6, ఫిబ్రవరి 2021, శనివారం

ఉమా

 *🌷ఉమా🌷*



ఉకారము శివుడు. మా అంటే పార్వతి. ఉమ అంటే శివశక్తులు అని అర్ధం. తారకాసుర సంహారం కోసం దేవతలు పరమేశ్వరిని ప్రార్ధించారు. అప్పుడు ఆమె వారికి ప్రత్యక్షమై నా అంశతో హిమవంతునికి ఒక కుమార్తె పుడుతుంది. ఆమెను శివునకిచ్చి

వివాహం చెయ్యండి. వారిద్దరికీ పుట్టిన కుమారుడు తారకుని సంహరిస్తాడు అని చెబుతుంది. కొంతకాలానికి హిమవంతుని భార్య మేనక గర్భవతి అయి ఆడపిల్లను ప్రసవించింది.

ఆ బాలిక దినదిన ప్రవర్ధమానమైంది. సర్వకాల సర్వావస్థలయందు శివనామాన్నే జపిస్తుండేది. రానురాను తాను శివుణ్ణి తప్ప వేరెవరినీ వివాహమాడను అని తేల్చి చెప్పింది.

ఆ సమయంలో శివుడు విరాగియై తపోదీక్షలో ఉన్నాడు. అతణ్ణి భర్తగా పొందాలంటే తపస్సు ఒక్కటే మార్గం. అందుకని తపస్సు చెయ్యటానికి ఇంటి నుంచి బయలుదేరింది. అప్పుడు తల్లి అయిన మేనక కుమార్తెను వారిస్తూ ఉ - ఓయమ్మా, మా - వద్దు అన్నది. అప్పటి నుండీ ఆమెకు 'ఉమా' అనే పేరు సార్ధకమై పోయింది.


ఉత్తమమైన చిత్తవృత్తి గలది. సూతసంహితలో పరానుభూతియు,  సంసార పాపములను నశింపచేయునదియు, సదాశివుని కన్న మించిన శోభనసంపద గల ఉమ అను పేరు గల అనేక విధాలయిన వైభవముగల ఉత్తమ చిత్తవృత్తికి మ్రొక్కెదను అని చెప్పబడింది. 


విష్ణు శివ బ్రహ్మ వాచకములైన అకార ఉకార మకారములతో కూడిన త్రిమూర్త్యాత్మకమైన ప్రణవస్వరూపిణి. అందుచేతనే ఉమా అంటే - దేవీ ప్రణవము అని చెప్పబడినది.


లింగపురాణంలో శివుడు దేవితో “అకార ఉకార మకారములు నా ప్రణవము. ఉకార మకార అకారములు నీ ప్రణవమందు గలవు' అంటాడు.


మహావాసిష్టంలో “ఓంకార సారశక్తి గలదగుటచే ఉమ అని కీర్తించబడింది" అని చెప్పబడింది. 


ఉమ అంటే చంద్రకళ. ఇది ముల్లోకాలలోను నిద్రించువారి మేల్కొనువారి హృదయాలను ప్రేరేపిస్తుంది.


శివసూత్రాలలో ఇచ్ఛాశక్తి ఉమాకుమారి అని చెప్పబడింది. యోగుల యొక్క ఇచ్ఛకు ఉమ అని పేరు, సింధువనమున ఉండే దేవత. ఉమా అంటే - కాంతి అని అర్ధం.


యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా

అన్ని జీవులయందు కాంతిరూపంలో ఉంటుంది.


కేనోపనిషత్తులో “ఒకసారి దేవదానవులకు భీకరయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలు విజయం సాధించారు. ఆ తరువాత వారందరూ ఒకచోట చేరి యుద్ధం రకంగా జరిగింది. తాము ఏ విధంగా విజయం సాధించాము అనే విషయాలను గాధలుగా

చెబుతున్నారు.  ఆ విజయానికి కారణం నేనే అని ప్రతివారూ చెబుతున్నారు. 


అగ్నిదేవుడు అంటున్నాడు. “ఆ యుద్ధంలో నేను నిప్పులు కురిపిస్తుంటే రాక్షసులంతా మాడిమసి అయిపోయారు"


వాయుదేవుడు అంటున్నాడు " ఆయుద్ధంలో నేను చండప్రచండగా గాలులు వీస్తుంటే రాక్షసులు ఆ గాలులకు కొట్టుకుపోయారు"


పరబ్రహ్మతత్త్వం ఈ మాటలు విన్నది. దేవతలంతా గర్వించి ఉన్నారు. వారికి జ్ఞానోదయం చెయ్యాలి అనుకున్నది. అనుకున్నదే తడవుగా వారి ఎదుట పెద్ద భూతాకారంగా ప్రత్యక్షమైంది. దాన్ని చూసి భయపడ్డారు దేవతలు. ఆ భూతం ఏమిటో వారికి అర్ధం కాలేదు. అప్పుడు వారు అగ్నిదేవుని దగ్గరకు వచ్చి, “ఓ దేవా ! నీ పరాక్రమం

వల్లనే రాక్షసులను జయించగలిగాము. ఇప్పుడు ఆ భూతం ఏమిటో కనుక్కోవలసినది అన్నారు. సరేనన్నాడు అగ్నిదేవుడు. ఆ భూతాన్ని సమీపించాడు. అప్పుడు ఆ భూతం

అగ్నిని చూసి ఎవరు నువ్వు ? అన్నది.


అగ్ని: నేను అగ్నిదేవుడను. జాతవేదుడు అంటారు నన్ను.

భూతం : నీ శక్తి ఏమిటి ?

అగ్ని: ఎటువంటి వస్తువునైనా క్షణాల్లో దహించివేస్తాను.

భూతం : అలా అయితే ఈ గడ్డిపరకను దహించు. అంటూ ఒక గడ్డిపరకను చూపించింది. అగ్నిదేవుడు శతవిధాల ప్రయత్నించాడు. గడ్డిపరక కసికందలేదు. అవమానంతో వెళ్ళిపోయాడు అగ్నిదేవుడు. ఆ తత్త్వం ఏమిటో తెలుసుకోవటం తనవల్ల కాలేదన్నాడు. దేవతలంతా ఈ సారి వాయువును ప్రార్ధించారు. ఆ తత్త్వం ఏమిటో తెలుసుకోమని అర్ధించారు. సరేనన్నాడు వాయువు. ఆ తత్త్వం దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు

ఆ భూతం వాయువుతో అన్నది.


భూతం : ఎవరు నువ్వు ?

వాయువు : నేను వాయుదేవుడను. ఆకాశంలో చరిస్తుంటాను. అందుచేత నన్ను మాతరిశ్వుడంటారు.

భూతం : నీ గొప్పతనం ఏమిటి ?

వాయువు : ఏ వస్తువునైనా క్షణాల్లో ఎగరగొట్టగలను.

భూతం : అలా అయితే ఈ గడ్డిపరకను ఎగరగొట్టు.

వాయుదేవుడు తన శక్తి అంతా కూడదీసుకుని గాలులు వీచాడు. గడ్డిపరక కదలను కూడా లేదు. అవమానంతో వెళ్ళిపోయాడు వాయువు, దేవతల దగ్గరకు వెళ్ళి ఆ తత్త్వం ఏమిటో తనకు తెలియలేదు అన్నాడు. ఈ సారి దేవతలు ఇంద్రుణ్ణి వెళ్ళమన్నారు.ఇంద్రుడు బయలుదేరి ఆ తత్త్వాన్ని సమీపించాడు.


ఆ తత్త్వం మాయమైపోయింది. ఆ స్థానంలో ఉమాదేవి ఉన్నది. అప్పుడు ఇంద్రుడు ఆమెతో అమ్మా ! ఇప్పటి దాకా ఇక్కడ ఉన్న తత్త్వం ఏమిటి ? అన్నాడు అందుకు ఉమాదేవి.


దేవేంద్రా ! అదే పరబ్రహ్మతత్త్వము. దాన్ని మీరు గుర్తించలేకపోయారు. ఆ తత్వానికి నాకూ తేడా లేదు. మేమిద్దరమూ ఒకటే అని చెబుతుంది. ఈ రకంగా పరబ్రహ్మను

ముందుగా దర్శించినవాడు కాబట్టే ఇంద్రుడు దేవతలకు రాజయినాడు. అగ్ని వాయువులు దిక్పాలకులయినారు అని చెప్పబడింది.


కాబట్టి ఉమ అంటే ఆ పరబ్రహ్మమే. ఆరు సంవత్సరాల బాలికను కూడా ఉమ అంటారు.


శ్రీమాత్రే నమః🌷

కామెంట్‌లు లేవు: