**దశిక రాము**
**సౌందర్య లహరి**
**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**
ఇరవైమూడవ శ్లోక భాష్యం - ఐదవ భాగం
ఇక చౌర్యమంటారా? శివుడే అనేక చౌర్యాలు చేశాడని కవులంటారు. ఆవిడ ఆయనలో సగభాగం అవునా? కాదా? మరి కామదహనం మూడవకన్నుతో చేసినపుడు ఆమె పాత్ర సగపాలు ఉన్నదా? లేదా? శివుడు మాత్రమె కామసంహార మూర్తి అన్న కీర్తిని వహించడం న్యాయమా? శివుడు కాలుని తన్ని నాశనం చేసింది ఏ కాలితో? ఎడమ కాలితో. అది ఆయనదా? ఆయనకు సంబంధమే లేదే! మరి పేరు మాత్రం ఆయన తీసుకోవడం ఏమి న్యాయం. ఆయనకు కాలసంహార మూర్తి అన్న పేరున్నది. నిజానికి దొంగతనం వలన బాధింప బడింది అంబిక-వేదమే ఆయనను “తస్కరాణాం పతిః” దొంగల నాయకుడని చెప్పుతోంది. దొంగతనం ఆరంభిం చిందే భార్య దగ్గర. ఆమె తన శరీరమే కాక, కీర్తి; ఒక్క కీర్తీ ఏమిటి సర్వస్వాత్మనివేదనం చేసుకొని మహా పతివ్రతగా మిగిలిపోయింది.
అంబిక శివుని యెడ పరమమైన ప్రేమతో తనలో ఉంచుకొన్నదని ఆచార్యులవారి ఉద్దేశం. ఆయన ఆమెతో ఉన్నాడు కనుక కామాక్షీదేవిని దర్శించినపుడు మనం శివుని కూడా దర్శించిన వారమవుతున్నాము. తల్లిదండ్రులను పూజించడంలో ఉన్న ఆనందం తల్లిలోనే తండ్రి కలసిఉన్న ఆమెను అర్చించడంలో లభిస్తుందికదా! శివుని తల్లి కూడా తానే అయిన మూర్తిగా మనం ప్రార్థిస్తున్నాము. అదే విధంగా తో తండ్రికూడా తానే అయిన మూర్తిగా అంబికను ప్రార్థించడం లో ఆనందమున్నది. బ్రహ్మ, బ్రహ్మశక్తి రెండూ రెండు రూపాలుగా ఉండనక్కరలేదు. అంబిక శివశక్తులు కలిసి ఉన్నరూపం. ఈ అద్వైత సత్యమే ఈ శ్లోకపు అంతరార్థం.
అంబిక దేహమంతా అరుణ కాంతిమయం, ఆమె అంబిక ఒక్కతేనని ఆ కాంతిలో ఆమె ప్రతి అవయవము దర్శించ డానికి ప్రయత్నిస్తాము. ఆమె నుదిటి కంటినీ, చంద్రవంకనీ చూసినపుడు మా ఆరాధ్య దైవమైన చంద్రమౌళీశ్వరుడు స్కృతికి మెదులుతాడు. నేను చంద్రమౌళీశ్వరుని చూశానా అని పరికించి చూసినపుడు ఆ రెండూ తప్ప శివుని శరీరము నకు సంబంధించిన మరే అవయవమూ కన్పించదు. ఇటు వంటి ఒక అనుభూతితో ఆచార్యులవారు “ఓ సగభాగం ఆక్రమించి కూడా తృప్తిపొందక మిగతా భాగాన్ని కూడా - దొంగిలించావా” అని అడుగుతున్నారు.
శివుడనే అమృతాన్ని పంచుకోవడానికి సాధ్యం కాదు. మొత్తంగా ఆస్వాదించవలసిందే- అంబిక సరిగ్గా అదే చేసింది.
(సశేషం)
కృతజ్ఞతలతో 🙏🙏🙏
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
#ParamacharyaSoundaryaLahariBhashyam
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి