6, ఫిబ్రవరి 2021, శనివారం

భాగవతం

 **దశిక రాము**


**భాగవతం 6వ స్కందము ఖండము-8**


హంసగుహ్య స్తవరాజము 


ముందుగా పరమేశ్వరునికి విశేషించి నమస్కరిస్తున్నాను. అనుభూతియే ఆకారమైన వానికి మ్రొక్కుతున్నాను. గుణవంతుడై విరాజిల్లుతూ నిమిత్తమాత్రంగా బంధురూపంలో ఉన్నవానికి ప్రణామాలు చేస్తున్నాను. సుగుణవంతులకు కాని, తత్త్వవేత్తలకు కాని తెలియరాని ఉనికి కలవాడు, మొదటినుండి ఉన్నవాడు, మోక్షానికి పరమావధి అయిన రూపం కలవాడు అయిన ఆ భగవంతుని ఆశ్రయిస్తున్నాను. సమస్త జీవుల దేహాలలో నివసిస్తున్నా జీవులు ఆ అంతర్యామిని గుర్తించడం లేదు. వారు తమలో తాము స్నేహం చేస్తున్నారే కాని పరమాత్మతో పొందు చేయడం లేదు. గుణాలలో చిక్కుకున్న జీవులు గుణాలకు అధీశ్వరుని దర్శింపలేకున్నారు. అటువంటి గుణవంతుడైన భగవంతుణ్ణి స్తుతిస్తున్నాను. మనస్సు, దేహం, పంచభూతాలు, పంచేంద్రియాలు, పంచప్రాణాలు కలిగి ఉన్న జీవులు ఈ దేహమే తాము అనుకుంటున్నారు. ఆ భావంతోనే అంతర్యామిని గుర్తింపలేక ఉన్నారు. వారికి వివేకబుద్ధి ప్రాప్తించినపుడు ఇంద్రియాదులు వేరని, జీవుడు వేరని తెలుసుకుంటున్నారు. ఈ సృష్టి నంతటినీ పరికించేవాడు, సమస్తానికి మూలమైనవాడు విశ్వహితుడు అయిన ఆదిపురుషుని ఆశ్రయిస్తున్నాను.

నానావిధాలైన నామ రూపాలను నిరూపించే మనస్సుచేత గమనింపబడినవి, స్మరింపబడినవి అయిన విషయాలు తొలగినప్పుడు కలిగే సమాధి స్థితిలో కేవలం జ్ఞానస్వరూపంగా గోచరించి, అటువంటి సమాధి స్థితికి ఆశ్రయభూతుడైన హంసస్వరూపునకు నమస్కరిస్తాను. ఎండుకట్టెలో దాగి ఉన్న అగ్నిని తమ బుద్ధితో ప్రకాశింపజేసినట్లు బుద్ధిమంతులు తమ హృదయాంతరాలలో ఉన్న పరమపురుషుని తమలోని శక్తిత్రయం చేత ప్రకాశింపజేస్తారు. అటువంటి భగవంతుడు సమస్త విధాలైన మాయలకు అతీతమైన మోక్షసంబంధమైన ఆనందానుభూతితో విలసిల్లుతుంటాడు. మాటలకు అందని మహత్తర శక్తితో కూడి ఉన్న ఆ విశ్వరూపుడు నాకు ప్రసన్నుడు అగును గాక! వాక్కు, బుద్ధి, ఇంద్రియాలు, మనస్సు మొదలైనవి ఆ పరమాత్ముని స్వరూపాన్ని వెల్లడించలేవు. అది ఇటువంటిదని నిరూపింపలేవు. ఇంద్రియాలకు అతీతాలైన గుణరూపాలతో వర్తిస్తూ ఉన్న ఆ నిర్గుణ స్వరూపానికి నమస్కరిస్తున్నాను. ఈ సమస్త విశ్వం ఏ మహాశక్తి వలన సృష్టింప బడుతున్నదో, ఏ మహాశక్తి వలన రక్షింపబడుతున్నదో, ఏ మహాశక్తి వలన లయం పొందుతున్నదో అటువంటి పరమాత్మ స్వరూపం పరాపరాల కంటే ఉత్తమమైనది. అనన్యమైనది, అనాది కాలం నుండి ప్రసిద్ధమైనది, అంతటా వ్యాపించి ఉన్నది, అన్నిటికీ మూలమైనది అయిన ఆ పరబ్రహ్మను ఆశ్రయిస్తున్నాను. ఆ పరమాత్మ ప్రభావం వల్లనే ప్రాణులు మాట్లాడుతున్నారు. వాదోపవాదాలు చేస్తున్నారు. వివాదాలు పెడుతున్నారు. అన్నింటికీ కారణం ఆ పరమాత్మ అనంత గుణాలే. జీవులను ఎప్పటి కప్పుడు మోహంలో ముంచి తేల్చే ఆ భగవంతునికి ప్రణామం చేస్తున్నాను. ఉన్నది, లేదు అనే వస్తు ద్వయానికి ఆలవాలాలై పైకి విరుద్ధ ధర్మాలుగా కనబడుతున్న యోగసాంఖ్య దర్శనాలను రెంటికీ సమత్వం సమకూర్చే పరమాత్మ నన్ను అనుగ్రహించు గాక! ఏ దేవుడు మానవుల పురాకృత పుణ్య విశేషాల చేత సుగంధాన్ని ఆశ్రయించిన వాయువు వలె అంతర్యామియై ఈ భూమిమీద ఉద్భవిస్తుంటాడో ఆ పరమేశ్వరుడు నా మనోరథాన్ని సఫలం చేయు గాక!” అంటూ భక్తిపరవశుడై తన భక్తి విశేషాలతో స్తుతిస్తున్న దక్షునికి భక్తవత్సలుడైన శ్రీహరి సాక్షాత్కరించాడు. అప్పుడు....శ్రీమహావిష్ణువు గరుత్మంతుని మీద ఆసీనుడై ఉన్నాడు. గరుడుని రెండు భుజాల మీద చాచిన ఆ స్వామి పాదాలు మేరు పర్వతం చరియకు రెండు ప్రక్కలా ప్రకాశించే ఇంద్రనీలమణుల గనులవలె ఉన్నాయి. అతని అష్టబాహువులు అందంగా పైకి చాచిన అష్టదిగ్గజాల తొండాలవలె ప్రకాశిస్తున్నాయి. ఎనిమిది చేతులలో చక్రం, ధనుస్సు, పద్మం, శంఖం, ఖడ్గం, పాశం, డాలు, గదాదండం విరాజిల్లుతున్నాయి. నల్లని దేహంతో, నగుమొగంతో, సాధుజనులను సంరక్షించే చల్లని చూపులతో, బంగారు రంగు పట్టు పీతాంబరంతో, మణిమయ కిరీటంతో, నలుమూలలా కాంతులు విరజిమ్మే భూషణాలతో, మకర కుండలాలతో (ప్రత్యక్షమైనాడు).శ్రీమన్నారాయణుని కర్ణకుండలాల కాంతులు ప్రసరించి చెక్కిళ్ళు చంద్రబింబాలవలె తళతళ లాడుతున్నాయి. తలమీద ధరించిన కిరీటం తన దివ్యదీప్తులతో గగనలక్ష్మికి కుంకుమరంగు చీరను అలంకరిస్తున్నది. అతని వక్షఃస్థలంమీద విరాజిల్లే వనమాలిక శోభలు శ్రీవత్సంతోను, కౌస్తుభంతోను పోటీ పడుతున్నాయి. బాహువులకు చుట్టుకొని ఉన్న భుజకీర్తులు నీలగిరికి చుట్టుకొన్న మెరుపు తీగలవలె మెరుస్తున్నాయి. ఆ స్వామి సౌందర్యం సమస్తలోకాలను మోహంలో ముంచి తేలుస్తున్నది. నారదాది మహర్షులు చుట్టూ చేరి సేవిస్తున్నారు. దేవతా బృందాలు కైవారాలు సలుపుతున్నారు. గంధర్వులు, కిన్నరులు, సిద్ధులు వీనుల విందుగా గానం చేస్తున్నారు.

సర్వేశ్వరుడు, సర్వాత్ముడు, సర్వాంతర్యామి, సర్వమయుడు, అచ్యుతుడు అయిన భగవంతుడు అందరూ తనను చేరి సేవిస్తుండగా కోరినవన్నీ ఇచ్చేవాడై దక్షునకు ప్రసన్నుడైనాడు. ఈ విధంగా ప్రత్యక్షమైన సర్వేశ్వరుని దివ్యరూపం అన్ని దిక్కులనూ ప్రాకాశింపజేస్తూ మహాశ్చర్యాన్ని కలిగించింది. దానిని చూచిన దక్షుని హృదయంలో భయం, ఆనందం, ఆశ్చర్యం ముప్పిరి గొన్నాయి. ఎలాగో ఆ తన్మయత్వం నుంచి తెప్పరిల్లి రెప్పపాటు కాలంలో స్వామికి సాష్టాంగ దండప్రణామం చేసాడు. చేతులు జోడించి నమస్కరించాడు. సెలయేళ్ళ కలయికతో దరులొరసి పొంగి మిన్నంటి సముద్రాన్ని దరిసిన మహానదీ ప్రవాహం వలె దక్షప్రజాపతి పులకించిన దేహంతో భగవంతుని ముందు నిలిచాడు. పరవశించిన తన హృదయాన్ని ఎలాగో స్వాధీనం చేసుకొని పొంగిపొరలే ఆనందంతో ఆ పరమేశ్వరునితో ఏమేమో మాట్లాడా లనుకున్నాడు. పరమ మంగళదాయకాలైన ఆయన పవిత్ర నామాలను ఉచ్చరించా లనుకున్నాడు. పరమ పవిత్రాలైన ఆయన లీలలను అభివర్ణించా లనుకున్నాడు. విబుధులకు సంతోషాన్ని కలిగించే ఆయన పరాక్రమాన్ని ప్రస్తుతించా లనుకున్నాడు. తన మనస్సులోని కోరికను వెల్లడించా లనుకున్నాడు. కాని ఏమీ చేయలేక పోయాడు. ఆ ప్రజాకాముడైన దక్షప్రజాపతిని చూచి సర్వజ్ఞుడు, సర్వప్రాణి హృదయాంతర్యామి అయిన ఆ స్వామి అతని అభిప్రాయాన్ని గ్రహించి ఆర్తజన పరిపోషకాలైన మాటలతో ఇలా అన్నాడు. దక్షప్రజాపతీ! నిన్ను మెచ్చుకొన్నాను. నీ తపస్సు ఫలించింది. అచంచలమైన భక్తితో నన్ను సేవించి నా నుంచి వైభవోపేతమైన వరాలను అందుకొనడానికి నీకంటె అర్హుడు ఈ లోకంలో ఎవరున్నారు?ఇక నీ తపస్సు చాలించు. సకల ప్రాణికోటికి సమస్త శుభాలు చక్కగా సమకూరు గాక! నా మనస్సులోని సంకల్పం కూడా ఇదే. అది నీ వల్ల నెరవేరింది. విను. బ్రహ్మ, శివుడు, ప్రజాపతులు, మనువులు, ఇంద్రులు మొదలైనవారు సమస్త ప్రాణుల వైభవాలకు కారణమైనవారు. వీరంతా నా మహాశక్తి వలన జన్మించినవారే. ఇంద్రియ నిగ్రహం, నియమం, సంధ్యావందనం మొదలైన వానితో కూడిన తపస్సే నా హృదయం. అంగోపాంగ సహితమై ధ్యానరూపమైన విద్యయే నా దేహం. ధ్యానం మొదలైన విషయాలలో ప్రవర్తించే భావనాది క్రియయే నా ఆకారం. యజ్ఞాలే నా అవయవాలు. ధర్మమే నా ఆత్మ. దేవతలే నా ప్రాణాలు. వేదాలే నా స్వరూపం. ఈ జగత్తు ఉద్భవించడానికి పూర్వం నేను ఒక్కడినే ఉన్నాను. వెలుపల గానీ, లోపల గానీ వేరొక పదార్థం లేదు. అప్పుడు ఈ సమస్త విశ్వం సుషుప్తి అవస్థలో ఉండగా నేనొక్కడనే సంజ్ఞామాత్రంగా అవ్యక్తంగా ఉన్నాను. నేను అనంతుడనే. అనంత గుణాలతో కూడిన నా మాయవల్ల గుణశరీరమైన ఈ బ్రహ్మాండాన్ని, అయోనిజుడైన బ్రహ్మను సృష్టించాను. నా తేజస్సుతో నిండిన ఆ చతుర్ముఖ బ్రహ్మ సృష్టికార్యాన్ని చేపట్టి కూడా తనను కృతార్థుడైన వానిగా తలచుకోలేదు. అసమర్థతతో ఈ సృష్టి తనవల్ల కాదని భావించాడు. అప్పుడు తపస్సు చేయమని బ్రహ్మను నేను ప్రబోధించాను. చతుర్ముఖుడు నాచేత ప్రబోధితుడై ఘోరమైన తపస్సు చేసి మొట్టమొదటి సారిగా సృష్టికర్తలైన మిమ్మల్ని ప్రజాపతులుగా సృష్టించాడు. దక్షప్రజాపతీ! ఇప్పుడు పంచజన ప్రజాపతి పుత్రిక అయిన అసిక్ని అనే పేరు గల ఈ కన్యను నీకు ఇస్తున్నాను. నీవు ఈమెను భార్యగా పరిగ్రహించు. ఈమె యందు దాంపత్యధర్మంతో ప్రవర్తించి విస్తారంగా ప్రజలను సృష్టించు. అనంతరం ప్రజలందరూ నా మాయచే మోహితులై దాంపత్యధర్మాన్ని అవలంబించి ప్రజాభివృద్ధి కావించి నన్ను సేవించగలరు” అని దక్షప్రజాపతితో పలికి శ్రీమన్నారాయణుడు కలలో కనిపించిన పదార్థం వలె అంతర్ధానమైనాడు. అనంతరం దక్షప్రజాపతి విష్ణుదేవుని మాయచేత విమోహితుడై పంచజనుని పుత్రిక అయిన అసిక్ని అనే పత్ని యందు హర్యశ్వులు అనే పేరుగల వారిని పదివేలమంది కుమారులను కన్నాడు. ధర్మస్వభవులైన ఆ దక్షుని కుమారులు పదివేలమంది తమ తండ్రి ఆజ్ఞానుసారం ప్రజలను సృష్టించే నిమిత్తం తపస్సు చేయాలని నిశ్చయించారు. ఆ హర్యశ్వులు పడమటి దిక్కుకు ప్రయాణం చేశారు. అక్కడ సింధునది నముద్రంలో సంగమించే ప్రదేశంలో నారాయణ సరస్సు అనే తీర్థరాజాన్ని చూశారు. ఆ పుణ్యతీర్థం సమస్త దేవతలచేత, మునీశ్వరులచేత, సిద్ధపురుషులచేత సేవింపబడుతూ ఉంటుంది. ఆ తీర్థాన్ని దర్శించినవారు సమస్త పాపాల నుండి విముక్తులై నిర్మల హృదయులౌతారు. అటువంటి పవిత్ర తీర్థంలో ఆ హర్యశ్వులు స్నానం చేశారు. పరిశుద్ధమైన మనస్సులు కలవారై ప్రజాసర్గం నిమిత్తం పరమాత్మను ఉద్దేశించి భయంకరమైన తపస్సును ప్రారంభించారు. ఒకనాడు నారదుడు అక్కడికి వచ్చి వారితో ఇలా అన్నాడు.నాయనలారా! మీరు మిక్కిలి మూఢులుగా ఉన్నారు. భవిష్యత్తును చూడలేకున్నారు. మీరు పసిబిడ్డలు. ఈ భూమి పరిమాణం ఎంతో తెలియనివారు. ఇక జీవులను ఎలా సృష్టించగలరు? మహాత్ముడైన పురుషుడు ఒక డున్నాడు. స్త్రీరూపిణియై అనేక రూపాలు ధరించిన ప్రకృతి ఒకటున్నది. మాయలమారి అయిన ఆ ప్రకృతి పురుషుణ్ణి లోబరచుకుంటుంది. ప్రకృతి, పురుషుడు కలిసి సంసార ప్రవాహాన్ని సాగిస్తారు. ఈ సంసారమనే నది రెండు వైపులనుండి ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రవాహాన్ని అనుసరించి ఒక హంస విహరిస్తూ ఉంటుంది. ఆ హంసకు ఇరవై అయిదు మహిమ లుంటాయి. అయినా ఆ హంస సరియైన మార్గం కానరాక వజ్రకాంతులతో మెరుస్తున్న జలప్రవాహం పడే గోతి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హర్యశ్వులారా! వినండి. ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోకుండా కేవలం మీ త్రండి ఆజ్ఞలను పాటించడానికి పూనుకొన్నారు. అటువంటి మిమ్ములను తెలివి తక్కువవాళ్ళు అని కాకుండా ఇంకేమనాలి?”అని నారదుడు బోధించగా హర్యశ్వులు తమ బుద్ధితో విమర్శించుకొని తమలో తాము ఇలా తర్కించుకొన్నారు.

ముందుగా మనం సూక్ష్మబుద్ధితో క్షేత్రజ్ఞుడంటే ఎవరో తెలుసుకోవాలి. తర్వాత అజ్ఞానబంధన రూపమైన లింగదేహమంటే ఏమిటో గ్రహించాలి. ఆత్మ, దేహం ఈ రెండింటి స్వరూపాలను తెలుసుకోకుండా కేవలం నిరుపయోగాలైన కర్మలు ఆచరించిన మాత్రాన మోక్షం లభించదు. ఈ సమస్త లోకాలకు మూలకారకుడైన భగవంతుడు ఒక డున్నాడు. ఆయన సర్వేశ్వరుడు, పుట్టుక లేనివాడు, ఆత్మాశ్రయుడు, పురుషోత్తముడు. అటువంటి అంతర్యామి అయిన స్వామిని దర్శింపలేకుంటే బ్రహ్మకైనా మోక్షం లభిస్తుందా? పురుషుడు సంసారమనే పాతాళ కూపంలో కూరుకొనిపోయి బయట పడకుండా ఉంటే పరబ్రహ్మ స్వరూపాన్ని ఎట్లా గుర్తించగలుగుతాడు? కర్మలు ఆచరించటం వల్ల స్వర్గఫలాలు ప్రాప్తిస్తాయి. కాని కైవల్యం చేకూరదు.భగవన్నిష్ఠ లేకుండా దుష్కర్మలు చేసేవారికి ఏమీ ప్రయోజనం ఉండదు. చంచలమైన బుద్ధి చెడు గుణాల వ్యామోహానికి లొంగి రంగులు పులుముకొని వింత వింత వేషాలు వేస్తూ ఉంటుంది. అటువంటి దుర్గుణాల వలయంలో చిక్కుకొని దిక్కుతోచని వానికి మోక్షం అందనే అందదు.

 

మానవుడు అవకాశాన్ని కల్పించుకొని ఎడతెగకుండా సంతతిని సృష్టిస్తూ ఆ ప్రవాహంలో పడి కొట్టుకుపోతూ ఉంటాడు. మాయ వల్ల అతిశయించిన ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక సతమతమౌతూ ఉంటాడు. అహంకారం అతణ్ణి వివశుణ్ణి చేసి జ్ఞానమార్గానికి దూరం చేస్తుంది. బలవంతంగా వానిచేత దుష్కర్మలు చేయిస్తుంది. ఈ విధంగా పుట్టుక, చావు, రోగం అనే దురవస్థలలో మునిగి తేలే జీవుడు ఆ బంధలనుండి బయటపడి సకల సౌఖ్యాలకు ఆకరం, పరమ సుందరం అయిన మోక్షమార్గాన్ని ఎలా అందుకోగలడు?

దుర్బుద్ధి కల పురుషుడు వక్రబుద్ధి కల స్త్రీని పెండ్లాడితే ఆ సంసారం సరసంగా ఉండదు. అటువంటి సుఖదుఃఖ మయమైన సంసారంలో పడిన జీవుడు తిరిగి స్వస్వరూపాన్ని తెలుసుకోలేడు. అతనికి మోక్షం లభించదు.పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచభూతాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం, పురుషుడు అనే ఇరవైయైదు తత్త్వాలను ప్రతిబింబించే అద్దం వంటిది పరతత్త్వం. అటువంటి పరతత్త్వాన్ని పట్టుకొనే ఉపాయం తెలుసుకోకుండా జీవుడు పనికిమాలిన పనులు చేస్తుంటే వానికి ఉత్తమమైన ముక్తిమార్గం ఎందుకు అందుతుంది?

 సంసారబంధంలో చిక్కుకొని మోక్షాన్ని అనుసంధానం చేసే ఆధ్యాత్మిక విద్యను పరిత్యజించి కర్మ కలాపంలో పడిన అజ్ఞానాంధుడైన అభాగ్యునికి శుభాలు ఎలా కలుగుతాయి? శక్తిమంతమైన ఈ కాలచక్రానికి సమస్త జగత్తును చుట్టచుట్టి పట్టుకొని సున్న చుట్టి మటుమాయం చేసే కిటుకులు తెలుసు. అటువంటి కాలస్వరూపాన్ని తెలుసుకోకుండా ఊరకే కర్మలు చేసేవానికి అక్షయమైన మోక్షపదం ఎలా దక్కుతుంది?

ఈ సృష్టి కార్యాన్ని మనతండ్రి అయిన దక్షప్రజాపతికి అతని తండ్రి బ్రహ్మదేవుడు అప్పగించాడు. అతి భయంకరమైన ప్రవృత్తి మార్గం పై ఆసక్తి లేనివాడై మనతండ్రి ఆ కార్యాన్ని పూర్తి చేయలేకపోయాడు.” అని ఆ దక్షుని కుమారులు తమలో తాము తర్కించుకొని...

రాజా! విను. ఆ హర్యశ్వులు నారద మునీంద్రుని హితోపదేశాన్ని శిరసావహించి భక్తితో అతనికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి తత్క్షణమే మోక్షమార్గాన్ని అవలంబించి కృతార్థులయ్యారు. సహజ మధురమైన శ్రీమన్నారాయణుని పాదకమల మకరందాన్ని పానం చేస్తూ, తన మానసమనే మధుకరం పరవశిస్తుండగా, గుణవిశారదుడైన నారదుడు శ్రీహరి లీలలను తన మహతీవీణపై మ్రోగిస్తూ, యథేచ్ఛగా వెళ్ళిపోయాడు.

అప్పుడు దక్షుడు తన కుమారులు ప్రవృత్తి మార్గాన్ని పరిత్యజించి నివృత్తి మార్గాన్ని స్వీకరించి మోక్షప్రవృత్తులైనారని నారదుడు చెప్పగా విన్నాడు. అతనికి దుఃఖం పొంగి వచ్చింది. హృదయం వ్యాకుల మయింది. దక్షుడు దుఃఖిస్తూ ఉండగా బ్రహ్మదేవుడు వచ్చి ఓదార్చి “పూర్వంలాగా అపార గుణవంతులైన కొడుకులను పుట్టించు” అని ప్రోత్సహించాడు. దక్షుడు తండ్రి ఆజ్ఞను పాటించి అసిక్ని యందు శబలాశ్వులు అను చక్కనివారు, పుణ్యాత్ములు అయిన వేలకొలది కుమారులను కన్నాడు.తమను పుట్టించిన తండ్రి అంతరంగాన్ని తెలుసుకొన్న ఆ కుమారులు ప్రజలను సృష్టించడానికి దీక్ష వహించి, తపస్సు చేయటానికి వెళ్ళారు.ఆ శబలాశ్వులు తండ్రి ఆజ్ఞానుసారం ప్రజాసృష్టి కొరకు తపస్సు చేయాలనే కోరికతో తీర్థాలలో ఉత్తమమైన నారాయణ తీర్థాన్ని చేరుకున్నారు. ఆ పుణ్యతీర్థం దర్శనమాత్రం చేతనే సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలాన్ని అనుగ్రహిస్తుంది. సకల పాపాలను హరిస్తుంది. అటువంటి తీర్థరాజాన్ని స్పర్శించి తమ దోషాలను పోగొట్టుకొని పవిత్రులైనారు.

శబలాశ్వులు బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా అందుకోలేని పరబ్రహ్మాన్ని బ్రహ్మానందంతో ధ్యానం చేశారు. ఆ బాలకులు తమ నాలుకలతో పరమాత్మకు సంబంధించిన మంత్రాలను ఉచ్చరిస్తూ భగవంతుణ్ణి దర్శించాలనే కుతూహలంతో సమస్తమూ ఆ పరబ్రహ్మ స్వరూపంగా భావించి ఆనందమయుడైన ఆ దేవదేవుని గురించి తపస్సు చేశారు. ఆ శబలాశ్వులు ఒంటికాలి బొటనవ్రేలు నేలమీద మోపి నిక్కి నిశ్చలదేహులై నిలుచున్నారు. రెండు చేతులను జోడించి పైకెత్తి ఆకాశంలోకి చూశారు. సూటిగా ప్రసరించే చురుకైన చూపులతో సూర్యుణ్ణి చూస్తూ కొంతకాలం వాయు భక్షణం చేస్తూ మరికొంత కాలం నిరాహారులై లోకాలు కంపించగా, దేవతలు భయపడగా తపస్సు కొనసాగించారు.


🙏🙏🙏

కామెంట్‌లు లేవు: