6, ఫిబ్రవరి 2021, శనివారం

సౌందర్య లహరి**

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఇరవైమూడవ శ్లోక భాష్యం - నాల్గవ భాగం


ధ్యానంలో అంబిక ఆచార్యులవారికి సౌందర్యలహరీ దైవతమైన కామేశ్వరీ రూపంలో కన్పించింది. లలితా సహస్ర నామ ధ్యాన శ్లోకం “సింధూరారుణ విగ్రహామ్, త్రినయనామ్” అని చెబుతోంది. ఆచార్యులవారు అదే చెబుతున్నారు. “సకల మరుణాభమ్, త్రినయనం” అదే శ్లోకంలో అంబికను

“తారానాయక శేఖరాం స్మితముఖీమ్ ఆపీన - వక్షోరుహాం” అని కూడా చెబుతోంది. తారానాయకుడు చంద్రుడు. ఆమె చంద్రశేఖరి. ఈ వాక్యంలో చెప్పబడిన రెండు లక్షణాలు ఆచార్యులవారు “కుచాభ్యా మానమం, కుటిలశశి చూడాల మకుటమ్” అని చెప్పారు. ఈ నాలుగు లక్షణాలు అంబికవే అయినా రెంటిని మాత్రమే ఆమెవిగా ఒప్పుకొని మరో రెంటి విషయంలో అమ్మవారిపై అభియోగం తీసుకొని వస్తున్నారు.


అంబిక మీద చౌర్య నేరారోపణ చేసిన ఆచార్యులవారు నిజానికి అంబిక నాలుగు లక్షణాలలో రెండు లక్షణాలను చౌర్యం చేశారు. కొందరు ఆచార్యులవారి కాలానికి అంబికకు ఈ త్రినయనములు, చంద్రశేఖరిత్వము ఉండి ఉండక పోవచ్చునని చెప్పవచ్చు. ఒక్క ప్రార్థనాశ్లోకంలోనే కాదు. సహస్ర నామాలలోకూడా త్రినయనా, చారు చంద్రకళాధరా అన్న నామములున్నాయి. శ్యామలాదండకం అంబికను చతుర్భుజే చంద్రకళావతంసే అని ప్రార్ధిస్తుంది. సర్వజ్ఞులైన ఆచార్యుల వారు సామాన్య ప్రజల దృష్టిపరంగా చమత్కరిస్తున్నారు - అని మనం గ్రహించాలి. 


దొంగిలించిన శివుని శరీరాన్ని అంబిక ఎక్కడ దాచిపెట్టింది. తనలోనే దాచిపెట్టుకొంది. శివునిలో శక్తి ఉన్నట్లు ఇక్కడ శక్తిలో శివుడు. శివునిలో సగం శరీరాన్ని అంబిక తినబట్టికదా అర్ధనారీశ్వరావతారం వచ్చింది. గోపాలకృష్ణ భారతి "పార్వతీ యెన్రోరు సీమాట్టి - ఆదిల్ పతియై తిన్రదుండు” “పార్వతియనే ఒక శ్రీమతి ఆదిలో పతిని తిన్నదున్నది” - తల్లులు తమ పుత్రుల యెడ విపరీతమైన వాత్సల్యంతో “నిన్ను తినేస్తా నమిలేస్తా” నంటూ ముద్దులు పెట్టుకోవడం చూస్తాం కదా! ప్రేమావేశంలో ఒక చౌర్యాభియోగమేమిటి హత్యాభియోగం వరకూ పోవచ్చు.


శివానందలహరిలో ఆచార్యులవారు ఇటువంటి హత్యాభియోగాలు ఎన్నో చేశారు. శివుడు ఒక ఏనుగును చంపి “కరీంద్ర భంగః” అయ్యాడు. పులిచర్మాన్ని కట్టుకోవడానికో హత్య, అడవిపందిని చంపడమో హత్య. పులిచర్మమేమో కౌపీనం - గజచర్మము ఉత్తరీయం. ఆచార్యుల వారికి చేతిలో లేడిని ధరించిన శివుడు పులివలెనూ, గజచర్మం ధరించి సింహంవలెనూ కన్పిస్తాడు. పులిచర్మం ధరించి పులిలా కన్పించడం సహజమే- సింహమెలాగ?.


శివుడు మన హృదయగుహలో వసిస్తాడు. సింహం గుహలలో నివసిస్తుంది. శివునికి అయిదు ముఖాలున్నాయి కనుక పంచముఖుడు. సింహం వెడల్పయిన ముఖంతో “పంచముఖి”. శివుడనే సింహము ఏనుగును, పులిని తిని వాటి చర్మాలను ధరించిందంటారు ఆచార్యులవారు. అదేరకంగా శివుని మింగివేసిన అంబిక ఆయన చిహ్నాలను మాత్రం తాను ధరించింది. సింహం ఏనుగు పులుల చర్మాలను నమలక వదిలివేసి ఉండవచ్చు. శివుని దేహం అంబికలోనికి వెళ్లిపోయిన తరువాత మిగతాదంతా కలిసిపోయినా మూడవకన్ను పొడుచుకువచ్చి ఉండవచ్చు. శివుని శరీరంలో భాగం కాని చంద్రకళ కూడా బహిర్గతంగా కన్పిస్తోంది. అయినా ఈ చౌర్యమూ, మింగి వేయడమూ రెండూ మిథ్యాభియోగాలే. మృత్యుంజయుడు అంబిక తాటంక మహిమ వలన మహా ప్రళయంలోనే నాశానమవడుకదా! 


(సశేషం)


కృతజ్ఞతలతో 🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

కామెంట్‌లు లేవు: