**దశిక రాము**
**శ్రీమన్నారాయణీయం**
**1-2-6-శ్లో.**
ఏవంభూతమనోజ్ఞతా నవసుధానిష్యందసందోహనం
త్వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతామ్।
సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచ యత్యంగకం
వ్యాసించత్యపి. శీతబాష్పవిసరైరానందమూర్ఛోద్భవైః||
భావము: సౌందర్యామృత మయమైన నీ రూపము బహు మనోజ్ఞమైనది. నిత్య నూతనమైనది. అట్టి నీ స్వరూప ఆకర్షణతో ప్రేరేపింపబడిన భక్తుల చిత్తములు పరతత్వ జ్ఞానానందము పొందుతాయి. వారి శరీరములకు గగుర్పాటు కలిగి, ఆనందభాష్పములతో పులకితులవుతారు.
వ్యాఖ్య - మనలను ఈ లోకానికి బంధించేది మనస్సు. మనస్సు వామనాడియైన ఇడానాడి అధీనములో ఉన్నది. దానిని ఆధారముగా చేసుకుని కూడా పైకి వెళ్ళవచ్చును. లోకములో అనేక వస్తువులపై పెంచుకునే మోహమును పరమేశ్వరునియందే పెంచుకొనవచ్చును. అన్నికోరికలు తీరుటకు ఆయననే ఆరాధింపవచ్చును. మధురమైన పాయసమును త్రాగితే కలిగే సంతృప్తిని ఆయనే ఈయగలడు. ఆయన చూపించేది ముక్తి మార్గమే అవుతుంది.
అటువంటి స్థితికి చేర్చే భక్తి ఎలా ఉండాలో భాగవతంలో వచ్చే ప్రహ్లాదుడి మాటల్లో చూద్దాం.
"దేవతలూ, సిద్ధులూ, మునీశ్వరులూ, బ్రహ్మదేవుడు మున్నగువారు ప్రగాఢమైన కాంక్షతో నిన్ను నిత్యం అనేక విధాలుగా ఆరాధిస్తారు; నీ గుణాలను గానం చేస్తారు; కాని సంపూర్ణంగా నిన్ను తెలుసుకుని సమగ్రంగా నిన్ను అభివర్ణించలేరట! నేనేమో దైత్యునికి పుట్టినవాడిని; గర్వ మద స్వభావిని; చిన్నపిల్లాడిని; మూర్ఖుడిని; మరి నిన్ను కీర్తించటం నాకెలా సాధ్యం అవుతుంది?
ఓ నారసింహా! గొప్ప గొప్ప జపతపాలు, సద్వంశమూ, తేజస్సూ, వేద నైపుణ్యాలూ, సౌందర్యాలు, గట్టి నిష్ఠలూ, సత్కార్యాలు చేసే నైపుణ్యాలు, పరాక్రమాలూ, పౌరుషాలు, నైష్ఠికాలూ, శక్తిసామర్థ్యాలూ, హోమాలూ యజ్ఞాలూ మొదలైని ఏవీ కూడ నిన్ను సంతోషపెట్టటానికి సరిపోవు.
పూర్వం గజేంద్రుడు భక్తితో నిన్ను మెప్పించి మె
మోక్షం సాధించాడు కదా. నిన్ను మెప్పించటానికి అలాంటి భక్తి తాత్పర్యాలు అలవరుచుకోవాలి.
దానం, నీతి, సత్యం, క్షాంతి, ఈర్ష్య లేకపోవుట, యజ్ఞాలు, తపశ్శక్తి, అసూయ లేమి వంటివి ఎన్ని ఉన్నా గర్విష్ఠి అయిన బ్రాహ్మణుని కంటె త్రికరణసుద్ధిగా సమబుద్ధితో నిన్ను సేవించే చండాలుడు ఉత్తముడు. అట్టివాడు నీ సాన్నిధ్యాన్ని పొంది తన వంశం మొత్తానికి శోభ కలిగిస్తాడు.
భగవానుడు అజ్ఞానులు చేసిన భక్తిని స్వీకరించడు. కాని ఆయన దయాసముద్రుడు కనుక కొందరు అజ్ఞానులు చేసిన ఆరాధనలను కూడా స్వీకరిస్తాడు. ఆయన పరిపూర్ణుడు కనుక భక్తులు చేసే భక్తివలన భగవంతునికి ఏ ప్రయోజనమూ లేదు. అయినా సర్వ కార్యాలు భగవదర్పణంగా చేయవలెను, అలా చేస్తే అద్దంలో నుదుటి బొట్టు కనబడినంత స్వచ్ఛంగా, సర్వ కార్యాలు ప్రయోజనాలు చేకూరుతాయి.
భగవంతుడు హరి దయామయుడు, భక్తుల ఎడ బందువాత్సల్యం గలవాడు. ఆయన భక్తిని తప్ప మరి దేనిని మెచ్చడు అందుచేత విష్ణుభక్తి విడువక చేయవలెను.
శ్రీహరీ! మానవుడు కేవలం నీ గుణాలను కీర్తించటం ద్వారా అవిద్యను జయించి కైవల్యాన్ని అందుకుంటాడు.
భగవంతుడా! ప్రతీ జన్మలోనూ సుఖానికి వియోగం, దుఃఖానికి సంయోగం కలుగుతూనే ఉంది. దానితో నా కెప్పుడూ శోకమే ప్రాప్తిస్తూ ఉంది. ఈ శోకాగ్ని నన్నెప్పుడూ నిలువునా కాల్చివేస్తూ ఉంది. సుఖం ఇవ్వదని తెలిసినా, ఈ దేహం మీద అభిమానం వదలటంలేదు. అలా ఆ మోహంతో తిరుగుతున్నాను. అటువంటి నాకు ప్రియుడవు, సఖుడవు, పరదేవతవు సర్వం నీవే. నీ లీలావతారాలే బ్రహ్మగీతాలు. వాటినే నిత్యం పఠిస్తూ కోరికలనుండి విముక్తి పొంది, దుఃఖాలను అధిగమించి నీ పాదపద్మాలను సేవించే భక్తులతో కలిసి ఉంటాను.
చంటిపిల్లాడిని తల్లిదండ్రులూ, రోగిని వైద్యుడు ఇచ్చే ఔషధమూ, సముద్రంలో మునిగిపోతున్న వాడిని నావ ఎలాగైతే రక్షిస్తారో, అలాగే ఈ సంసార తాపత్రయాలతో తప్తులైన వారిని నీవే తప్ప మరెవరు రక్షించలేరు. నీచేత ఉపేక్షింపడిన వానిని, నువ్వు తప్ప మరెవ్వరూ ఉద్ధరించలేరు.
లోకంలో ఎవడు, ఏ కార్యం, ఎవరి ప్రేరణతో, ఏ ఇంద్రియాల వలన, దేని కోసం, ఎవరికి సంబంధించి, ఏ స్థలంలో, ఏ సమయంలో, ఏ రూపంలో, ఏ గుణం వలన నెరవేరుస్తాడో; ఇహలోకంలో జనకభావానికీ, పరలోకంలో బ్రహ్మభావానికీ రూపాంతరం పొందించే ఆ వివిధ ప్రకారాలూ నీవే. సమస్తమూ నీవే, నీవు నిత్యముక్తుడవు. సత్యరక్షకుడవు.
నీ అంశయైన పురుషునిలో నీ అనుగ్రహం వలననే కాలప్రేరితమూ, కర్మమయమూ, బలయుతమూ, ప్రధానలింగమూ అయిన మనస్సును, నీ మాయ సృష్టిస్తుంది.
ఈ మనస్సు అవిద్యాజనకమైన వికారమూ, వేదోక్తకర్మ ప్రధానమూ, సంసారచక్రాత్మకం అయినది. ఇలాంటి మనస్సుతో నిన్ను సేవించకుండా తరించగల సమర్ధుడు ఎవడూ లేడు.
నువ్వు విజ్ఞానం చేత బుద్ధిగుణమును జయించిన వాడవు. కార్యకారణ శక్తినీ కాలం నీ వలననే వశం చేసుకుంటుంది, ఈ కాలం మాయతో కూడి పదహారు విధాలైన వికారాలతో కూడిన సంసార చక్రమును నిర్మించి, త్రిప్పుతూ ఉంటుంది, నేను ఈ సంసార దావానలంలో పడిమాడిపోతున్నాను లోకరక్షామణీ! రక్షించు!
ప్రజలు సిరి సంపదలూ, ఆయురారోగ్యాలు, వైభవమూ వంటి వాటినే దివ్యమైనవి అనుకుంటారు, వాటిని ఆశించి దిక్పాలకాదులను కొలుస్తారు. మా తండ్రి హిరణ్యకశిపుడు కోపంతో చూసే కడగంటి చూపుతో చెలరేగే భృకుటి ముడి మాత్రం చేతనే, ఆ దిక్ప
ాలురు వణికిపోతారు. అంతటి మహాశూరుడు ఒక్క నిమిషంలో నీ చేతిలో ఇవాళ మరణించాడు. కనుక బ్రహ్మాది రూపధారుల వైభవాలు, సిరిసంపదలు, జీవితాలు ఏవీ శాశ్వతాలు కావు. ఇవన్నీ కాలరూపంలో మెదులుతుండే విష్ణుమూర్తీ! నీ చేతిలో నశించిపోతాయి. ఇవేమీ నాకు వద్దు. నీ మీద కొద్దిగా భక్తి, జ్ఞానం కుదిరాయి. కాబట్టి, నేను నిత్యం సేవకుడిగా నిన్ను సేవిస్తాను.
ఎండమావుల వంటివి ఈ సుఖాలూ, భోగాలూ. మనిషి ఇవే జీవిత పరమావధి అనుకుంటాడు. తన దేహం దుఃఖ భూయిష్ఠం, రోగగ్రస్తం అయినా సరే, విరక్తి పొందడు. ప్రజ్వలించే కామాగ్నిలో పడి తపించిపోతూ ఉంటాడు. అట్టివాడు ఈ దుష్టసౌఖ్య పరంపరలకు లోబడిపోయి ఎన్నటికీ తీరం చేరలేడు.
ప్రభూ! లక్ష్మీ పతి! నరసింహా! పద్మంలో పుట్టిన ఆ బ్రహ్మదేవుడికి అయినా సరే నీ చెయ్యెత్తి తలమీద పెట్టి అభయం ఇవ్వలేదు. నేనేమో చిన్న పిల్లాడిని; తామసగుణంతో కూడిన రాక్షసవంశంలో పుట్టిన వాడిని; దైత్యుడిని; ఉగ్ర మైన రజోగుణం కలవాడను; అలాంటి నా తల మీద, అవ్యాజ్యమైన కృపతో నీ ది వ్య భవ్య హస్తాన్ని ఉంచి దీవించావు. ఇది నాకు ఎంతో ఆశ్చర్యం కలిగిస్తోంది. స్వస్తి.
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి