6, ఫిబ్రవరి 2021, శనివారం

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము**


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


భీష్మపర్వం.154


శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత ఉపదేశిస్తున్నాడు, కురుక్షేత్రంలో, మహాసంగ్రామం మొదలయ్యే ముందు.


షష్టాధ్యాయం ధ్యానయోగం.


యం సంన్యాసమితి ప్రాహుర్యోగం తం  విద్ధి పాండవ 

న హ్యసంన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన//   (  6  . 2  )

ఓ పాండుకుమారా !  దేనిని సన్యాసమని విజ్ఞులు అందురో, అదియే యోగము.  అన్ని  సంకల్పములను త్యజించినవాడే  సన్యాసి, అతడే యోగి.  కర్మలను సన్యసించినను వాని సంబంధమైన విషయములను, సంకల్పములను వదలనివారు యోగి కాజాలరు. 


చిత్తస్పందన సంకల్పములు యేర్పడటానికి మూలము. దానికి కారణము  రజోగుణము.  రజోగుణము యోగాభ్యాసం వలన నశించును.  రజోగుణం  నశిస్తే, చిత్త స్పందనలు నశిస్తాయి.  చిత్త స్పందనలు లేకపోతె, సంకల్పాలు కలుగవు.  సంకల్ప త్యాగియే   సన్యాసి.  అతడే యోగి.  కర్మలు చేయకున్న మాత్రమున సన్నాసి కాదు. వాటి గురించి కూడా ఆలోచించకూడదు. 


ప్రశాన్తాత్మా విగతభీ ర్బ్రహ్మచారి వ్రతే స్థిత : 

మన : సంయమ్య మచ్చిత్తో యుక్త ఆసీత మత్పర : //   ( 6 .14  )

శాంతిపొందిన మనసు కలవాడై, ప్రశాంతచిత్తుడై, దేనికీ భయపడనివాడై బ్రహ్మచారి   జీవితం గడుపుతూ, మనో నిరోధనము చేసి, విషయసుఖములను దూరంగా వుంచి,  నాయందే మనసు లగ్నం చేసినవాడై వుండవలెను.  


యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు 

యుక్త స్వప్నావ బోధస్య యోగో భవతి దుఃఖహా //  ( 6 . 17 )

తగిన ఆహార విహార నియమాలతో, యోగి చెయ్యవలసిన  పనులు మాత్రమే చేస్తూ, శరీరతాపము కలుగజేయని పనులు మాత్రమే చేస్తూ, యెక్కువ సమయం మేల్కొనక, యెక్కువ సమయము నిద్రించక, జాగరూకుడై  వుండువాడే యోగ సిద్ధిని పొంది దుఃఖమునకు దూరమగును.  


యధా దీపో నివాతస్థో   నేఁగతే సోపమాస్మృతా 

యోగినో యత చిత్తస్య యుజ్ఞతో యోగమాత్మన :  //  (6 .19  )

సంయమన చిత్తంతో యోగి తన  ధ్యాసను ఆత్మావలోకనం చేసుకుంటూ ' వాయురహిత ప్రదేశము నందు వుంచబడిన దీపమువలే ,  ఐహిక విషయములకు దూరంగా, చలన రహితుడై ప్రకాశిస్తూ వుండును. 


శనై శ్శనై రుపరమేద్బుద్ధ్యా ధృతి గృహీతయా 

ఆత్మసంస్థం మన: కృత్వా న కించదపి చింతయేత్ //   ( 6  .25  )

ప్రాణవాయువు నిరోధించడమే మనోనిగ్రహానికి మొదటిమెట్టు.  నెమ్మది నెమ్మదిగా ప్రాణవాయు స్పందనలను నిగ్రహించుట ద్వారా, మనోనిగ్రహం సాధించవలెను.  సాత్వికమైన ఆలోచనలతో, ఇంద్రియములను విషయముల నుండి విరమింప జేసి, యోగ బలంతో యితర వ్యాపకాల మీదకు మనోదృష్టి వెళ్లనీయక, ఆత్మస్థానమనే బుద్ధి గుహలో ప్రవేశించి ఆత్మయందు మనస్సును వుంచవలెను.  


యోమాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి      

తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి // ( 6 . 30  )

సర్వభూతములలో నన్ను దర్శించిన వానికి, నాయందు సర్వభూతములను దర్శించిన వానికి, నానుండి దూరమయ్యే ప్రశ్న వుత్పన్నం కాదు.  అనగా, నానుండి అతడు వేరు కాదు.   సమ్యగ్దర్శకుడైన యోగి వేరు, పరమాత్మ వేరు కాదని భావము.  


సప్తమాధ్యాయము  జ్ఞాన విజ్ఞాన యోగము.


మనుష్యాణాం సహస్రేషు   కశ్చిద్యతతి సిద్ధయే 

యతతామపి సిద్ధానాం కశ్చిన్మామ్ వేత్తి తత్త్వత :  //  ( 7 . 3  )

అర్జునా !  వేలకొద్దీ మనుషులలో యెవరో ఒకడు మాత్రమే తత్వజ్ఞాన సిద్ధికోసం ప్రయత్నిస్తాడు.  అలా ప్రయత్నించిన అనేకమంది సిద్ధపురుషులలో, యే ఒక్కరో యదార్ధంగా తత్వజ్ఞాని అగును.  

యోగమును అభ్యసించుట వలన త్త్వజ్ఞాన సిద్ధి కలుగును.   అట్టి జ్ఞాన సిద్ధులు తననుండి   ఆత్మ వేరు గాదని  , యోగసిద్ధిలో  దర్శించి, అదే ఆత్మ అన్ని జీవరాసులలో కలదని తెలుసుకోబడతాడు..  అట్టివాడు, పరమాత్మకన్నా భిన్నం కాదు. 


భూమిరాపో>నలో వాయు:: ఖం మనో బుద్ధిరేవచ 

అహంకార  ఇతీయం  మే భిన్నా ప్రకృతి రష్టధా  //   ( 7 . 4  )

భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు బుద్ధి , అహంకారము అను ఎనిమిది విధములుగా యీ ప్రకృతి విభజించబడి యున్నది.   ఇవి వాటి అంతట అవి యేర్పడలేదు.  ఈశ్వర కల్పితములు,


చతుర్విధా భజంతే మాం జనా : సుకృతినో>ర్జున  

ఆర్తో, జిజ్ఞాసురార్ధార్ధీ జ్ఞానీ చ భరతర్షభ //  ( 7 . 16 ) 

అర్జునా !  భరతవంశ శ్రేష్టా ! ఆర్తులైనవారు, జిజ్ఞాసువులూ, ప్రయోజనం ఆశించేవారు, జ్ఞానులు, అను నాలుగురకాల వారు నన్ను యెల్లప్పుడూ సేవించాలని పరితపిస్తూ వుంటారు.  అది వారి పూర్వజన్మ పుణ్యము వలన యేర్పడిన సాంగత్యము.  


జ్ఞాని ఏకాగ్ర బుద్ధితో యే కోరికలూ లేకుండా నన్ను సేవిస్తాడు.  అతనికి నేను అత్యంత ప్రియుడను.  నాకును అతడు అంత ప్రీతిపాత్రుడే.    పెక్కు జన్మలలో నా గురించి పరితపించి, ఈ సర్వమూ నేనే అను అనుభూతి చెంది జ్ఞాని నన్ను ఆశ్రయించును.  


సాధిభూతాధిదైవం మాం సాధియజ్ఞం చ యే విదు : 

ప్రయాణకాలే>పి చ మాం తే విధుర్యుక్తచేతస  :  //   ( 7 . 30 )

అధిభూత, అధి దైవ, అధియజ్ఞములతో కూడిన నన్ను తెలుసుకున్నవారు   వారి అంత్యకాలమున పరమాత్మనగు నాయందే మనసు లగ్నము చేసి, నన్ను చేరుకుందురు.  


అష్టమాధ్యాయము  అక్షర పరబ్రహ్మ యోగము.


ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ 

య : ప్రయాతి త్యజన్దేహం స యాతి పరమాం గతిం //  ( 8 . 13  )

ఏకాక్షర మంత్రమగు ఓంకారమును స్మరించుచు నా నామము స్మరించుచు  దేహాన్ని త్యజించువాడు ఉత్తమగతులు చేరతాడు.

యోగబలంతో సహస్రారంలో  ప్రాణం వుంచి, నన్ను తలుచుకుంటూ,ప్రణవ మంత్రం జపించుటకన్నా, ప్రశాంతమరణమేమున్నది ? 

ఓంకార స్మరణలోనే, స్వరం ఊర్ధ్వ స్థాయికి అసంకల్పితంగా వెళ్లే ప్రక్రియ వున్నది.  సహస్రారంలోనికి ప్రాణం తీసుకు వెళ్ళడానికి శ్రేష్టమైన మార్గం ఓంకార స్మరణ.    

 

అగ్నిర్జ్యోతిరహ : శుక్ల : షణ్మాసా  ఉత్తరాయణం

తత్ర ప్రయాతా గచ్చన్తి బ్రహ్మ బ్రహ్మవిదో జనా  :  //  ( 8 . 24 )

అగ్ని జ్యోతి, పగలు, శుక్లపక్షం,ఉత్తరాయణము, ఈ సమయములలో శరీరము త్యజించిన బ్రహ్మజ్ఞానులు ,  దేవయానములో  పయనించి  బ్రహ్మైక్యము   పొందుదురు.  ధూమ సమయములో, రాత్రివేళ, కృష్ణ పక్షంలో, దక్షిణాయనంలో   మరణించినవారు, పితృయానం మార్గంలో ప్రయాణించి,  చంద్రజ్యోతిని దర్శించి, కొంతకాలము తరువాత మరల పుట్టెదరు.


ఈ రెండు మార్గములు తెలిసిన యోగి, వేదాధ్యయనము, యజ్ఞకర్మలు, తపస్సు, ధ్యానము, దానములు  వంటి అనేక పుణ్య కార్యములు శాస్త్రోక్తంగా ఆచరించి, దేవయాన మార్గంలో బ్రహ్మైక్యం పొందడానికి కృషి చేస్తాడు., 

**దశిక రాము**


**మహాభారతము**


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


భీష్మపర్వం.155


శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత ఉపదేశిస్తున్నాడు, కురుక్షేత్రంలో, మహాసంగ్రామం మొదలయ్యే ముందు.


నవమాధ్యాయం రాజవిద్యారాజగుహ్య యోగం.


అశ్రద్దధానా : పురుషా ధర్మస్యాస్య పరన్తప 

అప్రాప్య మాం నివర్తన్తే మృత్యుసంసార వర్త్మని // ( 9 .3 )

ఆత్మజ్ఞాన ధర్మమును విశ్వసించని దేహాభిమానులగు నాస్తికులు మృత్యుమార్గాన సంసారచక్రంలో పునరపి జననం పునరపి మరణం చెందుతూ నానుండి దూరమగుదురు. 


అవజానన్తి మాం మూఢ మానుషీమ్ తనుమాశ్రితం 

పరం భావమజానన్తో మమ భూత మహేశ్వరం // ( 9 . 11 )

సర్వప్రాణులకు అధిదేవతగు నేను మనుష్యరూపములో నున్న పరమేశ్వరుడినని యెరుగక, నన్ను సామాన్య మానవునిగా మూఢజనులు, వివేకహీనులు, అనుకుంటారు.


అహం క్రతురహం యజ్ఞ: స్వధాహమహమౌషధం   

మంత్రో>హమహ మేవాజ్య మహమగ్ని రహం హుతం // ( 9 .16 )

పార్ధా ! నేనే క్రతువును. నేనే యజ్ఞాన్ని. సర్వప్రాణులకు ఆహరం యిచ్చే శక్తిని నేనే. నేనే ఔషధాన్ని. నేనే మంత్రాన్ని. నేనే నెయ్యిని. నేనే అగ్నిని. హోమద్రవ్యాన్ని కూడా నేనే. 


తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశన్తి 

ఏవం త్రయీధర్మమనుప్రసన్నా గతాగతం కామకామా లభంతే // ( 9 .21 )

కోరికలు అనేకం కలవారు, యజ్ఞాది కర్మల ద్వారా స్వర్గలోకములోని భోగములను అనుభవించి, పుణ్యము క్షీణించిన, తిరిగి మనుష్యలోకంలో పుడతారు. కేవలం కర్మల వలన పుణ్యం సంపాదించి, మోక్షం పొందజాలరు. యోగనిష్ఠ వలననే బ్రహ్మైక్యం పొందగలరు.   


అనన్యాశ్చిన్తయన్తో మాం ఏ జనా : పర్యుపాసతే 

తేషామ్ నిత్యాభి యుక్తానాం యోగక్షేమం వహామ్యహం. // ( 9 . 22 )

కోరికలను త్యజించినవారు, నన్ను తమకంటే వేరుగా చూడరు. తమఆత్మగా నన్ను సర్వ వేళలా భావిస్తూ ఆరాధిస్తారు. అట్టివారి యోగక్షేమాలను నేను చూసుకునే బాధ్యత వహిస్తాను.  


కిమ్ పునర్బ్రాహ్మణా: పుణ్యా భక్తా రాజర్షయస్తథా

అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం // ( 9 . 33 )

పుణ్యాచారణ కలిగి సదాచారులైన బ్రాహ్మణులూ, భక్తి భావం కలిగిన రాజర్షులు గానీ, నాన్నాశ్రయించి ఉత్తమగతి పొందుదురని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.  

శాశ్వతం కాని, తాత్కాలిక సుఖాన్ని యిచ్చే ఈ మనుష్యలోకంలో జన్మించినందుకు నన్ను భజించి, నన్ను చేరుకునే ప్రయత్నం చెయ్యి.


దశమాధ్యాయం విభూతియోగం.


మచ్చిత్తా మద్గతప్రాణా బోధయంత: పరస్పరం 

కథయన్తశ్చ మాం నిత్యం తుష్యన్తిచ రమన్తిచ // ( 10 . 9 )

చిత్తము నాయందే నిలిపి ఇంద్రియములు నాలో లీనమొనర్చి, జన సమూహములలో నాగురించి బోధిస్తూ, సత్కాలక్షేపంతో , సత్సంగాలతో వుండువారు యెంతో తృప్తిగా ఆనందభరితులై జీవింతురు


అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత : 

అహమాదిశ్చ మధ్యం చ భూతానామన్త ఏవచ // ( 10 . 20 )

ఇంద్రియాలను జయించిన ఓ అర్జునా ! అన్ని ప్రాణులలో వుండే ఆత్మను నేనే. సర్వ జీవుల జననము, పెరుగుదల, అంతము అన్నీ నేనే. నా యోగ మహిమచే, ఒకడినే, పెక్కు స్వరూపాలుగా భాసిస్తూ వున్నాను.

ఆదిత్యులలో నేను విష్ణువును. జ్యోతిశ్చక్రమున సూర్యునిగా వున్నది నేనే. దేవతలలో శ్రేష్ఠుడైన మరీచిని నేనే. నక్షత్రములలో చంద్రుడను నేనే. వేదములలో సామవేదము, దేవతలలో ఇంద్రుడు, ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలో చైతన్యము నేనే. రుద్రులలో శంకరుడను. యక్షులలో కుబేరుడను. వసువులలో పావకుడను. పర్వతములలో మేరు పర్వతాన్ని.  

పురశ్రేష్ఠులలో బృహస్పతిని, సేనానులలో కుమారస్వామిగా, నీటి సమూహములలో సముద్రునిగా నన్ను యెరుంగుము. మహర్షులలో భృగుడను. అక్షరాలలో ఓంకారాన్ని. యజ్ఞాలలో మానసిక యజ్ఞాన్ని. పర్వతములలో హిమ పర్వతాన్ని. వృక్షములలో రావి చెట్టును. దేవఋషులలో నారదుడను. గంధర్వులలో చిత్రరధుడను. సిద్ధులలో కపిలమునిని. 


గుఱ్ఱములలో అమృతంతో పాటు పుట్టిన ఉచ్చయిశ్రవాన్ని. ఏనుగులలో ఐరావతాన్ని. నరులలో చక్రవర్తిని. ఆయుధములలో వజ్రాయుధాన్ని. గోవులలో కామధేనువును. సంతానకారకుడైన మన్మధుడను కూడా నేనే. నేనే విష సర్పములలో వాసుకిని. నాగులలో అనంతుడిని. జలదేవతలలో వరుణుడను. పితృ దేవతలలో ఆర్యముడను. దిక్పాలకులలో యముడను.  

రాక్షసులలో ప్రహ్లాదుడను. కాల పురుషుడను నేనే. మృగాలలో సింహాన్ని. పక్షులలో గరుడపక్షిని. పవిత్రత కలిగించే సాధనాలలో వాయువును నేను. ఆయుధాలు ధరించే వారిలో రాముడను నేనే. మత్స్యములలో మొసలిని నేను. నదులలో గంగానదిని నేను. విద్యలలో ఆత్మవిద్యను నేను. తర్కం చేసే వాళ్లలో వాదపటిమను నేనే. 

అక్షరములలో ఆకారమును. సమాసములలో ద్వంద్వ సమాసమును. అనంతమగు కాలము కూడా నేనే. అభ్యుదయం, స్త్రీలలో కీర్తిని, సిరిని, వాక్కును, జ్ఞాపక శక్తిని, తెలివిని, ఓర్పును కూడా నేనే. 


ఛందస్సులో గాయతీ ఛందస్సు నేనే. మాసములలో మార్గశీర్ష మాంసమును నేనే. ఋతువులలో వసంత ఋతువును నేనే. అంతెందుకు. స్థావర జంగములలో ఏది కూడా నా అంశలేకుండా మనజాలదు.


అర్జునా ! నా దివ్యవిభూతులు అనంతములు. పైన నేను చెప్పినదంతా, సంక్షిప్తము మాత్రమే. ఎక్కడ సంపద, శక్తి కలిగిన వస్తువుండునో, అక్కడ నా అంశకలదని తెలుసుకొనుము.

 

స్వస.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు


🙏🙏🙏

స్వస.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.


🙏🙏🙏

కామెంట్‌లు లేవు: