6, ఫిబ్రవరి 2021, శనివారం

సౌందర్య లహరి**

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఇరవైనాల్గవ శ్లోక భాష్యం - మొదటి భాగం


జగత్సూతే ధాతా హరిరవతి రుద్రః క్షపయతే

తిరస్కుర్వ-న్నేతత్ స్వమపి వపు-రీశ-స్తిరయతి !

సదా పూర్వః సర్వం తదిద మనుగృహ్ణాతి చ శివ-

స్తవాఙ్ఞా మలంబ్య క్షణచలితయో ర్భ్రూలతికయోః !!


అమ్మా! నీ లతలవంటి కనుబొమల కదలికనుండి ఆజ్ఞను స్వీకరించి బ్రహ్మ ప్రపంచమును సృష్టించును. విష్ణువు పాలించును. రుద్రుడు సంహరించును. ఈశ్వరుడు వారిని తనలో లయము చేసుకొనుచూ తాను కూడా లయమవుచున్నాడు. సదా అన్న శబ్దము మొదలుగా కలిగిన శివుడు సర్వమును మరల అనుగ్రహించుచున్నాడు.


రెండవశ్లోకంలోనే ఆచార్యులవారు బ్రహ్మవిష్ణు రుద్రుల విధుల గురించి ప్రస్తావించారు. ఇక్కడ కూడా ఆ విషయాన్ని పునః ప్రస్తావిస్తున్నారు. “జగత్సూతే విధాతా బ్రహ్మ ఈ లోకములను పుట్టిస్తున్నాడు". “హరిరవతి” విష్ణుమూర్తి రక్షిస్తున్నాడు. “రుద్రః నీ క్షపయతి” రుద్రుడు సంహారం చేస్తున్నాడు. ఆచార్యుల నీ వారీ శ్లోకంలో పంచక్రియలలో మిగతా రెండు కార్యములను, చేసే దేవతలను కూడా ప్రస్తావిస్తున్నారు. ఈ ఇద్దరిలో ఒకడు ఈశ్వరుడు. 'ఈశస్తిరయతి' ఈశ అన్న ఈశ్వరుడన్న ఒకటే - ఈయన తిరోధాన కార్యము అంటే త్రిమూర్తులతో సహా ఈ సర్వాన్నీ మాయలో ముంచెత్తుతాడు. 'తిరయతి' అంటే కప్పి ఉంచటం మాయతో కప్పిఉంచడమన్న అర్థం. ఈశ్వరుడు పాలించే వాడని ఈతడు అంబిక పంచాక్రియల నిర్వహణకు నియమించిన అధికారులలో ఒకడు మాత్రమే! నిజమైన యజమాని అంబిక, పరాశక్తి. ఆమె అయిదుగురు అధికారులను నియమించి, వారిచేత పని చేయించుతున్నది.


పనిచేయిస్తున్నదంటే మెమోలు, సర్క్యులర్లు పంపుతున్నదా లేక మౌఖికమైన ఉత్తర్వులు జారీచేస్తున్నదా? మహారాజ్ఞి అయిన ఆ తల్లి ఇంతటి చిన్న చిన్న విషయాలకై అంత శ్రమ తీసుకోనవసరం లేదు. ఆమె వద్దనుండి చిన్న సూచన లభిస్తే చాలు ఈ అధికారులు మెరుపువేగంతో పనిచేస్తారు. ఆమె తన లతలవంటి కనులతలను క్షణకాలం కదపడం వంటి చిన్న సంజ్ఞ చేస్తేచాలు. “క్షణ చలితయో గ్ర్భూలతికయోః" - ఆ సంజ్ఞనే ఆమె ఆజ్ఞగా గ్రహించి “ఆజ్ఞామాలభ్య” ఈ పంచక్రియలు నిర్వహించడానికి ఆమెచే ఏర్పాటు చేయబడిన దేవతలు వారి వారి విధులు చేయడానికి శీఘ్రగతిని సాగిపోతారట.


మొదటి శ్లోకంలో అంబిక సర్వోన్నతమైన స్థితిలో అభివర్ణించబడింది. అక్కడ త్రిమూర్తులు ఆమె భక్తులు - ఆమె వారి ఆరాధ్యదైవం. ఇక్కడ రాచరికపు మర్యాదలు, హంగులు చూపబడినా వారితో ఆమె సంబంధం ఒక యజమాని, సేవకుల మధ్యనుండే సంబంధం వంటిదే! మరి ఆరాధ్యదైవం కంటే యజమాని స్థితి కొంచెం నిమ్నమైనదే కదా?


సరి! ఆమె పరిజనులలో తిరోధాన కార్యం నిర్వహించే ఈశ్వరుడొకడు. సమస్త విశ్వాన్ని, త్రిమూర్తులను మాయా బద్దులను చేసి ఉంచేది నేనేకదా అని ఆయన అనుకుంటూ ఉండవచ్చు. అందుకే ఆయన మహోన్నతుడైన దైవతమని సూచించే ఈశ్వర నామము వచ్చింది. “తిరస్కుర్వన్నేతత్" త్రిమూర్తులను కూడా మాయా బద్దులను చేస్తాడని చెప్పబడింది. “స్వమపి వపుః ఈశస్థిరయతి”. అంతేకాదు, తానేమి చేస్తున్నాడో తెలియక తనుకూడా మాయాబద్దుడై కప్పబడతాడట. అతని శక్తి నైపుణ్యములు అంబిక అనుగ్రహం. తన మాయచేతనే తాను కప్పబడేవాడు ఈశ్వరునిగా పిలవ బడటంలో హేతువులేదు. అంబికే నిజమైన ఈశ్వరి. ఆయనను ఆ పేరు ధరించనీయడం అంబికయొక్క పెద్దమనసు.

**దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఇరవైనాల్గవ శ్లోక భాష్యం - రెండవ భాగం


అయిదుగురు అధికారులలో నలుగురిని చూశాము, ఇక అయిదో అధికారి అనుగ్రహం చేస్తూ ఉంటాడు. అంబిక - ఈశ్వరుని ఉదాహరణ చూసిన తరువాత ఈయన ఇంకొక మెట్టు పెద్దదైన పేరుపెట్టు కొంటాడోమో! నాకంటే ఉన్నతుడునని సూచించే పేరుపెట్టుకోవచ్చు. అయితే నాకంటే ఉన్నతు లేవరూ లేరే? సములు ఎవరైనా ఉన్నారా అంటే అది నాపతి అయిన శివుడు మాత్రమే! మేమిద్దరమే ఈ పంచకృత్యాలు నిర్వహించే అధికారుల కంటే ఉన్నతులము. ఇప్పుడు ఈ అయిదవ అధికారి ఏమిపేరు పెట్టుకొంటాడో - అని ఆలోచించి నట్లుంది. ఆ అయిదో అధికారిని పిలిచి “నీ పేరు నీవే ఎన్నుకోవచ్చు. అయితే, శివుడనే పేరుమాత్రం పెట్టుకోవద్దు” అని శాసించినట్లుంది.


పెరుమాళ్ళు కింద ఎంతో భక్తిగల ఒక వైష్ణవ భూస్వామి వద్ద ఒక సేవకుడు ఉన్నాడు. ఒక రోజు ఆ యజమాని అతనిని “నీపేరేమిటి” అని అడిగినాడు. ఆతడు “పెరుమాళ్ళు” అని సమాధానం చెప్పాడు. "ఆ! ఒక సేవకుడు స్వామి నామంతో పిలవబడటమా? ఎంతటి అపచారం” అనుకొని ఆ భూస్వామి సేవకుని పెరుమార్చుకుని గాని పనిలోకి రాకూడదని చెప్పాడు. మరి దానికి చాలా ఖర్చు అవుతుంది. గ్రామపెద్ద కార్యాలయానికి వెళ్ళాలి. మేకనో కోడిపుంజునో బలి ఇవ్వాలి. చాలా ఖర్చవుతుంది. యజమాని ఆ ఖర్చు భరించడానికి ఒప్పుకుని బదులిచ్చాడు. ఆయనకు కావలసింది తాను సేవకుని తన ఆరాధ్యదైవమైన పేరుమాళ్ళు పేరుతో పిలవరాదనిమాత్రమే! పేరు మార్చుకొని వచ్చిన తరువాత యజమాని ఇప్పుడు “నీపేరేమిటి?” అని అడిగాడు. ఆ సేవకుడు “పెద్ద పెరుమాళ్ళు” అని చెప్పాడు. తమిళంలో “పెరుమాళ్ళు తరువాత పెద్ద పెరుమాళ్ళు” అన్న సామెత ఉన్నది.


తమిళంలో “పెరుమాళ్ కోయిల్” అంటే కాంచీపురం. ఒట్టిగా “కోయిల్” అంటే అది శ్రీరంగం. వైష్ణవులు రంగనాథుని ‘పెరియ పెరుమాళ్” అంటారు. “పెద్ద పెరుమాళ్ళు” అన్నా మరి ఇదే! తమిళదేశం చాలాకాలం తెనుగుల పాలనలో ఉన్నది. అందువల్లనే తమిళంలో చాలా తెలుగు పదాలుంటాయి. వాటిలో ఈ “పెద్ద” అన్న పదం ఒకటి. ఆచార్యులవారు ఆ అధికారి తన నామం సదా అన్నపదం ముందు చేర్చబడ్డ శివునిగా అంటే సదాశివునిగా పెట్టుకొన్నదని చెబుతున్నారు. “సదాపూర్వశివ”. కానీ ఆచార్యులవారు సదాశివుడని చెప్పక ఈ రకంగా చెప్పడం ఎందుకు? కొంటెతనం. చమత్కారం కోసం. అంబిక అమ్మ. ఏదో సందర్భంలో ఆమెను ఎగతాళి పట్టించడంలో ఒక ఆనందం ఉంది. ఆవిడ ఆ అధికారితో శివుని పేరుతప్ప ఏదైనా పేరు పెట్టుకోమందనుకోండి. ఆతడు సదా - నిత్యము, ఎల్లప్పుడూ అనే శబ్దంతో చేర్చిన శివుని పేరు పెట్టుకొన్నాడు. ఒకడు ఎల్లపుడూ శివుడయితే ఇక పేరు మార్చేదెలా? అంబిక విస్తు పోవడాన్ని ఆచార్యులవారు ఒక చమత్కారమైన మలుపుతో చెబుతామనుకొన్నారు. ఎంతో సున్నితంగా “సదాపూర్వశివు” డని చెప్పి పాఠకులలో ఒక ఉత్సుకతను రేకెత్తించి సమాధానం వెతుక్కొనేలా చేశారు. ఇలా చేయడం వల్ల పాఠకుల మనసుల్లో కథపైన లోతయిన ముద్ర ఉంటుంది. సదాశివుడని చెపితే ఇంత ఆలోచించాల్సిన అవసరమే ఉండదుకదా! ఈ రకంగా అమ్మవారిని పల్టీకొట్టించి 'సదాశివుడు' పేరు పెట్టుకొన్న అధికారి తన అనుగ్రహకార్యాన్ని అంబిక కనుసన్నల మేరకు జరుపుతూఉంటాడు. 


ఈ శ్లోకంలో అంబిక యజమానిగానూ, శివుడు తన రుద్ర, ఈశ్వర, సదాశివ రూపంలో సేవకులుగానూ అభివర్ణించ బడినాడు.


(సశేషం)


కృతజ్ఞతలతో 🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

(సశేషం)


కృతజ్ఞతలతో 🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

కామెంట్‌లు లేవు: