6, ఫిబ్రవరి 2021, శనివారం

శ్రీ అగ్ని మహా పురాణం - 30 వ అధ్యాయం

 🔥🔥 *శ్రీ అగ్ని మహా పురాణం - 30 వ అధ్యాయం - మణ్డలాదివర్ణనం* 🔥🔥


*నారదుడు చెప్పెను :*


*భద్రమండలము మధ్య నున్న కమలమున అంగదేవతా సహిత బ్రహ్మను పూజింప వలెను. తూర్పున నున్న కమలమున పద్మనాభుని, ఆగ్నేయమున నుద్న కమలమున ప్రకృతిని, దక్షిణమున నున్న కమలమున పురుషుని దక్షిణభాగమున అగ్నిదేవతను , నైరృతిదిక్కున నిరృతిని , పశ్చిమదిక్కున నున్న కమలమున వరుణుని , వాయవ్యదిక్కునం దున్న కమలమున వాయువును , ఉత్తరదిక్కునందున్న కమలమున ఆదిత్యుని , ఈశాన్యదిక్కునందున్న కమలమున బుగ్వేద యజుర్వేదములను పూజింపవలెను. రెండవ ఆవరణమునందు ఇంద్రాది దిక్పాలకులను, షోడశ దల కమలమున క్రమముగా సామవేద, అథర్వవేద, ఆకాశ, వాయు, తేజో, జల, పృథివీ, మనః, శ్రోత్ర, త్వక్‌, నేత్ర, రసనా, ఘ్రాణ, భూర్లోక, భువర్లోకములను పూజింపవలెను.*


*పిమ్మట తృతీయవరణము నందలి, ఇరువదినాలుగు దళముల కమలమున క్రమముగ మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోక, అగ్నిష్టోమ, అత్యగ్నిష్ణోమ, ఉక్థ, షోడశీ, వాజపేయ, అతిరాత్ర, ఆప్తోర్యామ, వ్యష్టిమనో, వ్యష్టిబుద్ధి, వ్యష్ట్యహంకార, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ, జీవ, సమస్టిమనః, సమష్టిబుద్ధి (మహత్తత్వ), సమష్ట్యహంకార, ప్రకృతులను పూజింపవలెను. వీటి అన్నింటియొక్క స్వరూపము శబ్దమాత్రమే. అనగా కేవలము వీటి పేరులు చెప్పి నమస్కరించిన చాలును; మూర్తులను ధ్యానింపవ అవుసరము లేదు. ఇరువది యైదవ అధ్యాయములో చెప్పిన వాసుదేవాదిమూర్తులను తొమ్మిందింటిని, దశవిధ ప్రాణములను, మనో, బుద్ధ్య, హంకార, పాయు, ఉపస్థలను, శ్రోత్ర, త్వక్‌, నేత్ర, రసనా, ఘ్రాణ, వాక్‌, పాణి, పాదములను, ఈ ముప్పదిరెండింటిని, ముప్పదిరెండు దళముల కమలమున ఆర్చన చేయవలెను. ఇవి నాల్గవ అవరణమునందలి దేతవలు. ఈ ఆవరణమున సాంగ సపరివార దేవతాపూజ చేయవలెను.*


*పిమ్మట వెలుపలి ఆవరణమునందు పాయు ఉపస్థల పూజ చేసి, పండ్రెండు మాసాల అధిపతులను, పురుషోత్తముడు మొదలగు ఇరువది యారు తత్త్వములను పూజించవలెను. మాసాధి పతుల పూజ చక్రాబ్జముపై క్రమముగా చేయవలెను. ఎనిమిది, లేదా ఆరు, లేదా ఐదు ప్రకృతులను అచటనే పూజింపవలెను. పిమ్మట మండలములపై వేరు వేరు రంగులు గల చూర్ణములు చల్లవలెను. ఎచట ఏ రంగుగల చూర్ఱము చల్లవలెనో చెప్పదను; వినుము కమలకర్ణిక రంగు పసుపు పచ్చగా ఉండవలెను. సమస్తరేఖులును సమప్రమాణము గలవై తెల్ల రంగలో నుండవలెను. రెండు హస్తముల మండలముల రేఖలు బొటనవ్రేలంత లావుగా ఉండవలెను. ఒక హస్తము మండలమునందలి రేఖలు బొటనవ్రేలి లావులో సగము లావు ఉండవలెను. రేఖలు తెల్లగా ఉండవలెను. పద్మములకు తెల్లరంగును, సంధులకు నలుపు లేదా నీలి రంగు వేయవలెను. కేసరములు ఎరుపు-పసుపురంగులో ఉండవలెను. కోణములం దున్న కోష్ఠములను ఎఱ్ఱని రంగు గల చూర్ణముతో నింపవలెను. ఈ విధముగా యోగపీఠమును యథేష్టముగ అన్ని రంగులతోను అలంకరింప వలెను. వీథిని లతల తోడను, పత్రాదుల తోడను అలంకరింపవలెను. పీఠద్వారమును తెల్లని రంగు గల చూర్ణముతోను, శోభాస్థానములను ఎఱ్ఱని చూర్ణముల తోడను నింపవలెను. ఉపశోభలపై నీలి రంగు చూర్ణము చల్లవలెను. కోణముల శంఖములను తెల్లగా చిత్రింపవలెను. ఇది భద్రమండలముపై రంగు లుంచు విధానము. ఇతర మండలముపై గూడ ఈ విధముగనే అనేకవిధము లగు వర్ణములు గల చూర్ణములు చల్లవలెను. త్రికోణమండలము తెలుపు - ఎరుపు - నలుపురంగులతో అలంకరింప వలెను. ద్వికోణమును ఎరుపు పసుపు రంగులతో అలంకరింపవలెను. చక్రకమలమునందలి నాభిస్థానమును నలుపురంగు చూర్ఱముతో అలంకరిపవలెను.*


*చక్ర కమలము ఆకులకు పసుపు-ఎరుపు రంగులు వేయవలెను. చక్రము అంచును నీలము-ఎరుపు రంగులు వేసి అలంకరింప వలెను. బైట నున్న రేఖలకు తెలుపు, శ్యామము, ఎరుపు, నలుపు, పసుపు* *రంగులు వేయవలెను. వరిపిండి మొదలగువాటిని తెలుపురంగునకు ఉపమోగించవచ్చును. కుసుంధచూర్ణాదులు ఎరుపు రంగునకును, పసుపు పసుపురంగునకును, మాడ్చిన బియ్యపు పిండు నల్లరంగునకును ఉపయోగించును. శమీ* *పత్రాదులచే శ్యామవర్ణము వేయవచ్చును. బీజ మంత్రములను ఒక లక్ష జపించుట చేతను, ఇతర మంత్రములను అక్షరలక్షలు జపించుట చేతను, విద్యలను ఒక లక్షజపించుట చేతను, బుద్ధవిద్యలను పదివేల సార్లు జపము చేయుట చేతను స్తోత్రములను వేయి* *పర్యాయములు జపించుట చేతను, లేదా అన్ని మంత్రములను మొదట ఒక లక్ష జపించుటచేతను, మంత్రశుద్ధియు, ఆత్మశుద్ధియు కూడ కల్గును. రెండవ పర్యాయము ఒక లక్ష* *జపించుటచే మంత్రము క్షేత్రీకృత మగును (సాధకునకు దానిపై నిలకడ ఏర్పడును). బీజ మంత్రజపము మొదట ఎంత సంఖ్యలో చేయబడునో హోమము కూడ అంత సంఖ్యలోనే చేయవలెను. ఇతర మంత్రముల విషయమున హోమము జపసంఖ్యలో పదవ వంతు* *చేయవలెను. మంత్ర పునః శ్చరణము చేయ సంకల్పించినప్పుడు ఒక్కొక్క మాసము వ్రతo ఆవలంబింప వలెను. నేలపై మొదట ఎడమ కాలు ఉంచవలెను. దానము పట్టగూడదు. ఈ రెండు రెట్లు మూడురెట్లు జపము చేసిననే మధ్యమ ఉత్తమ శ్రేణికి చెందిన ఫలముల లభించును*


*ఇపుడు మంత్రమువలన ఫలము సిద్ధించుటకై ఉపమోగించు మంత్ర ధ్యానమును చెప్పెదను - మంత్రము యొక్క స్థూల రూపము శబ్దము. ఇది దాని బాహ్యరూపము. మంత్రముయొక్క సూక్ష్మ రూపము జ్యోతిర్మయ మైనది. ఇదే దాని ఆంతరరూపము. ఇది కేవలము చింతనామయ మైనది. చింతనమునకు కూడు అతీతమైనది మంత్రము యొక్క పర రూపము. వరాహ నరసింహ-శక్తిమంత్రముల స్థూలరూపమునకే ప్రాధాన్యము. వాసుదేవుని రూపము చిన్తనరహిత మని చెప్పబడినది.*


*ఇతరదేవతల చింతామయ మగు ఆంతరికరూపమే సర్వదా ముఖమైనదిగ పరిగణింపబడుచున్నది. విరాట్టు యొక్క స్వరూపము స్థూలము. లింగమయ స్వరూపము సూక్ష్మము. ఈశ్వరుని రూపము చింతారహితము. బీజమంత్రము హృదయ కమలము నందు నివసించునది; అవినాశి; చిన్మయము; జ్యోతి స్వరూపము. జీవాత్మకము. దాని ఆకాశము కదంబ పుష్పముతో సమానము. ఈ విధముగ ధ్యానింపవలెను. కుండలో నుంచిన దీపముయొక్క కాంతి పైకి ప్రసరింపకుండునట్లు నిరుద్ధమై సంహత రూపమున ఒంటరిగా ఉన్నట్లు, మంత్రేశ్వరుడు హృదయము నందు ప్రకాశించుచుండును. అనేక రంధ్రములున్న కుంభములో నుంచిన దీపము కాంతులు ఎన్ని రంధ్రము లున్నవో అన్ని బైటకు ప్రసరించినట్లు జ్యోతిర్మయ బీజ మంత్రముల రశ్ములు నాడుల ద్వారా ప్రసరించుచు దేవాత్మక దేహముతో ప్రకాశించును. నాడులు హృదయమునుండి బయల్వెడలి నేత్రేంద్రియము వరకును ప్రసరించి ఉన్నవి. వాటిలో అగ్ని - సోమాత్మకము లగు రెండు నాడులు నాసికాగ్ర భాగమునందుడును. మంత్రసాధకుడు ఉద్ఘాతయోగముచే శరీరవ్యాపియై యున్న ప్రాణవాయువును చక్కగా జయించి జపధ్యానతత్పరుడై యున్నచో ఆతనికి మంత్రఫలము లభించును. పంచభూతతన్మాత్రల శుద్ధి చేసికొని యోగాభ్యాసము చేయు సాధకుడు కోరికలు కలవాడైనచో అణిమాది సిద్ధులను పొందును. వైరాగ్యవంతు డైనచో ఆ సిద్ధులను దాటి, చిన్మయ స్వరూపముతో నుండి, భరూత మాత్రల నుండియు, ఇంద్రియము లనెడు గ్రహముల నుండి సర్వదా విముక్తుడగును.*


*శ్రీ మదగ్ని మహాపురాణము నందు మండలాదివర్ణన మను ముప్పదవ అధ్యాయము సమాప్తము.*

       🔥🔥🔥🔥🔥

కామెంట్‌లు లేవు: