూనుకోరు.మరి ఆపని ఎలా సాధింపబడుతుంది? ఏ పని అయినా పూర్తి కావాలంటే, ముందు మొదలుపెట్టాలి అని ఛలోక్తి ఉన్నది. ఎలా? అడవి లోని మృగాలన్నింటికి   సింహము రాజు. నేను రాజును గదా అని సింహం గుహలోనే ప్రశాంతంగా కూర్చుంటే,  మృగాలు తమంతట తాముగా  రాజు ఆకలి తీర్చడానికి గాను పరుగెత్తుకుంటూ వెళ్లి, దాని నోటిలోకి ప్రవేశించవు,  సింహం రాజైనా  మృగాలను వెంటాడి, వేటాడడానికి పరుగెత్తాలి. సర్వశక్తులు పణంగా పెట్టాలి. ఫలితం దైవానికెరుక. ఆంజనేయుడు సముద్రలంఘనానికి, వానరులు నీరథికి వారధిని నిర్మించడానికి, భగీరథుడు గంగావతరణానికి చేసిన ప్రయత్నం  అసామాన్యము. అసాధారణము. కాన ప్రయత్నము చేతనే కార్యసిద్ధి అవుతుంది కాని కేవలం మనసారా కోరుకున్నంత మాత్రాన కాదని సారాంశము*.

                                *****

                *సమర్పణ   :   పీసపాటి*

🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲🌲

కామెంట్‌లు లేవు: