6, ఫిబ్రవరి 2021, శనివారం

మహాభారతము

 **దశిక రాము**


**మహాభారతము**


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


భీష్మపర్వం.152


శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీత ఉపదేశిస్తున్నాడు, కురుక్షేత్రంలో, మహాసంగ్రామం మొదలయ్యే ముందు. 


(  భగవద్గీత 18  అధ్యాయాలలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి చెప్పాడు.  మనం విహంగ వీక్షణంగా,  ఆ అమృత భాండాగారంలో నుంచి కొన్ని బిందువులు గ్రోలే ప్రయత్నం చేద్దాం.  మూలకథకు యెక్కువ ఆటంకం లేకుండా, కొద్దిశ్లోకాలు అక్కడక్కడా స్మరించుకుంటూ,  ప్రతి అధ్యాయం లో రెండు మూడు శ్లోకాలు మననం చేసుకుందాం.   

ప్రతి శ్లోకమూ ముఖ్యమైనదే. అందులో యెట్టి సందేహం లేదు.  ఇంతకుముందు భగవద్గీతను అవపోశన పట్టిన మహానుభావులకు ఇది కేవలం ఒక స్పర్శామాత్రము .  అసలు భగవద్గీత మనకు సంబంధించినది  కాదు, వృద్ధులకు మాత్రమే అనుకునే యువకులకు, చిన్న పరిచయ ప్రయత్నం.  


ఇంకొక ముఖ్య విషయము.  భగవద్గీత అంటే, నిత్యపారాయణ గ్రంధము.  యేవో కొన్ని నిర్దిష్టమైన సందర్భాలకు పరిమితము అనుకోవడం అవివేకమే అవుతుంది.  


పై పెచ్చు,  భగవద్గీత పాఠశాలలకు వెళ్లే, కళాశాలకు వెళ్లే, విద్యార్థినీ విద్యార్థులు,  కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు, పిల్లల పెంపకంలో సతమతమయ్యే గృహిణులు,  విశ్రాంత జీవితం గడుపుతున్నవారు, అందరూ చదువవలసినది.  కనీసం  వారికి సంబంధించిన   అధ్యాయాలు, గురువుల సలహాతో చదువుకుంటే బాగుంటుంది.


మా చిన్నప్పుడు, మా ఆరక్లాసులోనే గుంటూరు, మాజేటి గురవయ్య గారి పాఠశాలలో చదువుతున్నప్పుడు,  మా తెలుగు ఉపాధ్యాయులు,  అశ్వద్ధనారాయణ గారు,  మాకు ప్రతి రోజూ సాయంత్రం బ్రాడీపేట ఓంకారక్షేత్రంలో భగవద్గీత తరగతులు తీసుకుని, అధ్యాయాల వారీగా కంఠస్థం చేయించి, బయటనుండి పృచ్ఛకులను పిలిపించి, ఉత్తీర్ణులైనవారికి, ప్రశంశాపత్రాలు, బహుమతులు ఇచ్చేవారు.   ఆనాడు అక్కడ  భగవద్గీత నేర్చుకున్నవారు, యిప్పుడు యెంతో గొప్ప గొప్ప పదవులు నిర్వహించి, విశ్రాంత జీవితం గడుపుతూ వున్నారు.  మాకు అది ఆ వయసులో, పూర్తిగా అర్ధం కాకపోయినా, ఒక పవిత్రత ఆపాదించుకుని చదువుకున్నాం.


ఇది అప్రస్తుత ప్రసంగంగా భావించరని  అనుకుంటూ, నమస్కారములతో. )


1 అర్జున విషాదయోగం. :

    న కాంక్షే విజయం కృష్ణ  న చ రాజ్యం సుఖాని చ /

    కిమ్ నో రాజ్యేన గోవింద కిమ్ భోగైర్జీవితేన వా //   ( 1 . 31 )


    కృష్ణా ! యుద్ధములో నాస్వజనులను చంపుటలో నాకు యేవిధమైన శ్రేయస్సు కనబడకున్నది.  నాకు విజయం మీద, రాజ్యం మీద, సుఖాల మీదా కోరికలేకున్నది.    .   గురుదేవులు,పితృ, భ్రాతృ సమానులు, బంధువులు, స్నేహితులు  మొదలైనవారిని చంపవలసిన యుద్ధభూమిలో వున్నప్పుడు, ఆతరువాత, మనం పొందే రాజ్యము, సంపద, భోగము వలన యేమి ప్రయోజనము ? 


.   కులక్షయే ప్రణశ్యంతి కులధర్మా: సనాతనా: /

    ధర్మే నష్టే కులం కృత్స్నామధర్మో>భిభవత్యుత.//  ( 1 . 40  )

కులం ( వంశము ) క్షీణిస్తే, ఆకులములో అనాది నుండి ఆచరిస్తున్న సనాతన ధర్మములు నశించును.   అప్పుడు ఆ కులమే నిర్వీర్యమైపోవును.  


   సంకరో నరకాయయైవ కులఘ్నానాం కులశ్య చ /

   పతన్తి పితరో  హ్యేషామ్ లుప్త పిండోదక క్రియా : //      ( 1  . 42 )

వర్ణసంకరము జరిగిన కులము నశించి అల్లర్లాములోని  వారు నరక లోకమునకు పోవుట తధ్యము.  అందువలన, వారి పితృదేవతలు కూడా  పితృ సంబంధమైన కార్యములలో వారి తర్పణములు గ్రహించలేక,   ఆకలి దప్పులతో తపించి నరకమునకు త్రోసివేయ  బడుదురు.


2 . సాంఖ్య యోగము.  


శ్రీ భగవానువాచ :

     అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ  భాషసే  /

     గతాసూనాగతా సూ౦శ్చ నానుశోచన్తి పండితా:: //  ( 2  . 11  )

 భగవానుడు చెప్పుచున్నాడు :

    శోకించదగని వారి గురించి నీవు శోకిస్తున్నావు.  అయితే, ప్రాజ్ఞుని వలే మాట్లాడు తున్నావు.   పండితుడైనవాడు, వెళ్ళిపోయినవారి గురించిగానీ, వున్నవారి గురించిగానీ వేరు విధాలుగా ఆలోచించడు.


   నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా   భవితా వా న భూయ: /

   అజో నిత్య : శాశ్వతో >యమ్ పురాణో  న హన్యతే హన్యమానే శరీరే //    ( 2  20 ) 

ఆత్మ యెన్నడును పుట్టదు, గిట్టదు. ఒకప్పుడు లేనిది, తర్వాత వచ్చినది, మరల పోవునదీ కాదు.  శరీరానికే మరణం గానీ ఆత్మకు కాదు. 


    నైనం చ్ఛిన్దన్తి  శస్త్రాణి  నైనం దహతి పావక : /

    న చైనం  కలే దయంత్యాపో న  శోషయతి మారుత : //  ( 2 . 23 )

ఆత్మను యే అస్త్రశస్త్రములు ఖండింపజాలవు.  ఏ జ్వాలాగ్ని మండింపజాలదు  నీరు దీనిని తడుపలేదు, గాలి దానిని నిర్వీర్యము చేయజాలదు.  


    త్రైగుణ్యవిషయా వేదా నిస్త్రైగునో భవార్జునా /

     నిర్ద్వన్దో నిత్యసత్వస్థో నిర్యోగ క్షేమ ఆత్మవాన్ //   ( 2 . 45  ) .  

వేదములు త్రిగుణములను ( సత్వ, రజ : తమో గుణములు ) ప్రతిపాదించినవి. నీవు వాటికి అతీతుడవై, అద్వైతుడవై,  సమబుద్ధితో, యోగ క్షేమాల యందు అనురక్తుడవు కాక, ఆత్మయందే తాదాత్మ్యతతో వుండుము.  

     

స్వస.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

కామెంట్‌లు లేవు: